రైతుల తొలిపంట ఆ స్వామికే

కొండలమధ్య దర్శనమిస్తూ.. కోరిన కోర్కెలు ఈడేర్చే స్వామిగా గుర్తింపు పొందాడు కొమ్మాల లక్ష్మీనరసింహుడు. ఎత్తైన కొండపైన స్వయంభువుగా వెలసిన ఈ స్వామిని దర్శించుకునే భక్తుల్లో రైతులే ఎక్కువగా ఉండటం విశేషం. ఎంతో మహిమాన్వితమైన

Published : 24 Apr 2022 01:03 IST

రైతుల తొలిపంట ఆ స్వామికే

కొండలమధ్య దర్శనమిస్తూ.. కోరిన కోర్కెలు ఈడేర్చే స్వామిగా గుర్తింపు పొందాడు కొమ్మాల లక్ష్మీనరసింహుడు. ఎత్తైన కొండపైన స్వయంభువుగా వెలసిన ఈ స్వామిని దర్శించుకునే భక్తుల్లో రైతులే ఎక్కువగా ఉండటం విశేషం. ఎంతో మహిమాన్వితమైన ఈ క్షేత్రాన్ని రాణీరుద్రమదేవి సైతం సందర్శించుకున్నట్లుగా చరిత్ర పేర్కొంటోంది.

కొమ్మాల లక్ష్మీనరసింహుడి క్షేత్రం... వరంగల్‌ జిల్లా గీసుకొండ మండలం కొమ్మాల గ్రామంలో కనిపిస్తుంది. చుట్టూ పచ్చని చెట్లూ, ఆహ్లాదకరమైన వాతావరణంలో సుమారు 200 అడుగుల ఎత్తైన గుట్టపైన రైతుల కోసం
స్వయంభువుగా వెలసిన ఈ స్వామి కోరిన కోర్కెలు తీర్చే భక్తసులభుడు. నిజానికి ఇది శతాబ్దాల కాలంనాటి ఆలయమే అయినా... రెండువందల సంవత్సరాల నుంచే అంగరంగవైభవంగా పూజాది కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని అంటారు. 
ఈ స్వామిని దర్శించుకుంటే సంతానప్రాప్తి కలుగుతుందనీ, సొంతింటి కలా నిజమవుతుందనీ భక్తుల నమ్మకం.

స్థలపురాణం

కొన్ని వందల ఏళ్ల క్రితం ఈ ఆలయ పరిసరాల్లో కొమ్మిడి వంశానికి చెందిన ఓ రైతు తన పంటను కోసేందుకు పనివాళ్లను వెతికితే ఒక్కరూ దొరకలేదట. అలాంటి సమయంలో ఓ బాలుడు వచ్చి ఒక్క రాత్రిలోనే పంటంతా కోసేశాడట. అలా పంటను కోసినందుకు ప్రతిఫలం ఇవ్వమని ఆ బాలుడు రైతును అడిగితే... జొన్న అంబలిని ఇచ్చి తాగమని చెప్పాడట.  దాంతో ఆ బాలుడు తనకు అంబలి కాకుండా పంట కావాలని చెప్పి.. ఒక కట్టను తీసుకుని వెళ్లిపోతుండగా కోసిన పంటంతా అతని వెంట కదిలిపోయిందట. కొంత దూరం వెళ్లాక ఆ బాలుడు అదృశ్యమైపోవడంతో పంటంతా అక్కడే మిగిలిపోయిందట. అదే రోజు రాత్రి రైతుకు కలలో ఆ చిన్నారి కనిపించి ‘నేను నీ పొలం పక్కన ఉన్న గుట్టపైన వెలసిన నరసింహ స్వామిని. నాకు పూజలు చేయి...’ అని చెప్పాడట. మర్నాడు ఆ రైతు మిగిలిన ఊరివాళ్లకు ఈ విషయం చెప్పడంతో అంతా కలిసి వెళ్లి వెతికితే స్వామి విగ్రహం కనిపించింది. దాంతో వాళ్లు ఆ విగ్రహానికి పూజాది కార్యక్రమాలను నిర్వహించి అప్పటి నుంచీ తాము పండించిన మొదటి పంటను స్వామికి సమర్పించడాన్ని ఓ సంప్రదాయంగా పాటిస్తున్నారు. అయితే అంతకన్నా ముందు నుంచే స్వామి విగ్రహం ఇక్కడ ఉందనీ... వనవాసం సమయంలో పాండవులే కాకుండా, రాణి రుద్రమదేవీ ఈ ఆలయాన్ని దర్శించుకున్నట్లుగా చెబుతారు.

రాత్రివేళ కల్యాణం

చుట్టూ పంటపొలాల మధ్య కనిపించే ఈ ఆలయంలో శ్రీదేవి, భూదేవి సమేత నరసింహస్వామిని దర్శించుకున్నాక రామానుజాచార్యుల విగ్రహాన్నీ, గోదాదేవి ఉపాలయాన్నీ చూడొచ్చు. ఇక్కడ రోజువారీ జరిగే పూజలతోపాటూ... ఫాల్గుణ శుద్ధ సప్తమి నాడు ప్రారంభమయ్యే అధ్యయనోత్సవాలు మూడురోజుల పాటు నిర్వహిస్తారు. ప్రతి ఏకాదశినాడు రాత్రి పదిగంటల తరువాత కల్యాణోత్సవాన్ని నిర్వహిస్తారు. చుట్టుపక్కల ప్రాంతాల్లోని రైతులందరూ తమ వ్యవసాయ పనులు ముగించుకొని ఆలయానికి వచ్చేందుకే ఆ సమయంలో కల్యాణం జరిపిస్తామని చెబుతారు ఆలయ నిర్వాహకులు. అదేవిధంగా హోలీ పౌర్ణమి ముందు బ్రహ్మోత్సవాలను నిర్వహించి పౌర్ణమిరోజున పెద్ద ఎత్తున జాతరను ప్రారంభిస్తారు. అయిదు రోజులపాటు జరిగే జాతరలో పాల్గొనేందుకు ఎంతోమంది భక్తులు వస్తారని అంటారు. ఆ సమయంలో స్థానికులు ప్రభలతో ఊరేగింపుగా వచ్చి స్వామిపట్ల తమ భక్తిని చాటుకుంటారు. ఈ ప్రాంతంలో రైతులు మొక్కజొన్న, జొన్న, కూరగాయలు... ఇలా ఏది పండించినా మొదటి కాత స్వామికి అర్పించాకే బయటివారికి అమ్ముతారు. సంతానం లేని వారూ, ఇల్లు కట్టాలనుకునేవారూ ఈ ఆలయాన్ని దర్శించుకుని ముడుపు కడితే... అవి నెరవేరతాయని అంటారు.

ఎలా చేరుకోవచ్చు  

ఈ ఆలయం వరంగల్‌ జిల్లా గీసుకొండ మండలం కొమ్మాలలో ఉంది. వరంగల్‌ వరకూ రైలు, లేదా బస్సుల్లో వెళ్తే.. అక్కడి నుంచి ఆలయానికి చేరుకునేందుకు ప్రయివేటు వాహనాలూ, బస్సులూ అందుబాటులో ఉంటాయి.  

- గుండు పాండురంగశర్మ, ఈనాడు, వరంగల్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..