Published : 03 Jul 2022 00:42 IST

సిసింద్రీ

భళా... తబలా బాల!

బామ్మ భక్తి పాటలు పాడుతోంది. పక్కనే దాదాపు ఏడాది వయసున్న బుడతడు అల్యూమినియం డబ్బాలను వాయిస్తున్నాడు. అదీ లయబద్ధంగా..! అప్పుడే ఆ బుజ్జాయి తల్లిదండ్రులకు తమ కొడుకులో అద్భుత ప్రతిభ దాగి ఉందని అర్థమైంది. తబలాలో శిక్షణ ఇప్పించారు. ఆ చిన్నారే ఉత్తరప్రదేశ్‌కు చెందిన త్రిపురాజ్‌ పాండ్యా. ప్రస్తుతం ఈ చిచ్చరపిడుగు వయసు 13 సంవత్సరాలు. తనకు కేవలం ఆరేళ్ల వయసున్నప్పుడే ప్రపంచంలోకెల్లా అత్యంత పిన్న వయస్కుడైన తబలా మాస్టర్‌గా ‘గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌’లో స్థానం సంపాదించాడు. తనకు రెండేళ్ల వయసు నుంచే తబలా ప్రాక్టీస్‌ మొదలుపెట్టాడు. ఆ వయసులోనే తొలిసారిగా ప్రదర్శన ఇచ్చాడు. మూడేళ్ల వయసున్నప్పుడు దూరదర్శన్‌లో ఈ బుజ్జాయి ప్రోగ్రామ్‌ ప్రసారమైంది. ఇప్పటి వరకు పాండ్యా ఏకంగా 200 వరకు ప్రదర్శనలు ఇచ్చాడు. పదకొండేళ్ల వయసులో ‘గ్లోబల్‌ చైల్డ్‌ ప్రాడిజీ అవార్డు’నూ సొంతం చేసుకున్నాడు. మన ప్రధాని నరేంద్ర మోదీ నుంచి సైతం ఈ బుడతడు ప్రశంసలు అందుకున్నాడు. కరోనా నేపథ్యంలో గత రెండేళ్లుగా పెద్దగా ప్రదర్శనలు లేకపోయినా, తన ప్రతిభకు పదును పెట్టుకుంటున్నాడు. భవిష్యత్తులో మరిన్ని ప్రదర్శనలు ఇవ్వాలని ఉవ్విళ్లూరుతున్నాడు.


బీర్బల్‌ తెలివి..!

క రోజు అక్బర్‌ చక్రవర్తి తన పరివారాన్ని తీసుకుని అడవికి వేటకు వెళ్లాడు. బీర్బల్‌ను కూడా తనతో పాటు రమ్మన్నాడు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల కాస్త దూరం వెళ్లిన తర్వాత ఇక ముందుకు కొనసాగడం అక్బర్‌ వల్ల కాలేదు. అందుకే ఓ చెట్టు కింద ఆగి కాస్త విశ్రాంతి తీసుకున్నాడు. ఇంతలో అక్బర్‌కు ఓ అనుమానం వచ్చింది. తను బీర్బల్‌ తెలివికి పరీక్ష పెట్టక చాలా రోజులైంది. ఇంతకీ అతడి తెలివి అలాగే ఉందా... పెరిగిందా... లేక తగ్గిపోయిందా... అనేది తెలుసుకోవాలనుకున్నాడు. ఇలా అనుకున్నదే తడవుగా... ‘బీర్బల్‌ నువ్వు నన్ను ఈ గుర్రం మీద నుంచి కిందకు దించగలవా?’ అని పందెం కాశాడు అక్బర్‌. ఇది విన్నవెంటనే బీర్బల్‌... ‘జహాపనా... మీ అంతటి గొప్ప వ్యక్తిని గుర్రం మీద నుంచి దించడం నా వల్ల కాదు. కానీ మీరు గుర్రం దిగితే మాత్రం మరుక్షణంలో మీరు అశ్వాన్ని ఎక్కేలా చేయగలను’ అన్నాడు. అక్బర్‌కు ఇది విచిత్రంగా అనిపించింది. తనను గుర్రం మీద నుంచి దించలేని బీర్బల్‌, గుర్రం మాత్రం ఎలా ఎక్కిస్తాడు. కచ్చితంగా పందెంలో ఓడిపోతాడు అనుకున్నాడు అక్బర్‌. క్షణం ఆలస్యం చేయకుండా అక్బర్‌ గుర్రం దిగాడు. కానీ ఎంతసేపటికీ బీర్బల్‌, అక్బర్‌ను గుర్రం ఎక్కేలా చేయలేదు. దీంతో అక్బర్‌ ఇదే విషయం బీర్బల్‌ను అడిగాడు. ‘మీరు గుర్రం ఎక్కడం తర్వాత సంగతి, ముందు నేను మిమ్మల్ని గుర్రం దిగేలా చేశాను. మీరు కాసిన పందెంలో నేనే గెలిచాను’ అన్నాడు బీర్బల్‌. ‘శెభాష్‌ బీర్బల్‌... నువ్వు నేను కాసిన పందెంలో గెలిచావు. కానీ... నువ్వు కాసిన పందెంలో మాత్రం నువ్వే ఓడిపోయావు’ అన్నాడు అక్బర్‌, బీర్బల్‌ను కాస్త ఉడికిస్తూ. బీర్బల్‌ మాట్లాడలేదు. అక్బర్‌ వెంటనే గుర్రం ఎక్కి తన పరివారాన్ని ‘ముందుకు వెళదాం’ అన్నాడు. అంతే వెంటనే బీర్బల్‌... ‘జహాపనా... నేను కాసిన పందెంలో కూడా నేనే గెలిచానోచ్‌’ అన్నాడు. బీర్బల్‌ తెలివికి అక్బర్‌కు ముచ్చటేసింది. వెంటనే తన మెడలోని ముత్యాలహారాన్ని తీసి బీర్బల్‌ మెడలో వేశాడు అక్బర్‌.Advertisement

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


ఇంకా..

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని