కోర్టుదాకా ఎందుకు... కూర్చుని మాట్లాడుకుందాం!

యువదంపతుల మధ్య గొడవలు వస్తే ఇరువైపుల పెద్దలూ సమావేశమై వారికి నచ్చజెప్పి రాజీ కుదర్చడం చూస్తుంటాం. చాలా సందర్భాల్లో అది సమస్యని కోర్టు దాకా వెళ్లకుండా సామరస్యంగా సమసిపోయేలా చేస్తుంది. ఈ పద్ధతినే అన్నిరకాల వివాదాలకూ వర్తింపజేస్తే బాగుంటుందన్న ఆలోచన నుంచే ‘మధ్యవర్తిత్వం’

Published : 01 May 2022 00:52 IST

కోర్టుదాకా ఎందుకు... కూర్చుని మాట్లాడుకుందాం!

యువదంపతుల మధ్య గొడవలు వస్తే ఇరువైపుల పెద్దలూ సమావేశమై వారికి నచ్చజెప్పి రాజీ కుదర్చడం చూస్తుంటాం. చాలా సందర్భాల్లో అది సమస్యని కోర్టు దాకా వెళ్లకుండా సామరస్యంగా సమసిపోయేలా చేస్తుంది. ఈ పద్ధతినే అన్నిరకాల వివాదాలకూ వర్తింపజేస్తే బాగుంటుందన్న ఆలోచన నుంచే ‘మధ్యవర్తిత్వం’ అన్న విధానం వచ్చింది. దీనికి తగిన ప్రాధాన్యమిస్తే న్యాయస్థానాల మీద కేసుల భారాన్ని తగ్గించవచ్చని లోక్‌ అదాలత్‌లు నిరూపించాయి. ఇటీవల పార్లమెంటులో మధ్యవర్తిత్వ బిల్లును ప్రవేశపెట్టడమూ, దేశంలోనే మొట్టమొదటి అంతర్జాతీయ స్థాయి ఆర్బిట్రేషన్‌ కేంద్రాన్ని హైదరాబాదులో ప్రారంభించడమూ... ఆ దిశగా చర్యల్ని వేగవంతం చేసే ప్రయత్నాలే. ప్రతి సమస్యనీ కోర్టు ముంగిటికి తీసుకెళ్లకుండా మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకుంటే విలువైన సమయమూ డబ్బూ కూడా కలిసివస్తాయంటున్నారు నిపుణులు.

పెళ్లైన మూడేళ్లకే భార్యాభర్తల మధ్య అభిప్రాయభేదాలు వచ్చాయి. విడాకుల కోసం అర్జీ పెట్టుకుని ఆరేళ్లయింది. కట్నం డబ్బు, పిల్లవాడి బాధ్యత, ఆస్తి పంపకం... ఏ విషయంలోనూ అంగీకారం కుదరడం లేదు. కేసు వాయిదాల మీద వాయిదాలు పడుతోంది.

అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదా. పుష్కరమైనా తెగదూ ముడిపడదూ... ఆస్తి ఉండీ అనుభవించడానికి లేక మూడు కుటుంబాలూ నానా అవస్థలు పడుతున్నాయి.

ఇద్దరు మిత్రులు కలిసి వ్యాపారం పెట్టారు. కొన్నాళ్లకి మనస్ఫర్థలొచ్చాయి. లెక్కల్ని తారుమారు చేసి అన్యాయం చేస్తున్నారేమోనని పరస్పరం అపనమ్మకంతో విడివిడిగా కేసులు పెట్టుకున్నారు. ఎవరికి వాళ్లే కేసు గెలవాలని పంతానికి పోతున్నారు. బాగా జరుగుతున్న వ్యాపారం కాస్తా మూలనబడింది.

