పైన చాక్లెట్‌... లోన స్ట్రాబెర్రీ

ఎర్రని ఎరుపు రంగులో హృదయాకారంలో కొంచెం పుల్లగా కొంచెం తియ్యగా ఉండే స్ట్రాబెర్రీలు చూడ్డానికే కాదు, ఎవరికైనా కానుకగా ఇచ్చేందుకూ అందంగానే ఉంటాయి. అయితే ఆ అందానికి తియ్యని తమ ప్రేమనీ జోడిస్తోంది నేటి తరం.

Published : 09 Oct 2022 00:00 IST

పైన చాక్లెట్‌... లోన స్ట్రాబెర్రీ

ఎర్రని ఎరుపు రంగులో హృదయాకారంలో కొంచెం పుల్లగా కొంచెం తియ్యగా ఉండే స్ట్రాబెర్రీలు చూడ్డానికే కాదు, ఎవరికైనా కానుకగా ఇచ్చేందుకూ అందంగానే ఉంటాయి. అయితే ఆ అందానికి తియ్యని తమ ప్రేమనీ జోడిస్తోంది నేటి తరం. అందులో భాగంగానే ఆ స్ట్రాబెర్రీల్ని రంగురంగుల చాక్లెట్లలో ముంచి తీసి మరీ అందిస్తోంది..!

పుట్టినరోజుకో పెళ్లిరోజుకో లేదూ పండగల వేళల్లో ఆత్మీయుల్ని పలకరించడానికి వెళ్లినప్పుడో... వాళ్ల వాళ్ల అభిరుచిని బట్టి పండ్లనో స్వీట్లనో తీసుకెళుతుంటాం. అయితే ఆ రెండింటినీ కలిపి ఇస్తే ఇంకా బాగుంటుంది అన్న ఆలోచనతో ఈమధ్య వాటిని బొకేల రూపంలో ఎంతో అందంగా తయారుచేస్తూ వినియోగదారుల్ని ఆకర్షిస్తున్నాయి వ్యాపార సంస్థలు. అయితే పండ్లనీ చాక్లెట్లనీ కలిపి ఎంత అందంగా గుదిగుచ్చినా అవేంటి అనేదీ పైకి కనిపిస్తూనే ఉంటుంది. పైగా వాటిని తిన్నప్పుడూ దేనికదే తింటాం. కాబట్టి అందులో కొత్తదనం ఏమీ ఉండదు. అసలే ఈ తరానికి ఇచ్చే కానుకైనా కొనే వస్తువైనా అందులో ఏదో ఒక కొత్తదనం ఉండాలి. అందుకనే... ఇప్పుడు ఏకంగా స్ట్రాబెర్రీల్నే రంగుల చాక్లెట్లలో డిప్‌ చేసి, కంటికి ఇంపుగానూ నోటికి రుచిగానూ ఉండేలా తయారుచేస్తున్నారు. అంతేకాదు, వీటికి గులాబీలను చేర్చి బొకేల్లానూ కేక్‌ టవర్లలానూ కూడా అమరుస్తున్నారు. దాంతో పార్టీలూ ఫంక్షన్లకి వెళ్లేటప్పుడు ఈ బొకేల్ని కానుకలుగా ఇచ్చేందుకు కొందరు ఆసక్తి కనబరిస్తే, ఆయా పార్టీల్లో ఈ ఫ్రూట్‌ చాక్లెట్‌ టవర్లను ఏర్పాటుచేసి- అతిథులను - ముఖ్యంగా పిల్లలను- ఆకట్టుకుంటున్నారు ఇంకొందరు. అదీగాక, స్ట్రాబెర్రీ ఆరోగ్యానికి ఎంత మంచిదైనా ఆ పుల్లని రుచి, పిల్లలందరికీ పెద్దగా నచ్చదు. అలాంటివాళ్లకి ఈ చాక్లెట్‌ డిప్‌ స్ట్రాబెర్రీలు బాగా నచ్చేస్తున్నాయట. అలాగే అచ్చంగా చాక్లెట్‌ రుచిని ఇష్టపడనివాళ్లకీ ఈ పండ్ల చాక్లెట్లు మేలే. అన్నింటికన్నా చూడగానే లవ్‌/హార్ట్‌ చాక్లెట్లు అనిపించే వీటిని నోట్లో పెట్టుకోగానే అది కరిగి స్ట్రాబెర్రీ రుచి తగిలితే కానుకలుగా అందుకున్నవాళ్లకి సరికొత్త అనుభూతి తథ్యం... అందుకే ఈ డిప్‌డ్‌ బెర్రీస్‌ గిఫ్ట్‌ బాక్సెస్‌ అంటున్నారు తయారీదారులు.

ఎలా చేస్తారు?
చాక్లెట్‌ తింటే తియ్యగా ఉంటుంది. స్ట్రాబెర్రీ పుల్లపుల్లగా ఉంటుంది. అదే ఈ స్ట్రాబెర్రీ చాక్లెట్‌తో అయితే రెండు రకాల ఫ్లేవర్లతో కూడిన రుచిని సొంతం చేసుకోవచ్చన్నమాట. ఈ స్ట్రాబెర్రీల్ని ప్రీమియం బెల్జియం వైట్‌ లేదా డార్క్‌ చాక్లెట్‌లో ముంచి తీస్తున్నారు. చాక్లెట్‌ సాస్‌లో కూడా ఎడిబుల్‌ కలర్స్‌, గ్లిట్టరూ కలపడంతో ఈ ఫ్రూట్‌ చాక్లెట్లు చూడ్డానికీ ఆకర్షణీయంగా ఉంటున్నాయి. ఆపై వాటికి రకరకాల క్రాకర్లూ మార్ష్‌మాలో క్రీమ్‌, చీజ్‌... వంటి కన్ఫెక్షనరీలతోబాటు ఎడిబుల్‌ పెరల్స్‌, స్ప్రింకెల్స్‌, క్రిస్టల్స్‌.. వంటి వాటితో చూడముచ్చటగా డిజైన్‌ చేసి, బాక్సుల్లో అమరుస్తున్నారు. దాంతో ఈ డిప్‌డ్‌ చాక్లెట్‌ బాక్సులు హాటుహాటుగా అమ్ముడుపోతున్నాయట. స్ట్రాబెర్రీలూ చాక్లెట్లూ రెండూ ప్రేమకు సంకేతాలే... కాబట్టి ఆ రెండింటినీ కలగలిపి అందించే ఈ కానుకలు ఎవరికైనా- ముఖ్యంగా ప్రేమికులకు నచ్చకుండా ఉంటాయా మరి!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..