సిసింద్రీ

సిసింద్రీ

Updated : 13 Feb 2022 06:02 IST

సిసింద్రీ



కప్ప చూపిన దారి!

భువనగిరి రాజు ప్రతాపవర్మ. విజయపురి రాజు ఆనందవర్మ. ఒకసారి వీరి రాజ్యాల మధ్య పెద్ద యుద్ధం జరిగింది. చిన్నసైన్యంతో ప్రతాపవర్మ, పెద్ద సైన్యంతో ఆనందవర్మ యుద్ధం చేశారు. ఎవరి శక్తి కొలదీ వారు పోరాడారు. ఎత్తుకు పై ఎత్తు వేసి, ఎదుటి వాళ్లను చిత్తు చేయాలని ఇద్దరూ ప్రయత్నించారు. కానీ ప్రతాపవర్మ ఓడిపోయే పరిస్థితి వచ్చింది. యుద్ధంలోనూ బాగా అలసిపోయాడు. ఒంటినిండా గాయాలయ్యాయి. ఆయనకు నిలబడే శక్తి కూడా లేకపోయింది. ఇక తాను నెగ్గడం ఎటూ కుదరదని తెలిసి... ప్రతాపవర్మ మెల్లిగా పక్కదారిన పారిపోయి దగ్గరలోని ఒక గుహలో తలదాచుకున్నాడు. అక్కడ అతడికి ఒక కప్ప కనిపించింది. అది కింద నుంచి ఓ బండ మీదకు చేరుకోవాలని ప్రయత్నం చేస్తోంది. కాని గెంతిన ప్రతిసారీ కిందపడిపోతోంది. అయినా అది తన ప్రయత్నం మానలేదు. అలా గెంతుతూనే ఉంది. చాలా ప్రయత్నాల తర్వాత అది అమాంతం రాయి మీదకు చేరింది. దాని పట్టుదల చూసిన ప్రతాపవర్మకు జ్ఞానోదయం అయింది. ‘ఎన్ని కష్టాలు ఎదురైనా సరే పట్టుదలతో ప్రయత్నిస్తే, అనుకున్నది సాధిస్తాం’ అని తెలుసుకున్నాడు. ‘ఈ సారి తప్పక శత్రువును ఓడించి తీరాలి’ అని గట్టిగా అనుకుని మళ్లీ యుద్ధక్షేత్రానికి వెళ్లాడు. సరికొత్త వ్యూహంతో తన సైన్యాన్ని ముందుండి నడిపించాడు. ప్రతాపవర్మ ధైర్యసాహసాలు చూసి... ఆయన సైనికులు కూడా వీరోచితంగా పోరాడారు. ఆనందవర్మ యుద్ధంలో ఓడిపోయాడు. ప్రతాపవర్మ విజేతగా నిలిచాడు. గట్టిగా ప్రయత్నిస్తే విజయం తప్పక సొంతమవుతుందని ప్రతాపవర్మ ఇలా అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు. తర్వాత తన పరిపాలనలోనూ అనేక మార్పులు తీసుకొచ్చి ప్రజలను చక్కగా పాలించాడు.


బుజ్జి బుడత...  డ్రమ్స్‌ మోత..!

మూడేళ్ల వయసులో ఓ చిన్నారిని వాళ్ల అమ్మానాన్న నర్సరీలో చేర్పిస్తే.. అక్కడ పెన్సిల్‌తో టేబుల్‌ మీద డ్రమ్స్‌ వాయించినట్లు కొట్టాడట. అది తెలుసుకున్న తల్లిదండ్రులు, ఆ అబ్బాయికి అందులో ఆసక్తి ఉందని గ్రహించి అప్పట్నుంచే శిక్షణ ఇప్పించారు. ఇంకేముంది చక్కగా డ్రమ్స్‌ వాయించడం నేర్చుకుని ప్రావీణ్యం సంపాదించాడు. అంతేనా తన ప్రతిభతో రికార్డుల మోత మోగిస్తున్నాడు. ఇంతకీ ఆ చిన్నారి ఎవరంటే.. ఉత్తరాఖండ్‌లోని రుద్రపూర్‌కు చెందిన మహిమాన్‌ ఖనిజో. వయసు ఏడేళ్లు. కరోనా మొదలైన సమయంలో ఆన్‌లైన్‌ క్లాసులు అయిపోయాక పూర్తిగా సంగీత సాధనకే సమయాన్ని కేటాయించాడు. రోజూ డ్రమ్స్‌ ప్యాడ్‌పై సాధన చేసేవాడు. తర్వాత తన ప్రతిభను నలుగురికీ తెలియజెప్పాలనే ఉద్దేశంతో ప్రదర్శనలు ఇప్పించేవారు అమ్మానాన్న. తను డ్రమ్స్‌ వాయించడం చూసినవారంతా ఆశ్చర్యపోయేవారు. అక్కడితో ఆగిపోకుండా మరింత సాధన చేసి 100 డ్రమ్‌ రోల్స్‌ను 100 సెకన్లలో వాయించాడు. ఇంకేముంది ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌, ఆసియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌, కలామ్స్‌ వరల్డ్‌ రికార్డ్స్‌, మ్యాజిక్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం సంపాదించాడు. అంతేకాదు నేస్తాలూ! ‘యంగెస్ట్‌ డ్రమ్మర్‌’ బిరుదుతోపాటు ‘బెస్ట్‌ అచీవర్స్‌ అవార్డు’నూ సొంతం చేసుకున్నాడు. అలాగని మన మహిమాన్‌ చదువునేమీ నిర్లక్ష్యం చేయలేదు. అందులోనూ చక్కగా రాణిస్తున్నాడు.






మీరే చెప్పారు మరి!

టీచర్‌: ఏంటి టింకూ... క్లాసులో నిద్రపోతున్నావు?

టింకు: మీరే అన్నారుగా టీచర్‌. కలలు కనండి. వాటిని సాకారం చేసుకోండి అని! అందుకే కలలు కనడం కోసం నిద్రపోతున్నా.

టీచర్‌: ఆఁ!!


జవాబులు

పోలికలేంటి?: అడ్డం: కుర్చీ, కిటికీ, సోఫా; నిలువు: రెండు జడలు, పిల్లి, నీళ్లగ్లాసు; ఐమూలగా: గోడ గడియారం, వాటర్‌ బాటిల్‌.

కనిపెట్టండి చూద్దాం?: 3

తేడాలేంటి?: 1. గాలి పటం తోక

2. ఇసుకలో బంతి

3. జారుడు బల్ల మెట్లు

4. ఇసుకలో ఆడుకుంటున్న అమ్మాయి చొక్కా కాలర్‌

5. ఆకాశంలో పక్షులు

6. జారుడు బల్లకు దగ్గరగా ఉన్న పొద

7. రాయి

8. గాలి పువ్వుతో ఆడుకుంటున్న అమ్మాయి షూస్‌.

ముక్క ఏదో చెప్పుకోండి!: 2


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..