ఇది పెంపుడు బొమ్మ!

మనం మాట్లాడితే గుర్తుపడుతుంది. కూర్చోమంటే కూర్చుంటుంది. తల నిమిరితే కళ్లు మూస్తుంది. ఆహారం పెడితే తినడానికి రెడీ అయిపోతుంది. ఇవన్నీ ఓ కుక్క సంగతులు. ‘అన్ని కుక్కలూ ఇలాగే చేస్తాయిగా, ఇందులో ఏముంది వింత’ అనుకుంటున్నారేమో కదూ. కానీ ఇదో కుక్క బొమ్మ.

Updated : 20 Feb 2022 11:06 IST

ఇది పెంపుడు బొమ్మ!

మనం మాట్లాడితే గుర్తుపడుతుంది. కూర్చోమంటే కూర్చుంటుంది. తల నిమిరితే కళ్లు మూస్తుంది. ఆహారం పెడితే తినడానికి రెడీ అయిపోతుంది. ఇవన్నీ ఓ కుక్క సంగతులు. ‘అన్ని కుక్కలూ ఇలాగే చేస్తాయిగా, ఇందులో ఏముంది వింత’ అనుకుంటున్నారేమో కదూ. కానీ ఇదో కుక్క బొమ్మ. ‘మోజీ ఇంటరాక్టివ్‌ సాఫ్ట్‌ డాగ్‌ టాయ్‌’ పేరుతో వస్తున్న ఈ బొమ్మ పిల్లలకు మంచి పెట్‌లా ఉంటుంది. బ్యాటరీలతో పనిచేస్తూ రకరకాల శబ్దాలకు స్పందిస్తుంది. పైగా దీంతో పాటూ కొన్ని కార్డులూ వస్తాయి. వాటిని ఈ కుక్క బొమ్మ మెడపట్టీలోని బిళ్లతో స్కాన్‌ చేస్తే ఆ కార్డును బట్టి హైఫైవ్‌ ఇవ్వడమూ, కాళ్లు పైకెత్తడమూ, కూర్చోవడమూ... లాంటివీ చేస్తుంది. ఇలా నిజమైన పెంపుడు జీవుల్లా ఉండే ఇంటరాక్టివ్‌ పిల్లి బొమ్మలూ అందుబాటులో ఉన్నాయి!


టీషర్టు బోర్డు బాగుందా!

చిన్నూ తాను వేసుకున్న చొక్కాపైనే ఏనుగు బొమ్మవేశాడు. కాసేపటికి దాన్ని చెరిపేశాడు. అది చూసి ‘అబ్బ ఆ మ్యాజిక్‌ ఏదో మాకూ చెప్పవూ’ అంటూ ఫ్రెండ్స్‌ అందరూ అడిగారు. అసలు సంగతేంటంటే... అది ‘చాక్‌బోర్డ్‌ టీ షర్ట్‌’. చొక్కాపైన రాయడానికి ప్రత్యేకమైన క్లాత్‌ ఉంటుంది. దాని మీద టీషర్ట్‌తోపాటూ వచ్చే వైట్‌ మార్కర్‌తో నచ్చిన మంచిమాటలు రాసేయొచ్చు, వచ్చిన బొమ్మలు గీసేయొచ్చు. కావాలంటే చిన్న క్లాత్‌తో వాటిని చెరిపేస్తూ బ్లాక్‌బోర్డ్‌లా మళ్లీ మళ్లీ రాసుకోవచ్చు. గమ్మత్తయిన ఈ చొక్కాలు ఆన్‌లైన్లో అందుబాటులో ఉన్నాయి. ఇష్టమైతే మన కోసమే కొనుక్కోవచ్చు, లేదంటే ప్రియమైనవారి పుట్టినరోజున బహుమతిగానూ ఇవ్వొచ్చు.


అతుక్కునే పజిళ్లు ఇవి!

పిల్లల కోసం మార్కెట్లో బిల్డింగ్‌ బ్లాక్స్‌, లెగో బ్రిక్స్‌లాంటి బోలెడు పజిళ్లు ఉన్నాయి. వీటిల్లోని ముక్కల్ని ఓ క్రమపద్ధతిలో పెడుతూ ఆడుకుంటే చిన్నారులకు ఎంతో సరదాగా ఉంటుంది. అయితే పెద్ద పిల్లలే ఆ బ్లాక్స్‌ అన్నింటినీ చక్కగా పేర్చి ఓ ఆకారం తెప్పించగలరు. కాస్త చిన్న పిల్లలు కూడా ఇలాంటి పజిళ్లను సులువుగా పూర్తిచేసేలా ఇప్పుడు ‘మ్యాగ్నటిక్‌ బిల్డింగ్‌ బ్లాక్స్‌’ దొరుకుతున్నాయి. ఇందులో ఎన్నో రకాల ఆకారాలతో ఉండే ముక్కలన్నింట్లోనూ అయస్కాంతం ఉంటుంది. దీంతో ఈ బ్లాక్స్‌ను ఒకదానిమీద ఒకటి ఉంచినప్పుడు అవి పడిపోకుండా సులువుగా అతుక్కుపోతాయన్నమాట.


రాకుమారితో ఆహ్వానం!

పుట్టినరోజు అంటే ఇష్టం లేని చిన్నారులు ఎవరుంటారు... అందుకే స్నేహితుల్ని పిలిచి కేక్‌ కటింగ్‌తోనైనా ఆ వేడుకను చేసుకుంటారు. అయితే ఈసారి మీ ఫ్రెండ్స్‌ని ఎప్పటిలా రమ్మని నోటి మాటతో చెప్పేయకుండా అందాల రాకుమారితో ఆహ్వానం
పంపి, అది చూసి వాళ్లు ‘అరె భలే ఉందే’ అంటూ ఆశ్చర్యపోయేలా చేయండి. అదెలాగంటారా... కొత్తగా వస్తున్న ‘క్రియేటివ్‌ త్రీడీ డాన్సింగ్‌ ప్రిన్సెస్‌ చిల్డ్రన్‌ బర్త్‌డే ఇన్విటేషన్‌ కార్డు’ ద్వారా. రకరకాల రంగుల్లో... చక్కని పోజులుపెట్టి హొయలుపోతున్న ఈ బొమ్మలే బర్త్‌డే ఆహ్వానపత్రికల్లా ఆన్‌లైన్లో దొరుకుతున్నాయి. మామూలుగా కార్డులానే ఉన్నా తెరవగానే కాగితపు కుచ్చులు ముచ్చటైన గౌనులా కనిపిస్తూ అమ్మాయి బొమ్మలా మారిపోతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..