సైన్స్‌ సంగతులు

స్మార్ట్‌ఫోన్‌లో వస్తున్న ఆప్‌లు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతున్నాయి. అయితే కొత్తగా రూపొందించిన ఎకోస్‌ ఆప్‌, గుండె వేగాన్నీ గుర్తిస్తుందనీ చెబుతున్నారు లండన్‌ కింగ్స్‌ కాలేజ్‌, నెదర్లాండ్స్‌కు చెందిన మాస్ట్రిక్ట్‌ యూనివర్సిటీకి చెందిన నిపుణులు.

Updated : 30 Oct 2022 03:24 IST

సైన్స్‌ సంగతులు

స్మార్ట్‌ఫోనే స్టెతస్కోప్‌ అయితే...!

స్మార్ట్‌ఫోన్‌లో వస్తున్న ఆప్‌లు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతున్నాయి. అయితే కొత్తగా రూపొందించిన ఎకోస్‌ ఆప్‌, గుండె వేగాన్నీ గుర్తిస్తుందనీ చెబుతున్నారు లండన్‌ కింగ్స్‌ కాలేజ్‌, నెదర్లాండ్స్‌కు చెందిన మాస్ట్రిక్ట్‌ యూనివర్సిటీకి చెందిన నిపుణులు. అంటే- ఇకనుంచి స్మార్ట్‌ఫోన్‌ ఎలక్ట్రానిక్‌ స్టెతస్కోప్‌గానూ ఉపయోగపడుతుందట. ఆప్‌ ఆన్‌ చేసి ఫోన్‌కి ఉన్న మైక్రోఫోన్‌ను శరీరానికి తాకిస్తే చాలు, అది గుండె వేగాన్ని గుర్తించి రికార్డు చేస్తుంది. ఆ సమయంలో దూరంగా ఉన్న డాక్టర్‌ మానిటర్‌లో దాన్ని చూసి గుండె ఆరోగ్యాన్ని పరీక్షించవచ్చు అంటున్నారు. ఈ ఆప్‌ను ప్రయోగపూర్వకంగా ప్రవేశపెట్టాక ఇప్పటివరకూ లక్ష మందికి దీని ద్వారా హృద్రోగ పరీక్ష చేయగలిగారట. కాబట్టి మున్ముందు హృద్రోగులను వైద్యులు ఇంట్లో నుంచే పరీక్షించి వాళ్ల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవచ్చని చెబుతున్నారు.


పీచుతోనూ ప్రమాదం ఉంది!

చు ఎక్కువగా ఉండే పదార్థాలను తినడం వల్ల బరువు తగ్గుతారనీ క్యాన్సర్‌, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులు రావనీ తెలిసిందే. అయితే అదే పీచుని ప్రాసెస్‌ చేసి తింటే క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఉంది అంటున్నారు టొలెడొ యూనివర్సిటీ నిపుణులు. ఇందుకోసం వీళ్లు కొన్ని ఎలుకల్ని తీసుకుని ఇనులిన్‌ అనే పీచుతో ఫోర్టిఫైడ్‌ చేసిన పదార్థాలను తినిపించారట. నిజానికి ఇది మొక్కల ఉత్పత్తుల్లో సహజంగా ఉంటుంది. ప్రి-బయోటిక్‌గానూ పనిచేస్తుంది. ఆ కారణంతో దీన్ని ఇప్పుడు ప్రాసెస్‌డ్‌ పదార్థాల్లోనూ కలుపుతున్నారు. అలా చేసినప్పుడు- మామూలుగా ఆరోగ్యానికి మేలు చేసే పీచు కాస్తా జీవక్రియా లోపాలకు కారణమై కాలేయ క్యాన్సర్‌కు దారితీసిందట. ఈ రకమైన పీచుతో కూడిన ఆహారం తీసుకున్న ఎలుకల రక్తంలో పైత్య రసాలు ఎక్కువగా ఉన్నాయనీ, దాంతో ఇన్‌ఫ్లమేషన్‌ ఏర్పడి రోగనిరోధక వ్యవస్థ క్యాన్సర్‌ కణాల్ని గుర్తించి వాటిని నాశనం చేసే శక్తిని కోల్పోతుందనీ వివరిస్తున్నారు. అంటే- ఆహారంలో సహజంగానే ఉండే ఇనులిన్‌ ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గిస్తే, అదే ఇనులిన్‌ ప్రాసెస్‌డ్‌ పదార్థాల ద్వారా తీసుకున్నప్పుడు కాలేయానికి హాని కలిగిస్తున్నట్లు చెబుతున్నారు.


ఆత్మహత్య చేసుకోకుండా...

రకరకాల సమస్యల కారణంగా కుంగుబాటుకు గురయినవాళ్లలో కొందరు ఆత్మహజత్యకు పాల్పడుతుంటారు. అలా జరగకుండా చూడాలంటే - యాంటీ డిప్రసెంట్లు వాడటం, సైకోథెరపీ చేయించడం, అన్నింటినీ మించి కుటుంబీకుల ఆసరా అవసరమవుతాయి. వీటితోపాటు ఫోలిక్‌ ఆసిడ్‌ సప్లిమెంట్లు కూడా వాడమంటున్నారు చికాగో యూనివర్సిటీ నిపుణులు. ఇది శరీరంలో కొత్త కణాల ఉత్పత్తికి దోహదపడుతుంది. అందుకే గర్భిణులకు ఈ సప్లిమెంట్‌ను ఇస్తుంటారు. ఇకనుంచి కుంగుబాటుతో బాధపడేవాళ్లకీ ఇది అవసరమే అంటున్నారు సదరు పరిశోధకులు. ఇందుకోసం వీళ్లు రకరకాల మానసిక సమస్యలతో చికిత్స పొందుతున్న తొమ్మిది లక్షల మందిని నిశితంగా అధ్యయనం చేశారట. చికిత్సలో భాగంగా ఫోలిక్‌ ఆసిడ్‌ సప్లిమెంట్లు తీసుకున్నవాళ్లలో ఆత్మహత్యకు పాల్పడటం అనేది సగానికి సగం తక్కువైనట్లు గుర్తించారు.  ఈ రెండింటికీ మధ్య సంబంధం ఏమిటనేది స్పష్టంగా తెలియనప్పటికీ- కుంగుబాటును తగ్గించేందుకు ఇచ్చిన మందుల్ని ఈ సప్లిమెంట్‌ ప్రభావితం చేస్తుందనీ, ఆ కారణంగానే వాళ్లలో ఆత్మహత్య ఆలోచన రాకపోవచ్చనీ భావిస్తున్నారు. అదీగాక కూరగాయలూ పండ్లూ బీన్సూ నట్స్‌లో ఫోలిక్‌ ఆమ్లం సహజంగానే ఉంటుంది కాబట్టి డిప్రెషన్‌తో బాధపడేవాళ్లు వీటిని ఎక్కువగా తిన్నా ఫలితం ఉండొచ్చు మరి!


పొడవు ఎందుకు పెరగడం లేదంటే...

మనిషి రూపురేఖలూ ఎత్తూ... వంటి లక్షణాలన్నీ జన్యుపరంగానే వస్తాయని తెలిసిందే. అయితే అందుకు ఏయే జన్యువులు కారణమవుతున్నాయనే అంశాన్ని లండన్‌లోని క్వీన్‌ మేరీ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు క్షుణ్ణంగా పరిశీలించారు. ఇందుకోసం వీళ్లు 50 లక్షల మందిపైన అనేక అధ్యయనాలు చేశారట. అందులో పది లక్షల మంది ఆఫ్రికా, తూర్పు ఆసియా, దక్షిణా ఆసియాకు చెందినవాళ్లట. అందరినీ పరిశీలించాక తేలిందేమంటే- సుమారు 12,111 రకాల జన్యువులు వాళ్లలో ఎత్తుని  ప్రభావితం చేస్తున్నట్లు గుర్తించారు. ఇవే ఎముకల పెరుగుదలకి కారణమవున్నాయట. ఎత్తుకి సంబంధించిన జన్యువుల్లో యూరోపియన్లలో 40 శాతం వైవిధ్యం కనిపిస్తే ఆసియన్లలో 10-20 శాతం మాత్రమే వైవిధ్యం కనిపించింది. సాధారణంగా ఆనువంశికంగా వచ్చిన జన్యువుల్ని బట్టి చూస్తే పొడవుగా ఉన్న తల్లితండ్రులకు పుట్టే పిల్లలూ పొడవుగానే ఉంటారు. అలాగే పొట్టి వాళ్ల పిల్లలూ పొట్టిగానే ఉంటారు. కానీ కొన్నిసార్లు అలా జరగకపోవచ్చు కూడా. దీన్నిబట్టి జన్యువులు నిర్దేశించిన ఎత్తు పెరగకపోవడానికి కారణాల గురించీ, స్కిజోఫ్రీనియా వంటి జన్యువ్యాధుల గురించీ, ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అనేక అంశాల గురించీ తెలుసుకునేందుకూ ఈ జన్యు పరిశోధనలు ఉపయోగపడతాయి అంటున్నారు పరిశీలకులు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..