పూలతోటలు అద్దెకిస్తున్నాడు!

పూదోటల్ని చూస్తే మనసు పులకరించి పోతుంది. కాసేపు చూడాలనిపిస్తుంది. కొందరికైతే ఆ ప్రకృతిలో ఫొటోనో, సెల్ఫీనో దిగితే బాగుండు అనిపిస్తుంది. ఆ ఆలోచనతోనే వ్యాపారం చేస్తున్నాడు కేరళకు చెందిన సుజిత్‌. పూల తోటల్ని సాగు చేస్తూ ఫొటో షూట్‌లు చేసుకునేవారికి అద్దెకిస్తున్నాడు.

Updated : 16 Oct 2022 00:05 IST

పూలతోటలు అద్దెకిస్తున్నాడు!

పూదోటల్ని చూస్తే మనసు పులకరించి పోతుంది. కాసేపు చూడాలనిపిస్తుంది. కొందరికైతే ఆ ప్రకృతిలో ఫొటోనో, సెల్ఫీనో దిగితే బాగుండు అనిపిస్తుంది. ఆ ఆలోచనతోనే వ్యాపారం చేస్తున్నాడు కేరళకు చెందిన సుజిత్‌. పూల తోటల్ని సాగు చేస్తూ ఫొటో షూట్‌లు చేసుకునేవారికి అద్దెకిస్తున్నాడు. అటు సాగుతోనూ ఇటు షూట్లతోనూ ఆదాయాన్ని అందుకుంటున్న సుజిత్‌ వినూత్న ప్రయాణమిది.

ఈ రోజుల్లో ఫొటో షూట్‌లకు ఉన్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. పెళ్లి నుంచి పురుళ్ల వరకూ ప్రతి సందర్భంలోనూ ఫొటో షూట్‌్ చేయించుకునేవారే మనచుట్టూ కనిపిస్తుంటారు. అందుకే అందమైన ప్రదేశాలకోసం ఎంత దూరమైనా వెళుతుంటారు. కొందరేమో చుట్టుపక్కల పార్కులూ, చారిత్రక కట్టడాల్లోనే ఫొటోలు తీయించుకుంటుంటారు. పల్లెటూరివాసులు పొలాల్లోనో, పచ్చిక బైళ్లలోనో సరిపెట్టుకుంటుంటారు. కేరళలోని అలాంటి ఔత్సాహికులు అందుకోసం పక్క రాష్ట్రమైన తమిళనాడు వెళ్లడం గమనించాడు సుజిత్‌. అక్కడ తెన్కాశి జిల్లాలో పెద్ద ఎత్తున సాగుచేసే పొద్దుతిరుగుడు తోటలు అందంగా, ఆహ్లాదంగా ఉండటంతో జనాలు బారులుతీరేవారు. ఆ ఫొటోషూట్‌ల వల్ల పొద్దుతిరుగుడు మొక్కలూ, పువ్వులూ విరిగిపోవడం- అందుకు రైతులు ఇబ్బంది పడటం గమనించిన సుజిత్‌కి ఆ సమస్యలోంచి ఓ వ్యాపార ఆలోచన వచ్చింది. కేరళ, తమిళనాడు సరిహద్దు గ్రామాల్లోని పొలాల్ని కౌలుకు తీసుకుని బంతి, పొద్దుతిరుగుడు, రంగురంగుల చామంతులు, మల్లె, కనకాంబరం, గులాబీ తోటలు వేశాడు. ఆ తోటల్ని ఫొటో షూట్‌ చేసుకునేవారికి ‘సేవ్‌ ది డేట్‌’ పేరుతో అద్దెకు ఇవ్వడం మొదలుపెట్టాడు సుజిత్‌. ఫొటో తీయించుకునే సందర్భాన్ని బట్టి గంటకు రూ.200- 500 వరకూ వసూలు చేస్తున్నాడు. తోటలు చూడాలనుకున్నవారి వద్ద ఇరవై రూపాయల ఛార్జీ వసూలు చేసి ఫార్మ్‌ టూర్‌కీ అవకాశం కల్పిస్తున్నాడు. ఎప్పుడూ ఒకేలాంటి పూల తోటలు కాకుండా ఎప్పటికప్పుడు మార్చుతుంటాడు. పూలతోటల్ని అద్దెకివ్వడమన్నది చిన్న విషయమే అయినా సుజిత్‌ ఈ విధంగా ఆదాయాన్ని అందుకోవడంతో అందరిలో ప్రత్యేకంగా నిలుస్తున్నాడు.

సేంద్రియ సాగు

ఎంబీఏ చదివి కొంతకాలం ఓ దుకాణంలో సేల్స్‌మన్‌గా పనిచేసిన సుజిత్‌ ఆ తరవాత ఉద్యోగం మానేసి సేంద్రియ పద్ధతిలో కాయగూరలు సాగు చేస్తున్నాడు. అలప్పుళాలోని బ్యాక్‌ వాటర్స్‌లోనూ పూలతోటలూ, కాయగూరలూ, వరీ సాగు చేస్తున్న సుజిత్‌ వ్యవసాయంలో సరికొత్త విధానాలెన్నో పాటించి ఉత్తమ రైతుగా కేరళప్రభుత్వం నుంచి ఎన్నో అవార్డులు అందుకున్నాడు. ‘వెరైటీ ఫార్మర్‌’ పేరుతో యూట్యూబ్‌ ఛానల్‌నీ నిర్వహిస్తున్న సుజిత్‌... సాగు గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకోవడంతోపాటు అందుకు సంబంధించిన మెలకువలూ వివరిస్తుంటాడు. భలే మంచి ఆలోచన కదూ!


మీకు తెలుసా!

‘ఈ చిప్స్‌ ప్యాకెట్‌లో చిప్స్‌ పట్టుమని పది కూడా లేవు.. మిగతాదంతా ఒట్టి గాలే!’ అని తెగ బాధపడిపోతుంటారు... ఏదైనా బ్రాండెడ్‌ చిప్స్‌ కొన్నవాళ్లు. నిజానికి, ఆ ప్యాకెట్‌లలో ఉన్న గాలి... నైట్రోజన్‌. మనం తినబోయే ప్యాకెట్‌లో బ్యాక్టీరియా లాంటి సూక్ష్మక్రిములు పెరగకుండా అది కాస్తుందట. రవాణాలో చిప్స్‌ పగలకుండా, ఎప్పుడు కరకరలాడేలా చూస్తుందట. ఆహార ప్యాకెట్‌లలో ఇలా నైట్రోజన్‌ని నింపి ఇవ్వడాన్నే ‘మ్యాప్‌’ (మోడిఫైడ్‌ అట్మాస్ఫియర్‌ ప్యాకేజింగ్‌’) అని అంటున్నారు!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..