సిసింద్రీ

అనగనగా ఓ అడవి. అందులో ఒక అందమైన సరస్సు ఉండేది. ఒకరోజు ఓ తాబేలు సరస్సు ఒడ్డున సేద తీరుతూ, ఏదో ఆలోచించుకుంటూ పరధ్యానంలో ఉండిపోయింది.

Published : 10 Feb 2024 23:06 IST

అపాయంలో ఉపాయం!

నగనగా ఓ అడవి. అందులో ఒక అందమైన సరస్సు ఉండేది. ఒకరోజు ఓ తాబేలు సరస్సు ఒడ్డున సేద తీరుతూ, ఏదో ఆలోచించుకుంటూ పరధ్యానంలో ఉండిపోయింది. ఇంతలో హఠాత్తుగా వెనక నుంచి నక్క దాడి చేసి పట్టుకుంది. ‘హమ్మయ్య... ఇన్నాళ్లకు దొరికావు. ఎప్పటి నుంచో నీ మాంసం తినాలని ఎదురు చూస్తున్నా. నాకు ఈ రోజు విందు భోజనమే’ అంటూ తెగ సంబరపడిపోయింది నక్క. ‘ఎలాగూ నేను చావాల్సిందే కదా... అదేదో నీకు ఆహారంగా మారితే నాకు తృప్తి’ అంది తాబేలు. ‘సరే అయితే నిన్ను ఎక్కడి నుంచి తినడం ప్రారంభించాలి. తల నుంచా... తోక నుంచా?’ అని నక్క లొట్టలేస్తూ అడిగింది. తాబేలు వెంటనే తన తల, కాళ్లు, తోకను డిప్ప లోపలికి తీసుకుంది. ‘అయ్యో... నక్కబావా... నువ్వుచాలా తెలివైన జీవివి అనుకున్నాను. తాబేలును తినాలంటే ఓ పద్ధతి ఉంది. ముందు ఓ అయిదు నిమిషాలు నీళ్లలో నానబెట్టాలి’ అంది. ‘నాకు తెలియకేం. ఈ విషయం నాకూ తెలుసు. కానీ తాబేలు మాంసం దొరికిందన్న ఆనందంలో మర్చిపోయాను. అయినా నిన్ను నీళ్లలో పెడితే నువ్వు పారిపోవా?’ అని అడిగింది. ‘నేనేం పారిపోను. అయినా నా మీద నమ్మకం లేకపోతే... నన్ను ఈ నీళ్లలో ఉంచి... పైన నీ కాలు పెట్టు’ అంది తాబేలు. ఇదేదో బాగుంది అనుకున్న నక్క... తాబేలు చెప్పినట్లుగానే చేసింది. కొన్ని నిమిషాల తర్వాత ‘తాబేలూ... నువ్వు మెత్తబడ్డావా... ఇప్పుడు నిన్ను తినొచ్చా?’ అని అడిగింది నక్క.

‘నక్క బావా... మొత్తం మెత్తబడ్డాను... కానీ నువ్వు కాలు ఉంచిన చోట అలానే ఉన్నాను. నువ్వు ఆ కాలు తీస్తే...’ అని ఆగింది తాబేలు. ఏమాత్రం ఆలోచించకుండా నక్క తన కాలును వెంటనే తాబేలుపై నుంచి తీసింది. అంతే తాబేలు చటుక్కున మాయమైపోయింది. ముందు అవాక్కైన నక్క కాసేపటి తర్వాత, దిగాలుగా అక్కడి నుంచి వెళ్లిపోయింది. ‘హమ్మయ్య... ప్రస్తుతానికి గండం గడిచింది. ఇకపై ఒడ్డున ఉన్నప్పుడు అప్రమత్తంగా ఉండాలి’ అనుకుని తన పనిలో నిమగ్నమైపోయింది తాబేలు.














Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..