ఈ ‘చిట్టి’ రోబో పాఠాలు చెబుతాడు

నినో అంటే స్పానిష్‌ భాషలో ‘అబ్బాయి’ అని అర్థం. ఈ చిట్టి రోబో రెండడుగులే ఉంటాడు కాబట్టి ఆ పేరు పెట్టారు. పాఠాలకి సంబంధించిన పిల్లల ప్రశ్నలన్నింటికీ జవాబు చెప్పడం అతని పని. వాళ్లతోపాటూ ఆడతాడూ పాడతాడూ.

Published : 19 Jun 2022 00:49 IST

ఈ ‘చిట్టి’ రోబో పాఠాలు చెబుతాడు

నినో అంటే స్పానిష్‌ భాషలో ‘అబ్బాయి’ అని అర్థం. ఈ చిట్టి రోబో రెండడుగులే ఉంటాడు కాబట్టి ఆ పేరు పెట్టారు. పాఠాలకి సంబంధించిన పిల్లల ప్రశ్నలన్నింటికీ జవాబు చెప్పడం అతని పని. వాళ్లతోపాటూ ఆడతాడూ పాడతాడూ. చిన్నారులకి ఇలా అన్నివిధాలా సాయపడే ఈ చిట్టిరోబో... ఏవో ఇంటర్నేషనల్‌ స్కూళ్ళలోనే ఉంటాడనుకోనక్కర్లేదు. మామూలు బడులకీ అతణ్ణి చేరువచేస్తోంది సెరినా టెక్నాలజీస్‌ అన్న సంస్థ. అదెలా సాధ్యమవుతోందో చూడండి...

రోబో సినిమా క్లైమాక్స్‌ అది. ‘చిట్టి’ రోబోని ఏ కీలుకా కీలు విడగొట్టేయాలని(డిస్‌మాంటిల్‌) కోర్టు తీర్పు ఇస్తుంది. ఆ క్షణం వచ్చేసరికి చిట్టిరోబో నవ్వుతూ... జోకులేస్తూ తనని తానే విడదీసుకుంటూ పోతాడు... అది చూసి దాన్ని రూపొందించిన సైంటిస్టు రజినీకాంత్‌ కన్నీరుమున్నీరవుతుంటాడు. అతనే కాదు... ఆ సీన్‌ చూసిన ప్రేక్షకులూ ఉద్వేగానికి గురికాకుండా ఉండరు. కానీ, సెరినా టెక్నాలజీస్‌ సంస్థ ఏర్పాటుచేసే రోబోటిక్‌ ల్యాబుల్లో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంటుంది. ఇక్కడ దాదాపు ప్రతిరోజూ ‘నినో’ రోబోని పాఠశాల విద్యార్థులే ఏ కీలుకాకీలు విడదీస్తుంటారు. విడదీసినా వాళ్లెవరూ బాధపడరు, పైగా ఆనందిస్తుంటారు. ఎందుకంటే... విడదీసినంత వేగంగానే దాన్ని వాళ్లు మళ్లీ పెట్టేస్తారు(అసెంబుల్‌) కాబట్టి! అంతేకాదు, ఈ ల్యాబుల్లో ‘నినో’నే స్వయంగా విడదీయడాన్నీ మళ్లీ ఒకటి చేయడాన్నీ నేర్పిస్తుంటుంది. అది అక్కడితోనే ఆగదు. ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌(ఐఓటీ), కృత్రిమ మేధ(ఏఐ), మెషిన్‌ లెర్నింగ్‌, క్లౌడ్‌ కంప్యూటింగ్‌... ఇలా భవిష్యత్తు సాంకేతికతలన్నింటినీ పరిచయం చేస్తుంది. దాంతోపాటూ రోజువారీ పాఠాల విషయంలోనూ వాళ్లకి సాయపడుతుంది. ఈ ల్యాబులో ఒక్క నినో రోబోనే కాదు... దాంతోపాటూ ‘ట్విస్ట్‌’ అనే సాలెపురుగులాంటి రోబో, ‘పెర్రా’ అనే కుక్క పిల్ల రోబో కూడా విద్యార్థులకి వివిధ అంశాలని నేర్పిస్తుంటాయి. వీటన్నింటితో కూడిన రోబోటిక్‌ ల్యాబునే వివిధ బడుల్లో ఏర్పాటుచేసి ఇస్తోంది సెరినా టెక్నాలజీస్‌ సంస్థ.

దేశంలోనే మొదటిసారి...

కంప్యూటర్‌ ల్యాబుల స్థానంలో రోబోటిక్‌ ల్యాబులు ఏర్పాటుచేయడం... అందులో రోబోలే పాఠాలు చెప్పడం... ఈ ట్రెండు మనదేశంలో గత ఐదారేళ్లుగా ఉంది. కాకపోతే, ఈ ఆధునిక సాంకేతికత విదేశీ వర్సిటీలతో అనుసంధానమైన అంతర్జాతీయ బడులకే పరిమితమయ్యేది. ఇవి కాకుండా- అవసరాన్నిబట్టి తమ పరికరాలని పాఠశాలకి తెచ్చి విద్యార్థులకి నేర్పించి మళ్లీ వెళ్లిపోయే ప్రయివేటు రోబోటిక్‌ సంస్థలూ బోలెడన్ని ఉన్నాయి. సెరినా టెక్నాలజీస్‌ సంస్థ ఈ రెండింటికీ భిన్నంగా పనిచేస్తుంది.

బయట నుంచి కాకుండా ఆయా బడుల్లోనే శాశ్వతమైన ల్యాబుని ఏర్పాటుచేసివ్వడమే కాదు, అంతర్జాతీయ బడులకన్నా తక్కువ ఫీజులే వసూలు చేస్తుంది. పూర్తి స్వదేశీ సాంకేతికతతో రోబోలని నిర్మించుకోవడం వల్లనే ఇంత తక్కువ ధరలో ల్యాబుల్ని ఏర్పాటుచేస్తున్నామంటోంది సెరినా టెక్నాలజీస్‌ సంస్థ. అలా ఈ స్టార్టప్‌ బోధనా అవసరాల కోసం రూపొందించిన ‘నినో’ రోబో ఈ తరహావాటిల్లో మొదటిదట. ఎల్‌కేజీ విద్యార్థులకి రైమ్స్‌ నేర్పించడం నుంచి ఇంజినీరింగ్‌ విద్యార్థులకి మెషిన్‌ లెర్నింగ్‌ బోధించడం దాకా... ప్రత్యేక సిలబస్‌ల ఆధారంగా రోబోలే నేర్పిస్తాయి. ప్రస్తుతం 60 బడుల్లో ఈ ల్యాబులున్నాయి. విశాఖలోని వికాస విద్యానికేతన్‌ పాఠశాలలు, కిడ్జీ స్కూల్స్‌, దిల్లీ పబ్లిక్‌ స్కూల్‌, ఫ్యూచర్‌ వరల్డ్‌ బడుల్లో ఈ ల్యాబుల్ని నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లోని జనప్రియ స్కూల్స్‌లో ఉన్నాయి. మిగతా ల్యాబులన్నీ బెంగళూరులోనూ కువైట్‌ దేశంలోనూ పనిచేస్తున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తయితే... ఒడిశా ప్రభుత్వం తమ రాష్ట్రంలోని 16 వేల సర్కారు బడులన్నింటా ఈ ల్యాబుల్ని ఏర్పాటుచేస్తానని ముందుకు రావడం మరో ఎత్తు. అక్కడి సర్కారు బడుల్లో ఈ ల్యాబులను వచ్చే సెప్టెంబర్‌ నుంచీ మొదలుపెట్టబోతున్నారట! ఇక, ఇంజినీరింగ్‌ విద్యార్థుల కోసం కర్ణాటకలోని రెవా విశ్వవిద్యాలయం, ఒడిశాలోని కళింగ విశ్వవిద్యాలయాల క్యాంపస్‌లోనూ ఈ ల్యాబుల్ని ఏర్పాటుచేశారు!

అన్నట్టు... ఈ సంస్థ తయారుచేసిన నినో చిట్టి రోబో కేవలం పాఠాల్ని చెప్పడమే కాదు. బెంగళూరు విమానాశ్రయంలోనూ, కళింగ విశ్వవిద్యాలయంలోనూ కొత్తగా వచ్చేవాళ్లకి గైడ్‌గానూ పనిచేస్తున్నాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..