Updated : 12 Aug 2022 16:04 IST

సిల్లీపాయింట్‌

వెనిగర్‌లో నాలుగు నుంచి పది శాతం వరకూ ఎసిటిక్‌ యాసిడ్‌ ఉండటంవల్ల ఇందులో ముత్యాలు వేస్తే కరిగిపోతాయి.

* ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌(ఎఫ్‌బీఐ) అమెరికాలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద దర్యాప్తు సంస్థ. అమెరికాలో పెంపుడు కుక్కలూ, పిల్లులపైన జరిగిన నేరాలనీ మనుషుల హత్యలంత సీరియస్‌గానే దర్యాప్తు చేస్తుందట ఇది!
* ప్రపంచవ్యాప్తంగా రైల్వే వ్యవస్థలేని దేశాలు 27. కువైట్‌, ఒమన్‌, తూర్పు తైమూర్‌, లిబియా, భూటాన్‌ వంటివి ఈ జాబితాలో ఉన్నాయి.
* దక్షిణాఫ్రికాలో మనుషులకే కాదు, జంతువులకూ అన్ని రోడ్లమీదా తిరిగే హక్కు ఉంది. ఒకవేళ దారిలో పశువులు అడ్డుపడితే...వాటికి దారిచ్చాకే వెళ్లాలి. లేదంటే శిక్ష తప్పదు.  
* నేపాల్‌ ఎప్పుడూ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకోలేదు. దీనికి కారణం ఎప్పుడూ అది విదేశీ ఆక్రమణలో లేదు. 2008 వరకూ రాచరిక పాలనలో ఉన్న ఆ దేశం తరువాత ఫెడరల్‌ డెమొక్రటిక్‌ రిపబ్లిక్‌గా అవతరించింది.
* దక్షిణ కొరియాలో భోజనాల బల్ల దగ్గర కూర్చున్న వారిలో పెద్దవారు తినడం ప్రారంభిస్తేనే కానీ మిగిలినవారు ఆహారం ముట్టరు.
* మనిషి మెడలో ఉన్నట్లే జిరాఫీ మెడలో ఏడు ఎముకలు ఉంటాయి. కానీ అవి బాగా పొడవుగా ఉంటాయి.


ప్రపంచంలోనే అత్యంత పొడవైన భూగర్భనది ఫిలిప్పీన్స్‌లో ఉంది. దీని పేరు ఫ్యూర్టో ప్రిన్సెస్సా. ఇది సెయింట్‌పాల్‌ పర్వత శ్రేణి కింద సుమారు యాభై కిలోమీటర్ల మేర ప్రవహించి దక్షిణ చైనా సముద్రంలో కలుస్తుంది. ఈ భూగర్భనదిలో పడవ ప్రయాణం చేసే అవకాశమూ ఉంది.  


యెమన్‌ రాజధాని సనాకు పశ్చిమాన ఉన్న అల్‌ హుతైబ్‌... ప్రపంచంలో అసలు వర్షమే కురవని ప్రాంతం. అలాగని ఇదేమీ ఎడారిలో లేదు. భూ ఉపరితలానికి 3200 కిలోమీటర్ల ఎత్తులో ఓ కొండవాలున ఉంటుంది. అంత ఎత్తున మేఘాలు ఆవరించక ఒక చుక్క వాన కూడా పడదు.  


ప్రపంచంలో అత్యధికంగా దీవులున్న దేశం ఇండోనేషియా. కానీ ఎన్ని దీవులున్నాయో అక్కడి ప్రభుత్వం కూడా లెక్క తేల్చలేకపోతోంది!


ఒమన్‌లో  ఇళ్లూ, షాపింగ్‌ మాళ్లూ... ఇలా ఏ నిర్మాణానికైనా సరే తెలుపు రంగు మాత్రమే వేయాలి. ఇతర రంగులు వేయాలనుకుంటే ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలి.


* రువాండా దేశంలో ప్రతి నెలా చివరి శనివారం ఉద్యోగులందరికీ సెలవు. అలాగని, అన్ని పనులూ పక్కన పెట్టి హాయిగా విశ్రాంతి తీసుకుందామనుకుంటే మాత్రం కుదరదండోయ్‌. దేశాధ్యక్షుడి నుంచి సామాన్య ఉద్యోగి వరకూ ఎవరైనా సరే... ఆరోజు తమ వీధుల్నీ, ఇంటి పరిసరాల్నీ శుభ్రం చేసుకోవాల్సిందే. ఒకవేళ ఎవరైనా అలా చేయకపోతే 1994 పారిశుద్ధ్య చట్టం ప్రకారం వారికి జరిమానా విధిస్తారు.
* ఒక టన్ను ద్రాక్ష పళ్లతో సుమారు 720 సీసాల వైన్‌ని తయారు చేస్తారట.
* ప్రపంచ దేశాలన్నింటి కంటే నెదర్లాండ్స్‌లో కాఫీ తాగేవారి సంఖ్య ఎక్కువ.

స్కెలిటన్‌ పూలపై వానపడితే అవి పారదర్శకంగా ఇలా మారిపోతాయి.


* బ్లాక్‌ క్యాబ్‌లు లండన్‌ సంస్కృతిలో ఓ భాగం. అయితే, ఈ క్యాబ్‌కి డ్రైవర్‌గా మారడం మాత్రం అంత సులువు కాదు. ఇందుకు రెండు నుంచి నాలుగేళ్లపాటు శిక్షణ తీసుకోవాలి. లండన్‌లోని ప్రతి వీధినీ గుర్తుంచుకోవాలి. అప్పుడే ఆ అవకాశం దక్కుతుంది.
* ఏనుగులకు తేనెటీగలంటే చాలా భయం. అవి... ఏనుగు సున్నిత భాగాలైన తొండం లోపల, కంటి చుట్టూ కుడతాయనే ఆందోళనే అందుకు కారణమట.ఫస్ట్‌... ఫస్ట్‌..!

స్మార్ట్‌ఫోన్‌ అన్న పదం తెలియకముందే- 1992లోనే ఐబీఎం కంపెనీ, ‘సైమన్‌ పర్సనల్‌ కమ్యూనికేటర్‌’ పేరుతో తొలి స్మార్ట్‌ఫోన్‌ను రూపొందించింది. ఆ తరవాత పదిహేనేళ్లకు అంటే- 2007లో ఆపిల్‌ కంపెనీ ఐఫోన్‌ను విడుదల చేయడంతో స్మార్ట్‌ఫోన్‌ యుగం మొదలైంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


ఇంకా..

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని