సకుటుంబ సపరివార... కేకులివి!

పుట్టినరోజూ, పెళ్లిరోజూ, గృహప్రవేశమూ... ఇలా సంతోషాన్ని పంచుకునే సందర్భం ఏదైనా సరే, ఇంట్లోవాళ్లందరి నడుమ కేక్‌ కటింగ్‌ చేస్తుంటాం. కానీ చుట్టూ ఉండే కుటుంబసభ్యులే కేకులోనూ కనిపిస్తే... ఆ కేకు ‘మన ఇంటి పండుగ’ గుర్తు అవదా...

Published : 14 Aug 2022 00:32 IST

సకుటుంబ సపరివార... కేకులివి!

పుట్టినరోజూ, పెళ్లిరోజూ, గృహప్రవేశమూ... ఇలా సంతోషాన్ని పంచుకునే సందర్భం ఏదైనా సరే, ఇంట్లోవాళ్లందరి నడుమ కేక్‌ కటింగ్‌ చేస్తుంటాం. కానీ చుట్టూ ఉండే కుటుంబసభ్యులే కేకులోనూ కనిపిస్తే... ఆ కేకు ‘మన ఇంటి పండుగ’ గుర్తు అవదా... అందరికీ ‘హ్యాపీ ఫ్యామిలీ’గా చూపించేయదా... ఆ ఆనందాల్ని ఇవ్వడానికే ఇప్పుడు ఈ ‘ఫ్యామిలీ కేక్‌’ ట్రెండ్‌ వచ్చేసింది మరి.

అమ్మమ్మ పుట్టినరోజున శ్రీజ కేకు తెప్పించింది. దాన్ని చూడగానే అమ్మమ్మ ఎంతగానో ఆశ్చర్యపోతూ, ప్రేమతో పొంగిపోయింది. ఎందుకంటే... అందులో తన పిల్లలూ, మనవలూ- ఇలా ఇంటిల్లిపాదీ కనిపిస్తున్నారు. అవడానికి అవి బొమ్మలే అయినా ఇంట్లోవాళ్ల నమూనాలతో చేసిన కేకు కాబట్టే అంత ఆశ్చర్యమూ... అంత ఆనందమూ! వేడుకలన్నిటికీ చిరునామాగా మారిన కేకు- మనసునూ తాకేలా ఉంటే బాగుంటుంది కదా అనుకున్న కేకు మేకర్లు సరికొత్తగా ఆలోచించి కేకులోకి కుటుంబ సభ్యుల్నీ తీసుకొచ్చేశారు. ఈ ‘ఫ్యామిలీ కేక్‌’కు రూపమిచ్చి నయా ట్రెండ్‌ కేకును మార్కెట్లోకి దింపేశారు.

పెద్ద కేకుల దగ్గర్నుంచి బుల్లి కేకుల వరకూ... రియలిస్టిక్‌ కేకులు మొదలు చూడచక్కని పెయింటింగ్‌ చిత్రాల కేకుల దాకా ఎన్నో రకాలు వచ్చాయి. అంతేనా... అవసరాన్ని బట్టి పుట్టినరోజు, అన్నప్రాశన, సీమంతం, పెళ్లి... ఇలా వేడుకకు తగ్గట్టు ఎన్నో థీమ్డ్‌ కేకులూ తయారయ్యాయి. అయితే అవన్నీ కూడా ఆయా వేడుకను బట్టి ఆకారమూ, రంగూ, పరిమాణంలో తేడా చూపిస్తూ మన ముందుకొచ్చాయి. కానీ ఇప్పుడు వచ్చిన ఈ ఫ్యామిలీ కేక్‌ మాత్రం వాటన్నిటికీ భిన్నంగా, సందర్భం ఏదైతేనేం... ఇంట్లో వాళ్లందరి సంతోషానికి గుర్తుగా అందరి రూపాలతో కుటుంబ చిత్రాల కేకుగా వస్తోంది. 

నచ్చినట్టుగా...
వీటిల్లో వేడుక సందర్భమూ కుటుంబ సభ్యుల సంఖ్యలను బట్టి ఒక్కో కేకును ఒక్కోలా తీర్చిదిద్దుతున్నారు. ముందుగా కేకును తయారుచేసి దానిమీదే మనం ఇచ్చిన ఫొటోల్ని బట్టి ఆయా పోలికలతో వచ్చేలా బొమ్మల్ని చేసి అందరూ కలిసి ఒకే దగ్గర సరదాగా కూర్చున్నట్టో, పక్కపక్కనే నిలబడినట్టో కేకుపైన ఉంచుతారు.

ఆర్టిస్టు పనితీరును బట్టి వేసుకున్న డ్రెస్సుల దగ్గర్నుంచి ముఖకవళికల వరకూ అచ్చంగా ఇచ్చిన ఫొటోల్లోని వ్యక్తుల్లానే కనిపించేలా ఉంటున్నాయీ కేకులమీది బొమ్మలు. అదాటున చూసినవారికి ‘అరె ఫ్యామిలీ ఫొటో... కేకు మీదకు చేరిందే’ అని ఆశ్చర్యపోయేలా చేస్తున్నాయి. కేక్‌ కటింగ్‌ సమయంలో ఇంట్లోవాళ్లెవరైనా దూరంగా ఉన్నా... ఆ లోటును కాస్తా భర్తీచేసే ఈ సపరివార కేకు మీకూ నచ్చిందా?!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..