మాకు స్ఫూర్తి ఎవరంటే...

చాలామంది... ప్రముఖుల్ని ఆదర్శంగా తీసుకుంటారు. వాళ్లేం చెప్పినా ఆచరించేందుకు ప్రయత్నిస్తుంటారు. మరి ప్రముఖులకు ఎవరు స్ఫూర్తినిస్తారో... వాళ్లు ఎవరి మాటల్ని ఆదర్శంగా తీసుకుంటారో తెలుసుకోవాలని ఉందా...

Updated : 07 Aug 2022 06:28 IST

మాకు స్ఫూర్తి ఎవరంటే...

చాలామంది... ప్రముఖుల్ని ఆదర్శంగా తీసుకుంటారు. వాళ్లేం చెప్పినా ఆచరించేందుకు ప్రయత్నిస్తుంటారు. మరి ప్రముఖులకు ఎవరు స్ఫూర్తినిస్తారో... వాళ్లు ఎవరి మాటల్ని ఆదర్శంగా తీసుకుంటారో తెలుసుకోవాలని ఉందా...

స్వామి వివేకానంద ప్రభావం ఎక్కువ
- నరేంద్ర మోదీ

నా మాటల్లో, ఆలోచనా విధానంలో వివేకానందుడి ప్రభావం ఎంతోకొంత కనిపిస్తూనే ఉంటుంది. నేను ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నా. అక్కడ లైబ్రరీలో రకరకాల పుస్తకాలు ఉంటే... వాటిని ఆసక్తిగా తిరగేసేవాడిని. ఆ పుస్తకాల్లో స్వామి వివేకానంద స్ఫూర్తివాక్యాలు కనిపించేవి. వాటిని చదువుతున్నప్పుడు వివేకానందుడి గురించి ఇంకాస్త ఎక్కువగా తెలుసుకోవాలనిపించింది. అందుకే ఆ పుస్తకాలనూ ఎక్కువగా చదవడం మొదలుపెట్టా. దానివల్ల నాకు హిందీభాషపైనా పట్టు వచ్చింది. అలా ఎదిగేకొద్దీ... వివేకానందుడి మాటల్నీ ఆచరణలో పెట్టేందుకు ప్రయత్నించా.


చుట్టూ ఉన్నవాళ్లే ఆదర్శం
- ఆనంద్‌ మహీంద్రా

వ్యాపారంలోకి కొత్తగా వచ్చినవాళ్లూ కష్టపడి పని చేస్తున్నవాళ్లూ వైకల్యమున్నా ఏదో సాధించాలని తపనపడేవాళ్లూ మలిదశలోనూ తమ జీవితానికి ఓ అర్థం చెప్పే వృద్ధులూ, క్రీడాకారులూ... ఇలా నాకు ఎదురయ్యే ప్రతిఒక్కరినీ స్ఫూర్తిగా తీసుకుంటా. వాళ్లకు సంబంధించిన వీడియోలను చూసినప్పుడు... చాలా ఆనందంగా, కొన్నిసార్లు గర్వంగానూ అనిపిస్తుంది. అలాంటివాళ్ల గురించి అందరూ తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఎప్పటికప్పుడు ట్విటర్‌లో వాటిని పోస్ట్‌ చేస్తుంటా. వాళ్ల కష్టం, ఆలోచనా విధానం, సృజనాత్మకత... వంటివన్నీ నాకెంతో నచ్చుతాయి. అలాంటి వాళ్ల నుంచి నాకు తెలియని విషయాలను నేర్చుకునేందుకు నేనెప్పుడూ వెనుకాడను.


బిల్‌గేట్స్‌ నా గురువు
- మార్క్‌ జుకర్‌బర్గ్‌

ఓ వైపు చదువుకుంటూ మరోవైపు ఏదో ఒకటి చేయాలనుకున్నప్పుడు నాకు బిల్‌గేట్స్‌ ఓ హీరోలా అనిపించాడు. అందుకే బిల్‌గేట్స్‌ మాటలూ, టెక్నాలజీలో చేసిన ప్రయోగాలూ నన్నెంతగానో ఆకట్టుకున్నాయి. తాను ఎంచుకున్న రంగంలో సాధించిన విజయాలు నాకు కెరీర్‌పరంగా ఎంతో స్ఫూర్తినిస్తే... గేట్స్‌లోని సేవాగుణం నా ఆలోచనా విధానాన్ని మార్చింది. తన ఆదాయంలో ఎక్కువశాతాన్ని సామాజిక కార్యక్రమాల కోసం కేటాయించడం చూసిన నేనూ... ఓ స్థాయికి వచ్చాక నా వంతుగా సేవాభావాన్ని చాటుకున్నా. వ్యక్తిగతంగానే కాదు, కెరీర్‌పరంగానూ ఈ స్థాయికి చేరుకోవడం వెనుక బిల్‌గేట్స్‌ అందించిన స్ఫూర్తి ఎంతో ఉంది.


మహాత్ముడి మాటలే గుర్తొస్తాయి
- సత్యానాదెళ్ల

‘ప్రతిరోజూ అదే మన చివరి రోజు అన్నట్లుగా జీవించాలి. అదే విధంగా శాశ్వతంగా జీవిస్తామనే భావనతో ప్రతి విషయాన్నీ శ్రద్ధగా నేర్చుకోవాల’నే మహాత్ముడి మాటలే నాకు స్ఫూర్తి. అందుకే ఓ సంస్థకు ఛైర్మన్‌ అయిపోగానే నేను ఉన్నత శిఖరాలకు చేరినట్లుగా భావించలేదు. ఇప్పటికీ నిత్యవిద్యార్థిగానే ఉండేందుకు ప్రయత్నిస్తుంటా. ఎప్పుడూ ఏదో ఒక కొత్త విషయాన్ని తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తూనే ఉంటా. అదేవిధంగా విధుల్లోనూ ప్రతిరోజూ అదే నా చివరి రోజు అన్నట్లుగా వందశాతం కష్టపడాలనుకుంటా. ఇవన్నీ చేయకపోతే... నేనీరోజు ఈ స్థాయికి చేరేవాణ్ని కాదు మరి.


స్టీవ్‌జాబ్స్‌ ఎదిగిన తీరే నాకు స్ఫూర్తి
- రాజేష్‌ గోపీనాథన్‌

వినియోగదారులు తమకేం కావాలో చెప్పరు. మనమే తెలుసుకుని అందివ్వాలని చెబుతారు ఆపిల్‌ సంస్థ సహ వ్యవస్థాపకుడు స్టీవ్‌జాబ్స్‌. ఆ మాటలూ, స్టీవ్‌జాబ్స్‌ ఎదిగిన వైనమే నాకు స్ఫూర్తి. అందుకే ఓ పని లేదా ప్రాజెక్టును తీసుకున్నాక... దాన్ని ఎలాగైనా పూర్తిచేయాలనే తపనతో కష్టపడతా. పుస్తకాల నుంచి కూడా స్ఫూర్తిపొందే నేను వాటిల్లో తెలుసుకున్న విషయాలను కూడా ఆచరణలో పెట్టాలనుకుంటా. మా సంస్థను విజయాల బాటలో నడిపించేందుకు కష్టపడటం, వినియోగదారుల్ని ఆకట్టుకునేందుకు ప్రయోగాలు చేయడం.. వంటివే నాకూ, మా టీసీఎస్‌కూ విజయాలను తెచ్చిపెట్టాయనుకుంటా.


 

అన్నయ్యకు ప్రేమతో... చాక్లెట్‌ రాఖీ!

అన్నయ్యని ఆటపట్టించే చిట్టి చెల్లి... తమ్ముడిని గారం చేసే అక్క... తీయని ఆ ఆత్మీయ బంధానికి గుర్తుగా రాఖీపౌర్ణమి రోజు రక్షాబంధనం కట్టేస్తారు. ప్రేమతో మిఠాయిలూ తినిపిస్తుంటారు. కానీ ఈసారి రాఖీలోనే ఆ తీపి అంతటినీ కుమ్మరిస్తే... తోబుట్టువుల మీదున్న ప్రేమను తియ్యదనాల రాఖీతో చూపిస్తే... ఇక చిన్నారి అన్నాచెల్లెళ్ల ఆనందాన్ని ఆపగలమా! ఆ సంతోషాన్ని ఇవ్వడానికే వచ్చేశాయి ఈ ‘ఎడిబుల్‌ రాఖీలు’!

రాఖీపండుగ వస్తుందంటే చాలు... ఇంటా బయటా ఆ సందడి కాస్త ముందు నుంచే కనిపించేస్తుంటుంది. అన్నాచెల్లెళ్ల వేడుక కోసం మార్కెట్లో ఎన్నెన్నో రాఖీలూ, మిఠాయిలూ, బహుమతులూ కొత్తకొత్తగా వస్తుంటే... ఇంట్లోనేమో ‘ఈ ఏడు అన్నయ్యకి ఎలాంటి రాఖీ కొనాలి...’ అంటూ ఒకవైపు చెల్లీ... ఈసారి ‘చెల్లి కోసం ఏం తీసుకోవాలి...’ అంటూ మరోవైపు అన్నయ్యా... పండుగ రోజుకన్నా ముందే ఆలోచనలో పడిపోతారు. అమ్మా నాన్నల సలహాతో ఆ రాఖీ సరంజామా కొనేస్తుంటారు. అయితే ఈ ఏడాది ఆ పండుగ సామగ్రిలో ప్రత్యేకంగా మిఠాయిలు కొనకపోయినా, అమ్మ ఏ స్వీట్లూ చేయకపోయినా... తియ్యని వేడుక చేసుకోవచ్చు. అన్నాతమ్ముళ్ల నోరు తీపి చేయొచ్చు. ఎందుకంటే ‘ఎడిబుల్‌ రాఖీ’ పేరుతో రాఖీల్లా మారిన మిఠాయిలే మార్కెట్లో దొరుకుతున్నాయి మరి.

ఎన్ని రకాలో...
అది పుట్టినరోజు వేడుకకు కట్‌ చేసే కేక్‌ అయినా, పండుగలకు కొనే డ్రెస్‌ అయినా ఏటికేడూ సరికొత్తగా ఉండాలనుకుంటారు చాలామంది చిన్నారులు. అందుకే మరి అన్నిట్లో వచ్చే ఆ కొత్తదనం తోబుట్టువుల ప్రేమకు గుర్తుగా కట్టే రక్షాబంధనాల్లోనూ చూపాలిగా అనుకుంటూ... తయారీదారులు మార్కెట్లో పిల్లలకు నచ్చే రాఖీల్ని తీసుకొస్తుంటారు. వాటిల్లో సుతిమెత్తని బుజ్జాయిల రాఖీల దగ్గర్నుంచి బ్యాండ్లూ, కార్టూన్‌ పాత్రల బొమ్మల వరకూ ఎన్నెన్నో రాఖీలు. ఇప్పుడు ఇంకాస్త వెరైటీని జత చేస్తూ ఈ ఎడిబుల్‌ రాఖీల్ని అందుబాటులోకి తెస్తున్నారు. ఇందులోనే చాక్లెట్‌ రాఖీలూ, మిఠాయి రాఖీలూ, కుకీ రాఖీలూ అంటూ చాలానే ఉన్నాయి. చూడ్డానికి ఏదో చాక్లెటో, బిస్కెటో, స్వీటో అనిపించకుండా చక్కని డిజైన్‌తోనో, ముచ్చటైన డెకరేషన్‌తోనో ఉంటాయి ఇవన్నీ. మామూలు రాఖీల్లా చేయికి అతికి ఉండేలా- వీటికీ రాఖీని బట్టి థ్రెడ్‌ అమర్చుతారు. కావాలంటే మనకు నచ్చిన డిజైన్లతోనూ, బొమ్మలతోనూ కస్టమైజ్డ్‌ ఎడిబుల్‌ రాఖీల్నీ తయారుచేయించుకోవచ్చు. లేదంటే కాస్త ఓపికతో అమ్మను అడిగి ఇంట్లోనే ఇలాంటి సరికొత్త రాఖీలకు రూపం ఇవ్వొచ్చు కూడా. మరెందుకు ఆలస్యం... ఎప్పుడూ కట్టే రాఖీల స్థానంలో అన్నయ్య చేతిపైన ఈ కమ్మని మిఠాయి రాఖీని ఉంచారంటే... ‘అరె రాఖీ మిఠాయీ... భలే ఉంది’ అంటూ కళ్లు ఇంత చేసుకుని చూడ్డమే కాదు... చిట్టిచెల్లి తీపి ప్రేమకు బదులుగా ఓ చక్కని కానుకనూ అందిస్తాడు.


కార్ల గురించి తెలుసుకోవాలా... చలో ఇన్‌స్టా!

‘బుగాటి కొత్త మోడల్‌ వచ్చిందట’, ‘రోల్స్‌రాయ్స్‌ ఓ కారును డిజైన్‌ చేసింది. దాని ప్రత్యేకత ఏంటో తెలుసా.. ఆరు టైర్లు’, ‘ఈ మధ్య టైర్లు ఎన్ని హంగులతో వస్తున్నాయో...’ ఇలా కార్లూ, వాటి మోడళ్ల గురించి ఫ్రెండ్స్‌ ఎవరైనా చెబుతుంటే.. అబ్బా వీళ్లకెన్ని విషయాలు తెలుసో... అంటూ పొగిడేస్తాం కదూ...  మీకూ ఆ ఆసక్తి ఉంటే...  ఈ ఇన్‌స్టా అకౌంట్లను ఫాలో అయితే సరి. ఎందుకంటే... విలాసవంతమైన కార్ల తయారీ సంస్థలే కాదు, కొందరు ఔత్సాహికులూ ఆ వివరాలను ఇన్‌స్టా అకౌంట్ల ద్వారా ఎప్పటికప్పుడు చెప్పేస్తున్నారు మరి.

కొందరికి కార్లంటే ఎంత ఇష్టం ఉంటుందంటే.. ఎక్కడెక్కడ ఎలాంటివి తయారవుతున్నాయీ.. కార్ల మోడళ్లూ... ప్రత్యేకతలూ... ఎవరెవరి దగ్గర ఎలాంటి రకాలున్నాయీ ... ధరా... ఇలా ప్రతిదీ తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఆ ఆసక్తిని ఇంకాస్త పెంచేస్తాయి ఈ ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్లు. వీటిల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఖరీదైన కార్లకు సంబంధించిన వివరాలన్నీ గంటల తేడాలో చకచకా అప్‌డేట్‌ అవుతూనే ఉంటాయి. అందుకే కోట్ల మంది కార్ల ప్రేమికులు ఈ అకౌంట్లను ఫాలో అయిపోతున్నారు. వీటిల్లో కొన్నింటిని కార్ల సంస్థలే మొదలుపెడితే మరికొన్నింటిని మ్యాగజైన్లూ, కార్ల ప్రేమికులూ ప్రారంభించి ప్రపంచవ్యాప్తంగా కార్ల తయారీలో వస్తున్న మార్పుల్ని ఎప్పటికప్పుడు చెప్పేస్తున్నారు. ముందుగా సంస్థల గురించి చెప్పాలంటే... ఆడి, లాండ్‌రోవర్‌, మర్సిడేజ్‌-బెంజ్‌, పోర్షె, బీఎండబ్ల్యూ, ఫరారి, బుగాటి... వంటివెన్నింటికో ఇన్‌స్టా అకౌంట్లు ఉన్నాయి. ఈ సంస్థలన్నీ కార్ల తయారీలో తాము చేస్తున్న ప్రయోగాలకు సంబంధించిన వివరాలూ, పాల్గొనబోతున్న ప్రదర్శనలూ, విడుదల చేయబోతున్న ఎలక్ట్రిక్‌ మోడళ్ల సమాచారం మొదలు ఎన్నో విషయాలను ఈ అకౌంట్ల ద్వారా చెప్పేస్తాయి. కొన్నయితే... తమ కార్ల ప్రకటనల్ని కూడా ఈ ఇన్‌స్టా అకౌంట్ల ద్వారానే చేసేస్తున్నాయి. ఉదాహరణకు... బీఎండబ్ల్యూ సంస్థ త్వరలో ఐ7 సిరీస్‌ను విడుదల చేయబోతోందట. అదేవిధంగా లాండ్‌రోవర్‌, బెంజ్‌ లాంటివయితే... తమ కార్లకు సంబంధించిన వీడియోలూ, ఫొటోలనూ వాటి వేగం, ఇతర ప్రత్యేకతలతో సహా తెలియజేస్తున్నాయి. అందుకేనేమో వీటికి ఫాలోవర్లు కూడా కోట్లల్లో ఉంటున్నారు. మర్సిడేజ్‌-బెంజ్‌కు మూడుకోట్ల యాభైఆరు లక్షలమంది ఫాలోవర్లు ఉంటే... బీఎండబ్ల్యూను మూడుకోట్ల ముప్ఫైఆరు లక్షలమందీ, పోర్షె కారు అకౌంటును రెండుకోట్ల అరవైఆరు లక్షలమంది ఫాలో అవుతున్నారు. బుగాటి, ఫరారి, రోల్స్‌రాయ్స్‌ సంస్థల అకౌంట్లను కూడా దాదాపు కోటిమంది చూస్తున్నారు.

ఇవి కాకుండా...
కార్ల సంస్థలతో సమానంగా... కొన్ని ప్రయివేటు అకౌంట్లు కూడా వాటి వివరాలను అందించడంలో ముందుంటున్నాయి. అలాంటివాటిల్లో మొదట చెప్పుకోవాల్సింది మోటార్‌ట్రెండ్‌ గురించి... 2.2 మిలియన్ల ఫాలోవర్లు ఉన్న ఈ అకౌంటు ఏ కారు మార్కెట్లోకి ఎప్పుడొస్తుంది, ధర, ఏ సంస్థలు తమ కార్లను ఎలక్ట్రికల్‌ వాహనాలుగా మార్చబోతున్నాయి...  వంటి వివరాలను ఎప్పటికప్పుడు పోస్ట్‌ చేస్తుంది. ఆ అకౌంటు ప్రకారం వచ్చే సంవత్సరానికల్లా హోండా సివిక్‌ టైప్‌-ఆర్‌ అనే కొత్త మోడల్‌ మార్కెట్లోకి వస్తోందట. సూపర్‌కార్‌, టాప్‌గేర్‌ వంటివీ ఆ కోవలోకే వస్తాయి. ఉదాహరణకు... రోల్స్‌రాయ్స్‌ ఫాంటమ్‌ అనే కారుకు ఆరు టైర్లు ఉన్న సంగతి సూపర్‌కార్‌ బ్లాండీ అనే ఇన్‌స్టా అకౌంటులో కనిపిస్తుంది. ఈ అకౌంటుకు కోటిమందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు మరి. అదే పర్‌ఫెక్షన్‌ వీల్స్‌ అయితే... కార్ల టైర్ల తయారీలో వస్తున్న కొత్త డిజైన్ల గురించి తెలియజేస్తుంది. వీటికి కాస్త భిన్నం ఎఫ్‌1. ఫార్ములా1 రేసింగ్‌ సంస్థ ప్రారంభించిన ఈ అకౌంటులో వివిధ ప్రాంతాల్లో జరిగిన, జరిగే కార్ల రేసింగ్‌కు సంబంధించిన వీడియోలూ, ప్రముఖ రేసర్ల వివరాలూ... ఇలా ఎన్నో ఉంటాయి. అదండీ సంగతి... ఈసారి మార్కెట్లోకి రాబోతున్న ఏదయినా కొత్త కారు గురించి తెలుసుకోవాలనుకుంటే వీటిల్లో ఏదో ఒక అకౌంటును క్లిక్‌ చేసేయండి మరి.


ఇనుప పాత్రలు... మళ్లీ వచ్చేశాయ్‌!

దోశ వేయాలి... నాన్‌స్టిక్‌ పాన్‌ తీయాల్సిందే. దొండకాయ వేయించాలి. నాన్‌స్టిక్‌ పాత్ర స్టవ్‌ మీద పెట్టాల్సిందే. ఆమ్లెట్‌ వేయాలన్నా సాంబారులోకి పోపు చేయాలన్నా అన్నీ నాన్‌స్టిక్‌ మయమే. అయితే అవన్నీ వంటింటి నుంచి మెల్లమెల్లగా మాయమవనున్నాయా... వాటి స్థానంలో మళ్లీ అమ్మమ్మలనాటి ఇనుప పెనాలూ పాత్రలూ రానున్నాయా... అంటే అవుననే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకీ మార్పు అంటే..!
ఒకప్పుడు బామ్మ అట్లు పోయాలంటే ఇనుప పెనంమీదే వేసేది. కూర వేయించాలంటే ఇనుప బాండీలోనే వండేది. మెల్లగా అవన్నీ అటకెక్కాయి. వాటి స్థానంలో కాపర్‌ బాటమ్‌ స్టీల్‌ అనీ నాన్‌స్టిక్‌ అనీ ఆపై గ్రానైట్‌, సెరామిక్‌ కోటెడ్‌ అనీ... ఇలా చాలానే వచ్చాయి. ఇప్పుడు మళ్లీ వాటి స్థానంలో కిచెన్‌లోకి కాస్ట్‌ ఐరన్‌ కుక్‌వేర్‌ కాస్త నునుపుదేలి మరీ అడుగుపెడుతోంది. వేల సంవత్సరాల క్రితం మనిషి తవ్వి తీసిన ఖనిజమే ఇనుము. పనిముట్లకీ ఆయుధాల తయారీకి అన్నింటికీ అదే ఆధారం. ఆ తరవాత దాంతో వంటపాత్రల్నీ తయారుచేశాడు. ఆపై నాగరికత నేర్చిన మనిషి దానికి కార్బన్‌, మాంగనీస్‌, సిలికాన్‌, ఫాస్ఫరస్‌, సల్ఫర్‌, ఆక్సిజన్‌... వంటి ఇతర పదార్థాల్నీ జోడించి పుట్టించిన గట్టి పదార్థమే స్టీలు. నిర్మాణ రంగంలోనూ పాత్రల తయారీలోనూ దీనికి తిరుగన్నది లేకుండా పీఠమేసుకుని కూర్చుంది. నిజానికి స్టీలు పాత్రలు అన్ని విధాలా మంచివే. కానీ నేరుగా స్టవ్‌మీద పెట్టినప్పుడు మాడిపోతుంటాయి. అందుకే నాన్‌స్టిక్‌ కోటెడ్‌ పుట్టుకొచ్చాయి. అయితే వీటికి పూసే టెఫ్లాన్‌ కోట్‌ రసాయనపూరితం కావడంతో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. అందుకే అంతా మళ్లీ వెనక్కి చూస్తున్నారు.

ఎందుకు మంచిదంటే...
ఏమి తింటున్నాం అన్న దాంతోపాటు ఎందులో వండుతున్నాం అన్నదీ ముఖ్యమే. ఇనుప పాత్రల్లో వండటం వల్ల ఆయా వంటకాలు రుచిగానూ ఉంటాయి. పైగా అవి బాణలికి అంటుకున్నా భయపడక్కర్లేదు. కొద్దిపాళ్లలో ఇనుము రేణువులు కరిగి ఆహారంతోపాటు లోపలకు వెళ్తే, రక్తహీనత సమస్య ఉండదు. అందుకే వైద్యులూ ఇనుప పాత్రల్లోనే వండుకోమని సూచిస్తున్నారు. పైగా ఇనుప పెనాలు వాడేకొద్దీ నునుపుదేలి నాన్‌స్టిక్‌లా పనిచేస్తాయి. కాబట్టి స్టెయిన్‌లెస్‌ స్టీలు, అల్యూమినియంతో చేసిన వాటితో పోల్చితే ఇనుప బాండీల్లోనే నూనె తక్కువ పడుతుంది. పైగా వీటిల్లో వండినవి ఎక్కువసేపు వేడిగా ఉంటాయి.
అయితే ఇనుప పాత్రల్లో ముడి ఇనుముతో చేసినవీ, కాస్ట్‌ ఐరన్‌తో చేసినవీ అని రెండు రకాలు. అంటే- ముడి ఇనుముని నేరుగా వేడిచేసి పనిముట్ల సాయంతోనే పాత్రలు చేస్తారు. కాబట్టి ఇవి వాడేకొద్దీ నునుపుదేలతాయి. అదే కాస్ట్‌ ఐరన్‌ పాత్రలకోసం ఇనుమును కరిగించి, అందులో రెండు నుంచి ఐదు శాతం కార్బన్‌, కొద్దిపాళ్లలో సిలికాన్‌, మాంగనీస్‌, సల్ఫర్‌, ఫాస్ఫరస్‌... వంటి వాటినీ కలిపి, నమూనాల్లో పోసి చల్లార్చడం ద్వారా పాత్రలు తయారుచేస్తారు.

అందుకే ముడి ఇనుప పాత్రలకన్నా కాస్ట్‌ ఐరన్‌వి దృఢంగానూ నున్నగానూ ఉంటాయి. అయితే ఇవి వేడెక్కడానికి కాస్త ఎక్కువ సమయం పడుతుంది, అదేసమయంలో త్వరగా చల్లారకుండానూ ఉంటుంది. అదే అచ్చంగా ఐరన్‌తో చేసినవి కాస్త పలుచగా ఉండటంతో త్వరగా వేడెక్కి, అంతే త్వరగా వేడి తగ్గిపోతాయి. కానీ కాస్ట్‌ ఐరన్‌తో పోలిస్తే ముడి ఇనప పాత్రల్లో వండిన వాటిల్లోనే ఐరన్‌ కలిసే అవకాశం ఎక్కువ. అయితే ఇనుప పాత్రలకు తుప్పు ముప్పు ఎక్కువ. కాబట్టి ఆధునిక కిచెన్‌కి కాస్ట్‌ ఐరన్‌తో చేసినవైతే చూడ్డానికీ బాగుంటాయి. మొత్తమ్మీద ఈ రెండు రకాల ఇనుప పాత్రలూ నాన్‌స్టిక్‌తో పోల్చితే ఆరోగ్యానికి మంచివే. వీటిల్లో వండినవి తినేవాళ్లలో ఐరన్‌ లోపం తగ్గుతున్నట్లు కొన్ని అధ్యయనాల్లోనూ తేలినట్లు అమెరికన్‌ డయాబెటిక్‌ అసోసియేషన్‌ సైతం పేర్కొంది. అయితే ఉడికించే సమయం, వండే పదార్థాన్ని బట్టి ఐరన్‌ కలిసే శాతం ఆధారపడి ఉంటుందట.
ఉదాహరణకు కూరగాయలతో పోలిస్తే- మాంసాహారాన్ని వండినప్పుడు ఐరన్‌ శోషణ ఎక్కువ. అందుకే ఇప్పుడు మనదగ్గరనే కాదు, విదేశాల్లోనూ అనేక కంపెనీలు ఐరన్‌, కాస్ట్‌ ఐరన్‌ కుక్‌వేర్‌ పేరుతో పెనాలూ మూకుళ్లూ ఉడికించుకునే పాత్రలూ గ్రిల్‌ పాన్‌లూ పొంగనాల ప్లేటూ... ఇలా రకరకాల వంటపాత్రల్ని తయారుచేస్తూ ఆన్‌లైన్‌లోనూ విక్రయిస్తున్నాయి. సో, ట్రై చేసి చూడండి!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..