హనుమంతుడు స్త్రీ రూపంలో..

హనుమంతుడు అనగానే భారీ కాయం, చేతిలో గదను పట్టుకున్న రూపమే గుర్తొస్తుంది. అలాంటి స్వామి ఓ ఆలయంలో స్త్రీ మూర్తి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నాడు.

Updated : 19 Jun 2022 11:20 IST

హనుమంతుడు స్త్రీ రూపంలో..

ఇది విన్నారా...

హనుమంతుడు అనగానే భారీ కాయం, చేతిలో గదను పట్టుకున్న రూపమే గుర్తొస్తుంది. అలాంటి స్వామి ఓ ఆలయంలో స్త్రీ మూర్తి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నాడు. అరుదైన ఆ ఆలయమే చత్తీస్‌గఢ్‌, రతన్‌పూర్‌లో ఉన్న గిరిజాబంధ్‌ హనుమాన్‌ మందిర్‌. కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఆలయాన్ని స్వామి భక్తుడైన పృథ్వి దేజు అనే రాజు కట్టించాడట. ఆ రాజుకు కుష్టువ్యాధి ఉండటంతో నయం చేయమంటూ రోజూ స్వామికి పూజలు చేసేవాడట. కొన్నాళ్లకు అతడికి స్వామి కలలో కనిపించి తనకోసం ఆలయం నిర్మించమని చెప్పాడట. హనుమంతుడి మాటను ఆజ్ఞగా పాటించిన రాజు మర్నాటి నుంచే ఆలయ నిర్మాణం ప్రారంభించాడట. అది పూర్తయ్యే సమయానికి స్వామి మళ్లీ కలలో కనిపించి తన విగ్రహం ఎక్కడ ఉన్నదీ తెలియజేశాడట. ఆ రాజు వెళ్లి వెతికితే... స్త్రీమూర్తి రూపంలో ఉన్న స్వామి విగ్రహం కనిపించిదట. ఆ విగ్రహాన్నే తెచ్చి ఆలయంలో ప్రతిష్ఠించాడట. ఆ తరువాత రాజుకు కుష్టువ్యాధి నయమైపోయిందట. అలా అప్పటినుంచీ హనుమంతుడిని దేవత రూపంలోనే పూజిస్తున్నారు. ఈ స్వామికి రకరకాల అలంకారాలు కూడా చేయడం విశేషం.


సోదరులతో దర్శనమిచ్చే శ్రీరాముడు

ఏ రామాలయాన్ని తీసుకున్నా... సీతారామలక్ష్మణులు, హనుమంతుడి విగ్రహాలే ఉంటాయి. కానీ ఈ ఆలయంలో శ్రీరాముడు.... సీత - తన ముగ్గురు సోదరులు - హనుమతో కలిసి భక్తులకు దర్శనమివ్వడం విశేషం. వీర ప్రతాపరాముడిగా పూజలు అందుకుంటున్న ఈ స్వామికి ధ]నుర్బాణాలు ఉండవు. ఈ క్షేత్రంలో జరిపే పూజా కార్యక్రమాలూ కాస్త భిన్నమే. ఇలా ఎన్నో ప్రత్యేకతలు ఉన్న ఆలయమే వాల్మీకి క్షేత్రంలోని పట్టాభిరామాలయం.

విశాలమైన ప్రాంగణంలో కనిపించే పట్టాభిరామాలయంలో కోరిన కోర్కెలు తీర్చే స్వామిగా పూజలు అందుకుంటున్నాడు వీరప్రతాపరాముడు. కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఆలయం చిత్తూరు జిల్లాలోని వాల్మీకిపురం (వాల్మీకిక్షేత్రం)లో కనిపిస్తుంది. వాల్మీకి కోసమే స్వామి ఇక్కడ వెలిశాడని ప్రతీతి.

