ప్లాస్టిక్‌ తింటున్నాం... తాగుతున్నాం..!

మనం రోజువారీ తీసుకునే ఆహారంలో భాగంగా ప్లాస్టిక్కునీ తినేస్తున్నామట. సౌకర్యం కోసం ఓవెన్లలో నైలాన్‌ కుకింగ్‌ బ్యాగుల్నీ, తాగడానికి ప్లాస్టిక్‌ పూత పూసిన కాగితం కప్పులూ... ఇలా రకరకాలు వాడేస్తున్నాం.

Updated : 08 May 2022 06:14 IST

ప్లాస్టిక్‌ తింటున్నాం... తాగుతున్నాం..!

మనం రోజువారీ తీసుకునే ఆహారంలో భాగంగా ప్లాస్టిక్కునీ తినేస్తున్నామట. సౌకర్యం కోసం ఓవెన్లలో నైలాన్‌ కుకింగ్‌ బ్యాగుల్నీ, తాగడానికి ప్లాస్టిక్‌ పూత పూసిన కాగితం కప్పులూ... ఇలా రకరకాలు వాడేస్తున్నాం. దాంతో ఇవన్నీ ట్రిలియన్లకొద్దీ నానోపార్టికల్స్‌ని విడుదల చేస్తున్నాయట. పాలీప్రొపిలీన్‌ బేబీ బాటిల్స్‌, పాలీఇథిలీన్‌ టెర్పెథాలేట్‌ టీబ్యాగులూ నుంచి కూడా ఈ రేణువులు ఆయా పదార్థాల్లో కలుస్తూనే ఉన్నాయి. అయితే అవి ఏ మేరకు అన్నది గతంలో తెలియలేదట. దాంతో నైలాన్‌ స్లో కుకర్‌ బ్యాగుల్లో లీటరు నీళ్లు పోసి ఓ గంటసేపు ఉంచినప్పుడు- ఆ నీళ్లలో 35 ట్రిలియన్ల నానో పార్టికల్స్‌ ఉన్నట్లు గుర్తించారు. ఆ తరవాత ఓ పెద్ద ప్లాస్టిక్‌ కప్పులో లీటరు వేడి టీ పోసి ఇరవై నిమిషాలపాటు ఉంచగా అందులో 5.1 ట్రిలియన్ల ప్లాస్టిక్‌ నానోపార్టికల్స్‌ చేరాయట. దీన్నిబట్టి ఒక వ్యక్తి 13 ప్లాస్టిక్‌ కోటెడ్‌ పేపర్‌ కప్పుల్లో నుంచి నీళ్లనుగానీ లేదా కుకింగ్‌ బ్యాగులోని అరలీటరు నీటినిగానీ తాగితే శరీరంలోని ప్రతి ఏడు కణాలకు ఓ ప్లాస్టిక్‌ నానో పార్టికల్‌ ఉన్నట్లే అంటున్నారు. కాబట్టి ఇకనైనా జాగ్రత్త పడకపోతే భవిష్యత్తు ఎలా ఉంటుందో ఊహించుకోవడానికే కష్టం అంటున్నారు నిపుణులు.


క్రేవింగ్‌ తగ్గాలంటే...

మీరు వ్యాయామం చేస్తున్నారా? అయితే అది ఎంత ఎక్కువగా ఇంకెంత వేగంగా చేస్తే అంత మంచిది. దీనివల్ల ఫ్యాటీ ఫుడ్స్‌ తినాలన్న క్రేవింగ్‌ బాగా తగ్గిపోతుంది అంటున్నారు వాషింగ్టన్‌ స్టేట్‌ యూనివర్సిటీ నిపుణులు. అంతేకాదు, దానివల్ల మిఠాయిలూ బేకరీ ఉత్పత్తులూ వంటి వాటిమీదకు మనసు పోదనీ, ఆరోగ్యకరమైన పండ్లూ కూరగాయల్లాంటివే ఎక్కువగా తింటారనీ అంటున్నారు. ఎలాంటి వ్యాయామం చేయని వాళ్లలోనే ఫ్యాటీ ఉత్పత్తుల్ని తినాలన్న కోరిక ఎక్కువగా ఉంటుంది అన్న విషయాన్ని ఎలుకల్లో ప్రయోగపూర్వకంగా తెలుసుకున్నారు. ఇందుకోసం కొన్ని ఎలుకల్ని తీసుకుని, వాటిని రెండు విభాగాలుగా చేసి 30 రోజులపాటు వరసగా పరిశీలించారట. ఒక విభాగంలోని ఎలుకలతో చాలాసేపు ట్రెడ్‌మిల్‌మీద పరుగులు పెట్టించి, మరో వర్గం ఎలుకలతో ఏమీ చేయించకుండా వదిలేశారట. అయితే రెండింటికీ కొవ్వు సంబంధిత ఆహారాన్ని అందుబాటులో ఉంచినప్పుడు- వ్యాయామం చేసేవాటికన్నా చేయకుండా ఉన్న ఎలుకలే వాటిని ఎక్కువగా తిన్నాయట. దీన్నిబట్టి వ్యాయామం అనేది క్రేవింగ్‌ను తగ్గించే అద్భుతమైన పిల్‌ అంటున్నారు సదరు పరిశోధకులు.


