Sunday Story: ఫొటో లైఫ్‌

స్రవంతికి ఉద్వేగంగా ఉంది... మూడేళ్ళుగా తాను కోరుకుంటున్న సందర్భం ఇప్పుడు వచ్చినందుకు. తాను శిరీష కుటుంబాన్ని కలుసుకోబోతోంది. నాలుగు రోజులు వారితో గడపబోతోంది. దీని కోసమే ప్రత్యేకంగా చెన్నై నుంచి హైదరాబాద్‌కు బయల్దేరి వెళుతోంది.

Updated : 17 Dec 2023 07:34 IST

- ఎస్‌.వి.సురేష్‌

స్రవంతికి ఉద్వేగంగా ఉంది... మూడేళ్ళుగా తాను కోరుకుంటున్న సందర్భం ఇప్పుడు వచ్చినందుకు.

తాను శిరీష కుటుంబాన్ని కలుసుకోబోతోంది. నాలుగు రోజులు వారితో గడపబోతోంది. దీని కోసమే ప్రత్యేకంగా చెన్నై నుంచి హైదరాబాద్‌కు బయల్దేరి వెళుతోంది. ఇందుకోసం భర్త శరత్‌ను ఎంతో బతిమాలి మరీ నచ్చచెప్పుకోవాల్సి వచ్చింది. తాను తిరిగివచ్చే వరకూ ఆఫీసుకు సెలవు పెట్టి ఇద్దరు పిల్లల బాధ్యతలను శరత్‌ను చూసుకోమని అప్పగించింది.

సాధారణంగా ఎక్కడికి వెళ్ళినా అందరూ కలిసే వెళుతుంటారు కానీ ఈ ఒక్కసారి స్రవంతి తాను హైదరాబాద్‌లో తన ఫ్రెండ్‌ శిరీషతో నాలుగు రోజులు గడిపేందుకు వెళతానంటే, శరత్‌ కాస్త అయిష్టంగానే ఒప్పుకున్నాడు.

స్రవంతి, శిరీష పదేళ్ళ క్రితం ఇంజినీరింగ్‌లో క్లాస్‌మేట్స్‌. బాగా క్లోజ్‌గా ఉండేవారు. క్యాంపస్‌ సెలక్షన్స్‌లో ఇద్దరికీ ఉద్యోగాలు వచ్చాయి. పెళ్ళిళ్ళు అయ్యాయి. శరత్‌కు అప్పటికే చెన్నైలో ఉద్యోగం కావడంతో తానూ కంపెనీలో రిక్వెస్ట్‌ పెట్టుకుని హైదరాబాద్‌ వదిలేసింది స్రవంతి. రెండేళ్ళ వ్యవధిలో ఇద్దరు పిల్లలు పుట్టినా అమ్మానాన్నలతోపాటు అత్తామామలూ బాగా సపోర్ట్‌ చెయ్యడంతో ఎలాగోలా తిప్పలు పడి జాబ్‌ నిలబెట్టుకుంది.

శిరీష మొదటిసారి తల్లయినప్పుడే ఉద్యోగం మానేసింది. తనకీ మరో రెండేళ్ళకు పాప పుట్టింది. ఇప్పుడు శిరీషదీ తనలాగే ఇద్దరు పిల్లల కుటుంబం. శిరీష భర్త మనోహర్‌ కంపెనీలు మారుతూ హైదరాబాద్‌లోనే జాబ్‌ చేస్తున్నాడు.

‘కానీ వాళ్ళది ఎంత అన్యోన్యమైన కుటుంబం!’ అనుకుంది స్రవంతి. తరచూ శిరీష వాళ్ళ ఫ్యామిలీ ఫొటోలు వాట్సాప్‌లో షేర్‌ చేస్తుంటుంది. వాటిని చూస్తున్నప్పుడు ఎంత వద్దనుకున్నా స్రవంతిలో రవ్వంత అసూయ కలుగుతుంటుంది.

శిరీష తన పేరెంట్స్‌తో ఎట్లా ఉంటుందో మనోహర్‌ పేరెంట్స్‌తోనూ అంతే సన్నిహితంగా ఉంది. పిల్లలు ఆణిముత్యాల్లా ఉన్నారు. బాబుకు ఐదేళ్ళయితే, పాపకు మూడేళ్ళు.
‘ఎంత చక్కటి ఫ్యామిలీ!’ అనుకుంది స్రవంతి మరోసారి ఆ ఫొటోలను పరిశీలనగా చూస్తూ.

పుట్టినరోజులూ పెళ్ళిరోజులూ పండుగలూ ఫంక్షన్లకూ శిరీష విధిగా వాళ్ళ ఫ్యామిలీ ఫొటోలు పంపుతుంటుంది. వాటిని చూస్తుంటే మాత్రం స్రవంతిలో జెలసీ వచ్చేస్తుంది.
శిరీష ఫ్యామిలీని తన కుటుంబంతో స్రవంతి పోల్చుకుంటుండటమే ఇందుకు కారణం.

తన ఫ్యామిలీలో ఏవో కష్టాలున్నాయని కాదు కానీ... ఆ క్లోజ్‌నెస్‌ ఏది?
ఆ ఓపెన్‌నెస్‌ ఏది?
తనకు రెండో కాన్పు సమయంలో జాబ్‌కు రిజైన్‌ చేస్తానంది స్రవంతి. అందుకు శరత్‌తోపాటు అత్తమామలూ ఒప్పుకోలేదు. తాను జాబ్‌నూ పిల్లల బాధ్యతలనూ సమర్థించుకోలేనంటే సమ్మతించలేదు. పనుల్లో తాము సాయం చేస్తామన్నారు. ఉద్యోగం మానెయ్యడం తెలివి తక్కువ పనన్నారు. దాంతో స్రవంతి అలాగే నెట్టుకొస్తోంది.
కానీ, శిరీష జాబ్‌ మానేసి పిల్లల్ని చూసుకుంటూ ఎంతో హ్యాపీగా ఎంజాయ్‌ చేస్తోంది. ఆ విషయాన్ని శిరీష పంపే ఫొటోలూ తన ఫేస్‌బుక్‌ పోస్టింగ్సూ తను పెట్టుకునే డీపీలే చెబుతుంటాయి అనుకుంది స్రవంతి.

అందుకే నాలుగు రోజులు శిరీష దగ్గర గడిపి వస్తే మైండ్‌ ఫ్రెష్‌ అవుతుందని ఈ ప్రయాణం పెట్టుకుంది.

* * * *

కాలింగ్‌ బెల్‌ మోగగానే తలుపు తీసిన శిరీష చేతిలో సూట్‌కేస్‌తో నిలబడ్డ స్రవంతిని చూసి నివ్వెరపోయింది.
వెంటనే తేరుకుని ‘‘రా స్రవంతీ, చెప్పాపెట్టకుండా వచ్చేశావే’’ అంది.
శిరీష ముఖంలో భావాలు గుర్తించిన స్రవంతి మనస్సు చివుక్కుమంది. కానీ దాన్ని కనిపించనీయకుండా ‘‘ఎప్పటినుంచో చెబుతూ ఉన్నా కదే... ఏదో ఒకరోజు ఫోన్‌ కూడా చేయకుండా వచ్చేస్తానని’’ అంది ముఖాన నవ్వు పులుముకుని.

లోపలికి వెళుతూనే కన్పించిన మనోహర్‌కి చెప్పింది శిరీష- ‘‘నేను చెబుతుంటానే... నా ఫ్రెండ్‌ స్రవంతి... చెన్నై నుంచి వచ్చింది... నాలుగు రోజులుండి వెళదామని.’’
విషయం విన్న మనోహర్‌ ముఖం ప్రసన్నంగా లేకపోవడాన్ని గమనించింది స్రవంతి.

‘‘నైస్‌’’ అంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు.
ఈలోపు శిరీష కొడుకు చైతు, కూతురు దివ్య వచ్చారు.
తనను చూస్తూనే బెదురుగా పారిపోతుంటే... స్రవంతి ఇద్దరినీ దగ్గరకు తీసుకోవాలని చూసింది కానీ వాళ్ళు రాలేదు.

స్రవంతికి తన పిల్లలు గుర్తుకు వచ్చారు. కొత్తవాళ్ళు ఎవరు వచ్చినా ‘నమస్తే’ పెట్టి కలిసిపోతారు. ముందు వాళ్ళూ ఇలాగే ఉన్నా నెమ్మదిగా తానూ, శరత్‌ అలవాటు చేశారు.
స్రవంతికి కాఫీ ఇచ్చి పిల్లలకు పాలిచ్చేందుకు ప్రయత్నించింది శిరీష. కానీ, చైతూ తాగనని మొరాయించాడు. వాడికి ఒక్కటి తగిలించింది. దాంతో వాడు ఒక్కసారిగా ఏడుపు లంకించుకున్నాడు.
స్రవంతి వారించబోయింది కానీ...
‘‘నీకు తెలియదే. వీడు రోజూ ఇంతే. నాలుగు తగిలిస్తే కానీ తాగడు’’ అంది శిరీష.
కొడుకు ఏడుపుకు బయటకు వచ్చిన మనోహర్‌ ‘‘ఏమిటీ, పొద్దునే గోల’’ అని విసుక్కున్నాడు.

‘‘గోల అని విసుక్కోకపోతే... వాడికి
కాస్త పాలు పట్టించకూడదూ’’ అంది శిరీష మరింత చిరాగ్గా.
‘‘వీకెండ్‌లో రెండు రోజులు ఎలాగూ నేనే పిల్లల్ని చూస్తున్నాను. వర్కింగ్‌డే నాడూ చూడమంటే ఎలా?’’ మనోహర్‌ కసురుకుంటూ అన్నాడు.

ఇలా వాళ్ళిద్దరూ తనముందే వాదులాడుకుంటుంటే స్రవంతికి ఇబ్బందిగా అనిపించింది. అక్కడి నుంచి నెమ్మదిగా పక్కగదిలోకి వెళుతుంటే... ‘‘అయినా మీ గారాబం వల్లనే వాడు మొండిగా తయారవుతున్నాడు’’ రెట్టించిన స్వరంతో శిరీష అనడం వెనుక నుంచి వినిపించింది.

స్రవంతి తనకు ఇచ్చిన గదిలోకి వచ్చి ఆలోచిస్తూ కూర్చుంది.
పిల్లల్ని చూసే విషయంలో ఎలాంటి పంతాలూ పట్టింపులూ ఉండకూడదన్నది తానూ, శరత్‌ మొదటి నుంచీ అనుసరిస్తున్న విధానం. పైగా పిల్లల ముందు ఏ విషయంలోనూ వాదులాడుకోకూడదన్నది పెద్దవాడు పుట్టినప్పుడే తీసుకున్న నిర్ణయం. శరత్‌ కూడా ఈ విషయంలో ఎప్పుడూ జవదాటలేదు.

‘‘స్రవంతీ, బ్రేక్‌ఫాస్ట్‌ చేద్దాం రా’’ అన్న శిరీష పిలుపు విని బయటకు వస్తుంటే గోడపైన వాళ్ళ ఫ్యామిలీ ఫొటో కనిపించింది. శిరీష, మనోహర్‌, ఇద్దరు పిల్లలూ చిద్విలాసంగా ఫొటోకు ఫోజులిచ్చారు. ఈ ఫొటోనే శిరీష తనకు కొద్దిరోజుల కిందట వాట్సాప్‌లో షేర్‌ చేసినట్టు గుర్తు.

* * * *

స్రవంతి, శిరీష బ్రేక్‌ఫాస్ట్‌ చేస్తుంటే మనోహర్‌ వాళ్ళ పేరెంట్స్‌ వచ్చారు. వాళ్ళను చూడగానే స్రవంతి గుర్తుపట్టింది. వీళ్ళతో కలిసి ఉన్న చాలా ఫొటోలను శిరీష తనకు పంపింది. అత్తమామలతో శిరీష అన్యోన్యత ఆ ఫొటోలలో చూసే తనకు వాళ్ళింటికి రావాలనిపించింది.
అత్తమామలను చూడగానే శిరీష ముఖం చిట్లించింది.

‘‘రండి అత్తయ్యా, టిఫిన్‌ చేసే వచ్చారుగా’’ అంటూ ఆమె సమాధానం కోసం చూడకుండా స్నానానికి వెళ్ళిపోయింది. ఆ పెద్దవాళ్ళ ముఖాలు చూస్తే బ్రేక్‌ఫాస్ట్‌ చేసి రాలేదని గుర్తించిన స్రవంతి మనస్సు బాధపడింది.
తానే చొరవ తీసుకొని వాళ్ళిద్దరికీ కాఫీ, బిస్కెట్లూ ఇచ్చింది.

అత్తమామలతో శిరీష అంటీముట్టనట్టు ఉండటం స్రవంతికి ఆశ్చర్యం కలిగించింది.
మధ్యాహ్నం భోజనాలు అయ్యాక
ప్రయాణ బడలికతో ఉన్న స్రవంతి కాసేపు నిద్రపోయింది.
గంట తర్వాత గది బయట పెద్దగా అరుపులు వినిపిస్తుంటే స్రవంతి కంగారు పడుతూ లేచింది.

‘‘మీరు రావడంవల్ల నేనేమీ ఇబ్బంది పడటంలేదు. కానీ, పిల్లల్ని గారాబం చేయవద్దంటున్నాను. మీరు వెళ్ళాక
వాళ్ళని ఒక దారికి తీసుకురావడానికి తల ప్రాణం తోకకు వస్తోంది’’ గట్టిగా రొప్పుతూ అంటోంది శిరీష, కోపంతో ఆమె కళ్ళు ఎర్రబడి ఉన్నాయి.
‘‘అదేంటమ్మా... పిల్లలు తాతా నానమ్మల దగ్గరకు రాకుండా ఉంటారా? మేం కాస్త ముద్దు చేయడం నిజం. దానికి గారాబం
చేసి పిల్లల్ని చెడగొడుతున్నామంటే ఎలా?’’ శాంతంగా అన్నారు శిరీష అత్తగారు సులోచన.
‘‘నేను కావాలని అంటున్నట్టు మాట్లాడుతున్నారేమిటీ?’’ అంటూ శిరీష అత్తగారిపై కస్సున లేచింది.
‘‘నేనేమీ అనడం లేదు శిరీషా... పిల్లల్ని దగ్గరకు తీస్తే పాడైపోతారని అనుకోకూడదు’’ చెప్పారు సులోచన తన మనసులో భావాన్ని వివరిస్తూ.

‘‘గారాబం చేయవద్దంటుంటే... ఏదేదో చెబుతారేంటీ? మీ సలహాలూ సుద్దులూ నాకు అవసరం లేదు. నా ఇంటికి వచ్చినప్పుడు నేను చెప్పినట్టు వినాలంతే’’ రోషంతో మాట జారింది శిరీష.
‘‘ఎందుకమ్మా అంతమాట. నీకు కష్టంగా ఉంటే మేము ఇప్పుడే వెళ్ళిపోతాం. ఏదో పిల్లలపై ఆపేక్షతో వచ్చాం’’ అన్నారు అప్పటివరకూ మౌనంగా ఉన్న మామగారు.
గొడవ కాస్తా ముదిరిపోతోందని గమనించిన స్రవంతి అక్కడి నుంచి శిరీషను పక్కకు తీసుకెళ్ళింది.

ఆ తర్వాత చాలాసేపటి వరకూ ఆ ఇంట్లో నిశ్శబ్దం రాజ్యమేలింది. పిల్లలు బిక్కచచ్చిపోయి కన్పించారు. స్రవంతికి అక్కడ ఉండటం అసౌకర్యంగా అనిపించింది.
పెళ్ళయి పదేళ్ళయినా ఇప్పటి వరకూ తాను అత్తయ్యతో ఒక్కసారి కూడా గట్టిగా మాట్లాడలేదు. అలా అని భేదాభిప్రాయాలు అసలు లేవని కాదు. అలాంటి పరిస్థితి ఎప్పుడైనా వస్తే... తమ ఇద్దరిలో ఎవరో ఒకరు మౌనం పాటిస్తారు. దానితో కొద్దిసేపటికే మనస్పర్థ సమసిపోతుంది.

ఇక తను మామగారి ఎదుట కఠినంగా మాట్లాడిన సందర్భం ఒక్కటీ లేదు.
అసలు తమ ఇల్లు శరత్‌ వేసే జోకులతో ఎప్పుడూ సరదాగా ఉంటుందే తప్ప సీరియస్‌గా ఉండదు.
స్రవంతి ఒక్కసారి తన ఫోన్‌ తీసి శిరీష చాట్స్‌లో వెతికి నెలకిందట పంపిన ఫొటోలు చూడసాగింది.

శిరీష, తన అత్తమామలతో కలిసి తీయించుకున్న ఫొటోలు పదివరకూ ఉన్నాయి. అన్నింటిలో శిరీష తన అత్తగారి భుజంపైన చెయ్యి వేసో మెడచుట్టూ చెయ్యి వేసో సన్నిహితంగా ఉంది.
ఆ ఫొటోల ఆధారంగానే అయితే శిరీషకు ఉత్తమ కోడలిగా, బెస్ట్‌ మదర్‌గా అవార్డులు ఇవ్వవచ్చు.
కానీ, నిజ జీవితంలో... నిత్య జీవితంలో ఏం జరుగుతుందో స్రవంతి కళ్ళారా చూసింది.

శరత్‌గానీ తన అత్తమామలుగానీ ఫొటోలకు ఎప్పుడూ ప్రాధాన్యం ఇచ్చేవారు కాదు. ఏ పండగలప్పుడో తాను అడిగితే ఒప్పుకున్నా... ‘‘ఒక్క కండిషన్‌ స్రవంతీ... ఈ ఫొటోలు మన మధ్యనే ఉండాలి. సోషల్‌ మీడియాలో వాడకు’’ అని శరత్‌ సున్నితంగా హెచ్చరించేవాడు.
స్రవంతిలో అప్పటివరకూ ఉన్న భ్రమలు తొలగిపోయాయి.

ఒక్క క్షణం కూడా అక్కడ ఉండాలని అనిపించలేదు.
‘‘ఏమిటే, నాలుగు రోజులు ఉందామని వచ్చి అప్పుడే బట్టలు సర్దుకుంటున్నావ్‌?’’ అడిగింది శిరీష.
‘‘నీ ఫొటోల్లోని జీవితం మా ఇంట్లో చూద్దువుగాని నాతోపాటు చెన్నై రా శిరీషా... నాలుగు రోజులుండి వెళుదువుగాని’’ అంది స్రవంతి సూట్‌కేస్‌ మూస్తూ.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..