గుడ్డు కూరలు... కాస్త కారంగా!

ఫ్రిజ్‌లో కోడిగుడ్లు ఉన్నప్పుడు వాటితో ఏదో ఒక కూర చేసేయకుండా ఇలాంటి రుచుల్లో వండితే... అన్నంలోకే కాదు పులావ్‌, బిర్యానీ, రోటీలకు కూడా మంచి కాంబినేషన్‌ అవుతాయి.

Updated : 15 May 2022 06:11 IST

గుడ్డు కూరలు... కాస్త కారంగా!

ఫ్రిజ్‌లో కోడిగుడ్లు ఉన్నప్పుడు వాటితో ఏదో ఒక కూర చేసేయకుండా ఇలాంటి రుచుల్లో వండితే... అన్నంలోకే కాదు పులావ్‌, బిర్యానీ, రోటీలకు కూడా మంచి కాంబినేషన్‌ అవుతాయి.


చెట్టినాడ్‌ కర్రీ

కావలసినవి: ఉడికించిన గుడ్లు: ఆరు, నూనె: అరకప్పు, ఆవాలు: చెంచా, జీలకర్ర: చెంచా, కరివేపాకు రెబ్బలు: మూడు, ఉల్లిపాయముక్కలు: కప్పు, అల్లంవెల్లుల్లిముద్ద: రెండు చెంచాలు, టొమాటో గుజ్జు: అరకప్పు,
దనియాలపొడి: రెండు చెంచాలు, పసుపు: అరచెంచా, కారం: రెండు చెంచాలు, ఉప్పు: తగినంత, నిమ్మరసం: రెండు చెంచాలు, జీలకర్ర: చెంచా, సోంపు: చెంచా, కొబ్బరితురుము: కప్పు, ఎండుమిర్చి: అయిదు, మిరియాలు: చెంచా.

తయారీ విధానం: స్టౌమీద కడాయి పెట్టి చెంచా నూనె వేసి జీలకర్ర, సోంపు, కొబ్బరితురుము, ఎండుమిర్చి, మిరియాలు వేయించుకుని తీసుకోవాలి. వీటి వేడి చల్లారాక మిక్సీలో వేసి కాసిని నీళ్లు పోసి మెత్తని పేస్టులా వచ్చేలా గ్రైండ్‌ చేసుకోవాలి. ఇప్పుడు బాణలిని పొయ్యిమీద పెట్టి రెండు టేబుల్‌స్పూన్ల నూనె వేసి... గుడ్లను ఎర్రగా వేయించుకుని విడిగా తీసుకోవాలి. అందులోనే మిగిలిన నూనె వేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేయించుకుని ఉల్లిపాయముక్కలు, అల్లంవెల్లుల్లి ముద్ద వేసి ఎర్రగా వేయించుకోవాలి. తరువాత టొమాటో గుజ్జు, దనియాలపొడి, పసుపు, కారం, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. కాసేపటికి ఈ మిశ్రమం దగ్గరకు అవుతుంది. అప్పుడు పావుకప్పు నీళ్లు, గుడ్లు వేసి కలిపి పది నిమిషాలయ్యాక దింపేసి నిమ్మరసం వేసి మూత పెట్టాలి.


ఎగ్‌ పెప్పర్‌ మసాలా

కావలసినవి: ఉడికించిన గుడ్లు: అయిదు, ఉల్లిపాయలు: రెండు, టొమాటో: ఒకటి, నీళ్లు: పావుకప్పు, నూనె: పావుకప్పు, ఉప్పు: తగినంత, మిరియాలు: రెండు చెంచాలు, ఎండుమిర్చి: నాలుగు, వెల్లుల్లి రెబ్బలు: ఆరు, సోంపు: టేబుల్‌స్పూను, మిరియాలపొడి: అరచెంచా.

తయారీ విధానం: ముందుగా ఎండుమిర్చి, వెల్లుల్లి, మిరియాలు, సోంపు మిక్సీలో వేసుకుని పొడిలా గ్రైండ్‌ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టౌమీద కడాయి పెట్టి నూనె వేసి... ఆ మసాలాపొడి, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేయించుకోవాలి. తరువాత టొమాటోముక్కలు, తగినంత ఉప్పు, నీళ్లు పోసి స్టౌని సిమ్‌లో పెట్టాలి. టొమాటో ముక్కలు ఉడికి కూరలా అవుతున్నప్పుడు ఉడికించిన గుడ్లు, మిరియాల పొడి వేసి బాగా కలిపి దింపేయాలి.


షాహీ అండా కర్రీ

కావలసినవి: ఉడికించిన గుడ్లు: నాలుగు, వెల్లుల్లి రెబ్బలు: అయిదు, ఉల్లిపాయ: ఒకటి, పచ్చిమిర్చి: రెండు, అల్లం: చిన్నముక్క, తాజా క్రీమ్‌: టేబుల్‌స్పూను, పెరుగు: చెంచా, కసూరీమేథీ: టేబుల్‌స్పూను, చాట్‌మసాలా: అరచెంచా, గరంమసాలా: అరచెంచా, కారం: చెంచా, కొత్తిమీర: కట్ట, ఉప్పు: తగినంత, నూనె: రెండు టేబుల్‌స్పూన్లు.

తయారీ విధానం: ముందుగా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి మిక్సీలో వేసుకుని మెత్తని పేస్టులా చేసుకుని పెట్టుకోవాలి. తరువాత స్టౌమీద కడాయి పెట్టి నూనె వేయాలి. అది వేడెక్కాక ఉల్లిపాయ మిశ్రమం వేసి బాగా వేయించాలి. ఈ మసాలా వేగి, నూనె పైకి తేలుతున్నప్పుడు పెరుగు, క్రీమ్‌ వేసి బాగా కలిపి అయిదు నిమిషాలాయ్యాక కసూరీమేథీ, గరంమసాలా, కారం, తగినంత ఉప్పు వేసి కలిపి కప్పు నీళ్లు పోయాలి. స్టౌని సిమ్‌లో పెట్టి మధ్యమధ్య కలుపుతూ ఉంటే... కాసేపటికి ఈ మిశ్రమం దగ్గరకు అవుతుంది. అప్పుడు అక్కడక్కడా గాట్లు పెట్టిన గుడ్లు, చాట్‌మసాలా, కొత్తిమీర తరుగు వేసి కలిపి అయిదు నిమిషాలయ్యాక దింపేయాలి.


చెప్‌ చిట్కా

హోటల్‌ నుంచి తెచ్చుకునే బిర్యానీ ఎంత రుచికరంగా ఉంటుందో చెప్పక్కర్లేదు. మరి అదే రుచి ఇంట్లోనూ రావాలంటే ఎలా అనుకునేవారు ఈ చిట్కాలను పాటిస్తే సరి.

* చికెన్‌ లేదా మటన్‌ బిర్యానీ చేస్తున్నప్పుడు...మాంసం, బియ్యాన్ని సమానంగానే తీసుకోవాలి. అంటే... కేజీ బియ్యాన్ని వాడుతుంటే మాంసాన్ని కూడా కేజీనే తీసుకోవాలి. అప్పుడే అన్నం ఎక్కువగా, మాంసం ముక్కలు తక్కువగా... లేదా మాంసం ముక్కలు ఎక్కువగా అన్నం తక్కువగా కాకుండా ఉంటుంది.

* చికెన్‌ లేదా మటన్‌కు మసాలా పట్టించాక కనీసం నాలుగైదు గంటల తరువాతే వండాలి. దానివల్ల ఆ ముక్కల్లో ఎక్కువ రసం ఊరి... వండిన తరువాత మరింత రుచికరంగా ఉంటుంది. 

* బిర్యానీ కోసం వండే బాస్మతీ బియ్యాన్ని ఇరవై నిమిషాల నుంచి అరగంటవరకూ నానబెట్టాలంటారు. అయితే ముందుగా బియ్యాన్ని కడిగి కొద్దిగా ఉప్పు వేసిన నీటిలో నానబెట్టుకోవాలి. వండేటప్పుడు ఆ నీటిని కూడా వాడితే అన్నం పొడిపొడిగానే కాదు, రుచికరంగానూ ఉంటుంది. అదేవిధంగా నానబెట్టుకున్న బియ్యాన్ని పది నుంచి పన్నెండు నిమిషాలు అంటే... దాదాపు డెబ్బైశాతం ఉడికించుకుని తీసుకుంటే చాలు.

* దమ్‌ చేస్తున్నప్పుడు వేసే ఇతర మసాలాలతోపాటు రెండు వంతుల యాలకులు, ఒక వంతు జాపత్రి కలిపి చేసిన పొడి లేదా కేవ్‌డానీరు కొద్దిగా చల్లితే... బిర్యానీకి హోటల్‌ రుచి వస్తుంది. ఘుమఘుమలాడుతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..