Published : 03 Jul 2022 00:10 IST

సేంద్రియ రైతులు చెబుతున్న పాఠాలు!

బిడ్డలకు అన్నం పెట్టే అమ్మ ఆ అన్నంలో విషం కలపదు. దేశానికి అన్నం పెట్టే రైతు మాత్రం ఆ పని ఎలా చేయగలుగుతాడు? అందుకే... తెలియకుండా ఇన్నాళ్లూ చేసిన ఆ పొరపాటును దిద్దుకునే ప్రయత్నాలు మొదలుపెట్టాడు. సారహీనమైన భూమి నుంచి చాలినంత దిగుబడి రాబట్టేందుకు వాడుతున్న రసాయన ఎరువులూ క్రిమిసంహారకాలూ మనిషి ప్రాణాలకే ఎసరు పెడుతున్న నేపథ్యాన్ని అన్నదాత అర్థం చేసుకుంటున్నాడు. రసాయన రహిత సేద్యంతో అటు నేలతల్లికీ ఇటు ప్రజల ఆరోగ్యానికీ రక్షగా నిలుస్తున్నాడు. సేంద్రియ సాగులో ప్రయోగాలు చేసి చక్కటి ఫలితాలు రాబడుతున్న ఈ రైతన్నలు ఏం చెబుతున్నారో విందామా..!

విలువ జోడించాలి..!

సాగుబడిలోనూ సమయానికి తగిన మార్పులు చేసుకోవాలన్నది ఖమ్మం జిల్లా అనంతనగర్‌కి చెందిన బొమ్మిశెట్టి శ్రీనివాసరావు నమ్మిన సిద్ధాంతం. మొదట అందరిలాగే రసాయన సేద్యం చేసేవారాయన. పొలంలో పురుగుమందు కొట్టి ఇంటికొచ్చి పడుకుంటే నిద్రపట్టేది కాదనీ ప్రాణగండమేదో పొంచివున్నట్టనిపించేదనీ, మర్నాడు పొద్దున పొలం వెళ్లేసరికి చచ్చిపడున్న పిచ్చుకల్నీ తేనెటీగల్నీ చూసి కడుపు తరుక్కుపోయేదనీ చెబుతారాయన. మనం బతకడానికి ఇంత విధ్వంసం అవసరమా అన్న బాధే ఆయన్ని ప్రకృతి సేద్యం వైపు మళ్లించింది. మొదట్లో మార్కెటింగ్‌పై సరైన అవగాహన లేక బాగా నష్టపోయారు. అయినా వెనకడుగు వేయకుండా సొంతంగా ప్రయోగాలు చేసి తనదైన పద్ధతులను ఏర్పరుచుకున్నారు. పరిమిత వనరులతో అపరిమిత ప్రయోజనాలు అందుకోవడం ఎలాగో ఇప్పుడు చేసి చూపిస్తున్నారు. ప్రకృతి సేద్యం చేసే రైతులు లాభాలార్జించాలంటే తమ ఉత్పత్తులకు విలువ జోడించాలనే శ్రీనివాసరావు పూర్తి సేంద్రియ పద్ధతుల్లో చెరకు, వరి, పప్పుధాన్యాలు, కూరగాయలు, పశువుల కోసం గడ్డీ పండిస్తున్నారు. ఈ పంటలకు కావలసిన సహజ ఎరువులూ కషాయాలూ స్వయంగా తయారుచేసుకోవడానికి గాను 60 పశువులనూ పోషిస్తున్నారు. పశువుల పాకనుంచి వ్యర్థాలన్నీ నేరుగా గోబర్‌ గ్యాస్‌ ఛాంబర్‌లోకి వెళ్లే ఏర్పాటు చేశారు. గ్యాస్‌ని ఇంటి అవసరాలకు వాడుకుంటూ మిగిలిన వ్యర్థాన్ని పంటలకు పెట్టే నీటిలోకి వదులుతారు. అందులో నత్రజని, భాస్వరం స్థాయులు ఎక్కువగా ఉండటమే కాదు, పలు మూలకాలూ ఉంటాయి కాబట్టి పంటలకు మంచి పోషకంగానూ క్రిమిసంహారిణిగానూ పనిచేస్తుంది. ఇక, దిగుబడుల విషయానికి వస్తే శ్రీనివాసరావు వాటిని నేరుగా విక్రయించకుండా బియ్యం, పప్పులూ, బెల్లం రూపంలోకి మార్చి, ఖమ్మం నగరంలో ప్రత్యేకంగా ఒక దుకాణం పెట్టి విక్రయిస్తున్నారు. టన్ను చెరకును మార్కెట్లో అమ్మితే ఐదువేలు వస్తాయనీ అదే రసం తీసి అమ్మితే లీటరు 50 రూపాయలకే అమ్మినా పాతికవేలు సంపాదించవచ్చనీ అనుభవంతో చెబుతున్నారీయన.