స్థలపురాణం

పురాణాల ప్రకారం... వాల్మీకి మహర్షి రాముడి అనుగ్రహం కోసం శతశృంగ పర్వతశ్రేణుల్లో తపస్సు చేశాడట. దానికి మెచ్చి రాముడు ప్రత్యక్షమై వాల్మీకికి దర్శనభాగ్యం కలిగించాడట. ఆ తరువాత కొన్నాళ్లకు సీతారామలక్ష్మణులు, భరత, శతృఘ్న హనుమంతుడి విగ్రహాలు ఇక్కడ కనిపించాయనీ... వాటిని జాంబవంతుడు ప్రతిష్ఠించడం వల్లే ఈ ప్రాంతం వాల్మీకి క్షేత్రమయ్యిందనీ చెబుతారు. రాముడు సపరివారంగా దర్శనం ఇవ్వడం వల్లే ఇక్కడ పట్టాభిరాముడిగా, వీరప్రతాప రాముడిగా పూజలు అందుకుంటున్నాడు. ఈ ఆలయాన్ని శ్రీకృష్ణదేవరాయలు అభివృద్ధి చేశాడనీ పురాణాలు చెబుతున్నాయి. అన్నమాచార్యుడు ఈ ఆలయాన్ని సందర్శించి రాముడిమీద 27 సంకీర్తనలను ఆలపించాడట. అదే విధంగా కవయిత్రి, వేంకటేశ్వరస్వామి భక్తురాలైన వెంగమాంబ కూడా ఈ ఆలయాన్ని దర్శించి రాముడికి పట్టాభిషేకాన్ని జరిపించిందని ఇక్కడున్న చారిత్రక ఆధారాలు పేర్కొంటున్నాయి.

విశేషాలకు నెలవు

ఈ ఆలయంలోని రాజగోపురం, ప్రధాన ఆలయం, గర్భాలయం.. ఇలా అన్ని ప్రధాన ద్వారాలూ ఉత్తర దిక్కున ఉంటాయి. ఇతర రామాలయాలతో పోలిస్తే ఇక్కడ సీతాదేవి రాముడికి కుడివైపున ఉండి భక్తులకు కనిపిస్తుంది. సాధారణంగా అన్ని ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తరద్వార దర్శనం జరిగితే.. ఇక్కడ మాత్రం ద్వాదశినాడు ఉత్తరద్వారాలు తెరిచి పూజాదికాలను నిర్వహిస్తారు. అదే విధంగా రాముడి జన్మనక్షత్రమైన పునర్వసు నక్షత్రం రోజున కాకుండా సీతమ్మ తల్లి జన్మనక్షత్రమైన ఆశ్లేష నక్షత్రం రోజున వార్షిక బ్రహ్మోత్సవాలతోపాటూ సీతారామ కల్యాణాన్ని జరుపుతారు. ఈ ఆలయంలో రాముడికి ధనుర్బాణాలు ఉండవు. స్వామి ఇక్కడ తన కుడిచేతి చూపుడువేలును చూపిస్తూ ఒకే మాట, ఒకే బాణం, ఒకే పత్ని అనే సందేశాన్ని ఇవ్వడం వల్లే ఈ రాముడిని వీరప్రతాపరాముడిగా పిలుస్తారు. తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ ఆలయాన్ని దర్శించుకునేంద]ుకు కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు నుంచి భక్తులు తరలివస్తారు.

ఎలా చేరుకోవచ్చు

వాల్మీకి క్షేత్రంలోని పట్టాభిరాముడి ఆలయం... అనంతపురం- తిరుపతి జాతీయ రహదారిపైన మదనపల్లెకి 20 కిలోమీటర్లు, తిరుపతికి 95 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఆలయాన్ని చేరుకునేందుకు మదనపల్లె-తిరుపతి మధ్య ప్రతి 20 నిమిషాలకు ఓ బస్సుతోపాటు ప్రైవేటు వాహనాలు అందుబాటులో ఉంటాయి. వాల్మీకి క్షేత్రంలోనే రైల్వేస్టేషన్‌ ఉండటంతో అక్కడే రైలు దిగి ఆలయాన్ని దర్శించుకోవచ్చు.

- చింతల కిరణ్‌కుమార్‌

న్యూస్‌టుడే, వాల్మీకిపురం, చిత్తూరు జిల్లా


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు