బాల్కనీ...అందంగా...ఆహ్లాదంగా..!

ఇంటిచుట్టూ చల్లదనాన్ని పంచే పచ్చని తోటల్నీ ముంగిట అందాల పూలమొక్కల్నీ పెంచుకోవాలని ఎవరికి మాత్రం ఉండదు? కాకపోతే కాంక్రీటు అరణ్యాల్లో కాస్త పెద్ద బాల్కనీ ఉండటమే అపురూపంగా అనిపిస్తుంది. అందుకే లేనిదానికోసం చింతించకుండా ఉన్న ఆ కాస్త స్థలాన్నే మొక్కలతో పచ్చగానూ

Published : 08 May 2022 01:47 IST

బాల్కనీ...అందంగా...ఆహ్లాదంగా..!

ఇంటిచుట్టూ చల్లదనాన్ని పంచే పచ్చని తోటల్నీ ముంగిట అందాల పూలమొక్కల్నీ పెంచుకోవాలని ఎవరికి మాత్రం ఉండదు? కాకపోతే కాంక్రీటు అరణ్యాల్లో కాస్త పెద్ద బాల్కనీ ఉండటమే అపురూపంగా అనిపిస్తుంది. అందుకే లేనిదానికోసం చింతించకుండా ఉన్న ఆ కాస్త స్థలాన్నే మొక్కలతో పచ్చగానూ కాసేపు హాయిగా కూర్చునేందుకు సౌకర్యంగానూ అందంగానూ ఉండేలా డిజైన్‌ చేసుకుంటున్నారు. అదెలానో చూద్దామా..!

పూలతో కళకళలాడే పెరటితోటలూ విశాలమైన వరండాతో ఉండే ఇల్లూ లేదనుకోకుండా అపార్ట్‌మెంట్‌ బాల్కనీనే పచ్చదనంతో నింపేస్తున్నారు నగరాల్లోని ప్రకృతి ప్రేమికులు. అది కూడా రంగుల కుండీలూ గులకరాళ్లూ పూలమొక్కలతో అందం తీసుకొచ్చేవాళ్లు కొందరైతే, ఉన్న ఆ కొంచెం స్థలంలోనే కృత్రిమ గడ్డి తివాచీల్నే పచ్చికలా పరిచి, కూర్చునేందుకు వీలుగా చిన్న సైజు నులకమంచాలూ సోఫాలూ వేసుకుని, గోడవారగా పూలకుండీలూ క్రోటన్లూ పెట్టుకుని, హస్తకళాకృతుల్ని తగిలించడం ద్వారా బాల్కనీని అందంగా అలంకరించుకుంటున్నారు.

మొక్కల పెంపకంలోనూ బాల్కనీని అలంకరించుకోవడంలోనూ ఒక్కొక్కరిదీ ఒక్కో అభిరుచి. పచ్చదనం ఉంటే చాలనుకుంటారు కొందరు. అలాకాదు, పెంచే ప్రతి మొక్కా పూసి తీరాలి అనుకునేవాళ్లు ఇంకొందరు. ఏది పెంచాలన్నా ముందు బాల్కనీ విస్తీర్ణాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ముఖ్యంగా ఎల్‌ ఆకారంలో మొక్కల్ని పెంచుకుంటూ- అంటే రెండు పక్కల కుండీలు ఉంచి, మిగిలిన రెండు వైపులా ఉన్న స్థలాన్ని సిటవుట్‌లా మలచుకుంటే తిరగడానికీ కూర్చోవడానికీ కూడా సౌకర్యంగా ఉంటుంది. ఇలా పెట్టుకునేటప్పుడు మన బాల్కనీలోకి ఎండ ఎటువైపు నుంచి వస్తుందీ ఎంతసేపు ఉంటుందో కూడా చూసుకోవాలి. ఇటీవల చాలామంది బెడ్‌రూమ్‌ వైపు ఉన్న బాల్కనీలో మల్లె, జాజి, చమేలీ... వంటి తీగమొక్కల్నీ, హాలులోకి ఉన్న బాల్కనీలో పూలమొక్కల్నీ, కిచెన్‌ బాల్కనీలో మిర్చి, కొత్తిమీర, కరివేపాకు వంటివీ పెడుతున్నారు. కానీ సాధారణంగా దక్షిణం వైపు ఉన్న బాల్కనీలో ఎండ ఎక్కువసేపు నిలిచి ఉంటుంది. కాబట్టి అటు కూరగాయల్లాంటివి పెంచుకోవచ్చు. తూర్పువైపు ఉండే బాల్కనీల్లో ఉదయం వేళలోనూ పడమటివైపు ఉండే బాల్కనీల్లో సాయంకాలం పూటా ఎండ ఉంటుంది కాబట్టి అక్కడ గులాబీలూ చామంతులూ నూరువరహాలూ బంతులూ మందారాలూ... వంటివి పెంచుకోవచ్చు. ఉత్తరంవైపు బాల్కనీలో నీడన పూసే బెగోనియా లాంటి పూలమొక్కల్ని పెంచుకుంటే మేలు. భవన నిర్మాణాన్ని బట్టి ఎండ పడే తీరూ మారుతుంటుంది కాబట్టి దాన్ని గమనించుకోవాలి. అంతేకాదు, పూలమొక్కలతోపాటు  క్రోటన్‌ మొక్కల్నీ; అరెకా పామ్‌, వెదురు... వంటి వాటినీ పెంచితే బాల్కనీ మరింత శోభాయమానంగా కనిపిస్తుంది. పచ్చదనంతో పాటు, వెదురు ఫర్నిచరూ రంగుల కుషన్లూ వేలాడే దీపాలూ మీ బాల్కనీకి కొత్త అందాన్ని తెస్తాయనేది మర్చిపోకండి.


