సరిలేరు ఆయనకెవ్వరూ..!

ఎన్టీఆర్‌ వ్యక్తిత్వం, గొప్పతనం ఆయన్ని దగ్గరగా చూసిన, ఆయనతో ప్రయాణించిన వారికంటే ఇంకెవరికి బాగా తెలుస్తుంది. ఆ మహనీయుడి గురించి ఈ సినీ దిగ్గజాలు (గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలలో) ఏం చెప్పారంటే...

Updated : 28 May 2023 05:07 IST

ఎన్టీఆర్‌ వ్యక్తిత్వం, గొప్పతనం ఆయన్ని దగ్గరగా చూసిన, ఆయనతో ప్రయాణించిన వారికంటే ఇంకెవరికి బాగా తెలుస్తుంది. ఆ మహనీయుడి గురించి ఈ సినీ దిగ్గజాలు (గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలలో) ఏం చెప్పారంటే...


పంథా మార్చుకున్నా

- అక్కినేని నాగేశ్వరరావు

నేను సినిమాల్లోకి వచ్చిన నాలుగేళ్ల తర్వాత ఎన్టీఆర్‌ వచ్చారు. ఆయనపైన నాకు మొదట్నుంచీ ప్రత్యేక పరిశీలన ఉండేది. చేయి తిరిగిన శిల్పి శ్రద్ధతో చెక్కినట్లుండే ముఖకవళికలు, ఆజానుబాహు శరీరం, సుమధురమైన గంభీరమైన కంఠస్వరం, ఏవైపు నుంచి చూసినా అందంగా కనిపించే స్ఫురద్రూపం... ఈ విషయాల్లో ఆయనతో పోల్చుకుంటూ నాకు జీరో మార్కులు వేసుకునేవాణ్ని. నా చుట్టూ ఉన్నవాళ్లు కూడా ‘ఇక నాగేశ్వరరావు దెబ్బతింటాడు’ అనుకోవడం నా చెవిన పడింది. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఏఎన్నార్‌ ఉండడనిపించింది. నేను జాగ్రత్త పడగలిగింది ఒక్కటే, మంచి పాత్రలను ఎంపిక చేసుకోవడం. అంతకు మించిన మార్గం లేదు. అదే చేశాను. ఎన్టీఆర్‌ అనే పోటీయే లేకపోతే ఇన్ని పాత్రలద్వారా ఇంత పేరు తెచ్చుకునేవాణ్నే కాదు.


మర్యాద రామన్న...

- సి.నారాయణరెడ్డి

చలనచిత్ర రంగంలో రామారావు గారి వ్యక్తిత్వం సుదర్శనచక్రం లాంటిది. ఎన్ని అంచులని చెప్పను... ఒక్కో అంచుకి ఒక్కో విలక్షణమైన పాత్ర. నటుడిగా నిర్మాతగా దర్శకుడిగా చిత్రకథా రచయితగా ఎడిటర్‌గా స్క్రీన్‌ప్లే రచయితగా మాత్రమే కాదు... పురాణ పాత్రలకు సంబంధించిన మేకప్‌, కిరీటాలు, ఆభరణాలు - వీటన్నిటికీ ఆయన స్కెచెస్‌ వేసి కళాదర్శకుడికి చూపడం స్వయంగా చూసినవాణ్ణి నేను. నటన ఆయనకు కేవలం వృత్తి కాదు... అదో తపస్సు. కళాకారుణ్ణి గౌరవించడంలోనూ రామారావు గారిదో ప్రత్యేకమైన శైలి. ఆయన సెట్లో ఉండగా నేను లోపలికి వెళ్తే నన్ను చూడగానే లేచి చేయి కలిపేవారు. ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’కి పాటలు రాస్తున్న రోజుల్లో- ఓ సాయంత్రం గండిపేటలోని అతిథి గృహంలో కూర్చుని పాట రాస్తున్నా. మధ్య మధ్యలో ఆయన సలహాలు ఇస్తున్నారు. పాట పూర్తయింది. ఆయనకు ఎంతో నచ్చిందది. ఆయన స్టైల్లో ‘రెడ్డిగారూ థ్యాంక్స్‌... మీకు శ్రమ ఇచ్చాను. అద్భుతంగా వచ్చింది... ఐ యామ్‌ సో హ్యాపీ, సో హ్యాపీ’ అంటూ షేక్‌హ్యాండ్‌ ఇచ్చారు. అంతేకాదు, ‘సెలవండీ’ అంటూ నా కారు దగ్గరకి వచ్చి నాకంటే ఓ అడుగు ముందుకేసి ఆయనే స్వయంగా కారు డోర్‌ తెరిచారు. అప్పుడాయన ముఖ్యమంత్రి. మా డ్రైవరు విస్తుపోయి కంగారుగా చూస్తున్నాడు. నేను చకితుణ్ణయి ‘అయ్యో, మీరు డోర్‌ తెరవడమేమిటండీ’ అంటుండగానే ‘మిమ్మల్ని గౌరవించడం మా ధర్మం’ అన్నారు. నేను నిరుత్తరుణ్ణయ్యాను. నాకు పూర్తిగా అర్థమైందప్పుడు- ఆయన గౌరవిస్తున్నది నారాయణరెడ్డిని కాదు, కవి వాక్కుని అని. అదీ ఆయన సంస్కారం.


నిద్ర మూడు గంటలే...

- ఎస్పీబాలసుబ్రమణ్యం

1977 వరద బాధితుల సహాయార్థం ఆర్టిస్టులందరి చేతా ప్రోగ్రాములు చేయిస్తూ ఊరూరూ తిరిగి చందాలు వసూలు చేస్తున్న రోజులు... ఉదయం 4:30కి బస్సు మా విడిది నుంచి బయలుదేరేది. ఎన్టీఆర్‌ గారు నాలుగు గంటలకే మొదటి సీట్లో ప్రత్యక్షం అయ్యేవారు. మధ్యమధ్యలో దిగుతూ చందాలు వసూలు చేసేవారు. ఊళ్లో దిగగానే మేమంతా బస గురించి చూసుకుంటే, ఆయన మాత్రం ఊళ్లోకి వెళ్లి పెద్దలందర్నీ కలిసి చందాలు వసూలు చేసేవారు. అలా సాయంత్రం వరకూ జరిగేది. ఏడింటికి కల్చరల్‌ ప్రోగ్రామ్స్‌ మొదలు పెట్టేవాళ్లం. ఆఖరున శ్రీకృష్ణ తులాభారం ప్రదర్శన ఉండేది. కృష్ణుడిగా రామారావుగారే చేసేవారు. దాని కోసం రాత్రి 12 గంటలకు మేకప్‌ వేసుకుని సైడ్‌ వింగ్‌లో సిద్ధంగా ఉండేవారు. ఒంటిగంట వరకూ ఆ ప్రదర్శన జరిగేది. తర్వాత మేకప్‌ తీసి పడుకోవాలి. ఇంతాచేసి మళ్లీ ఉదయం నాలుగు గంటలకల్లా బస్సులో మాకన్నా ముందుగా ప్రత్యక్షమయ్యేవారు. అలా ఏకధాటిగా 17 రోజులు. ఆయనెప్పుడు నిద్రపోతారో ఎప్పుడు లేస్తారో ఎవరికీ అంతుబట్టేది కాదు. కార్యసాధనలో అంతటి అకుంఠిత దీక్ష ఆయన ఒక్కడికే సాధ్యం.


పెద్దలంటే గౌరవం

- కైకాల సత్యనారాయణ

నిజజీవితంలో- తన సహధర్మచారిణిని మినహాయిస్తే రామారావుగారు ఎక్కువ కాలం గడిపింది నాతోనే. ఒకటా రెండా... నూటొక్క సినిమాల అనుబంధం మాది. ఏ సినిమా చూసినా ఆయన హీరో, నేను విలన్‌. నిజానికి నేనీ స్థాయికి చేరుకోవడానికి కేవలం రామారావుగారే కారణం. తొలిరోజుల్లో నన్ను ఆదరించి దగ్గరకు తీసుకుని, మంచి పాత్రలు ఇప్పించి నన్నో కళాకారునిగా తీర్చిదిద్దారాయన. ప్రతి ఒక్కర్నీ ‘మీరు, గారు’ అంటూ సంబోధించే రామారావు గారు నన్ను మాత్రమే ‘తమ్ముడూ’ అని పిలుస్తారు. మా అమ్మ అంటే ఆయనకు ఎంతో ప్రేమ, గౌరవం. మద్రాసులో ఉన్నప్పుడే కాదు సీఎం అయ్యాకా మా ఇంటికివచ్చి  అమ్మతో కాసేపు మాట్లాడి వెళ్తుండేవారు. ఓసారి ఆయన మా ఇంటికి వచ్చినప్పుడు నేను అవుట్‌ డోర్‌ షూటింగ్‌లో ఉన్నాను. పావుగంట అమ్మ దగ్గర కూర్చుని మాట్లాడారు. అమ్మకి అప్పుడు సుస్తీగా ఉండటంతో ‘నాతో హైదరాబాద్‌ వచ్చేయ్‌ అమ్మా, మంచి వైద్యం చేయిస్తాను’ అని ఎంతో సేపు అడిగారట. ఆ మాట నాతో చెబుతూ మా అమ్మ ఆనందంతో ఏడ్చేసింది. ఎప్పుడు కనిపించినా ‘అమ్మ ఎలా ఉంది’ అని అడిగేవారు. పెద్దలంటే అంతటి ప్రేమ, గౌరవం  ఉన్న అపురూపమైన మనిషి ఎన్టీఆర్‌ గారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు