వారాంతంలో వైద్యం ఉచితం

కాస్త తలనొప్పీ జ్వరంతో ఆసుపత్రికి వెళ్లినా కనీసం ఐదొందల రూపాయలు ఆవిరైపోతున్న రోజులివి. కానీ ఈ న్యూరాలజిస్టు పక్షవాతం, మూర్ఛ వంటి తీవ్రవ్యాధులకూ ఉచితంగానే వైద్యం చేస్తున్నారు.

Updated : 18 Dec 2022 04:02 IST

వారాంతంలో వైద్యం ఉచితం

కాస్త తలనొప్పీ జ్వరంతో ఆసుపత్రికి వెళ్లినా కనీసం ఐదొందల రూపాయలు ఆవిరైపోతున్న రోజులివి. కానీ ఈ న్యూరాలజిస్టు పక్షవాతం, మూర్ఛ వంటి తీవ్రవ్యాధులకూ ఉచితంగానే వైద్యం చేస్తున్నారు. రెండు నెలలకోసారి తెలుగు రాష్ట్రాల్లోని నలభైచోట్ల ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటుచేస్తున్నారు. అలా ప్రతిసారీ దాదాపు 40 వేల మందికి వైద్యం అందేలా చూస్తున్నారు... డాక్టర్‌ గోపాళం శివన్నారాయణ.

విజయవాడ కానూరు ప్రాంతంలో ఉంటుంది గిరిజా న్యూరో కేర్‌... ఈ ఆసుపత్రిలో అపాయింట్‌మెంటు దొరకడం అంత సులభం కాదు. ఎంతటివారైనా సరే కనీసం నెల రోజుల ముందు అపాయింట్‌మెంట్‌ తీసుకోవాలి. ‘కాదు... ఈ రోజే డాక్టర్ని చూడాలి’ అనుకుంటే ఎన్నిగంటలైనా ఓపికగా వేచి ఉండాలి. ముందుగా పేర్లు రాయించుకున్న పేషంట్లందరినీ చూడటం పూర్తయితేనే అక్కడి న్యూరాలజీ చీఫ్‌- డాక్టర్‌ గోపాళం శివన్నారాయణ మిమ్మల్ని చూస్తారు. ఆయన అంత బిజీగా ఉంటారు మరి!  కానీ ఆ బిజీ అంతా సోమవారం నుంచి శుక్రవారం దాకే.

శని, ఆదివారాల్లో ఆయన వైద్య శిబిరాల ద్వారా పేదవాళ్లకి అందుబాటులో ఉంటారు. పక్షవాతం, మూర్ఛవ్యాధులకీ వాటి ప్రధాన కారకాలైన మధుమేహం, అధిక రక్తపోటులకీ ఉచిత చికిత్స అందిస్తారు. వంద రూపాయల నామమాత్రపు రుసుము తీసుకుని రెండు నెలలకి సరిపడా మందుల్ని ఇచ్చి పంపిస్తారు! అరవైయేళ్ల డాక్టర్‌ శివన్నారాయణ ఈ ఉచిత సేవల్ని ఒక్క విజయవాడకే పరిమితం చేయట్లేదు. చల్లపల్లి, బాపట్ల, దాచేపల్లి, మంగళగిరి, ఏలూరు, జంగారెడ్డి గూడెం, రాజమహేంద్రవరం, రంపచోడవరంలోనూ ఈ వైద్య శిబిరాలని నిర్వహిస్తున్నారు. ప్రతి ప్రాంతానికీ రెండునెలలకోసారి వెళ్లేలా ప్లాన్‌ చేసుకుంటున్నారు. అంతేకాదు, తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాలూ నగరాల్లో వైద్యులుగా ఉంటున్న తన మిత్రుల ద్వారానూ ఈ శిబిరాలని ఏర్పాటుచేస్తున్నారు. మరి వాళ్లలో అందరూ న్యూరాలజిస్టులే అయుండరు కదా! అలాంటప్పుడు ఆ డాక్టర్లకి తానే సూచనలు ఇచ్చి రోగులకి తగిన వైద్యం అందేలా చూస్తున్నారు.

స్పెషలిస్టులు రావట్లేదనే...

డాక్టర్‌ శివన్నారాయణ స్వస్థలం బాపట్ల. అక్కడుంటున్న ఆయన బంధువులు ఓసారి తమ కోసం అక్కడో వైద్యశిబిరం నిర్వహించమని కోరారట. ఆ శిబిరం నిర్వహిస్తున్నప్పుడే పక్షవాతం, మూర్ఛలాంటి జీవితకాలం చికిత్స అందించాల్సిన న్యూరాలజీ సమస్యలకి తెలుగు రాష్ట్రాల్లో ఎవరూ ఉచిత శిబిరాలు నిర్వహించడంలేదని గమనించారు. అదీ పేదవాళ్ల కోసం వీటిని ఏర్పాటుచేసే ప్రయివేటు స్పెషలిస్టులెవరూ లేరని తెలుసుకున్నారట. ఆ లోటుని తానే భర్తీచేయాలని భావించారాయన. ఇందుకోసం తన నానమ్మా తాతయ్యల పేరుమీద గోపాళం భ్రమరాంబ రామస్వామి(జీబీఆర్‌) ఫౌండేషన్‌ని ఏర్పాటుచేశారు. గిరిజా ఆసుపత్రి ద్వారా తాను సంపాదించిందాన్ని ఇలా పేదల కోసం ఖర్చుచేస్తున్నారు. అలా గత ఇరవైయేళ్లలో యాభై లక్షల రూపాయలదాకా వ్యయం చేశారు. అవీ సరిపోకవిరాళాలు సేకరిస్తున్నారు. ఆయన స్వయంగా హాజరవుతున్న ప్రాంతాలుపోగా ఆంధ్రప్రదేశ్‌లో ఒంగోలు, నెల్లూరు, పులివెందుల తదితర ప్రాంతాలూ తెలంగాణలోని హైదరాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం నగరాలూ మొత్తం కలిపి 40 చోట్ల వీటిని నిర్వహిస్తున్నారు. అన్ని ప్రాంతాలకీ కలిపి దాదాపు నలభైవేల మంది హాజరవుతారు. ప్రజాసేవపట్ల ఆసక్తి ఉన్న ఔషధ తయారీ పరిశ్రమల నుంచి కొంత రాయితీలతో మందులు కొని... వాటిని వందరూపాయలకే పేదలకి అందిస్తున్నట్టు చెబుతున్నారు డాక్టర్‌ శివన్నారాయణ. అంతేకాదు, మధుమేహం తీవ్రంగా ఉన్న రోగులకి ఇన్సులిన్‌ ఉచితంగానే ఇస్తున్నారు. రక్త పరీక్షలూ, స్కానింగులూ అవసరమైన వారికి ఆయా ల్యాబ్‌లతో మాట్లాడి తక్కువ ఖర్చుకే చేయిస్తున్నారు. ఆయన సేవాస్ఫూర్తిని గౌరవించి జనవిజ్ఞాన వేదిక, వామపక్ష పార్టీల కార్యకర్తలూ, ఎన్‌సీసీ విద్యార్థులూ, విశ్రాంత ఉద్యోగ సంఘాలవాళ్లూ ఈ వైద్యశిబిరాల్లో వలంటీర్లుగా సాయం అందిస్తున్నారు.

డాక్టర్‌ శివన్నారాయణ ఈ శిబిరాల కోసం ఓ ఎన్నారై సహకారంతో మొబైల్‌ ఆప్‌ను రూపొందించారు. ఈ శిబిరాలకి ప్రతిసారీ వచ్చే వేలమంది రోగుల వివరాలన్నీ ఇందులో పొందుపరిచారు. వైద్యుడు చూడాల్సిన అవసరంలేని- ఆ నెలకి కావాల్సిన మందులు మాత్రం తీసుకుంటే సరిపోతుందనుకునేవాళ్లు- ఆయా శిబిరాలకి వెళ్లి ఆప్‌లోని తమ రిజిస్టర్‌ నంబర్‌ చూపిస్తే చాలు...
ఆ మందుల్ని ఇచ్చేస్తారు. శిబిరాల్లో వైద్యుడికోసం క్యూలో నిల్చోవాల్సిన అవసరం రాదు! ఏదేమైనా- న్యూరాలజీలాంటి స్పెషాలిటీ వైద్యాన్నీ ఉచిత శిబిరాల ద్వారా నిరుపేదలకి చేరువచేస్తున్న డాక్టర్‌ శివన్నారాయణ బాటలో మరెంతోమంది వైద్యనిపుణులు నడిస్తే... ఎంత బావుంటుందో కదూ!

ముత్తా నారాయణరావు, ఈనాడు, అమరావతి డెస్కు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..