గిన్నె చూస్తే...ఐసైపోవాల్సిందే!

పూల రంగులూ పండ్ల రుచులతో అందంగా కనువిందు చేసే చల్లచల్లని ఐసు గిన్నెల్లో ఐస్‌క్రీమ్‌ను తింటుంటే ఆ అనుభూతే వేరు అంటారు హిమప్రియులు.

Updated : 05 Feb 2023 04:20 IST

గిన్నె చూస్తే...ఐసైపోవాల్సిందే!

పూల రంగులూ పండ్ల రుచులతో అందంగా కనువిందు చేసే చల్లచల్లని ఐసు గిన్నెల్లో ఐస్‌క్రీమ్‌ను తింటుంటే ఆ అనుభూతే వేరు అంటారు హిమప్రియులు. అనడమే కాదు, అలాంటి ఐసు గిన్నెల్ని స్వయంగా తయారుచేసి మరీ ఇంటికి వచ్చిన అతిథుల్ని చల్లని ఆతిథ్యంతో సేదతీరుస్తుంటారు.

పుట్టినరోజు, పెళ్లిరోజు వేడుకలు చాలామంది జరుపుకునేవే. అయితే ఆ పార్టీల్లో అతిథులకు వడ్డించే పదార్థాలే కాదు, వాటిని వడ్డించే ప్లేట్లూ గిన్నెలూ కూడా వినూత్నంగానూ అందంగానూ ఉండాలని కొందరు మాత్రమే అనుకుంటారు. అందుకోసం తమదైన సృజనతో కొత్తకొత్తగా ఆలోచిస్తుంటారు. అలా రూపుదిద్దుకున్నవే ఈ ఐసు గిన్నెలు. పూల డిజైన్లు ఉన్న గాజు గిన్నెల్లా మెరిసే ఈ మంచు బౌల్స్‌లో ఐస్‌క్రీమ్‌నో కస్టర్డ్‌నో సార్బెట్‌నో డెజర్ట్‌నో వడ్డించి ఇంటికి వచ్చిన స్నేహితుల్నీ బంధువుల్నీ చకితుల్ని చేస్తున్నారు.

ఎలా చేస్తారు?

ముందుగా ఒకదాంట్లో ఒకటి పట్టేలా రెండు విభిన్న సైజుల్లో ఉన్న ప్లాస్టిక్‌ లేదా గాజు గిన్నెల్ని తీసుకోవాలి. ఈ రెండింటికీ మధ్య కనీసం ఒకటిన్నర సెం.మీ. ఖాళీ ఉండాలి. పెద్దగా ఉన్న గిన్నెలో అడుగున కొన్ని పూలనీ రేకల్నీ, ఆకుల్నీ పేర్చుకుని చల్లని నీళ్లు పోసి రెండో గిన్నె పెట్టాలి. తరవాత రెండు గిన్నెల మధ్యా కూడా నచ్చిన పువ్వుల్నీ పండ్ల ముక్కల్నీ అమర్చాలి. ఇప్పుడు రెండో గిన్నెమీద ఏదైనా ప్లేటుని మూతపెట్టి ఈ మొత్తాన్ని ఫ్రీజర్‌లో పెట్టి కనీసం ఆరు గంటలు ఉంచాలి. అది గడ్డకట్టాక బయటకు తీయాలి. ముందుగా మూత తీసి చిన్నగిన్నెలో కొన్ని నీళ్లు పోస్తే అది సులభంగా వచ్చేస్తుంది. ఆ తరవాత ట్యాప్‌ నీళ్ల కింద పెద్ద గిన్నెను వెనక్కి తిప్పి పెడితే ఐసు గిన్నె బయటకు వస్తుంది. రంగుల పూలతోనూ పండ్లముక్కలతోనూ ఉండే ఈ ఐసు గిన్నె చూడ్డానికి అందంగానే కాదు, అందులో చల్లని పదార్థాలను వడ్డిస్తే అవి మరికాసేపు చల్లదనం పోకుండా ఉంటాయి.

ఎందుకివి?

అందమైన ఐసు గిన్నెల్ని తయారుచేయడం నిజానికి విదేశాల్లోనే ఎక్కువ. అక్కడ పెళ్లి వేడుకలు లేదా పార్టీల్లో  టేబుల్‌ అందంగా కనిపించేందుకు పూలూ పండ్లతో చేసిన ఐస్‌క్యూబ్స్‌ను గ్లాసుల్లోనూ బౌల్స్‌లోనూ వేసి ఉంచేవారు. వాటిని కాక్‌టెయిల్స్‌, మాక్‌టెయిల్స్‌లో కలుపుకునేవారు. కొందరు మంచినీళ్లలో కూడా వేసుకుని తాగేవారు. గులాబీ రేకులు, వయొలెట్స్‌, లావెండర్‌ పూలూ; ఔషధ గుణాలున్న పుదీనా, లెమన్‌బామ్‌, రోజ్‌మేరీ, సోంపు ఆకులూ; రాస్బెర్రీ, రెడ్‌ కరెంట్‌, స్ట్రాబెర్రీ... వంటి పండ్లనీ ముక్కల్నీ వేసి చేయడంతో ఆ ఫ్లేవర్‌ దిగి నీళ్లు రుచిగానూ ఉంటాయి. ఆపై కరిగిన ఆయా ఆకుల్నీ పండ్లనీ హాయిగా చప్పరించనూవచ్చు. అలా మొదలైన ఐసు అలంకరణ ఇప్పుడు గిన్నెల్లోకీ చొరబడిందన్నమాట. చల్లని పదార్థాలను ఈ గిన్నెల్లో వడ్డిస్తే ఎక్కువసేపు చల్లగానూ త్వరగా కరిగిపోకుండానూ ఉంటాయట. పైగా ఇలా చేసుకున్న ఐస్‌బౌల్స్‌ను గాలిచొరని కంటెయినర్‌లో పెట్టి ఫ్రీజర్‌లో పెడితే కొన్ని రోజులవరకూ అలాగే ఉంటాయట. మరి మనమూ ట్రై చేద్దామా?!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..