‘స్మార్ట్‌’గా నీళ్లు తాగేద్దాం!

ఎండాకాలంలో బయటకు వెళ్లినప్పుడు బ్యాగులో కచ్చితంగా వాటర్‌ బాటిల్‌ ఉండేలా చూసుకుంటాం. మరి అదే వాటర్‌ బాటిల్‌ పాటలు కూడా వినిపిస్తే... చీకట్లో వెలుగునిస్తే... పవర్‌ బ్యాంక్‌లానూ ఉపయోగపడితే... ఎంత బాగుంటుందో

Updated : 17 May 2022 16:26 IST

‘స్మార్ట్‌’గా నీళ్లు తాగేద్దాం!

ఎండాకాలంలో బయటకు వెళ్లినప్పుడు బ్యాగులో కచ్చితంగా వాటర్‌ బాటిల్‌ ఉండేలా చూసుకుంటాం. మరి అదే వాటర్‌ బాటిల్‌ పాటలు కూడా వినిపిస్తే... చీకట్లో వెలుగునిస్తే... పవర్‌ బ్యాంక్‌లానూ ఉపయోగపడితే... ఎంత బాగుంటుందో కదూ! అలాంటి ఎన్నెన్నో ఫీచర్లతో మార్కెట్లో ‘స్మార్ట్‌’ బాటిళ్లు దొరుకుతున్నాయి. అవేంటో ఓ లుక్కేయండి మరి!

వెనకటి రోజుల్లో నీళ్లను కలప, లెదర్‌, మట్టితో తయారుచేసిన బాటిళ్లలో తీసుకెళ్లేవారు. తర్వాత్తర్వాత ప్లాస్టిక్‌, స్టీలు, రాగి బాటిళ్లు వచ్చేశాయి. ఏదైనా అక్కడితో ఆగిపోతే అందులో కొత్తదనం ఏముంటుంది... అందుకే అన్నింట్లో వచ్చిన స్మార్ట్‌ ఫీచర్లు వాటర్‌ బాటిళ్లలోకీ వచ్చేశాయి. మన అలవాట్లూ సౌకర్యాలకు అనుగుణంగా బోలెడన్ని వెరైటీల్లో దొరుకుతున్నాయి.


పాటలూ వినొచ్చు!

కాస్త ఖాళీ సమయం దొరికినా సరదాగా పాటలు వినడానికే ఎక్కువగా ఇష్టపడుతుంటారు యువత. అలాంటివారికోసం వస్తున్నవే ‘బ్లూటూత్‌ స్పీకర్‌ వాటర్‌ బాటిళ్లు’. మామూలు బాటిల్‌లానే కనిపించినా బాటిల్‌ మూతలోనో, అడుగుభాగంలోనో బ్లూటూత్‌, స్పీకరూ ఉంటాయి. ఫోన్‌కు బాటిల్‌ బ్లూటూత్‌ని కనెక్ట్‌ చేసుకోవచ్చు. బాటిల్‌ పైనున్న బటన్‌ నొక్కి ఎంచక్కా ఎక్కడైనా, ఎప్పుడైనా పాటలు వినొచ్చు.  ఫోన్‌ కాల్స్‌కీ బదులు ఇవ్వొచ్చు. అంతేకాదు... అవసరమైతే ఈ బాటిల్‌, ఫోన్‌కి ఛార్జింగ్‌ పెట్టుకోవడానికి పవర్‌బ్యాంక్‌లానూ పనిచేస్తుంది.


విటమిన్ల బాటిల్‌!

ఎండలకు ఊరికే నీరసపడిపోకుండా ఉండేందుకు కొంతమంది మంచినీళ్లు మాత్రమే కాకుండా వాటర్‌ బాటిల్లోనే ఎలక్ట్రాల్‌ పౌడరూ, పండ్ల రసాల్లాంటి వాటినీ కలుపుతారు. మీరూ ఆ కోవకే చెందుతారా... అయితే ‘లైఫ్‌ ఫ్యూయెల్స్‌ న్యూట్రిషన్‌ స్మార్ట్‌ బాటిల్‌’ని ప్రయత్నించి చూడండి. దీంట్లో బాటిల్‌తోపాటూ మల్టీవిటమిన్స్‌, ఇమ్యూనిటీ అంటూ రకరకాల ఫ్లేవర్లతో చిన్నచిన్న బాటిళ్లు వస్తాయి. బాటిల్‌కి అడుగున మనకు కావాల్సిన మూడు ఫ్లేవర్లను ఒకేసారి అమర్చుకోవచ్చు. అంతేకాదు దీన్ని ఫోన్‌లో ఆప్‌ ద్వారా ఆపరేట్‌ చేసుకోవచ్చు కూడా. బాటిల్‌తో పాటు వచ్చిన విటమిన్‌ బాటిళ్లే కాకుండా మనకు నచ్చిన పండ్ల రసాల్నీ అందులో పోసుకోవచ్చు.  


మంచినీటిగా మారుస్తుంది!

నీళ్లు శుభ్రంగా ఉండవనే కారణంతో చాలామంది ఎక్కడపడితే అక్కడ నీళ్లు తాగడానికి ఇష్టపడరు. కానీ అన్నిసార్లూ ఇంటి నుంచి మంచినీళ్లు పట్టుకెళ్లడమో, కొనుక్కోవడమో కుదరకపోవచ్చు కదా. అలాంటి సమయాల్లో ‘సెల్ఫ్‌ క్లీనింగ్‌ వాటర్‌ ప్యూరిఫయింగ్‌ స్మార్ట్‌ బాటిల్‌’ ఉంటే బయట దొరికే ఏ నీళ్లనైనా తాగేయొచ్చు. ఎందుకంటే దీంట్లో నీళ్లుపోసి బటన్‌ నొక్కితే చాలు... బాటిల్లో ఉండే యూవీ-సీ అనే ప్రత్యేకమైన టెక్నాలజీ ద్వారా నిమిషంలో అందులోని చెడు బ్యాక్టీరియా, వైరస్‌లాంటివన్నీ పోయి నీళ్లు శుభ్రంగా మారుతాయి. రీఛార్జబుల్‌ బ్యాటరీలతో పనిచేసే ఈ బాటిల్‌ నీటిని రోజంతా చల్లగానూ ఉంచుతుంది.


ఎండతోనే శక్తి!

ఈ స్మార్ట్‌ బాటిల్‌ చూడ్డానికి మామూలుగానే ఉంటుంది. ఇందులో ఎలాంటి బ్యాటరీలూ ఉండవు. దీన్ని ఛార్జింగ్‌ పెట్టుకునే అవసరమూ ఉండదు. అయినా మనం రోజంతా ఎన్ని నీళ్లు తాగామో చెబుతుంది. నీటిని చల్లగానూ ఉంచుతుంది. ఎలా అంటే ఇది సోలార్‌ పవర్‌ బాటిల్‌ కాబట్టి.  పగటి వెలుతురు నుంచి శక్తిని తీసుకుంటూ ఛార్జ్‌ అవుతూ రకరకాల స్మార్ట్‌ఫీచర్లతో పనిచేస్తుందన్నమాట.


రాత్రిపూట లైట్‌లా...

పగటి పూట తెల్లటి వాటర్‌ బాటిల్‌ మీద ఏదో డిజైన్‌ ఉన్నట్టే కనిపిస్తుందా... కానీ చీకట్లో మాత్రం ఆ డిజైన్‌ అందంగా మెరిసిపోతూ ఆకట్టుకుంటుంది. అదీ త్రీడీ ఎఫెక్ట్‌లో. ఎందుకంటే అది ‘త్రీడీ గ్లోయింగ్‌ వాటర్‌ బాటిల్‌’ మరి. పిల్లలూ, వెరైటీ కోరుకునే పెద్దల కోసం ఇలా రాత్రివేళ చమక్కుమనే బాటిళ్లు బోలెడన్ని రకాల్లో వస్తున్నాయి. వీటిల్లో రాత్రిపూట లైట్‌లా వెలిగే నీళ్ల బాటిళ్లూ అందుబాటులో ఉన్నాయి.


ఆడుతూ తాగొచ్చు!

పెద్దలైతే ఎలాగోలా గుర్తుపెట్టుకుని నీళ్లు తాగేస్తుంటారు. కానీ చిన్నపిల్లలు కొన్నిసార్లు ఆటల్లోపడి మర్చిపోతుంటారు. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే వాటర్‌ బాటిల్‌నే ఆట బొమ్మలా తీసుకొచ్చారు. ‘గులులు ఇంటరాక్టివ్‌ వాటర్‌ బాటిల్‌’ పేరుతో చిన్నారుల కోసం ప్రత్యేకంగా వచ్చిన ఈ స్మార్ట్‌ బాటిల్‌పైన తాకే తెరా, స్పీకర్‌ కూడా ఉంటాయి. పిల్లలు దాన్ని టచ్‌ చేస్తూ అందులో వచ్చే వీడియోగేమ్స్‌తో హాయిగా ఆడుకోవచ్చు. బాటిల్‌ చేతిలోనే ఉంటుంది కాబట్టి దాహం వేసినప్పుడు మరిచిపోకుండా నీటిని తాగేస్తారు. ఈ బాటిల్‌ ఆప్‌ ద్వారా- పిల్లలు ఎన్ని నీళ్లు తాగారో అమ్మానాన్నలు తెలుసుకోవచ్చు కూడా!ప్రసవమయ్యాక భర్తదే బాధ్యత! పందొమ్మిదేళ్ల అనిస్‌ ఆయునీ ఉస్మాన్‌కీ, ఇరవై ఒక్కేళ్ల వెల్డన్‌ జుల్‌కెఫ్లీకీ గతేడాది పెళ్లైంది. మలేషియాలోని కెలాంతన్‌ అనే ప్రాంతానికి చెందిన ఈ జంట ఇటీవల పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. విటా మిల్క్‌ పేరుతో సౌందర్యోత్పత్తుల సంస్థను నడుపుతున్న అనిస్‌ ఈ మధ్య తన భర్తకు దాదాపు మూడున్నర కోట్లకుపైనే ఖర్చు పెట్టి లాంబొర్గిని కారును బహుమతిగా ఇవ్వడం వైరల్‌ అయింది. ఎందుకంటే సంప్రదాయం ప్రకారం... భార్యకు ప్రసవమయ్యాక సుమారు మూడునెలలపాటు భర్త అత్తారింట్లోనే ఉండి ఆమెనీ, బిడ్డనీ రాత్రింబగళ్లూ చూసుకోవాల్సి ఉంటుంది. ప్రసవమైన మహిళలు మంచి ఆహారం తీసుకుంటూ పూర్తిగా విశ్రాంతిలోనే ఉంటారు. అలా ఉండటం వల్ల ప్రసవానంతర సమస్యల నుంచి త్వరగా కోలుకుంటారని వారి అభిప్రాయం. ఈ క్రమంలో వెల్డన్‌ కూడా భార్యకు తోడుగా ఉండి బిడ్డ ఆలనాపాలనా చూసుకుంటున్నాడు. అందుకే అనిస్‌ తన భర్తకు ఖరీదైన కారును బహుమతిగా ఇచ్చిందట.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..