మహాసముద్రం మీద నడిచి వచ్చాం!

‘అట్లాంటిక్‌ మహాసముద్రంలో నడుస్తూ బార్‌ ఐల్యాండ్‌కి చేరుకుని అక్కడి అందాలను తనివితీరా ఆస్వాదించి మళ్లీ అదే సముద్రంలో నడుస్తూ బార్‌ హార్బర్‌కు తిరిగి రావడం చిత్రమైన అనుభూతిని కలిగించింది’ అంటూ ఆ విశేషాలను చెప్పుకొస్తున్నారు అనంతపురానికి చెందిన పి.వసుంధర.

పురాణగాథల్లో వసుదేవుడికి యమునానది తోవ ఇచ్చిందని విన్నాం. అదెలా ఉన్నా అలాంటి ప్రకృతి వింతను కళ్లారా చూశాం. అందాల బార్‌ దీవికి చేరుకునేందుకు అట్లాంటిక్‌ మహాసముద్రం రోజుకి రెండుమూడుసార్లు పర్యటకులకు దారి ఇస్తుంది. చిత్రంగా ఉన్నా ఇది నిజమే. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మహా సముద్రమే అట్లాంటిక్‌. తూర్పున ఉన్న యూరప్‌, ఆఫ్రికా ఖండాలను పడమర వైపున ఉన్న ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికాల నుంచి వేరుచేసే ఈ మహాసముద్రంలో వందలాది చిన్నా
పెద్దా ద్వీపాలు ఉన్నాయి. వీటిల్లో ఒకటైన మౌంట్‌ డెజర్ట్‌ ద్వీపం అమెరికాలోని మైనె రాష్ట్రంలో భాగంగా ఉంది. వేసవిలో పచ్చదనంతోనూ పర్యటకులతోనూ కళకళలాడే ఆ ద్వీపాన్ని చూడాలని వెళ్లాం. ముందుగా ద్వీపంలో ముఖ్యపట్టణమైన బార్‌హార్బర్‌కి చేరుకుని, అక్కడి అకేడియా నేషనల్‌ పార్క్‌లోని కేడిలాక్‌ పర్వత శిఖరం నుంచి అమెరికాలో తొలి సూర్యోదయాన్ని చూశాం.

తరవాత డౌన్‌టౌన్‌లోని బ్రిడ్జి స్ట్రీట్‌ దగ్గర ఉన్న ‘అట్లాంటిక్‌ మహా సముద్రంమీద నడిచే చోటు’కి వెళ్లాం. అక్కడ అలలు లేదా ఆటుపోట్లు(టైడ్స్‌) ఏర్పడే వేళలతో ప్రతిరోజూ ఓ చార్ట్‌ని ఉంచుతారు. సూర్యచంద్రుల గురుత్వాకర్షణ శక్తి వల్లనూ భూమి గుండ్రంగా తిరగడం వల్లనూ సముద్రం అధిక- అల్ప ఆటుపోట్లకు గురవుతుందనీ, ఈ ఆటుపోట్లు సముద్రమట్టంమీద ప్రభావం కనబరుస్తాయనీ తెలిసిందే. ఆ రోజు ఉదయం 11.30 గంటలకు లోటైడ్‌ అని రాశారు. మేం తొమ్మిదిన్నరకే అక్కడకు చేరుకున్నాం. అప్పటికే పర్యటకులు ఉన్నారు. లో టైడ్‌కి గంటన్నర ముందే- అంటే, పది గంటలకు- అందరం చూస్తుండగానే అప్పటివరకూ అఖండ జలరాశిగా ఉన్న అట్లాంటిక్‌ మహాసముద్రం రెండుగా చీలిపోయిందా అనిపించేలా సముద్రంలో ఓ పాడవాటి నేలభాగం ప్రత్యక్షమైంది. పర్యటకులంతా కేరింతలు కొడుతూ ఆ నేలమీద నడుస్తూ బార్‌ ద్వీపానికి ప్రయాణమయ్యారు. కొందరు కాలినడకనా మరికొందరు కార్లలోనూ బయల్దేరారు. సుమారు 1.9 మైళ్ల దూరం ఉన్న ఆ దారిలో మేము నడుస్తూనే బార్‌ ద్వీపానికి చేరుకున్నాం. దారంతా చిత్తడిచిత్తడిగా గులకరాళ్లూ ఇసుకలతోనూ; గవ్వలు, నత్తలు, ఎండ్రకాయలు, నక్షత్రచేపలు... వంటి సాగరజీవులతోనూ; కీటకాలతోనూ నిండి ఉంది. వేగంగా నడిస్తే అరగంట, నెమ్మదిగా నడిస్తే 45 నిమిషాల్లో బార్‌ ద్వీపానికి చేరుకుంటాం. అక్కడ ఓ గంట గడిపి తిరుగుప్రయాణమైతేనే బార్‌హార్బర్‌కు చేరుకోగలం. లేదంటే 9గంటలు వేచి చూడాలి లేదా వాటర్‌ ట్యాక్సీల్లో రావాలి. ఇక్కడ ప్రతిరోజూ రెండు లోటైడ్స్‌, రెండు హైటైడ్స్‌ ఏర్పడతాయి. ఒక్కో లోటైడ్‌కీ మధ్య తొమ్మిది గంటల వ్యవధి ఉంటుంది. ప్రతి లోటైడ్‌కి ముందు గంటన్నరా తరవాత గంటన్నరా మొత్తం మూడు గంటలే కాలిబాట కనిపిస్తుంది. ఆ రోజు 11.30కి లోటైడ్‌- అంటే, ఉదయం పది నుంచి మధ్యాహ్నం ఒంటిగంటవరకూ కాలిబాట ఉంటుందన్నమాట. అయితే మేం చుట్టూ చూస్తూ నెమ్మదిగా నడుస్తూనే బార్‌ ద్వీపానికి చేరుకున్నాం. విరబూసిన అడవి పూలమొక్కలూ పైన్‌, బిర్చ్‌, ఆపిల్‌ చెట్లూ చిట్టడవులూ పచ్చికమైదానాలూ గంతులేస్తూ తిరుగుతోన్న లేళ్లూ దుప్పులూ వంటి వన్యప్రాణులతో ఎంతో ఆహ్లాదంగా ఉందా దీవి. అవన్నీ చూసి కాసేపు ఆనందంగా గడిపి కాలిబాటన తిరిగి వచ్చాం. ఫొటోలు దిగుతూ సమయాన్ని మర్చిపోయినవాళ్లు వాటర్‌ట్యాక్సీల్ని పిలిపించుకుని వచ్చారు. సమయాన్ని పట్టించుకోకుండా ఏమరుపాటుగా ఉంటే అప్పుడప్పుడూ ప్రమాదాలూ జరుగుతాయి. ఏదయితేనేం... సముద్రంమీద నడిచి బార్‌ద్వీపాన్ని సందర్శించిన ఆనందానుభూతితో మేం వెనుతిరిగాం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..