సారీ చెప్పాలని...

‘ఇంకోసారి దాన్ని చూడొచ్చు కదా అని...’...ఆ పెద్దాయన అన్న మాటలే రాజేష్‌ చెవుల్లో ధ్వనిస్తూ ఉన్నాయి. బైక్‌ నడుపుతున్నాడు కానీ, చుట్టూ నడుస్తున్న వాహనాల రొదా, హారన్లూ ఇవేమీ తనకి వినిపించట్లేదు... ఆ పెద్దాయనే గుర్తొస్తున్నారు.

Updated : 30 Jan 2022 06:01 IST

సారీ చెప్పాలని...

- అనన్య

‘ఇంకోసారి దాన్ని చూడొచ్చు కదా అని...’
...ఆ పెద్దాయన అన్న మాటలే రాజేష్‌ చెవుల్లో ధ్వనిస్తూ ఉన్నాయి. బైక్‌ నడుపుతున్నాడు కానీ, చుట్టూ నడుస్తున్న వాహనాల రొదా, హారన్లూ ఇవేమీ తనకి వినిపించట్లేదు... ఆ పెద్దాయనే గుర్తొస్తున్నారు.

*              *              * 

ఈమధ్య రాజేష్‌కి ఆఫీసులో పని ఎక్కువయింది. ఆ విసుగంతా తనమీదే చూపిస్తున్నాడని అతని భార్య నిత్య ఆరోపిస్తూనే ఉంది. పేరుకి ఏరియా హెడ్డే అయినా, చెప్పుకోవడానికీ ఖర్చు చేయటానికీ జీతం బాగానే అందుతున్నా, చేసే ఉద్యోగం మార్కెటింగ్‌ రంగంలో అవ్వటం వల్ల, కార్లో తిరగటానికి ఒకటికి రెండు గంటలు పడుతుందని బైక్‌మీదే గంటలకొద్దీ గడపటం వల్ల నడుమూ మణికట్లు నొప్పులు రావటం, దుమ్మూ- ధూళి వల్ల దగ్గులూ, తలనొప్పులూ, జుట్టు ఊడటం... ఒకటేమిటి ఎన్నైనా వస్తున్నాయి ఇబ్బందులు. ఈ యాతనకి తోడు ఉద్యోగంలో టార్గెట్లు... శారీరకంగా మానసికంగా ఒత్తిడి ఎక్కువైపోతూ, పెళ్లాం బిడ్డలతో గడపటమే లేదు సరికదా, మాట్లాడే నాలుగు మాటల్లోనూ విసుగూ చిరాకూ ఉంటున్నాయి.
నిత్య చెప్పటమే కాదు, తనకీ తెలుస్తోంది. కానీ ఎంత వద్దనుకున్నా ఈ కోపం విసుగూ ఇంకా ఇంకా ఎక్కువ అవుతున్నాయి. ఉదయం అదే జరిగింది. చిన్న విషయానికి ఇంట్లో చిలికి చిలికి గాలివాన అయ్యింది.
తన పైస్థాయి మేనేజర్‌ ఒకతను ఊళ్లోకి వస్తున్నానని కబురు పెట్టాడు. అతనికి పిల్లనిచ్చిన మామగారు ఏదో సర్జరీ కోసం ఈ ఊళ్లో ఆసుపత్రిలో చేరారనీ, ఆయన్ని చూడటానికి వస్తున్నాననీ, రాజేష్‌ కూడా అక్కడికే వస్తే ప్రాజెక్టు విషయాలు అక్కడే చర్చించవచ్చనీ చెప్పాడు.