తెగుళ్లకు పొగబెట్టడమే..!

మేకా రాధాకృష్ణమూర్తి వయసు 85. సైకిల్‌ మీదే పొలానికి వెళ్తారు. పిల్లలు ఉద్యోగాలు చేస్తూ నగరాల్లో ఉంటున్నా బాపట్ల జిల్లా మంత్రిపాలెంకు చెందిన ఆయన మాత్రం ఊళ్లోనే ఉంటూ వ్యవసాయం చేస్తున్నారు. ఆరోజుల్లోనే ఇంటర్‌ వరకూ చదివిన రాధాకృష్ణమూర్తికి వ్యవసాయం అంటే విపరీతమైన ప్రేమ. సాగుకు సంబంధించిన సమాచారాన్ని బాగా చదువుతారు. ఆ క్రమంలోనే రసాయనాల వాడకంవల్ల ఆరోగ్యం దెబ్బతింటోందని తెలుసుకుని పన్నెండేళ్ల క్రితం ప్రకృతి వ్యవసాయానికి మారారు. నాలుగైదేళ్లు అది చేశాక ఆ నామమాత్రపు పెట్టుబడి ఖర్చు కూడా ఉండకుండా జీరో బడ్జెట్‌ వ్యవసాయం చేస్తున్నారు. గోమూత్రం, పేడలనే ఎరువుగా వాడుతూ వేపాకులాంటి వాటితో కషాయాలను తయారుచేసుకుంటున్నారు. 12 ఎకరాల్లో వరి వేసి మంచి దిగుబడి సాధించారు. వడ్లను మర పట్టించి బియ్యం అమ్ముతున్నారు. మినుము, పెసరలాంటి ధాన్యాలతో పాటు కూరగాయలూ పండ్ల చెట్లూ పెంచుతున్నారు. పొలం సరిహద్దు గట్ల మీద కొబ్బరి, బొప్పాయి చెట్లు పెట్టారు. తెగుళ్ల నివారణకు ఈయన తనదైన పద్ధతి అనుసరిస్తున్నారు. వరిగడ్డీ ఎండిపోయిన ఆకులూ కొబ్బరి టెంకలూ వేసి తెల్లవారుజామున మంట పెడితే ఆ పొగకి తెగుళ్లు దరిదాపుల్లోకి రావంటారాయన. రైతులకు సంబంధించి ఎక్కడే సమావేశం జరిగినా వెళ్లి వారి ప్రతినిధిగా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేవారు, సూచనలు ఇచ్చేవారు. 35 ఏళ్ల క్రితమే రష్యాలో పర్యటించి అక్కడి వ్యవసాయ క్షేత్రాలను చూసొచ్చారు. పల్లెల్లోనూ మారిపోయిన జీవనశైలి రోగాలకు కారణమవుతోందని గుర్తించిన ఆయన పెరట్లో కూరగాయలు పండించుకోమని ప్రోత్సహిస్తూ తానే స్వయంగా ఏడురకాల కూరగాయల విత్తనాలను ప్యాకెట్లుగా చేసి ఊరందరికీ పంచిపెట్టారట. అంతటితో ఊరుకోకుండా వారం వారం వెళ్లి వాళ్లు వాటిని పెంచుతున్నదీ లేనిదీ చూసేవారట. మనం మారితే సరిపోదు, చుట్టూ ఉన్నవారిలోనూ మార్పు తేవాలన్నది ఆయన ఆశయం.


మట్టితో ఏమారుస్తారు!

వరి, గోధుమల్లో ‘డి’ విటమిన్‌ అధికంగా ఉండే ఫార్ములాను రూపొందించి అంతర్జాతీయ పేటెంట్‌ పొందిన ప్రయోగశీలి హైదరాబాద్‌లోని అల్వాల్‌కు చెందిన చింతల వెంకటరెడ్ఢి ఆయన కూడా అందరిలాగే రసాయన ఎరువులూ క్రిమిసంహారకాలూ వాడి ద్రాక్ష, వరి, కూరగాయలు పండించేవారు. అయితే ఎన్ని మందులు వాడినా క్రమంగా పంట దిగుబడి తగ్గడాన్ని గమనించారాయన. భూసారం తగ్గడమే దానికి కారణమని తెలుసుకున్నారు. ఓసారి పొలంలో బావి తవ్వినప్పుడు ఆ ఒండ్రుమట్టి అంతా పొలంలో కలిసిందట. ఆ ఏడాది ద్రాక్ష పంట దిగుబడి రెట్టింపయింది. మట్టిలో మార్పే దానికి కారణమని అప్పుడు తెలియలేదు కానీ ఎక్కడికెళ్లినా మట్టినీ ఆ మట్టిమీద పెరుగుతున్న పంటల్నీ బాగా గమనించడం అలవాటైన ఆయన ఏ మొక్కలైనా ఏపుగా పెరగాలంటే భూసారం అన్నిటికన్నా ముఖ్యమని గుర్తించారు. మట్టిలో అన్నిరకాల పోషకాలూ ఉంటాయనీ వాటినే మళ్లీ పైరుకి అందేలా చేయాలనీ అనుకున్నారు. మట్టి పై పొర లక్షణాలు ఒకలా ఉంటే కాస్త లోపల ఉండే కింద పొర లక్షణాలు మరోలా ఉంటాయి. వాటిని ఆధారం చేసుకుని ఆయన ఎన్నో ప్రయోగాలు చేశారు. పొలంలో ఒకచోట కందకం తవ్వి లోపలి మట్టిని తీసి మిగతా పొలంలో పై పొరలా పలుచగా పరవడం మొదలెట్టారు. ఇలా వేయడం వలన వరి, గోధుమ పంటల్లో మంచి దిగుబడిని సాధించారు. చీడపీడల నివారణకు వెంకటరెడ్డి తనదైన పద్ధతి తయారుచేసుకున్నారు. రెండు పొరల నుంచి మట్టిని తగు నిష్పత్తిలో తీసుకుని నీటిలో కలిపి పంటల మీద చల్లడం ద్వారా తెగుళ్లు రావు, మట్టి సారం వృథా కాకుండా పంటలకు అందుతుందనీ ఆయన చెబుతున్నారు. వ్యవసాయ పంటలు పండే మట్టిని ఉద్యానపంటలకూ ఉద్యానపంటలు పండే భూమిలోని మట్టిని వ్యవసాయ పంటలకూ మార్చి మార్చి వాడతారు. ఈ విధానానికి ఆయన పేటెంట్‌ కూడా పొందారు. తాను చేపట్టిన ప్రయోగాలు మంచి ఫలితాన్నిస్తే వాటి గురించి అందరికీ చెబుతుంటారు. రైతులందరూ తక్కువ పెట్టుబడితో ఆరోగ్యకరమైన పంటలు పండించాలన్నది ఆయన అభిమతం.