ఇరుగూ పొరుగూ రైతులిద్దరికి నీటి కాలవ దగ్గర గొడవ. ఒకరోజు ఆవేశంలో మాటలు చేతల దాకా వెళ్లాయి. బంధుజనాన్ని పోగేసుకుని కిందా మీదా పడి కొట్టుకున్నారు. కొందరికి చేతులూ కాళ్లూ విరిగాయి. పోలీసు కేసయింది. విచారణ ఖైదీలుగా జైల్లో ఊచలు లెక్కబెడుతున్నారు.

పట్టణంలో చిన్న ఇల్లు కట్టుకోవాలన్న కల ఓ చిరుద్యోగిది. దాన్ని నిజం చేసుకోడానికి పొదుపుగా డబ్బు దాచుకుని వంద గజాల స్థలం కొనుక్కున్నాడు. ఎవరో దాన్ని కబ్జా చేశారు. కష్టపడి సంపాదించుకున్న డబ్బుని అనుభవించిందీ లేదు, ఆస్తీ మిగల్లేదు... ఎదురు కోర్టు ఖర్చులతో సతమతమవుతున్నాడు రిటైర్మెంట్‌కి చేరువైన ఆ ఉద్యోగి.

...ఇలా చెబుతూ పోతే ఎన్నిరకాల వివాదాలో. అవన్నీ కోర్టుల్లో కేసులై గుట్టలు గుట్టలుగా పేరుకుపోతుంటాయి. అలా ఇప్పుడు మన దేశంలో వివిధ స్థాయుల్లో న్యాయస్థానాల వద్ద దాదాపు నాలుగు కోట్లకు పైగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయట. దానివల్ల ఆయా కేసులకు సంబంధించిన కక్షిదారులమీద కోర్టు ఖర్చులూ లాయరు ఫీజులూ అన్నీ కలిసి ఏడాదికి ముప్ఫైవేలకోట్ల భారం పడుతోందని ఐదేళ్ల క్రితం ‘దక్ష్’ అనే సంస్థ చేసిన అధ్యయనం పేర్కొంది. సకాలంలో పరిష్కారం కాని కేసులవల్ల ఏటా దేశానికి యాభై వేల కోట్ల విలువైన ఉత్పాదకతకి నష్టం జరుగుతోందట.

అసలు ఒకప్పుడు మనదేశంలో న్యాయవ్యవస్థ అంటే రచ్చబండే. ఊళ్లో ఏ చిన్న వివాదం చోటు చేసుకున్నా ఊరి పెద్దమనుషులే న్యాయమూర్తులయ్యేవారు. ఇరుపక్షాల వాదనలూ విని తగిన తీర్పు చెప్పేవారు. మర్యాద రామన్న తీర్పుల కథలన్నీ ఆ సంప్రదాయం నుంచి పుట్టినవే. బ్రిటిష్‌ పాలనలో ఆ పద్ధతి క్రమంగా మరుగున పడిపోయింది. వలస పాలకులు తాము అనుసరిస్తున్న న్యాయవ్యవస్థనే ఇక్కడా నెలకొల్పారు. క్రమంగా దానికి అలవాటుపడిపోయారు ప్రజలు.

న్యాయస్థానాలు ఉన్నదే ప్రజలకు న్యాయం చేయడానికి. అవసరమైనప్పుడు వాటి ముంగిటికి వెళ్లడంలో తప్పు లేదు. కానీ ప్రతి చిన్న విషయానికీ కేసులు పెట్టుకుంటూ కోర్టుకెక్కడమూ, పెరుగుతున్న జనాభాకి తగినట్లుగా న్యాయస్థానాల సంఖ్య పెరగకపోవడమూ కలిసి ఇలా పెండింగ్‌ కేసుల సంఖ్యను లక్షలూ కోట్లకు చేర్చాయి. జిల్లా కోర్టుతో మొదలుపెట్టి సుప్రీంకోర్టు వరకూ ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి.