అసలే టార్గెట్లు అవ్వటానికి టైం తక్కువ ఉందని టెన్షన్‌లో ఉంటే, అతణ్ణి కలవటానికి ఒక రోజంతా వృథా అయిపోతే ఎలా? పైగా ఆ ఆసుపత్రి ఊరికి ఆ చివరన ఉంది. రానుపోనూ నాలుగు గంటలు పోతాయి. ఇక అక్కడ చర్చలంటే ఇంకో నాలుగైదు గంటలు పట్టేస్తాయి. కానీ ఇప్పుడు రానని అనలేని పరిస్థితి. ఇంకో నెలలో రివ్యూ మీటింగులు ఉంటాయి. ఈ బాస్‌ ఇచ్చే రివ్యూని బట్టే రాజేష్‌కి జీతం పెరుగుతుంది. ఇలాంటి సమయంలో అతనితో రాలేనని చెప్పటం రిస్కే. దాంతో, చేసేదేంలేక, వెళ్దామని నిర్ణయించుకున్నాడు.
ఉదయమే బయలుదేరుతానని నిత్యకి చెప్పాడు. ఉదయం పిల్లవాడిని స్కూలుకి సిద్ధం చేస్తూ ఇడ్లీలు వేసి పెట్టింది. పచ్చడిలో ఉప్పు వేయలేదని కేకలేశాడు.
‘‘అయ్యో, ఇంకా వేయలేదు. అప్పుడే వడ్డించేసుకున్నావా?’’ అంది.
‘‘అప్పుడే...నా? ఏడింటికి బయలుదేరాలి అని ముందే చెప్పాను కదా?’’ అన్నాడు.
‘‘చంటిగాడికి స్నానం చేయించటానికి వెళ్లాను. ఇదిగో వస్తున్నా, ఒక్క నిమిషం’’ అంది.
‘‘చట్నీ అంతా చేసినదానివి ఉప్పు వేయటానికి ముహూర్తం కుదరలేదా తమరికి?’’ అని విసుక్కున్నాడు.
‘‘వాడు బాత్‌రూమ్‌కి వెళ్లాడు. అందుకే వెళ్లాను. వచ్చి వేద్దామనుకున్నాను ఈలోపే నువ్వు వచ్చేశావు’’ అంది.
‘‘అంటే, నేను రావటమే తప్పంటావు. పోనీ మళ్లీ గదిలోకి వెళ్లి ఒక అరగంటసేపు అద్దం ముందు నుంచొని రానా?’’ అని మళ్లీ చిర్రుబుర్రులాడాడు.
‘‘ఇదిగో, వచ్చేశా... ఆ ప్లేట్‌ పక్కకి పెట్టేసెయ్‌. ఇదిగో, ఉప్పు వేసిన చట్నీ ఈ ప్లేట్‌లో తిను’’ అని ఇంకో ప్లేట్‌ అందించి అందులోకి ఇడ్లీలను మార్చింది.
‘‘ఇప్పుడు ఆ పచ్చడి ఏం చేస్తావు? పడేస్తావా?’’ అన్నాడు.
‘‘పడేయనులే’’ అంది.
‘‘డబ్బులు ఎక్కువయిపోయాయి నీకు. సంపాదించేవాడికి తెలుస్తుంది బాధ’’ అన్నాడు.
‘‘పడేయను మహాప్రభో, నీకు టైమ్‌ అవుతోంది కదా? బయలుదేరు’’ అంది.
‘‘అంటే, నోరు మూసుకోమంటున్నావు. అంతే కదా?’’
‘‘కాదు, నిజంగానే టైమ్‌ అవుతోంది కదా? ఇబ్బంది పడతావని’’
‘‘మొగుడితో తప్ప అందరితోనూ సవ్యంగానే మాట్లాడతావు నా ఖర్మ...’’
‘‘ఇప్పుడు నేను ఏమన్నాను?’’
‘‘ఏమీ అనలేదు. నాకే ఊసుపోక అరుస్తున్నాను.’’
‘‘సరే, వాడికి టైమ్‌ అవుతోంది. స్నానం చేయించాలి. నువ్వు తినేశాక, ఈ కాఫీ తాగి తలుపు దగ్గరికి వేసి వెళ్లిపో.’’
‘‘వేస్తానులే. మీ ఇంట్లో లాగా వదిలేసి వెళ్లను.’’
‘‘ఏంటీ? ఏమన్నావు?’’