విజయానికి ఐదు మెట్లు

మెకానికల్‌ ఇంజినీరింగ్‌ చదివి అనుకోని పరిస్థితుల్లో వ్యవసాయం వైపు వచ్చారు ఏలూరు తడికలపూడికి చెందిన రైతు గూడూరు వెంకట శివరామప్రసాద్‌. తండ్రి క్యాన్సర్‌తో బాధపడుతున్నప్పుడు చికిత్స కోసం కొన్ని నెలలపాటు ఆస్పత్రుల చుట్టూ తిరిగాననీ, ఈ అనారోగ్యాలన్నిటికీ రసాయన సేద్యమే కారణమని తెలిశాక ఉద్యోగం మానేసి తమకున్న పాతిక ఎకరాల్లో ప్రకృతి సేద్యం మొదలెట్టాననీ చెబుతారాయన. ఇతర రంగాల్లో లాగే వ్యవసాయంలోనూ విజయం సాధించాలంటే ఐదు మెట్లు తప్పనిసరి అంటారు శివరామప్రసాద్‌. భూమిని బాగు చేసుకోవడం, మంచి విత్తనాల ఎంపిక, నీటి యాజమాన్యం, నాణ్యమైన పంట దిగుబడి, గిట్టుబాటు ధరకు అమ్ముకోవడం... ఈ అయిదు విషయాలనూ తాను ఆచరిస్తూ ఇతరులకి ఆదర్శంగా నిలుస్తున్నారు. శివరామప్రసాద్‌ తన పొలంలో మొక్కలకు నాలుగువైపులా చిన్న చిన్న గుంతలుతీసి పంట వ్యర్థాలనూ, కలుపు మొక్కలనూ, ఇతర సేంద్రియ వ్యర్థాలనూ అందులో వేస్తున్నారు. అవే కుళ్లిపోయి మట్టిలో కలిసి మొక్కలకు ఎరువుగా మారుతున్నాయి. విత్తనం నాణ్యమైనది కాకపోతే ఖర్చుతో పాటు మొత్తంగా ఒక పంటకాలం రైతుకు వృథా అవుతుంది కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు. ఇక, తన పొలంలో కురిసిన వాన నీరు బయటకు పోకుండా వాలుకు తగ్గట్టు ఎక్కడికక్కడ గట్లు వేసుకోవడమే కాక, అక్కడక్కడా గుంతలూ తవ్వారు. దాంతో ఏడాదంతా నీరు అందుబాటులో ఉంటోంది. పంటల నాణ్యత పెంచడానికి తేనెటీగల పెంపకాన్నీ చేపడుతున్నారు. ఇలా తగు జాగ్రత్తలన్నీ తీసుకుని తాను పండిస్తున్న కొబ్బరి, కోకో, అరటి, నిమ్మ, కూరగాయలను నేరుగా వినియోగదారులకు అమ్మడం ద్వారా గిట్టుబాటు ధర సాధిస్తున్నారు. తాను ఆచరించే విధానాల్లో తోటి రైతులకు శిక్షణ కూడా ఇస్తున్నారు శివరామప్రసాద్‌.


కాలంతో పాటే మనమూ...

