అన్నదాతల కోసమే ఈ ఆవిష్కరణలు

వారంతా దేశానికి వెన్నెముక అయిన రైతుల కుటుంబాల నుంచి వచ్చారు. అందుకే అన్నదాతల కోసం కొత్త ఆవిష్కరణలు చేసి పంటల దిగుబడి పెరగడానికి తోడ్పడుతున్నారు. వాళ్లెవరంటే...

Published : 13 Mar 2022 01:22 IST

అన్నదాతల కోసమే ఈ ఆవిష్కరణలు

వారంతా దేశానికి వెన్నెముక అయిన రైతుల కుటుంబాల నుంచి వచ్చారు. అందుకే అన్నదాతల కోసం కొత్త ఆవిష్కరణలు చేసి పంటల దిగుబడి పెరగడానికి తోడ్పడుతున్నారు. వాళ్లెవరంటే...


సాగుకు సోలార్‌ సాయం...

డిశాకు చెందిన మినుశ్రీ, అమృతలు స్నేహితులు. ఇద్దరూ రైతు కుటుంబాల నుంచి వచ్చినవారే. దిల్లీలో కొంత కాలం ఐటీ ఉద్యోగాలు చేసిన ఈ అమ్మాయిలు 2015లో ఓ స్టార్టప్‌ను ఏర్పాటుచేసి సోలార్‌ ప్యానెళ్లు తయారు చేస్తుండేవారు. ఆ క్రమంలోనే రైతులు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యల్ని గుర్తించి అందుకనుగుణంగా సౌర విద్యుత్తుతో నడిచే మూడు పరికరాలను ఆవిష్కరించారు. పంటలకు క్రిమిసంహారకాలను పిచికారీ చేయాలంటే వాటి వల్ల కలిగే దుష్ప్రభావాల కారణంగా కూలీలు వెనకాడుతున్నారు. అందుకే సౌర విద్యుత్తుతో నడిచే పిచికారీ యంత్రాన్ని తయారు చేశారు. ద్రావణాలనూ, యూరియావంటి వాటినీ చల్లడానికి ఈ యంత్రం ఉపయోగపడుతుంది. ఆరేడు గంటలు సోలార్‌ బ్యాటరీతో ఛార్జ్‌ చేస్తే నడిచే ఈ యంత్రంతో తక్కువ సమయంలో ఎక్కువ పని పూర్తి చేయొచ్చు. మరోటి చేపల చెరువులో నీటి పరిమితినీ, శుభ్రతనీ, ఆక్సిజన్‌ శాతాన్నీ తెలియజేసేది. చేపలూ, రొయ్యలూ చనిపోకుండా అవి చక్కగా ఎదగడానికి ఉపయోగపడే ఈ యంత్రం నీటిపై తేలియాడుతూ ఎలాంటి అంతరాయాలూ లేకుండా సౌర విద్యుత్తుతో నడుస్తుంది. మూడోది చేపలూ, రొయ్యలకు ఆహారాన్ని చల్లడానికి ఉపయోగించే యంత్రం. మనుషులతో పనిలేకుండా ఒకేసారి 20 కేజీల ఆహారాన్ని నీటిలో చల్లగలదు. అలానే ఇది నీటిలో పీహెచ్‌ స్థాయుల్ని కూడా పర్యవేక్షిస్తుంది. ఇప్పటికే వేల మంది రైతులు ఈ పరికరాలను వాడి దాదాపు 30 శాతం అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు.


పశువులకీ పోషకాహారం...

పోషకాహారం మనుషులకే కాదు పశువులకీ, కోళ్లకీ కూడా చాలా అవసరం అంటాడు లఖ్‌నవూకి చెందిన కుమార్‌ రంజన్‌. అందుకే వాటికోసం పోషకాల దాణాని ఉత్పత్తి చేయడంతోపాటు ఓ ఆప్‌ను రూపొందించాడు. 2020లో ‘ఈ ఫీడ్‌’ పేరుతో స్టార్టప్‌ను ప్రారంభించిన రంజన్‌ ఈ మధ్య షార్క్‌ ట్యాంక్‌ ఇండియా కార్యక్రమంలోనూ ప్రశంసలు పొందాడు. పశువులూ, కోళ్లూ, రొయ్యలూ, చేపల ఆరోగ్యం, వాటి దాణా గురించి రైతులు శ్రద్ధ తీసుకోవట్లేదని స్నేహితుల మాటల్లో అర్థమైంది. అందుకే ఆ దిశగా రైతులకు అవగాహన కల్పించి... సరైన దాణాను అందించాలనుకున్నాడు. అందుకోసం ఓ ఆప్‌ని రూపొందించి పశువులూ-కోళ్లూ-చేపలూ-రొయ్యల ఆరోగ్యం, పోషకాల లోపం వల్ల వాటిలో తలెత్తే సమస్యలూ, వాటికి ఇవ్వాల్సిన పోషకాల గురించీ చెబుతూ రైతులకు అర్థమయ్యేలా వీడియోలు రూపొందించాడు. వీటన్నింటి కోసం ప్రత్యేకంగా తయారు చేసిన  పోషకాల దాణానూ మార్కెట్‌లోకి తీసుకొచ్చాడు. ఉత్తర్‌ప్రదేశ్‌తోపాటు ఛత్తీస్‌గడ్‌, కర్ణాటక రాష్ట్రాల్లోని రైతులు ఈ దాణాని పొందడంతోపాటు ఆప్‌ని ఉపయోగించి ఎప్పటికప్పుడు రంజన్‌ సలహాలూ సూచనలూ తీసుకుంటున్నారు. ఇలా- లక్షమంది ఆక్వారైతులూ, 70 వేల మంది పౌల్ట్రీ రైతులూ, 50 వేల మంది పాడి రైతులకుపైనే లబ్ధి పొందారు.


సాటి రైతులకు సాయంగా...

క్షరం ముక్క రాకపోయినా రైతుల అవసరాలు తెలుసుకుని పలు యంత్రాలను తయారు చేస్తున్నాడు తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా సేసురాజపురానికి చెందిన సెల్వరాజ్‌. ఆ గ్రామంలో రెండున్నర ఎకరాల భూమిలో కాయగూరలూ, తృణధాన్యాలూ, వేరుసెనగా సాగు చేస్తుంటాడు. కూలీల కొరత కారణంగా చాలా కాలం ఇబ్బంది పడిన సెల్వరాజ్‌ చాలారోజులు శ్రమించి విత్తడానికీ, దున్నడానికీ, కలుపు తీయడానికీ పలు రకాల యంత్రాలను రూపొందించాడు. సైకిల్‌ టైర్లూ, బ్లేడ్లూ, చెక్కలూ వంటి వాటితోనే తక్కువ ఖర్చులోనే వాటిని చేశాడు. ఈ యంత్రాలను వాడటం వల్ల కూలీల కొరత ఉన్నా సమయానికి పని పూర్తి చేసుకోవచ్చు. ఖర్చు కూడా ఉండదు. సెల్వరాజ్‌ రోజంతా వ్యవసాయ పనులు చేసుకుని సాయంత్రం పూట చుట్టుపక్కల గ్రామాల్లో ఆ యంత్రాల గురించి చెప్పి రైతులకు అవగాహన కల్పిస్తుంటాడు. దాంతో రైతులు కొందరు ఆ యంత్రాలను కొనుగోలు చేస్తున్నారు. మరికొందరు అద్దెకు తీసుకెళుతున్నారు. సెల్వరాజ్‌ గురించి తెలుసుకున్న ఉద్యానవన శాఖ అధికారులు అతని యంత్రాల పనితీరును గురించి ఇతర జిల్లాల రైతులకీ వివరిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..