బాక్సుల్లోకి మసాలా రైస్‌

పిల్లలు స్కూళ్లకూ, పెద్దవాళ్లు ఆఫీసులకూ వెళ్లడం మొదలుపెట్టాక పొద్దుటి పూట హడావుడి అంతాఇంతా కాదు. అందుకే అప్పుడప్పుడూ అన్నం, పప్పు, కూర.. వంటివన్నీ చేయాలని చూడకుండా

Published : 19 Jun 2022 00:46 IST

బాక్సుల్లోకి మసాలా రైస్‌

పిల్లలు స్కూళ్లకూ, పెద్దవాళ్లు ఆఫీసులకూ వెళ్లడం మొదలుపెట్టాక పొద్దుటి పూట హడావుడి అంతాఇంతా కాదు. అందుకే అప్పుడప్పుడూ అన్నం, పప్పు, కూర.. వంటివన్నీ చేయాలని చూడకుండా ఇలాంటి రైస్‌ రుచుల్నీ వండితే... రైతాతో కలిపి తినేయొచ్చు.

షాజహానీ పులావ్‌

కావలసినవి: బాస్మతీబియ్యం: కప్పు, పెసలు: కప్పు, నెయ్యి: రెండు టేబుల్‌స్పూన్లు, జీలకర్ర: ఒకటింబావు చెంచా, లవంగాలు: నాలుగు, దాల్చినచెక్క: ఒక ముక్క, మిరియాలు: అరచెంచా, యాలకులు: నాలుగు, కరివేపాకు రెబ్బలు: అయిదు, ఉల్లిపాయలు: రెండు, జీడిపప్పు పలుకులు: పావుకప్పు, తాజా కొబ్బరి తురుము: రెండు టేబుల్‌స్పూన్లు, ఉప్పు: తగినంత, పచ్చిమిర్చి ముద్ద: ఒకటింబావు చెంచా, కొత్తిమీర: కట్ట.

తయారీవిధానం: పెసల్నీ, బియ్యాన్నీ రెండుగంటల ముందుగా నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టౌమీద కుక్కర్‌ను పెట్టి నెయ్యి వేసి జీలకర్ర, లవంగాలు, దాల్చినచెక్క, మిరియాలు, యాలకులు వేయించాలి. తరువాత కరివేపాకు, ఉల్లిపాయముక్కలు, జీడిపప్పు పలుకులు వేసి వేయించి... కడిగిన పెసలు, బియ్యం, నాలుగున్నర కప్పుల నీళ్లు, తగినంత ఉప్పు, కొబ్బరితురుము, పచ్చిమిర్చి ముద్ద, కొత్తిమీర తరుగు వేసి మూత పెట్టేయాలి. మూడు కూతలు వచ్చాక స్టౌని కట్టేయాలి.


ఆలూ రైస్‌

కావలసినవి: బేబీ ఆలూ: పావుకేజీ (ఉడికించుకోవాలి), అన్నం: రెండు కప్పులు, నెయ్యి: రెండు టేబుల్‌స్పూన్లు, ఆవాలు: అరచెంచా, సెనగపప్పు: చెంచా, మినప్పప్పు: చెంచా, కరివేపాకు రెబ్బలు: రెండు, పసుపు: పావుచెంచా, ఉప్పు: తగినంత, టొమాటో: ఒకటి, ఎర్రగా వేయించిన ఉల్లిపాయ ముక్కలు: రెండు పెద్ద చెంచాలు.

మసాలాకోసం: మినప్పప్పు- సెనగపప్పు-మిరియాలు: చెంచా చొప్పున, ఎండుమిర్చి: ఏడు, దనియాలు: రెండు చెంచాలు, జీలకర్ర: చెంచా, ఎండుకొబ్బరిపొడి: చెంచా.

