కిళ్ళీ రుచిలో... ఐస్‌క్రీమ్‌, లడ్డూ, చాక్లెట్‌..!

విందుల్లో ఎన్ని రకాల వంటకాలు ఆస్వాదించినా...ఆఖరున పెట్టే పాన్‌ రుచే నోట్లో ఎక్కువ సేపు ఉంటుంది. కాస్త ఘాటుగా ఉండే తమలపాకులో రకరకాల పదార్థాలు జోడించి చేస్తారు కాబట్టే ఆ రుచి అంత ప్రత్యేకం. అయితే ఇప్పుడా రుచుల సమ్మేళనంతో ఐస్‌క్రీమ్‌లూ

Published : 24 Apr 2022 01:06 IST

కిళ్ళీ రుచిలో... ఐస్‌క్రీమ్‌, లడ్డూ, చాక్లెట్‌..!

విందుల్లో ఎన్ని రకాల వంటకాలు ఆస్వాదించినా... ఆఖరున పెట్టే పాన్‌ రుచే నోట్లో ఎక్కువ సేపు ఉంటుంది. కాస్త ఘాటుగా ఉండే తమలపాకులో రకరకాల పదార్థాలు జోడించి చేస్తారు కాబట్టే ఆ రుచి అంత ప్రత్యేకం. అయితే ఇప్పుడా రుచుల సమ్మేళనంతో ఐస్‌క్రీమ్‌లూ, కుల్ఫీలూ, చాక్లెట్లూ, పలు రకాల స్వీట్లూ నోరూరిస్తున్నాయి. భోజనానంతరం వీటిని తింటే ప్రత్యేకంగా పాన్‌ తినాల్సిన పనే ఉండదు.

మాంచి విందు భోజనం కడుపు నిండా లాగించేసి... ఐస్‌క్రీమ్‌ కప్పు కూడా ఖాళీ చేశాక చివరాఖరికి కనిపిస్తుంది కిళ్లీ. దాన్నే పాన్‌ అనీ కూడా అంటారు. పేరు ఏదైతేనేం, నోట్లో వేసుకున్నామంటే... ఆ అనుభూతే వేరు. అయితే భోజనమయ్యాక పాన్‌ నోట్లో వేసుకోవడమన్నది ఓ అలవాటు మాత్రమే కాదు, తిన్నదాన్ని అరిగించే చక్కని ఔషధంగానూ, మౌత్‌ఫ్రెషనర్‌గానూ అది పని చేస్తుంది. అలాంటి కిళ్లీలు పలు రుచుల్లో భిన్నపదార్థాల మిళితంగా వస్తూ రకరకాల పేర్లతో అందుబాటులో ఉన్నాయి. వాటన్నింటిలోనూ ఎక్కువ మంది ఓటేసేది మాత్రం మీఠా పాన్‌కే. కొబ్బరి పలుకులు, టూటీఫ్రూటీ, గుల్‌కంద్‌, యాలకులు, లవంగాలు, సన్నగా తరిగిన డ్రైఫ్రూట్స్‌, కొద్దిగా వక్క జోడించి దీన్ని చేస్తారు. కొందరు ఆరోగ్యం కోసమని పచ్చకర్పూరం, సోంపు, జాజికాయ, కుంకుమపువ్వు, సోంపు వంటివీ చేర్చుకుంటారు. అందుకే కొంచెం తీపీ మరికొంచెం మసాలా ఘాటూ కలగలిపిన ఈ పాన్‌ భిన్నమైన రుచితో అలరిస్తుంది.

ఈ పాన్‌మసాలా, తమలపాకులూ ఇప్పుడు ఐస్‌క్రీమ్‌లూ, చాక్లెట్లూ, కుల్ఫీల్లోకి చొరబడిపోయి- కాస్త చల్లగా, మరికాస్త ఘాటుగా నోటికి రుచుల విందు చేస్తున్నాయి. లడ్డు, కోవా, బర్ఫీ, హల్వా, మోదక్‌ వంటి స్వీట్లలో చేరిపోయి తీయని వేడుకల్లో భాగమవుతున్నాయి. అంటే, ఈ తినుబండారాల సహజ రుచికి, తీపీ ఘాటూ కలగలిపిన పాన్‌ కూడా తోడవడంతో ప్రత్యేకించి పాన్‌ తినక్కర్లేదు. విందు భోజనాల వేళ ఎన్ని రకాల వంటకాలు పెట్టినా చివరలో ఓ కిళ్లీ పెట్టకపోతే మాత్రం మర్యాద లోపంగానో లేదా భోజనం పూర్తవనట్లుగానో కొందరు భావిస్తారు. అలాంటి వారికి ఇలాంటి స్వీట్లో, ఐస్‌క్రీమ్‌లో, కుల్ఫీలో, చాక్లెట్లో చేతిలో పెట్టేస్తే చాలు వెరైటీగానూ ఉంటుంది. కిళ్లీ తినలేదన్న లోటూ ఉండదు.
ఐస్‌క్రీమ్‌, కుల్ఫీ, చాక్లెట్‌, పాప్సికిల్స్‌ వంటివి చేసేటప్పుడు వాటికి కావలసిన పదార్థాలతోపాటు అదనంగా తీపి పాన్‌లో చేర్చేవన్నీ కూడా తగిన మోతాదులో వేస్తే చాలు- పాన్‌ ఐస్‌క్రీమ్‌, పాన్‌ కుల్ఫీ, పాన్‌ చాక్లెట్‌, పాన్‌ పాప్సికిల్స్‌ వంటివీ సిద్ధమైపోతాయి. అయితే కొన్ని సంస్థలు చాక్లెట్‌, ఐస్‌క్రీమ్‌, కుల్ఫీల తయారీలో ఒక్క తమలపాకునే చేర్చుతున్నాయి. కొందరేమో లడ్డు, మోదక్‌ వంటి వాటిలోపల పాన్‌ మసాలాను స్టఫ్‌గా పెడుతున్నారు. ఏదైతేనేం, గుండెకీ, జీర్ణవ్యవస్థకీ మేలు కలిగించి... నోటి దుర్వాసననీ మలబద్ధకాన్నీ సైతం దూరం చేసే ఔషధ గుణాలెన్నో ఉన్న తమలపాకు వల్ల తినుబండారాలన్నీ చిలకపచ్చ రంగులో చవులూరించేస్తున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..