ఇప్ప గొప్పెంతో!

భద్రాచలం రాములవారి గుడి దగ్గర ఇప్పపూల ప్రసాదాలు అమ్మడమూ, ఇప్ప పువ్వుతో గిరిజనులు సారా చేస్తారన్నదీ చాలామందికి తెలిసే ఉంటుంది. కానీ ఇప్ప పువ్వుని వంటల్లోనూ వాడుతుంటారు. అందుకే ‘ఇప్ప పడితే ఎండు గడ్డికైనా ఎక్కడలేని రుచి వస్తుందనే సామెతలూ పుట్టుకొచ్చాయి. అధర్వణ వేదం మొదలుకుని చరక సంహిత వరకూ ఎన్నో గ్రంథాల్లో ఇప్ప పూల ప్రస్తావన ఉంది. కేవలం రుచే కాదు... గిరిజనులు కల్పవృక్షంగా భావించే ఈ చెట్టు ఆకులూ, బెరడూ, పువ్వులూ, కాయలూ... అన్నింటిలోనూ పోషక విలువలు ఎక్కువేనట. ముఖ్యంగా పువ్వుల్లో మాంసకృత్తులు, పిండిపదార్థాలు, ఖనిజ లవణాలు, పీచు, క్యాల్షియం, ఫాస్పరస్‌, కెరోటిన్‌, విటమిన్‌-సి... వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే పూర్వకాలం నుంచీ ఆదివాసీలు ఈ పువ్వులను శక్తినిచ్చే ఆహారంగా భావించి అనేక రకాలుగా వాడుకుంటారు. ఇప్ప పూలు దగ్గు, శ్వాసకోశ సమస్యల్ని నివారిస్తాయట. బాలింతల్లో పాలు వృద్ధి కావడానికి పాలల్లో కాస్త ఇప్పపూల పొడిని కలిపి ఇస్తారు.  ఈ పూలను మరిగించి చల్లార్చిన కషాయం తాగితే అతిదాహం తగ్గుతుంది. రక్త సంబంధిత సమస్యలకీ ఈ కషాయం చక్కటి ఔషధం. అలానే చర్మ సంరక్షణకూ, కీళ్ల నొప్పుల నియంత్రణకూ ఇప్ప తైలాన్ని వాడుతుంటారు. ఈ నూనెను పంట పొలాల్లో కలుపు నివారణకూ ఉపయోగిస్తారు. ఇప్ప పూలతో కుడుములు, జొన్న రొట్టె, ఉండలు, జంతికలు... వంటివెన్నో చేసుకుంటారు గిరిజనులు. వర్షాకాలంలో ఈ పూలకి చిక్కుడు గింజలు, బొబ్బర్లనీ కలిపి అంబలి కాచుకుంటారు. ఏ కూరగాయలూ అందుబాటులో లేకపోతే ఇప్పపువ్వు వేసి అన్నం వండుతారు. ఇప్పుడు ఆధునికులు సైతం ఇప్ప పూలలోని రుచినీ పోషకాల్నీ గుర్తించి వాటితో జామ్‌లూ, కేక్‌లూ, ఇన్‌ఫ్యూజ్డ్‌ ఐస్‌క్రీమ్‌లూ... ఇలా ఎన్నో రకాలు చేస్తున్నారు. గొప్ప విషయమే కదూ!                


టూకీగా...

విటమిన్‌-డి లోపం ఎక్కువగా ఉన్నవాళ్లకి కొవిడ్‌ సోకితే తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు ఇప్పటికే అనేక పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. అయితే, కొవిడ్‌ సోకక ముందు డి-విటమిన్‌ సరిగ్గానే ఉన్నప్పటికీ వచ్చి తగ్గిన తరవాత కూడా చాలామందిలో డి-విటమిన్‌ లోపం తీవ్రంగా ఉంటుందనీ కాబట్టి కరోనానుంచి కోలుకున్నప్పటికీ డి-విటమిన్‌ను కొంతకాలం వాడాల్సి ఉంటుందనీ బార్‌-ఇలాన్‌ యూనివర్సిటీకి చెందిన నిపుణులు చెబుతున్నారు.
* శ్వాసకోస సంబంధవ్యాధులు- ముఖ్యంగా ఆస్తమాతో బాధపడేవాళ్లకి పులియబెట్టిన సోయా ఉత్పత్తుల్ని ఇవ్వడం వల్ల అవి చాలావరకూ తగ్గుతున్నట్లు ఒసాకా సిటీ యూనివర్సిటీ పరిశీలనలో స్పష్టమైందట.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..