‘‘ఏం లేదు. అంత ధైర్యమా?’’
‘‘లేదు. ఏదో అన్నావు చెప్పు.’’
‘‘నిన్ను చాలా చక్కగా పెంచారని అంటున్నాను.’’
‘‘ఇప్పుడు ఆ మాటలు మాట్లాడే టైమ్‌ ఉందా నీకు?’’
‘‘పొద్దున్నే లేచి వాడిని తెమిల్చి, నాకు టిఫిన్‌ దగ్గరుండి పెట్టొచ్చు కదా?’’
‘‘రోజూ అలాగే పెడుతున్నాను కదా? ఈరోజు వాడి స్కూల్‌టైమ్‌లో నువ్వు బయల్దేరుతున్నావు... రోజూకంటే త్వరగా.’’
‘‘అవును. అదీ నా తప్పే. చాలా సంతోషం. ఈ కాలంలో పెళ్లాలకి ఇవన్నీ ఏం తెలుస్తాయి? మొగుడు ఎంత కష్టపడి వచ్చినా అనవసరం.’’
‘‘ఇప్పుడు మళ్లీ మొత్తం ఆడవాళ్లందరినీ ఒక తాటికి కట్టి స్టేట్‌మెంట్లు ఇస్తున్నావా? ఇక చాలు రాజేష్‌, నీకూ వాడికి కూడా టైమ్‌ అవుతోంది.’’
‘‘నువ్వు మాట్లాడమంటే మాట్లాడతాను, వద్దంటే ఆపేస్తాను... అదే కదా నీకు కావలసింది?’’

‘‘అది కావాలీ ఇది కావాలీ అని పోరు పెట్టే పెళ్లాం దొరికితే బాగుండేది నీకు. అడగట్లేదు కదా, అందుకే ఇంకా లోకువయ్యాను. పెళ్లైన కొత్తల్లోనే బాగుండేది. వస్తూ వస్తూ మల్లెపూలో, పానీపూరీలో, చెరుకురసమో ఏదోఒకటి తెచ్చేవాడివి. ఇప్పుడు ఇంటికి రావటమంటేనే బాధ అయిపోయింది నీకు. అయినా ఏనాడూ ఏమీ అడగకుండా సహకరిస్తుంటే నాకు మిగిలేది ఇది. ఏదో ఒకటి చెయ్యి. పొద్దున్నే ఈ డిస్కషన్లు నావల్ల కాదు. నీ టెన్షన్‌లన్నీ చూపించటానికి నేనే దొరికాను. నువ్వు కూడా అందరితోనూ బాగానే మాట్లాడతావు. నా విషయానికి వచ్చేసరికే కారాలూ మిరియాలూ నూరుతావు. పెళ్లాం అంటే మొగుళ్లందరికీ లోకువే.’’
‘‘నువ్వు కూడా మగవాళ్లందరినీ ఒక తాటికి కట్టి మాట్లాడుతున్నావు కదా? పానీపూరీ కావాలంటే నువ్వు కొనుక్కుని తినొచ్చు. నన్నిలా దెప్పక్కరలేదు. ఎంతసేపూ నీ గురించే నువ్వు ఆలోచిస్తావు. నాకేం చేస్తున్నావు? ఈ కాఫీ కూడా వేడిగా లేదు. చలిలో 20 కిలోమీటర్లు బైక్‌ మీద వెళ్లాలి. వేడి కాఫీ తాగే యోగం కూడా లేదు నాకు.’’
‘‘ఇంకొక అరగంట నామీద అరువు. అప్పుడు కాఫీ వేడిగా ఉంటుంది మరి. నాకు కావలసింది పానీపూరీ కాదు. అది తెచ్చిచ్చే నీ ప్రేమ, ఆదరణ. అది అర్థం చేసుకోవు.’’
‘‘ఛీ! చెప్పినా నన్ను అర్థం చేసుకోదు. పైగా నేనే తనని అర్థం చేసుకోవాలట. బయటకి వెళ్లే మొగుణ్ణి చిరునవ్వుతో పంపించటం ఎప్పటికి వస్తుందో! అయినా నిన్ను అని ఏం లాభం? ఎవరి నుంచో వచ్చిన పోలికలు.’’
‘‘రాజేష్‌, అంటే నన్ను అను. మా అమ్మానాన్నలని అనొద్దని చాలాసార్లు చెప్పాను. నాకూ చిరునవ్వు నవ్వాలనే ఉంది. ఇలా ఉండటం నాకేం ఇష్టం కాదు. నామీద పొద్దున్నే ఇలా అరుస్తుంటే ఎలా నవ్వమంటావు?’’ అంది నిత్య కన్నీళ్లు పెట్టుకుంటూ.
‘‘మాట్లాడితే ఈ ఏడుపొకటి’’ అంటూ కాఫీ తాగకుండానే విసురుగా బయటకు వెళ్లి, బైక్‌ స్టార్ట్‌ చేసి రోడ్డున పడ్డాడు రాజేష్‌. చెవిలో ఎఫ్‌.ఎమ్‌లో పాటలు పెట్టుకుని వింటూ, 20 కిలోమీటర్లూ నగర వాహన సముద్రాన్ని ఈది వేళ్లేసరికి కాస్త మూడ్‌ మారింది రాజేష్‌కి.

*              *              * 

హాస్పిటల్లో రాజేష్‌- బాస్‌ సత్యని కలిశాడు. ఐసీయూలో అతని మామగారిని ఒకసారి పలకరించి, ఐసీయూ వెయిటింగ్‌ ఏరియాలో మూలకున్న రెండు కుర్చీలు చూసుకుని కూర్చున్నారు ఇద్దరూ. సత్య తన బావమరిదితో ‘‘నేను కాసేపు ఇక్కడ ఉంటాను కదా? ఒకసారి నువ్వు ఇంటికి వెళ్లిరా’’ అని పంపించాడు. కాసేపు ఆఫీస్‌ విషయాలు చర్చించుకున్నాక, క్యాంటీన్‌లో బిస్కెట్లూ టీ లాగించి మామూలుగా రాజకీయాలూ షేర్‌మార్కెట్ల కబుర్లు చెప్పుకుంటున్నారు ఇద్దరూ.
రెండు కుర్చీల అవతల కూర్చున్న ఒక వృద్ధుడిని ఇంతవరకూ వాళ్లు గమనించలేదు. ఆయనే రాజేష్‌ని పిలిచి ‘‘బాబూ, ఇక్కడ ఫోన్‌ చార్జింగ్‌ పెట్టాను. నా బ్యాగ్‌ ఇక్కడ ఉంది. ఐసీయూ నుంచి నర్స్‌ నన్ను రమ్మని పిలిచింది. ఒకసారి వెళ్తాను. కొంచెం నా ఫోనూ, బ్యాగూ చూస్తారా బాబూ?’’ అన్నారు. రాజేష్‌ వాచీ చూసుకుంటూ ‘‘నేనిక్కడ ఇంకో అరగంట మాత్రమే ఉంటానండీ. ఈయన కూడా ఇంక బయలుదేరుతారు’’ అన్నాడు. ‘‘అబ్బే, అయిదు నిమిషాల్లో వచ్చేస్తాను బాబూ’’ అన్నారాయన. ‘‘సరే, వెళ్లిరండి’’ అన్నాడు రాజేష్‌. ఆ పెద్దాయన నడిచి వెళ్తుంటే గమనించాడు రాజేష్‌. చేతివేళ్లు సన్నగా వణుకుతున్నాయి. చిన్నపిల్లల కంటే చిన్నగా, బుడిబుడి అడుగులు వేస్తూ నడిచి లిఫ్ట్‌ వైపుకి వెళ్తున్నారు. ఎనభై ఏళ్లపైనే ఉంటుంది వయసు. కాటన్‌ తెల్ల పంచెమీద లేత నీలం రంగు చొక్కా వేసుకున్నారు. చిన్న సంచీ చేతిలో పట్టుకుని నెమ్మదిగా ఆ చిన్న చిన్న అడుగులతో లిఫ్ట్‌ చేరుకున్నారు.
‘‘పాపం కదా రాజేష్‌? పెద్దవాళ్లకి ఎంత కష్టం? పిల్లలంతా ఏ ఎన్నారైలో అయ్యుంటారు. ఐసీయూలో ఉన్నది ఆయన భార్య అయ్యుంటుంది’’ అన్నాడు సత్య.
‘‘అయ్యుండొచ్చు’’ అన్నాడు రాజేష్‌ ఏదో ఆలోచిస్తున్నట్టుగా తల ఊపుతూ.
‘‘పిల్లలు ఏ అమెరికాకో ఆస్ట్రేలియాకో చదువుకో ఉద్యోగానికో వెళ్తాం అన్నప్పుడు ఆనందంతో అందరికీ మావాడు ఆ దేశంలో ఉన్నాడు, మా అమ్మాయి ఈ దేశంలో కాపురానికి వెళ్లింది అని చెప్పుకుంటారు. తీరా పిల్లల ఆదరణ తల్లిదండ్రులకు అవసరం అయ్యేసరికి వాళ్లు రారు, రాలేరు. ఇక్కడ వీళ్లు ఒక్కరే ఉండిపోతారు. ఇప్పుడు మా బావమరిదిని చూడు. ఇక్కడ ఉన్నాడు కనుక తండ్రిని చూసుకుంటున్నాడు. మేమూ పిలవగానే పలికేలా ఉన్నాము. కాబట్టి మా మామగారికి సర్జరీ అనగానే వచ్చి వాలిపోయాము. హాయిగా ఉన్నారు వాళ్లు’’ అని తన అభిప్రాయం తాను కుండ బద్దలుకొట్టినట్టు చెప్పుకుపోయాడు సత్య. అవునన్నట్టు తల ఊపుతూ వింటున్నాడు రాజేష్‌.
రాజేష్‌ తల్లిదండ్రులు తమ సొంత ఊళ్లోనే ఉంటున్నారు తన అన్నావదినలతో. కనుక కొంత నిశ్చింతగానే ఉంటుంది రాజేష్‌కి. అప్పుడప్పుడూ తన ఇంటికి వస్తూ వెళుతూ ఉంటారు. అత్తమామలకి నిత్య ఒక్కతే కూతురు. ఈ ఊళ్లోనే పక్క ఏరియాలో ఉంటూ, తరచూ రాకపోకలు సాగిస్తూ ఉంటారు వాళ్లు కూడా.
ఈలోగా ఆ పెద్దాయన మళ్లీ లిఫ్ట్‌ దిగి అలాగే బుడిబుడి అడుగులు వేసుకుంటూ దగ్గరకు వచ్చారు. ఈసారి మరింత నిశితంగా గమనించాడు రాజేష్‌. ఆయన చెయ్యేకాదు, మెడ కూడా సన్నగా వణుకుతున్నట్టుగా ఊగుతోంది. ‘పాపం ఇంత వృద్ధాప్యంలో ఆయనకే ఇలా ఉంటే, భార్యను చూసుకోవలసిరావటం ఎంత దారుణం?’ అనుకున్నాడు.
పెద్దాయన, పక్కకి వచ్చి కూర్చుంటూ ‘‘చాలా థాంక్స్‌ బాబూ. ఏదో సంతకం కావాలని పిలిచింది నర్సు’’ అన్నారు.
‘‘ఫరవాలేదండీ. ఎవరున్నారండీ ఐసీయూలో?’’ అని అడిగాడు రాజేష్‌.
‘‘మా ఇంటావిడ బాబూ. నాలుగేళ్లుగా నలతగానే ఉంటుంది. రెండు రోజుల కిందట రాత్రి ఉన్నట్టుండి వాంతులు చేసుకుంటే ఇక్కడికి తీసుకువచ్చాం బాబూ’’ అన్నారు.
‘‘ఇప్పుడు బాగానే ఉందా అండీ?’’ అన్నాడు రాజేష్‌.
‘‘వాంతులు ఆగేలా ఏదో మందు ఆరాత్రే ఇచ్చారు. ఏవేవో టెస్టులు చేశారు. ఊపిరి తిత్తుల్లో ఏదో ఇన్‌ఫెక్షన్‌ మొదలై ఇప్పుడు మెదడుకి చేరిందన్నారు. సర్జరీ అవసరమా లేదా అని డాక్టర్లు మాట్లాడుకుని ఇదిగో, ఇందాకే సర్జరీ చేసి చూద్దామని నిర్ణయించారు బాబూ. అందుకే సంతకం పెట్టమంటే వెళ్లి వచ్చాను’’ అన్నారాయన ఆయాసంగా ఒకొక్క మాట పలుకుతూ.
‘‘మీ పిల్లలు ఎవరూ దగ్గరలో లేరా అండీ?’’ అడిగాడు సత్య.
‘‘ఉన్నారు బాబూ. ముగ్గురు పిల్లలూ ఈ ఊళ్లోనే ఉన్నారు. రాత్రి ఒకరూ పగలు ఒకరూ ఇక్కడే ఉంటున్నారు. నన్ను ఇంటికి వెళ్లిపోమన్నారు. నేనే ఇక్కడ ఉంటానని పట్టుబట్టాను. కొడుకూ కోడలు స్నానాలూ భోజనాలూ చేద్దామని ఇందాకే వెళ్లారు. కూతురూ అల్లుడు- ఇప్పుడు నాకు భోజనం తీసుకువస్తారు. రాత్రి మళ్లీ చిన్న కొడుకు వస్తాడు’’ అన్నారు. సత్యా, రాజేష్‌ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ‘మనం అనవసరంగా బోలెడు కథలు అల్లేసుకున్నాం కదా?’ అన్నట్టు కళ్లతోనే కనీ కనిపించకుండా నవ్వుకున్నారు.
‘‘నేను ఫుడ్‌ కార్పొరేషన్‌లో చేసి రిటైర్‌ అయ్యాను బాబూ. మాకు 22 ఏళ్లలోపే పెళ్లయింది. అది నా మేనకోడలే. పాపం అరవై ఏళ్లపైనే ఒకరికొకరం తోడుగా గడిపాం. అదలా మాటా పలుకూ లేకుండా మంచంమీద పడి ఉంటే...’’ అని దుఃఖం పొంగుకు రాగా, వాక్యం పూర్తి చేయలేక ఆగిపోయి కళ్లు తుడుచుకున్నారు ఆయన.
సత్యా, రాజేష్‌ ఏమీ మాట్లాడలేదు. అలాగే ఆయన్ని చూస్తూ కూర్చున్నారు. ఆయనే మళ్లీ మాట్లాడారు. ‘‘పిచ్చిపిల్ల చిన్నప్పటి నుంచీ గలగలా మాట్లాడేది. కమ్మగా పాటలు పాడేది. ఈమధ్య ఒక మూడేళ్లుగా ముసలిదయ్యింది. ఏదో మూడు పూటలా వెళ్లదీస్తూ వస్తున్నాం ఇద్దరం ఉన్నాం కనుక. పేరుకి మొగుడూ పెళ్లాలమే కానీ, చిన్నప్పటి నుండీ అది నాకు ఫ్రెండే. కలిసి ఆడుకున్నాం. నాకు 84 అయితే దానికి 81 ఏళ్లు. 81 సంవత్సరాల స్నేహం మాది. ఇప్పుడు ఉన్నట్టుండి అలా పడి ఉండటం చూస్తే ఏమీ తోచట్లేదు’’ అన్నారు శూన్యంలోకి చూస్తూ పెదవి విరుస్తూ.

రాజేష్‌కి ఎందుకో పెద్దాయన చాలా నచ్చారు. ‘‘81 ఏళ్ల స్నేహం. అందులో 65ఏళ్ల సంసార జీవితం! చాలా బాగుందండీ. ఆదర్శ దంపతులన్నమాట. మేమైతే ప్రతిరోజూ దెబ్బలాడుకుంటామండీ. మీలాంటివాళ్ల నుంచి ఎన్నో నేర్చుకోవాలి’’ అన్నాడు రాజేష్‌. ‘‘ఆదర్శం అనేది చూసేవాళ్లు అనే మాటే బాబూ. మాటా మాటా అనుకోకుండా ఏ మొగుడూ పెళ్లాలూ ఉండరు. మళ్లీ ఎంత త్వరగా కలిసిపోయాం అన్నదానిలోనే ఉంటుంది ఆదర్శం అంతా. నాకు చాదస్తం ఎక్కువ, మా ఆవిడకి విసుగు ఎక్కువ. ఇక ఊహించండి మా కాపురం ఎలాంటిదో!’’ అని గర్వంగా నవ్వారాయన.
రాజేష్‌ కూడా చిన్నగా నవ్వి ‘‘మరి ఎవరు సర్దుకుపోతారు?’’ అని అడిగాడు. ‘‘అది సర్దుకోకపోతే నేను, నేను సర్దుకోకపోతే అది’’ అన్నారు ‘‘ఇందులో ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏముంది?’’ అన్న స్వరంతో. ‘‘ఎవ్వరూ సర్దుకోకపోతే?’’ అన్నాడు సత్య. ‘‘ఇద్దరం కలిసి సర్దుకుపోవటమే. జీవితం చాలా చిన్నది బాబూ. మనం చూస్తుండగానే ఎదుగుతాం. పెళ్లిళ్లూ అవుతాయి, పేరంటాలూ అవుతాయి. పిల్లలూ, వాళ్ల చదువులూ, వాళ్ల పెళ్లిళ్లూ, మనుమలూ... ఇలా రెప్పపాటులో అందరం కైలాస యాత్ర చేయాల్సిందే. కోపాలతో కాలక్షేపం వల్ల ఏం మిగులుతుంది?’’ అన్నారు.
‘‘మీకు కోపం రాదా?’’ అని అడిగాడు రాజేష్‌.
‘‘ఎందుకు రాదు? దూర్వాసుడి పక్క సీటు నాకే. మొన్న నాలుగు రోజుల క్రితం దాన్ని ఊరికే కోప్పడ్డాను... నాలుగుసార్లు పిలిచినా పలకలేదని. వినికిడి తగ్గిన మనిషిని పట్టుకుని వినపడనందుకు కేకలేస్తే దానికి మనసు చివుక్కుమనదూ? ఒక పూటకి నాకు తెలివి వచ్చింది. కానీ ఆరోజే అది ఈ హడావుడి చేసింది. ఇప్పుడు సారీ చెప్పాలని నాకున్నా, అది నన్ను గుర్తుపట్టడం లేదు. అసలు కళ్లు తెరవాలి, నన్ను చూడాలి కదా... సారీ చెప్పగలనో లేదో’’ అంటూనే ఆయన కళ్లనీళ్ల పర్యంతం అయ్యారు.
అంతలో మళ్లీ పెద్దాయన ఫోన్‌ మోగింది. మాట్లాడాక ‘‘నర్సుకి ఈ పాత ఫైలు కావాలట. ఇచ్చేసి వస్తాను. ఇంకోసారి బ్యాగు కనిపెట్టి ఉండండి బాబూ’’ అంటూ లేవబోయారు. రాజేష్‌ చటుక్కున లేచి, ‘‘నేను ఇస్తానండీ. ఫైలే కదా? మీరు కూర్చోండి’’ అన్నాడు. ‘‘అలా కాదులే బాబూ. ఆ వంకన ఇంకోసారి దాన్ని చూడొచ్చు కదా అని...’’ అంటూ ఆ చిన్ని చిన్ని అడుగులతో వణికే చేతులూ కాళ్లతో లిఫ్ట్‌ వైపుకి నడిచారు.
