శివలింగంలోనే... హరిహరుల దర్శనం

పూరీ జగన్నాథ ఆలయాన్ని పోలిన నిర్మాణం... సుమారు పది కిలోమీటర్ల వరకూ కనిపించే గోపురం... వందకు పైగా ఉపాలయాలనుఒకేచోట చూడగలగడం... శివలింగాన్ని హరిహరులుగా పూజించడం... ఈ ప్రత్యేకతలన్నీ భువనేశ్వర్‌లోని లింగరాజ ఆలయంలో కనిపిస్తాయి.  ఈ ఆలయంలో స్వామి స్వయంభువుగా కొలువుదీరడం విశేషం.

Updated : 04 Feb 2024 17:09 IST

పూరీ జగన్నాథ ఆలయాన్ని పోలిన నిర్మాణం... సుమారు పది కిలోమీటర్ల వరకూ కనిపించే గోపురం... వందకు పైగా ఉపాలయాలనుఒకేచోట చూడగలగడం... శివలింగాన్ని హరిహరులుగా పూజించడం... ఈ ప్రత్యేకతలన్నీ భువనేశ్వర్‌లోని లింగరాజ ఆలయంలో కనిపిస్తాయి.  ఈ ఆలయంలో స్వామి స్వయంభువుగా కొలువుదీరడం విశేషం.

శివాలయాల్లో విష్ణుమూర్తి విగ్రహాలు అరుదుగా ఉంటాయి. అలాగే వైష్ణవాలయాల్లో శివలింగాలూ తక్కువగానే కనిపిస్తాయి. కానీ ఈ లింగరాజ ఆలయంలో మాత్రం... శివలింగాన్ని హరిహరుల స్వరూపంగా పూజిస్తారు. అందుకే స్వామిని బిల్వదళాలతోపాటూ తులసి ఆకులతోనూ అర్చిస్తారు. శివ-విష్ణుమూర్తి అర్చనలూ జరుగుతాయి. కళింగ రాజుల కళానైపుణ్యాన్ని ప్రతిబింబించేలా నిర్మించిన
ఈ ఆలయంలోని ప్రధాన గోపురం సుమారు పది కిలోమీటర్ల దూరం వరకూ కనిపిస్తుంది. సోమవంశ రాజైన యయాతి కేసరి ఈ ఆలయాన్ని పదకొండో శతాబ్దంలో నిర్మిస్తే.. ఆ తరువాత
గంగరాజులు అభివృద్ధి చేశారట.  

స్థలపురాణం

ఓసారి పరమేశ్వరుడు తనకు కాశీతోపాటూ భువనేశ్వర్‌ ప్రాంతమూ ఇష్టమని పార్వతీదేవితో చెప్పాడట. దాంతో పార్వతీదేవి పశువులను కాచే గొల్లభామగా మారిఇక్కడకు వచ్చిందట. ఆ సమయంలో కృతి, వాస అనే ఇద్దరు అసురులు అమ్మవారిని చూసి తమని వివాహమాడమంటూ వేధించడంతో పార్వతీదేవి ఆ రాక్షసుల్ని సంహరించిందట. అప్పుడు పార్వతీదేవికి కలిగిన దాహాన్ని తీర్చేందుకూ, ఆగ్రహాన్ని అదుపు చేసేందుకూ పరమేశ్వరుడు ఇక్కడకు వచ్చి బిందుసాగర్‌ అనే సరస్సును సృష్టించి ఆ తరువాత ఈ ప్రాంతంలోని మామిడిచెట్టుకింద స్వయంభువుగా కొలువుదీరాడని కథనం.

  

దీపారాధన చేశాకే దర్శనం...

స్వామిని త్రిభువనేశ్వరుడిగానూ పిలిచే ఈ ఆలయంలో విమాన, జగమోహన, భోగమండప, నటమందిరాలు ప్రధాన ఆకర్షణగా నిలిస్తే... వాటి చుట్టూ వందకు పైగా ఉపాలయాలు కనిపిస్తూ భక్తుల్ని
ఆకట్టుకుంటాయి. ఆలయానికి వచ్చే భక్తులు ముందుగా దీపారాధన చేసి ముఖ్యమందిరాల్లోకి ప్రవేశ అర్హతను పొందాకే హరిహరుడి రూపమైన పరమేశ్వరుడిని పూజిస్తారు. ఆ తరువాత ఈ ఆలయం చుట్టూ ఉండే పార్వతీదేవి, కార్తికేయ, గణేశుడు, గోపాలుడు, సూర్యుడు, బలరాముడు, సహదేవుడు, కృష్ణుడు, శివలింగాలు ... ఇలా అన్నీ కలిపి మొత్తంగా వందకు పైగా ఉపాలయాలను దర్శించుకోవచ్చు. ఇక్కడ నందీశ్వరుడికీ ప్రత్యేక ఆలయం ఉంది.  

పితృతర్పణాలూ వదలొచ్చు

పితృతర్పణాలు కాశీలో వదలడం మామూలే. అక్కడికి వెళ్లలేనివాళ్లు ఇక్కడ పితృతర్పణాలు వదలొచ్చనీ అలా చేయడం వల్ల కాశీలో పితృతర్పణాలు విడిచిన ఫలితం కలుగుతుందనీ చెబుతారు. ఇక్కడి బిందుసాగర సరస్సులోని నీటికి అనారోగ్యాలను నయం చేసే శక్తి ఉందట. స్వామిని  రోజూ ఈ నీటితోనే అభిషేకిస్తారు. ఇక, హరిహరులకు నిత్యం చేసే పూజలతోపాటూ  స్వామికి రోజూ ఎనిమిదిసార్లు వరి అన్నం, ఇతర పదార్థాలను నివేదిస్తారు. వాటిని కూడా ఎప్పటికప్పుడు కొత్త కుండల్లోనే తయారుచేస్తారు. అయితే ఆ వంటకాలపైన సూర్యుడి కిరణాలు పడకుండా ఉండేందుకు ముందుగా సూర్యుడికి నివేదించడాన్ని ఓ సంప్రదాయంగా పాటిస్తారు. ఆ తరువాత సూర్యకిరణాలు వంటకాలపైన పడకుండా చాలా జాగ్రత్తగా గర్భగుడిలోకి తీసుకెళ్లి స్వామికి అర్పిస్తారు. అంతేకాదు... రోజులో ఒక సమయంలో స్వామికి నివేదించిన ప్రసాదాన్నే పార్వతీదేవికీ అర్పించడాన్ని ఇక్కడ చూడొచ్చు. వీటన్నింటితోపాటూ ఒడిశా సంవత్సరాదినాడు భంగ్‌గా పిలిచే ఒకరకమైన గంజాయితో చేసిన పానీయంతో స్వామిని అభిషేకిస్తారు. ఇక, శివరాత్రి సమయంలో ఆలయ శిఖరంపైన వెలిగించే మహాదీపాన్ని చూసేందుకు రెండు కళ్లూ సరిపోవు. ఆ రోజున వేల సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని ఆ మహాదీపాన్ని దర్శించుకున్నాకే ఉపవాస దీక్షను విరమిస్తారు. అలాగే ఏడాదికోసారి నిర్వహించే చందన యాత్రనూ, విశ్వశాంతీ యజ్ఞాన్నీ చూసి తరించాల్సిందే. ఈ ఆలయంలో నిర్వహించే పూజలకూ, వండే ప్రసాదాలకూ, అలంకరణలకూ, పండుగల సమయంలో చేసే వేడుకలకూ... ఇలా అన్నింటికీ విడివిడిగా సేవకులు ఉంటారట. అన్నింటికీ మించి... పూరీ తరహాలో ఇక్కడా ఇతర మతస్థుల్ని అనుమతించరు. అన్యమతస్థులు ఎవరైనా ఆలయాన్ని చూడాలనుకుంటే ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదిక దగ్గర నిల్చుని ఆలయాన్ని చూడొచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..