పెసలతో నోరూరించేలా

ఎన్నో పోషకాలనిచ్చే పెసల్ని కేవలం పెసరట్లకే పరిమితం చేయకుండా వాటితో అప్పుడప్పుడూ ఇలాంటి వంటకాలనూ చేసుకుంటే సరి.

Updated : 11 Dec 2022 05:36 IST

పెసలతో నోరూరించేలా

ఎన్నో పోషకాలనిచ్చే పెసల్ని కేవలం పెసరట్లకే పరిమితం చేయకుండా వాటితో అప్పుడప్పుడూ ఇలాంటి వంటకాలనూ చేసుకుంటే సరి. నోరూరించే ఈ వంటకాలు పిల్లల నుంచీ పెద్దల వరకూ అందరికీ నచ్చేస్తాయి తెలుసా...


టిక్కీ

కావలసినవి: పెసర మొలకలు: రెండు కప్పులు (ముందుగా నానబెట్టుకోవాలి), ఉల్లికాడల తరుగు: అరకప్పు, ఓట్స్‌: కప్పు, అల్లం: చిన్నముక్క, పచ్చిమిర్చి: రెండు, దనియాలపొడి: అరచెంచా, గరంమసాలా: అరచెంచా, ఉప్పు: తగినంత, నూనె: కప్పు.

తయారీ విధానం: నానబెట్టుకున్న పెసల్లో గుప్పెడు విడిగా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిగిలిన పెసలు, ఓట్స్‌, అల్లం, పచ్చిమిర్చి మిక్సీలో వేసుకుని కాస్త బరకగా గ్రైండ్‌ చేసుకోవాలి. ఇందులో నూనె తప్ప మిగిలిన పదార్థాలు, పెసలు వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని చిన్నచిన్న టిక్కీల్లా చేసి పెట్టుకోవాలి. స్టౌమీద పెనంపెట్టి రెండుమూడు టిక్కీలను ఉంచి నూనె వేస్తూ రెండువైపులా ఎర్రగా కాల్చుకునితీసుకోవాలి. వీటిని వేడివేడిగా టొమాటోసాస్‌తో కలిపి తినొచ్చు.


మసాలాకూర

కావలసినవి: పెసలు: అరకప్పు, నూనె: మూడు టేబుల్‌స్పూన్లు, జీలకర్ర: అరచెంచా, ఎండుమిర్చి: ఒకటి, కరివేపాకు రెబ్బలు: మూడు, ఉల్లిపాయ: ఒకటి, అల్లంవెల్లుల్లి ముద్ద: చెంచా, పచ్చిమిర్చి: ఒకటి, టొమాటో: ఒకటి, పసుపు: అరచెంచా, కారం: చెంచా, దనియాలపొడి: ఒకటిన్నర చెంచా, గరంమసాలా: ముప్పావుచెంచా, జీలకర్రపొడి: పావుచెంచా, ఉప్పు: తగినంత, కొబ్బరిపాలు: అరకప్పు, కొత్తిమీర తరుగు: పావుకప్పు.

తయారీ విధానం: పెసల్ని నాలుగుగంటల ముందు నానబెట్టుకుని కుక్కర్‌లో రెండు కూతలు వచ్చేవరకూ ఉడికించుకుని దింపేయాలి. స్టౌమీద కడాయి పెట్టి నూనె వేసి.. జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేయించుకోవాలి. ఇందులో ఉల్లిపాయముక్కలు, పచ్చిమిర్చి తరుగు, అల్లంవెల్లుల్లి ముద్ద వేసి వేయించి తరవాత టొమాటో ముక్కలు వేయాలి. రెండు నిమిషాలయ్యాక పసుపు, కారం, దనియాలపొడి, జీలకర్రపొడి, గరంమసాలా, ఉడికించిన పెసలు, తగినంత ఉప్పు, కొబ్బరిపాలు, కొత్తిమీర తరుగు వేసి కలపాలి. కూర దగ్గరకు అవుతున్నప్పుడు దింపేయాలి.


చాట్‌

కావలసినవి: పెసర మొలకలు: కప్పు, నూనె: రెండు చెంచాలు, ఆవాలు: అరచెంచా, జీలకర్ర: అరచెంచా,కరివేపాకు రెబ్బలు: రెండు, ఉల్లిపాయముక్కలు: అరకప్పు, అల్లంవెల్లుల్లి ముద్ద: చెంచా, కారం:అరచెంచా,పసుపు:పావుచెంచా,దనియాలపొడి:అరచెంచా, టొమాటో ముక్కలు: పావుకప్పు, పెరుగు: నాలుగు టేబుల్‌ స్పూన్లు, ఉప్పు: తగినంత, కొత్తిమీర: కట్ట, చాట్‌మసాలా: అరచెంచా.

తయారీ విధానం: స్టౌమీద కడాయి పెట్టి నూనె వేసి ఆవాలు, జీలకర్ర వేయించాలి. ఇందులో కరివేపాకు, సగం ఉల్లిపాయముక్కలు, అల్లంవెల్లుల్లి ముద్ద, కారం, పసుపు, దనియాలపొడి, టొమాటోముక్కలు, పెసలు, పావుకప్పు నీళ్లు, తగినంత ఉప్పు వేసి అన్నింటినీ వేయించుకుని పెసలు కాస్త మెత్తగా అవుతున్నప్పుడు దింపేయాలి. ఈ మిశ్రమంపైన గిలకొట్టిన పెరుగు, కొత్తిమీర తరుగు, మరికొంచెం ఉప్పు,మిగిలిన ఉల్లిపాయ ముక్కలు, చాట్‌మసాలా వేసి ఓసారి కలిపి వడ్డించాలి.


చీలా

కావలసినవి: పెసలు: ముప్పావుకప్పు, బియ్యప్పిండి: మూడు టేబుల్‌స్పూన్లు, ఉల్లిపాయ: ఒకటి, క్యారెట్‌ తురుము: పావుకప్పు, క్యాప్సికం తరుగు: పావుకప్పు, పచ్చిమిర్చి తరుగు: రెండు చెంచాలు, అల్లం తరుగు: అరచెంచా, ఉప్పు: తగినంత, కొత్తిమీర తరుగు: రెండు టేబుల్‌స్పూన్లు, నూనె: అరకప్పు.

తయారీ విధానం: పెసల్ని అయిదు గంటల ముందు నానబెట్టుకుని ఆ తరువాత మెత్తగా గ్రైండ్‌ చేసుకోవాలి. ఇందులో నూనె తప్ప బియ్యప్పిండితోపాటు మిగిలిన పదార్థాలన్నింటినీ వేసుకుని కలుపుకోవాలి. ఈ పిండిని వేడిపెనంమీద చిన్న అట్టులా మందంగా వేసుకుని నూనెతో రెండువైపులా కాల్చుకుని తీసుకోవాలి.


ఇవీ లాభాలు

పెసల్ని తరచూ తీసుకోవడం వల్ల ఎలాంటి మేలు జరుగుతుందంటే...

* పెసల్లో పొటాషియం, మెగ్నీషియం, రాగి, పీచు, బి-విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. పెసల్లోని డైటరీ ఫైబర్‌ చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుందని చెబుతారు డాక్టర్లు. వీటిలో ఎక్కువ మోతాదులో ఉండే మాంసకృత్తులు శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తాయి.

* వీటిలో గ్లైసమిక్‌ ఇండెక్స్‌ స్థాయులు తక్కువ. దానివల్ల రక్తంలో చక్కెరస్థాయులు అదుపులో ఉంటాయి. మధుమేహం వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది. ఇందులోని ఇనుము... ఎర్ర రక్తకణాల వృద్ధికి తోడ్పడుతుంది. ఫలితంగా రక్తహీనత  సమస్య తలెత్తదు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..