కాసేపటికి సత్య బావమరిది వచ్చాడు. సత్య మరోసారి తన మామగారిని పలకరించి బయలుదేరిపోయాడు. రాజేష్‌కి పనులు ఉన్నా పెద్దాయన పిల్లలు వచ్చేవరకూ తోడుగా ఉండాలనిపించి ఆగాడు. ఇంకాసేపటికి వాళ్లు వచ్చారు. డాక్టరుతో మాట్లాడారు. సర్జరీవల్ల లాభం లేదనీ, ఇన్‌ఫెక్షన్‌ బాగా పాకిపోయిందనీ, ఇంకొన్ని గంటలే ఆవిడకి ఉన్నాయనీ వాళ్లు తండ్రికి చెప్పారు. కూతురు వెక్కివెక్కి ఏడుస్తోంది. కోడలు ఆవిడను ఓదార్చుతోంది. అల్లుడూ కొడుకులూ డాక్టర్లతో మాట్లాడుతున్నారు. పెద్దాయన అలాగే కుర్చీలో కూలబడిపోయారు. ఈసారి ఆయన ఏడవటం లేదు. ఆయన చెప్పవలసిన సారీ చెప్పలేకపోయినందుకు బాధపడుతున్నారా? చిన్నతనంలో ఆవిడతో ఆడుకున్నవి గుర్తుచేసుకుంటున్నారా? పెళ్లయ్యాక కలిసి పడిన సుఖదుఃఖాలు ఏమైనా తలచుకుంటున్నారా? బతికించమని దేవుడిని కోరుకుంటున్నారా? ఆయనకే తెలియాలి. ఏమో, బహుశా ఆయనకి కూడా తెలియదేమో. శూన్యంలోకి చూస్తూ అలా ఉండిపోయారు.
ఆవిడకి ఏమైనా అయితే ఆయన ఒంటరి అయిపోతారు. కంటికి రెప్పలా చూసుకునే పిల్లలు ఉన్నారని తెలుస్తోంది. కానీ ప్లిలలు పిల్లలే. ఆవిడ ఆవిడే. ఆ స్నేహితురాలు లేని లోటుని ఎవ్వరూ తీర్చలేరు కదా? ఇక బయట చీకటి పడుతోంది. 20 కిలోమీటర్లు వెళ్లాలి కనుక ఆయన్ని పిలిచి ‘‘బాబాయ్‌ గారూ, పిన్నిగారికి ఏమీ కాకూడదని కోరుకుంటున్నాను. కంగారు పడకండి’’ అన్నాడు. ‘‘దేవుడే కాయాలి బాబూ. వెళ్లిరండి’’ అన్నారు హ్యాండ్‌ షేక్‌ చేస్తూ.

*              *              * 

రాజేష్‌ కాలింగ్‌ బెల్‌ కొట్టగానే నిత్య నవ్వుముఖంతో తలుపు తీసింది. లోపలికి వెళ్లి హెల్మెట్‌ తీసిన వెంటనే మంచినీళ్లు ఇస్తూ... ‘‘సారీ రాజేష్‌. పొద్దున్న ఏదో హడావుడి టైమ్‌ అవ్వటం వల్ల నేనే పిచ్చిదానిలా నిన్ను...’’ అంటున్న నిత్య నోటికి చూపుడు వేలు అడ్డుపెట్టి ‘‘ష్‌...!’’ అన్నాడు. తనతో తెచ్చిన క్యారీ బ్యాగ్‌ తీసి ఇచ్చాడు. నిత్య తనకిష్టమైన పానీపూరీల వాసనని మనసారా పీల్చి చిరునవ్వు నవ్వింది. తిరిగి చూసేసరికి టేబుల్‌ మీద పొగలు కక్కుతున్న తాజా కాఫీ కప్పులోంచి నురగను జుర్రుకుంటూ నిత్యకి కన్నుకొట్టాడు రాజేష్‌.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..