మరో పక్కనుంచి చూస్తే- ఇద్దరు కక్షిదారులు ఒక వివాదంలో పరిష్కారం కోసం కోర్టు గడప తొక్కితే, ఇక ఆ తర్వాత వారిద్దరూ బద్ధ శత్రువుల్లాగా మారిపోతారు. ఎదుటి వ్యక్తిని ఓడించి తామే గెలవాలనే లక్ష్యంతో హోరాహోరీ పోరాడుతారు. కొన్నేళ్ల పోరాటం తర్వాత, చాలా డబ్బు ఖర్చయ్యాక ఎవరో ఒకరే గెలుస్తారు. రెండు కుటుంబాల మధ్య జీవితకాలపు శత్రుత్వం తప్ప మరేమీ మిగలదు. 

‘సమస్యను సామరస్య పూర్వకంగా అర్థం చేసుకుంటే ఎంత పెద్ద వివాదాన్నైనా సులువుగా పరిష్కరించుకోవచ్చు. న్యాయవాదుల ప్రధాన విధి కక్షిదారులను ఏకం చేయడమే’- అనేవారు మహాత్మాగాంధీ. ఆచరణలో అందుకు భిన్నంగా జరుగుతోందన్నది వాస్తవం. ఈ పరిణామాలన్నిటినీ దృష్టిలో పెట్టుకునే ప్రత్యామ్నాయ వివాద పరిష్కార(ఆల్టర్నేటివ్‌ డిస్ప్యూట్‌ రిసొల్యూషన్‌- ఏడీఆర్‌) విధానాలపై దృష్టిపెట్టింది ప్రభుత్వం. చిన్న చిన్న కేసులైతే డిజిటల్‌ సాంకేతికత సాయంతో ఆన్‌లైన్‌లోనూ పరిష్కరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఎలాంటి ప్రత్యామ్నాయాలు?

1987లో తెచ్చిన లీగల్‌ సర్వీసెస్‌ అధారిటీ చట్టం న్యాయమూర్తుల మధ్యవర్తిత్వంతో ఎక్కడికక్కడ లోక్‌ అదాలత్‌లు నిర్వహిస్తూ వివాదాల పరిష్కారానికి వీలు కల్పించింది. న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల్నే కాక, ఇంకా కోర్టుదాకా వెళ్లని ‘ప్రి లిటిగేషన్‌’ దశలో ఉన్న వివాదాల్ని కూడా ఇక్కడ సత్వరం పరిష్కరించుకోవచ్చు. అలా పరిష్కారమైన కేసులకు కోర్టు ఫీజు ఉండదు. అలాగే మోటారు వాహనాల చట్టం, బీమా చట్టాల కింద క్లెయిముల కేసులను, సివిల్‌ కేసులను కూడా లోక్‌ అదాలత్‌ల పరిధిలో పరిష్కరించుకోవచ్చు. వాటికి కూడా కోర్టు ఫీజు ఉండదు. ఈ విధానానికి మంచి ఆదరణే లభిస్తోంది. 2019లో లోక్‌ అదాలత్‌లు దేశవ్యాప్తంగా దాదాపు అరవై లక్షల కేసుల్ని పరిష్కరించాయి. గతేడాది మహారాష్ట్రలో ఒకసారి నిర్వహించిన మూడు రోజుల స్పెషల్‌ డ్రైవ్‌లో అయితే ఏకంగా లక్షా 57 వేల కేసుల్ని పరిష్కరించారు. ఆ సమయంలోనే బాంద్రా కుటుంబ న్యాయస్థానంలో 44 వివాదాల్లో రాజీ కుదర్చగా, ఎనిమిది మంది మాత్రమే విడాకులకు మొగ్గుచూపారట. ఒక జంట మధ్య పద్నాలుగేళ్లుగా సాగుతున్న వివాదానికీ అక్కడ సామరస్యపూర్వకంగా ముగింపు పలకడం విశేషం.

ఫ్యామిలీ కోర్టు కూడా ఇలాంటిదేనా?

కుటుంబ న్యాయస్థానాల ఏర్పాటు చట్టం ఉద్దేశమే మధ్యవర్తిత్వం సహాయంతో కేసులను త్వరగా పరిష్కరించడం. దాదాపుగా ప్రతి జిల్లాలోనూ ఉన్న ఈ కోర్టుల్లో ఏ కేసైనా నమోదవగానే ముందుగా ఇరుపక్షాలనూ మధ్యవర్తి దగ్గరకు కౌన్సెలింగ్‌కు పంపిస్తారు. ఒకవేళ భార్య విడాకులు కోరుతూ న్యాయస్థానం ముందుకు వచ్చిన పక్షంలో భర్తను పిలిచి మాట్లాడితే అతడు విడాకులకు ఇష్టపడకపోవచ్చు. అప్పుడు వాళ్లిద్దరి మధ్యా ఉన్న సమస్య విడాకులు తీసుకోవాల్సినంత పెద్ద సమస్యా, లేక రాజీ పడటానికి అవకాశం ఉందా అని తెలుసుకోవటానికి కౌన్సెలర్‌ ఆ ఇద్దరినీ కూర్చోబెట్టి మాట్లాడి సంధి కుదర్చడానికి ప్రయత్నిస్తారు. విడాకులు తీసుకుంటే వచ్చే సమస్యలూ పిల్లలు ఎదుర్కొనే ఇబ్బందులూ తదితరాలన్నిటి గురించీ వారికి వివరిస్తారు. భావోద్వేగాలు శ్రుతిమించడం వల్ల దూరమైన జంటలను దగ్గర చేయడానికి మధ్యవర్తిత్వమే మేలైన మార్గం. ఎంత ప్రయత్నించినా రాజీ కుదరకపోతేనే- కోర్టుకి వెళ్లాల్సి ఉంటుంది.

కుటుంబ న్యాయస్థానాల్లో వివాహ సంబంధ కేసులే చూస్తారు. ఆస్తుల తగాదాల్లాంటి సివిల్‌ కేసులను కోర్టు బయట పరిష్కరించుకోవాలనుకుంటే ఆ విషయం తెలియజేస్తూ న్యాయస్థానానికి దరఖాస్తు చేసుకోవాలి. అప్పుడు ఆ కేసుని న్యాయస్థానం లోక్‌ అదాలత్‌కి పంపిస్తుంది. అలా కాకుండా ఇరుపక్షాలూ మధ్యవర్తి ముందుకు వెళ్లాలనుకుంటే ప్రతి జిల్లా కోర్టులోనూ మీడియేషన్‌ సెంటర్లున్నాయి. అక్కడ మధ్యవర్తుల బృందం ఉంటుంది. ఇరుపక్షాలూ వారి తరఫు లాయర్లూ మధ్యవర్తిత్వానికి సమ్మతిస్తే అక్కడికి వెళ్లవచ్చు. మధ్యవర్తిత్వం విజయవంతమై కక్షిదారులిద్దరూ ఒక ఒప్పందానికి వస్తే ఆ ఒప్పందాన్ని రికార్డు చేసి కోర్టుకు పంపిస్తారు. దాని ఆధారంగా కోర్టు డిక్రీ (చట్టపరమైన ఆదేశం)ఇస్తుంది. లోక్‌ అదాలత్‌లో కానీ, మధ్యవర్తి దగ్గర కానీ ఇలా ఒప్పందానికి వచ్చినప్పుడు ఇక ఆ నిర్ణయంపై మరోసారి పై కోర్టుకి అప్పీల్‌కి వెళ్లడానికి వీలవదు. ఇరుపక్షాలూ ఒక అంగీకారానికి వచ్చాకనే అది డిక్రీ అవుతుంది కాబట్టి దాన్నే తుది తీర్పుగా పరిగణించాలి. ఆర్బిట్రేషన్‌ ప్రక్రియ కూడా ఇలాంటిదే.