ఎనిమిదేళ్లుగా సహజసిద్ధమైన వ్యవసాయం చేస్తున్న కోనసీమ గంగవరం గ్రామానికి చెందిన అల్లూరి సూర్యనారాయణమూర్తి మొదట్లో సాధారణ వ్యవసాయమే చేసేవారు. కానీ చుట్టూ జరుగుతున్న మార్పుల్ని గమనించడమూ ఆయనకు అలవాటు. తాను తెలుసుకున్న విషయాలను అధికారులతో చర్చించి వారి సలహాలూ తీసుకునేవారు. అందువల్లే ప్రకృతి సేద్యంవైపు తేలిగ్గా మారిపోయారు. కాలంతో పాటు మారాలని తెలుసుకున్నాననీ ఇప్పుడు తమకున్న ఏడెకరాల్లోనూ వరి, చెరకుతో పాటు ఏ సీజన్‌లో పండే పండ్లూ కూరగాయల్ని ఆ సీజన్‌లో పండిస్తూ, తమ పొలంలో పండినవే తింటూ కుటుంబమంతా ఆరోగ్యంగా ఉన్నామంటున్నారు సూర్యనారాయణమూర్తి. కొత్తలో పశువుల ఎరువు వాడేవారట. క్రమంగా అది కూడా మానేసి కేవలం నారు నాటుకోవడం, కలుపు నివారించడం, దిగుబడి తీసుకోవడం అనే సింపుల్‌ విధానాన్ని అనుసరిస్తున్నారు. ఐదెకరాల్లో వరి పండించే ఆయన కలుపు నివారించడానికి ఖరీఫ్‌, రబీలలో వేర్వేరు విధానాలలో నారును నాటుతుంటారు. పండించిన వడ్లను మర పట్టించి బియ్యాన్ని నేరుగా వినియోగదారులకు అమ్ముతున్నారు. అది కాకుండా మరో పక్క ఒక ఎకరం 90 సెంట్ల భూమికి చుట్టూ పదడుగుల వెడల్పు, నాలుగడుగుల లోతున కందకం తవ్వి ఆ మట్టిని పొలం మధ్యలో వేసి చదునుచేసి దానిమీద వివిధ రకాల కూరగాయలూ పండ్లూ పండిస్తున్నారు. కుటుంబ అవసరాలకు పోనూ మిగిలినవి అమ్ముతున్నారు. చుట్టూ ఉన్న కందకంలో చేపల్ని పెంచడం ద్వారా అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు. చేప పిల్లల్ని కొనడం తప్ప వాటి పెంపకానికి మరే విధమైన ఖర్చూ ఉండదు. వడ్లను మర పట్టించినప్పుడు వృథాగా పోయే నూకను తెచ్చి వాటికి ఆహారంగా వేస్తున్నారు. అవి బాగా పెరిగాక పొలం దగ్గరే అమ్ముతున్నారు.


మా పంట... మా ధర

డిగ్రీ చదువు పూర్తవుతూనే సుభాష్‌ పాలేకర్‌ శిక్షణ శిబిరానికి హాజరైన పెద్దపల్లి జిల్లా హరిపురం గ్రామానికి చెందిన బోడ శ్రీవనితా మైథిలి సాగులోనే కాదు, సామాజిక మాధ్యమాల సాయంతో పంట ఉత్పత్తుల్ని ఇంటి నుంచే అమ్ముకుంటూ మార్కెటింగ్‌ లోనూ తనదైన ప్రత్యేకత కనబరుస్తున్నారు. తొలి ప్రయత్నంగా ఆమె పదేళ్ల క్రితం అరెకరం పొలంలో పసుపును సహజసిద్ధమైన విధానాల్లో పండించారు. మంచి ఫలితం రావడంతో అప్పటినుంచీ మొత్తం ఐదెకరాల్లో పలు రకాల పంటల్ని పండిస్తున్నారు. వ్యవసాయం ఒక్క చేత్తో అయ్యే పని కాదు. అందుకని ముందు తల్లిదండ్రుల్ని ఒప్పించిన ఆమె వారి సహకారంతో ముందుకెళ్లి, ఐదు దేశీ ఆవుల్ని పెంచుతూ వాటి మూత్రం, పేడలనే ఎరువుగా వాడుతూ దేశీ వరి వంగడాలను సాగుచేస్తున్నారు. ఏ పంట అయిపోయినా వాటి దుబ్బులను తగలబెట్టకుండా దున్నేసి నేలలో కలిసిపోయేలా చేస్తారు. ఇప్పటివరకు తన పంటలకు ఎలాంటి తెగుళ్లూ సోకలేదనే వనిత విత్తనాలూ, ఎరువులూ సొంతంగా తయారుచేసుకుంటే ఎవరిపైనా ఆధారపడాల్సిన అవసరం లేదనీ సొంతూళ్లో కుటుంబంతో కలిసి ఉండటాన్ని మించిన సంతోషం ఏముంటుందనీ అంటారు. ఈ విధానంలో పంటపంటకీ భూసారం పెరుగుతుందనే ఆమె తక్కువ పొలంలోనే పలు రకాల వరి వంగడాలనీ, ఏడు రకాల అరటినీ, పసుపు, మునగ పంటల్నీ పండిస్తున్నారు. పంటకి రైతు నిర్ణయించిన ధర ఇచ్చి వినియోగదారులే రైతు ఇంటికి వచ్చి మరీ కొనుక్కుని వెళ్లే వెసులుబాటు ప్రకృతి సేద్యం చేసేవారికి మాత్రమే లభిస్తుందంటారు ఈ యువ రైతు.


ఖర్చు 5 వేలు... ఆదాయం 15 లక్షలు

పంటల సాగులో రసాయనాలు వాడకుండా ఉండడం ఒక ఎత్తైతే చుట్టూ ఉన్న జీవరాశికి మేలుచేసే పద్ధతులనే వాడడం మరో ఎత్తు. పంటకి అవసరమైన పోషక ద్రావణాల నుంచి, కీటక నాశనుల వరకూ అన్నిటినీ సొంతంగా పొలంలోనే తయారుచేసుకోవడమే ప్రకృతి రైతుల విజయరహస్యం... అంటారు జగిత్యాల జిల్లా తుంగూర్‌ గ్రామానికి చెందిన రైతు మిట్టపల్లి రాములు. ఈయన కొంతకాలం గల్ఫ్‌ వెళ్లి పనిచేసి వచ్చారు. సొంతూళ్లో వ్యవసాయాన్ని మించిన ఆనందం మరొకటి లేదని భావించి ఎనిమిదేళ్లుగా ప్రకృతి సేద్యం చేస్తూ మామిడి, జామ, వరి, కూరగాయలు పండిస్తున్నారు. తోటలో తేనెటీగలు ఎక్కువగా ఉంటే మామిడి దిగుబడి పెరుగుతుందని గుర్తించిన రాములు ఆ చెట్ల మధ్యలో మునగచెట్లు నాటారు. మామిడి పూతకన్నా ముందు మునగ పూత వస్తుందనీ దాంతో తేనెటీగలు వస్తాయనీ, మునగపూత అయిపోగానే వచ్చే మామిడిపూతకి అవి అలవాటుపడతాయనీ చెప్పే ఆయన వాటికోసమే అక్కడక్కడా వేపచెట్లు కూడా వేశారు. రసాయన క్రిమిసంహారకాలు తేనెటీగల్ని రానీయవనీ, ఎరువులేమో ఎర్రల్ని చంపేస్తాయనీ రైతులు ఈ విషయాన్ని గ్రహించాలనీ చెబుతారు. మామిడి పూత బాగా రావడానికి బెల్లం ద్రావణంతో యూవీ కల్చర్‌, చేపల వ్యర్థాలూ మజ్జిగాలాంటివి కలిపి అమైనోఆసిడ్లు... స్వయంగా తయారుచేసి చెట్లపై పిచికారీ చేస్తారు. ఒక్క పంట మీద ఆధారపడకుండా మామిడి తోటలోనే జామ, ఆపిల్‌, అరటి, దానిమ్మ లాంటి చెట్లూ పెట్టారు. మధ్యలో శనగ, బొబ్బర్లు లాంటివి కూడా పండిస్తున్నారు. ఎనిమిది పశువులతో 14 ఎకరాల్లో ప్రకృతి సేద్యం చేస్తూ ఎకరానికి ఏడాదికి లక్ష రూపాయలకు తగ్గకుండా ఆదాయం పొందుతున్నానంటారు రాములు. డబ్బులుంటే నూటికి నూరుశాతం స్వచ్ఛమైన బంగారం కొనుక్కోగలం కానీ- కల్తీ లేని, పురుగుమందులూ రసాయన ఎరువుల అవశేషాలూ లేని ఆహారపదార్థాల్ని మాత్రం ఎంత డబ్బు పెట్టినా కొనుక్కోవడం అసాధ్యం... అనిపించే పరిస్థితి వచ్చిందంటూ, ఈరోజుల్లో ప్రతి ఇంట్లోనూ ఒక మందుల పెట్టె ఉంటోందనీ రైతులంతా ప్రకృతిసేద్యం చేస్తేనే ఆ పరిస్థితి మారుతుందనీ అంటారాయన.