తయారీవిధానం: స్టౌమీద కడాయి పెట్టి మసాలా కోసం సిద్ధంచేసుకున్న పదార్థాలను నూనె లేకుండా వేయించుకుని  తరవాత పొడి చేసుకోవాలి. స్టౌమీద కడాయి పెట్టి నెయ్యి వేసి ఆవాలు, సెనగపప్పు, మినప్పప్పు, కరివేపాకు వేయించుకోవాలి. ఇప్పుడు  పసుపు, సన్నగా తరిగిన టొమాటో ముక్కలు వేయించి బేబీ ఆలూ, మసాలా పొడి, తగినంత ఉప్పు వేసి స్టౌని సిమ్‌లో పెట్టి బాగా కలపాలి. అన్నీ వేగాక అన్నం కూడా వేసి కలిపి దింపే ముందు ఎర్రగా వేయించిన ఉల్లిపాయముక్కలు వేయాలి.


మసాలా చావల్‌

కావలసినవి: వండిన అన్నం: రెండు కప్పులు, నెయ్యి: టేబుల్‌స్పూను, ఆవాలు: చెంచా, జీలకర్ర: చెంచా, సోంపు: చెంచా, కరివేపాకు రెబ్బలు: రెండు, అల్లంవెల్లుల్లి ముద్ద: అరచెంచా, పచ్చిమిర్చి: రెండు, ఉల్లిపాయ: ఒకటి, టొమాటో: ఒకటి, క్యారెట్‌: ఒకటి, బీన్స్‌: మూడు, క్యాప్సికం: ఒకటి చిన్నది, బఠాణీ: రెండు టేబుల్‌స్పూన్లు, పసుపు: పావుచెంచా, కారం: చెంచా, దనియాలపొడి: చెంచా, గరంమసాలా: అరచెంచా, చాట్‌మసాలా: అరచెంచా, ఉప్పు: తగినంత, కొత్తిమీర: కట్ట.

తయారీవిధానం: స్టౌమీద కడాయి పెట్టి నెయ్యి వేసి ఆవాలు, జీలకర్ర, సోంపు, కరివేపాకు, అల్లంవెల్లుల్లి ముద్ద వేయించాలి. ఇందులో పచ్చిమిర్చి తరుగు, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో తరుగు వేసి వేయించాలి. టొమాటో ముక్కలు వేగాక మిగిలిన కూరగాయ ముక్కలు, బఠాణీ వేయించి మూత పెట్టాలి. అయిదు నిమిషాలయ్యాక పసుపు, కారం, దనియాలపొడి, గరంమసాలా, చాట్‌మసాలా, అన్నం, సరిపడా ఉప్పు, కొత్తిమీర తరుగు వేసి బాగా కలిపి దింపేయాలి.


చిట్కా

ఇంట్లో పనీర్‌ తయారుచేస్తున్నారా?

ఎన్ని జాగ్రత్తలు తీసుకుని పనీర్‌ను తయారుచేసినా బయట కొన్నట్లుగా రావడంలేదని అంటూంటారు కొందరు. అలాంటివారు ఈ విధంగా చేసి చూస్తే సరి.
* పనీర్‌ చేయడానికి ఫుల్‌క్రీమ్‌ పాలు లేదా గేదె పాలు వాడాలి. అప్పుడే పనీర్‌ రుచిగా ఉంటుంది. 

* పాలల్లో నిమ్మరసం వేసి, అవి విరిగిపోయాక దింపేయాలి తప్ప స్టౌమీద ఉంచకూడదు. లేదంటే పనీర్‌ గట్టిగా వస్తుంది.

* రెండుమూడు రోజులు నిల్వ ఉంచిన పనీర్‌ మెత్తగా ఉండాలనుకున్నప్పుడు అయిదు నిమిషాలు గోరువెచ్చని నీటిలో వేయాలి.

* పనీర్‌ని ఫ్రిజ్‌లో భద్రపరుస్తున్నప్పుడు ఓ గిన్నెలో నీళ్లు తీసుకుని అందులో పనీర్‌ని ఉంచాలి. అప్పుడే ఎండిపోకుండా తాజాగా ఉంటుంది.

* ఏదయినా కూరకోసం పనీర్‌ను నూనెలో వేయించినప్పుడు కూడా కొన్నిసార్లు గట్టిగా అవుతుంది. అలాంటప్పుడు ఆ ముక్కల్ని ఉప్పు కలిపిన గోరువెచ్చని నీటిలో అయిదు నిమిషాలు ఉంచి తరువాత నీటిని పిండేసి కూరల్లో వేసుకోవచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..