అది ఎందుకు?

మధ్యవర్తిత్వం అనేది ఇరు పక్షాల మధ్య రాజీ కుదిర్చి ఒక ఒప్పందానికి రావడానికి దోహదం చేస్తే, ఆర్బిట్రేషన్‌లో న్యాయమూర్తి ఇరుపక్షాల వాదనలూ విని స్వయంగా తీర్పును వెల్లడిస్తారు. ఉదాహరణకు రెండు రాష్ట్రాల మధ్య జలవివాదమో, రెండు వాణిజ్యసంస్థల మధ్య గొడవో చోటుచేసుకుంటే- అప్పుడు హైకోర్టు వారిద్దరి కోరిక మేరకు ఆర్బిట్రేటరును నియమిస్తుంది. ఆయన ఇరుపక్షాలూ ఏయే విషయాలను సెటిల్‌ చేసుకోవాలనుకుంటున్నాయో తెలుసుకుని వాళ్ల ముందు ఉన్న అవకాశాలేమిటో వివరిస్తారు. వాటి లాభనష్టాలను అన్ని కోణాల్లోనూ చర్చిస్తారు. ఆ తర్వాత ఇద్దరికీ అనుకూలంగా ఉండేలా సెటిల్‌మెంట్‌ చేసి అగ్రిమెంట్‌ రాస్తారు. దానిమీద అందరూ సంతకాలు పెట్టారంటే అది డిక్రీ అయిపోతుంది. అదే మధ్యవర్తుల విషయానికి వస్తే వారు న్యాయమూర్తులు కారు, ఆర్బిట్రేటర్లుగా న్యాయమూర్తులనే నియమిస్తారు.  
కంపెనీలూ వ్యాపారాలూ లాంటివి పెట్టుకునేటప్పుడు భాగస్వాములు అగ్రిమెంటులో ‘మామధ్య వివాదాలు వస్తే ఆర్బిట్రేటరు సాయంతో పరిష్కరించుకుంటాము’ అని రాసుకుంటే వాళ్లు కోర్టుకు వెళ్లడానికి ఉండదు. ఆర్బిట్రేటర్‌ దగ్గరికే వెళ్లాల్సి ఉంటుంది. ఈ ఆర్బిట్రేషన్‌ ప్రక్రియకి ఈ మధ్య కాలంలో ఎక్కువ ప్రాధాన్యం లభిస్తోంది. పెద్ద పెద్ద వ్యాపార సంస్థ్లలు తమ పోటీ సంస్థలతో తగవులన్నిటినీ ఆర్బిట్రేషన్‌ విధానంలోనే పరిష్కరించుకుంటున్నాయి.అమెరికా, కెనడా, యూరప్‌, జపాన్‌ తదితర దేశాల్లో అయితే- కుటుంబ, వాణిజ్య, కార్మిక, వినియోగ, సివిల్‌... ఏ వివాదాలైనా సరే కోర్టుకు ఎక్కేముందు తప్పనిసరిగా మధ్యవర్తిత్వంతో పరిష్కారానికి ప్రయత్నించాలని నిబంధన ఉంది. ఆ దేశాల్లో దాదాపు 80 శాతం కేసులు మధ్యవర్తిత్వం ద్వారానే పరిష్కారమవుతున్నాయనీ అందుకే అక్కడి కోర్టులపై భారం ఉండడం లేదనీ, మొత్తంగా న్యాయపరిపాలనా వ్యవస్థ పటిష్ఠంగా ఉందనీ చెబుతున్నారు నిపుణులు. వివాద పరిష్కారంలో మధ్యవర్తిత్వాన్ని తప్పనిసరి తొలిమెట్టుగా పరిగణించాలనీ దానికోసం ఒక ప్రత్యేక చట్టం తీసుకురావాలనీ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ ప్రతిపాదించారు. దాంతో 2021 డిసెంబరులో ప్రభుత్వం పార్లమెంటులో మధ్యవర్తిత్వ బిల్లును ప్రవేశపెట్టింది. పార్లమెంటరీ స్థాయీ సంఘం ముందుకు వెళ్లిన ఈ బిల్లు చట్టమై వస్తే మధ్యవర్తిత్వ ప్రక్రియలకు మరింత వెసులుబాటు కలుగుతుంది. కక్షిదారులు స్వచ్ఛందంగా ఈ విధానాన్ని ఎంచుకోవచ్చు. నిజానికి గతంలోనూ కొన్ని చట్టాల్లో మధ్యవర్తిత్వానికి గుర్తింపును ఇచ్చే సెక్షన్లు ఉన్నాయి. సివిల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ (1908), మధ్యవర్తిత్వం, రాజీ చట్టం(1996), కంపెనీల చట్టం(2013), వాణిజ్య కోర్టుల చట్టం(2015), వినియోగదారుల రక్షణ చట్టం(2019) తదితరాల్లో అలాంటి సెక్షన్లు ఉన్నా వాటి గురించి ప్రజలకు తెలియదు. న్యాయనిపుణులు కూడా వాటిమీద ఎక్కువ దృష్టి పెట్టలేదు. దాంతో వాటిని ఆచరణలో ఉపయోగించడం అరుదైపోయింది. ప్రత్యేకంగా మధ్యవర్తిత్వం కోసమే సమగ్ర చట్టం ఒకటి అవసరమన్న వాదనకి అదే కారణం. ఆ చట్టం ఉంటే సివిల్‌, వాణిజ్య వివాదాల్లో కోర్టుకి వెళ్లేముందు తప్పనిసరిగా మధ్యవర్తిత్వంతో సమస్య పరిష్కారానికి ప్రయత్నించేందుకు అవకాశం ఉంటుంది. స్థానిక వివాదాల నుంచి అంతర్జాతీయ వివాదాల వరకూ ఏవైనా సామరస్యంగా పరిష్కరించుకోవచ్చు. చాలావరకూ క్రిమినల్‌ కేసులకు మూలం కూడా సివిల్‌ వివాదాల్లోనే ఉంటుంది. అందువల్ల సివిల్‌ వివాద దశలోనే మధ్యవర్తిత్వంతో సమస్యను పరిష్కరించుకోవడం మంచిది. అవసరమైన సందర్భాల్లో మధ్యవర్తిత్వాన్ని ఆంతరంగికంగా, రహస్యంగా జరిపేందుకూ వీలుంది. రెండుసార్లు అక్కడ ప్రయత్నించి పరిష్కారం కుదరనప్పుడు మాత్రమే కోర్టుకు వెళ్లొచ్చు. అయితే, కేవలం చట్టం ద్వారా ఒక విధానాన్ని ప్రజలకు చేరువ చేయడం సాధ్యం కాదు. దానికి కక్షిదారులూ న్యాయవాదులూ న్యాయమూర్తులూ స్వచ్ఛందంగా పూనుకోవాలి.  


మధ్యవర్తులుగా ఎవరైనా ఉండవచ్చా?

శిక్షణ పొందిన న్యాయవాదుల్నే మధ్యవర్తులుగా నియమిస్తారు. లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ అన్ని జిల్లా కోర్టుల్లోనూ 42 గంటల వ్యవధి గల శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటుంది. దానికి తోడు మధ్యవర్తిగా పనిచేయబోయేవారికి ఎంతో సహనం ఉండాలి. రెండు పార్టీల విషయాల్నీ శ్రద్ధగా వినగలగాలి. ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలన్నీ సూచించగలగాలి. ఎవరినీ బలవంతం చేయకూడదు. నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. ఇలాంటి లక్షణాలు ఉన్నవారిని ఎంపిక చేసుకుని మీడియేషన్‌ అనేది ఎలా చేయాలి, ఎన్నిసార్లు చేయాలి, ఎప్పుడు విడివిడిగా కూర్చోబెట్టి మాట్లాడాలీ, ఏ దశలో కలిపి కూర్చోబెట్టి మాట్లాడాలీ, ఇద్దరి మధ్య అభిప్రాయభేదాలని ఎలా పరిష్కరించాలీ... లాంటివన్నీ శిక్షణ ఇస్తారు.

మధ్యవర్తిత్వం వల్ల లాభాలేంటి?

ఒకప్పుడు రాజులు యుద్ధాలను నివారించడానికి ప్రత్యర్థి వద్దకు రాయబారుల్ని పంపి సంధి కుదుర్చుకునేవారు. ఆధునిక చరిత్రలోనూ పలు దేశాల మధ్య సామరస్యపూర్వక ఒప్పందాలకు మధ్యవర్తిత్వమే కారణం. ఇద్దరు వ్యక్తులో రెండు సంస్థలో సంవత్సరాల తరబడి కోర్టులో చేసే పోరాటాలను మధ్యవర్తిత్వంతో ఆపవచ్చు. మధ్యవర్తిత్వం వల్ల ఒకరు గెలవడం మరొకరు ఓడిపోవడం ఉండదు. సమన్యాయం జరుగుతుంది కాబట్టి ఇద్దరూ విజేతలే అవుతారు. తక్కువ ఖర్చుతో, తక్కువ సమయంలో వివాదం పరిష్కారమైపోతుంది. కక్షిదారులిద్దరూ జీవితకాలపు శత్రువులు కానక్కరలేకుండా రెండు కుటుంబాల మధ్య సఖ్యత నెలకొంటుంది. న్యాయస్థానాల మీద కేసుల భారం తగ్గుతుంది.

ఉదాహరణకు ఒక్క వరకట్న వేధింపుల కేసు తీసుకుంటే అక్కడ మొదలై విడాకులు లేదా దాంపత్య హక్కుల పునరుద్ధరణ, పిల్లల సంరక్షణ, కుటుంబ నిర్వహణ, ఆస్తుల్లో వాటా... ఇలా ఎన్నో కేసులకు అది దారితీస్తుంది. అవి ఎప్పటికి పరిష్కారమవుతాయో తెలియదు. అన్నీ ఒకరికే సంబంధించినప్పటికీ వేర్వేరు విషయాలు కాబట్టి చాలా ఆలస్యమవుతుంది. అదే మధ్యవర్తిత్వానికి వెళ్తే అన్నీ ఒకేసారి పరిష్కారమవుతాయి. ఎంతో విలువైన సమయమూ డబ్బూ కూడా ఆదా అవుతాయి. తీవ్రమైన మోసాలు, పత్రాల తారుమారు, నకిలీ పత్రాల సృష్టి, మైనర్లకూ శారీరక, మానసిక స్వస్థత లేనివారికీ సంబంధించిన వివాదాలు, అలాగే క్రిమినల్‌ నేరాల ప్రాసిక్యూషన్‌పై వివాదాలూ, ప్రభుత్వ విధానాలూ నైతిక విలువలూ క్రమశిక్షణ చర్యలూ వృత్తి నిపుణుల అనుచిత ప్రవర్తనపై విచారణ... తదితరాలకు సంబంధించిన కేసుల్లో తప్ప మిగిలిన అన్నిచోట్లా మధ్యవర్తిత్వ ప్రక్రియ వర్తిస్తుంది.

అయినా ఇది ఎందుకు అంతగా ఆదరణ పొందలేదు?

సుప్రీంకోర్టు చొరవతో దాదాపు అన్ని ప్రధాన నగరాల్లోనూ సంప్రదింపుల బాటలో వివాదాల పరిష్కారానికి జరుగుతున్న ప్రయత్నాలు చెప్పుకోదగ్గ స్థాయిలో విజయవంతమవుతున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. అయినా ఇది ఇతర దేశాల్లో లాగా ఆదరణ పొందకపోవడానికి ప్రధాన కారణం- అవగాహన లేకపోవడమే. దానికితోడు కక్షిదారుల్లో ఏ ఒక్కరికి అంగీకారం కాకపోయినా మధ్యవర్తిత్వానికి వెళ్లేందుకు వీలుకాదు. కొందరు దాన్ని తమకు అనువుగా వాడుకుంటున్నారు. స్వార్థంతోనో అహంభావంతోనో పంతానికి పోయి కేసు పెట్టిన వారిమీద కక్ష సాధిస్తున్నారు. హైకోర్టుకీ సుప్రీంకోర్టుకీ అయినా వెళతాం కానీ రాజీపడే ప్రసక్తే లేదంటున్నారు. నష్టపరిహారం ఇవ్వాల్సివస్తే- ‘ఇప్పటికిప్పుడు వాళ్లకి ఎందుకివ్వాలి. అదే కోర్టుకెళ్తే ఇంకొన్నేళ్లు లాగించొచ్చుగా... నా మీద కేసు పెడతారా... తిరగనీ ఎన్నాళ్లైనా, నా సొమ్మేం పోయింది...’ ఇలా అనుకునేవాళ్లు ఎక్కువ. కోర్టులో అయితే కేసు వాయిదాలకు హాజరవకుండా ఎంతకాలమన్నా పొడిగించవచ్చు. ఈ ధోరణిలో మార్పు తేవాలంటే మధ్యవర్తిత్వం ప్రాధాన్యంపై అవగాహన పెచాలి. ఆ దిశగానే ఇప్పుడు ప్రయత్నాలు జరుగుతుండడం హర్షణీయం.

*          *           *

ఆలస్యమైతే అమృతమైనా విషమవుతుందంటారు. వివాదమైనా అంతే... నాన్చిన కొద్దీ ఇరువర్గాల మధ్యా శత్రుత్వం మరింతగా పెరుగుతుంది. అదే త్వరగా పరిష్కరించుకుంటే కుటుంబంలో అయినా సమాజంలో అయినా శాంతీ సుహృద్భావాలు నెలకొంటాయి. అందుకే... మధ్యవర్తిత్వానికి అంత ప్రాధాన్యం..!


హైదరాబాద్‌లో తొలి ఆర్బిట్రేషన్‌ కేంద్రం

న దేశంలోనే మొట్టమొదటి అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ కేంద్రం ‘ఇంటర్నేషనల్‌ ఆర్బిట్రేషన్‌ అండ్‌ మీడియేషన్‌ సెంటర్‌- ఐఏఎంసీ’ హైదరాబాద్‌లో గత డిసెంబరులో ఏర్పాటైంది. దీంతో ఇలాంటి కేంద్రాలున్న దుబాయ్‌, సింగపూర్‌, లండన్‌, పారిస్‌, న్యూయార్క్‌ లాంటి నగరాల సరసన హైదరాబాద్‌ కూడా చేరింది. ఈ కేంద్రం ప్యానెల్‌లో అంతర్జాతీయ స్థాయి ఆర్బిట్రేటర్లు ఉన్నారు. తొలి మూడు నెలల్లోనే మూడువేల కోట్ల రూపాయల విలువ గల వివాదాలు ఈ సంస్థ ముందుకు వచ్చాయి. విడాకులు కోరుతూ వచ్చిన ఒక జంట కేవలం ఐదు దఫాల చర్చలతో రాజీపడి సఖ్యతగా తిరిగివెళ్లడం విశేషం. నెలల తరబడి అద్దె చెల్లించకుండా వేధించిన కేసు అరగంటలో పరిష్కారమైంది. ఇంధన, స్థిరాస్తి, కుటుంబ వివాదాలు సహా మొత్తం 22 రకాల కేసుల్ని ఇక్కడ పరిష్కరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..