పాలమూరు బ్రాండ్‌... సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరు

బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరుగా ఉద్యోగం చేసేవారు తలకంటి ప్రవీణ్‌కుమార్‌ రెడ్ఢి అక్కడ సేంద్రియ ఉత్పత్తులు కొనుక్కోవడం అలవాటు. తండ్రి అనారోగ్యానికి గురవడంతో ప్రవీణ్‌కుమార్‌ దృష్టి వనపర్తి జిల్లా పెబ్బేరులో ఉన్న తమ వ్యవసాయం మీదికి మళ్లింది. తమకే పొలం ఉన్నప్పుడు పండించుకోకుండా కొనుక్కోవడం ఎందుకూ అనుకున్న ఆయన మనిషిని పెట్టి సేంద్రియ వ్యవసాయం చేయించడం మొదలెట్టారు. వారాంతాల్లో వచ్చి చూడడం ఇబ్బందవడంతో మొత్తంగా ఉద్యోగం మానేసి స్వయంగా రంగంలోకి దిగారు. పలు వ్యవసాయ క్షేత్రాలను సందర్శించిన ప్రవీణ్‌ ప్రకృతిసేద్యంపై మంచి అవగాహన తెచ్చుకున్నారు. జూరాల ప్రాజెక్టు పరిధిలో ఉండడం వల్ల సాగునీటికి ఢోకాలేదు. దాంతో వేపనూనె, ఆముదం పిండి, కషాయాల సాయంతో వరి, వేరుశనగ, పెసర, మినుము, మామిడి, బత్తాయి, పందిరి కూరగాయల్లాంటివెన్నో పండిస్తున్నారు. కేవలం పంటలు పండించడంతో సరిపెట్టక మార్కెటింగ్‌ మెలకువలూ తెలుసుకోవాలనీ పంటలకో బ్రాండ్‌ వాల్యూ తేవాలనీ అంటారు ప్రవీణ్‌. తాను పండిస్తున్న వరికి బ్రౌన్‌, సెమిబ్రౌన్‌, సింగిల్‌ పాలిష్‌ పద్ధతుల్లో మర పట్టించి ‘పాలమూరు’ రైస్‌ పేరుతో ప్యాక్‌ చేసి నేరుగా వినియోగదారులకు విక్రయిస్తున్నారు. మొదట ఆసక్తి కలవారిని పొలానికి పిలిచి చూపించి శాంపిల్‌గా కిలో బియ్యం ఇచ్చాననీ అవి రుచి చూసిన వారిలో 85శాతం మంది రెగ్యులర్‌ కస్టమర్లుగా మారారనీ చెబుతారు ప్రవీణ్‌. సొంతంగా సేంద్రియ ఉత్పత్తుల దుకాణాన్ని ప్రారంభించిన ఆయన తమ పొలంలో పండే ఇతర ఉత్పత్తులను కూడా పాలమూరు బ్రాండ్‌ పేరుతో ఇక్కడ విక్రయిస్తున్నారు. ప్రకృతి రైతులు తమ ఉత్పత్తుల్ని సొంతంగా మార్కెటింగ్‌ చేసుకోగలిగితే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగానికి దీటుగా సంపాదించవచ్చంటారు ప్రవీణ్‌.

మట్టిలోని సారమే ఆహారమై మనిషిని బతికిస్తోంది. ఆ సారాన్ని కాపాడుకోవడమే పెను సమస్యగా మారిన పరిస్థితుల్లో ప్రకృతి సిద్ధమైన సహజ విధానాలతో పరిష్కారాలు కనిపెట్టారు ఈ సేంద్రియ రైతులు. దాంతో ఇటు విష రసాయనాల్లేని ఆహారాన్ని అందిస్తూనే అటు పర్యావరణానికీ రక్షణనివ్వగలగడం విశేషం.


Advertisement

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


ఇంకా..

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని