‘ఈ పని చెయ్యి’ అంటే చాలు... చేసేస్తుంది!

‘హలో! నేను గాంధీచౌక్‌కి వెళ్ళాలి ఆటో బుక్‌ చెయ్‌. అక్కడి మల్టిప్లెక్స్‌లో ప్రభాస్‌ సినిమాకి టికెట్స్‌ రిజర్వ్‌ చేసెయ్‌.

Updated : 04 Feb 2024 17:13 IST

‘హలో! నేను గాంధీచౌక్‌కి వెళ్ళాలి ఆటో బుక్‌ చెయ్‌. అక్కడి మల్టిప్లెక్స్‌లో ప్రభాస్‌ సినిమాకి టికెట్స్‌ రిజర్వ్‌ చేసెయ్‌. టొమాటోలు, ఆలు, మిర్చి కావాలి. స్విగ్గీలైట్‌లో ఆర్డర్‌ పెట్టు...’ - ఇలా మనం చెప్పగానే అన్నీ చేసిపెట్టే వస్తువొకటి అరచేతిలో ఉంటే ఎలా ఉంటుంది! స్మార్ట్‌ఫోన్‌ ఉందిగా అంటారేమో? అందులో ప్రతి పనికీ ఓ ఆప్‌ని తెరవాలిగా... చదువురానివాళ్ళకది ఇబ్బంది కదా! వాళ్ళకోసమే వచ్చినట్టు ‘ర్యాబిట్‌ ఆర్‌1’ అనే పరికరం సంచలనం సృష్టిస్తోందిప్పుడు. అదేమిటో చూద్దామా...! 

కన్జ్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ షో... క్లుప్తంగా సీఈఎస్‌. అమెరికాలో జరిగే ఈ ప్రదర్శన కోసం ఏటా ప్రపంచం మొత్తం ఎదురుచూస్తుంటుంది. శామ్‌సంగ్‌, ఎల్జీ వంటి బడా సంస్థలు తమ సరికొత్త పరికరాలని ఇందులోనే ప్రదర్శిస్తుంటాయి. అసలు అక్కడ ప్రదర్శనకి అవకాశం దక్కించుకోవడానికే ఎన్నో సంస్థలతో పోటీపడాలి. అలాంటి తీవ్ర పోటీలో - ఆ కుర్రాడు వెనకపడ్డాడు. జెస్సీ లియూ అన్నది అతని పేరు... చైనా నుంచి వచ్చి అమెరికాలో స్థిరపడ్డవాడు. అతను రూపొందించిన ‘ఆర్‌1’ అన్న ఆ పరికరానికి ఈసారి సీఈఎస్‌లో అవకాశం దక్కలేదు. అతనెంతో ప్రయత్నించగా ప్రదర్శన చివరి రోజు ఓ చిన్న హాలులో తన ప్రొడక్ట్‌ గురించి వివరించే అవకాశమిచ్చారు నిర్వాహకులు. దాన్ని అద్భుతంగా వినియోగించుకున్నాడు లియూ. ‘ర్యాబిట్‌ ఆర్‌1’ అన్న తన పరికరాన్ని పరిచయం చేస్తూ అతను చేసిన 20 నిమిషాల ప్రసంగం- ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. అది విని, ఆ పరికరాన్ని తీసుకుని పరీక్షించిన మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్ళ అబ్బురపడ్డాడు. ‘2007లో ఆపిల్‌ అధినేత స్టీవ్‌జాబ్స్‌ ఐఫోన్‌లని ప్రపంచానికి పరిచయం చేసిన సందర్భంలాంటిదే ఇది కూడా! ‘ర్యాబిట్‌ ఆర్‌1’ అంతే సంచలనం సృష్టిస్తుంది’ అంటూ కితాబిచ్చాడు. ఆయన జోస్యాన్ని నిజం చేస్తూ కేవలం వారంలోనే 50 వేల పరికరాలకి ఆర్డర్‌లు వచ్చాయి. రావడమే కాదు- ‘ర్యాబిట్‌ ఆర్‌1’తో ఇక స్మార్ట్‌ఫోన్‌ల హవాకి తెరపడినట్టే అన్న మాట కూడా చక్కర్లు కొడుతోంది!

స్మార్ట్‌ఫోన్‌ చేయలేనివి...

స్మార్ట్‌ఫోన్‌ అంటే మనకి ఆప్‌లే గుర్తుకువస్తాయి. మెసేజికో ఆప్‌, కారు బుకింగ్‌కి ఒకటీ, సినిమాలకి ఇంకొకటీ, ట్రైన్‌కి ఒకటీ... ఇలా చాలా ఉంటాయి వాటిల్లో. ప్రతిదాన్నీ వాడాలంటే- కాస్తోకూస్తో చదువుకుని ఉండాలి. చదువురానివాళ్ళనీ అంధుల్నీ వృద్ధుల్నీ ఇవి ఇబ్బందిపెడతాయి. అలాకాకుండా- ఆప్‌లతో పనిలేకుండానే మనక్కావాల్సినవన్నీ చేసిపెడుతుంది ‘ర్యాబిట్‌ ఆర్‌1’ పరికరం. ఐఫోన్‌లలోని సిరి, అమెజాన్‌ అలెక్సా, గూగుల్‌ అసిస్టెంట్‌-లు కూడా మనం అడగ్గానే కొన్ని పనులు చేసిపెడతాయి కదా అని అడగొచ్చు. వాటికి చాలా పరిమితులున్నాయి. ఉదాహరణకి అలెక్సాని ట్యాక్సీ బుక్‌ చేయమని అడిగితే- ఓలా, ఉబర్‌ ఆప్‌లని చూపిస్తుందంతే.

అందులో అడ్రెస్‌ వగైరాలు మనమే టైప్‌ చేయాలి. కానీ- ‘ర్యాబిట్‌ ఆర్‌1’ అలా కాదు. చెప్పిన కొద్దిక్షణాల్లోనే మనం ఎక్కడికెళ్ళాలో అక్కడికి బుక్‌ చేసేస్తుంది. ఈరోజు మీకేం వంటచేయాలో తోచలేదనుకోండి. అలాంటప్పుడు ఈ ‘ర్యాబిట్‌ ఆర్‌1’ పరికరంలోని కెమెరాకి మన ఫ్రిజ్‌ని తెరిచి చూపిస్తే చాలు. ఉన్నవాటితో మనం ఏమేం వంటలు చేయొచ్చో- వాటి రెసిపీలతో సహా క్షణాల్లో చెప్పేస్తుంది! మీ ఎదురుగా ఓ కొత్త వస్తువో మీకు పెద్దగా పరిచయంలేని ఏ ప్రముఖుడి ఫొటోనో ఉందనుకుందాం. వాటి గురించి తెలుసుకోవాలంటే దాన్ని మీరు ఫొటో తీసి, గూగుల్‌ ఇమేజెస్‌లో పెట్టి వెతకాలి. కేవలం కొన్ని నిమిషాలైనా పట్టే పని అది. అదే బొమ్మని ‘ఆర్‌1’లోని కెమెరాకి చూపిస్తే కొన్ని క్షణాల్లోనే చరిత్రమొత్తాన్నీ చదివి వినిపించేస్తుంది. అరచేతికన్నా చిన్నగా ఉండే ఈ పరికరం ఇన్ని పనులు ఎలా చేయగలుగుతోందంటే...  

‘ఏఐ’తోనే...

గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘చాట్‌జీపీటీ4’ గురించి విని ఉంటారుకదా! మనం అడిగిన ఏ విషయంపైనైనా గూగుల్‌కన్నా లోతుగా సమగ్రంగా సమాచారాన్ని మనముందు పెట్టే ‘ఏఐ’ సాంకేతికత ఇది. దీన్ని ‘లార్జ్‌ లాంగ్వేజ్‌ మోడల్‌’(ఎల్‌ఎల్‌ఎమ్‌) అన్న విధానంతో తయారుచేశారు. అంటే- ప్రపంచంలోని వివిధ భాషలకి చెందిన మాటల్నీ, వాక్యాలనీ పుంఖానుపుంఖాలుగా కంప్యూటర్‌లోకి చొప్పించడం అన్నమాట. అలా అన్నిభాషలనీ తెలుసుకుంటుంది గనకే మనం ఏ ప్రశ్న అడిగినా కంప్యూటర్‌ చటుక్కున చెప్పేస్తుంది! కంప్యూటర్‌కి అలా మాటల్ని కాకుండా చేతల్ని నేర్పిస్తే ఎలా ఉంటుంది...? అన్న ఆలోచన వచ్చింది శాస్త్రవేత్తలకి. అంటే- ‘ఓ సినిమా షో బుక్‌చేయాలంటే... స్టెప్‌1- సంబంధిత సైట్‌కి వెళ్ళాలి, స్టెప్‌2 - థియేటర్‌ ఖాళీగా ఉందోలేదో చూడాలి...’ ఇలా వరసగా నేర్పిస్తూ వెళ్ళడమన్నమాట. ఇలా కంప్యూటర్‌కి ‘పనులు’ నేర్పించడాన్నే లార్జ్‌ యాక్షన్‌ మోడల్‌(ఎల్‌ఏఎమ్‌) అంటారు! ఈ సరికొత్త టెక్నాలజీ ఆధారంగానే తన ‘ర్యాబిట్‌ ఆర్‌1’ని సృష్టించాడు జెస్సీ లియూ! స్మార్ట్‌ఫోన్లలా ఆప్‌ అవసరమే లేకుండా దీన్ని తీర్చిదిద్దాడు. దాంతో ఖర్చు భారీగా తగ్గించగలిగాడు. దాని ఆధారంగానే ‘ర్యాబిట్‌ టెక్‌’ అన్న స్టార్టప్‌ని పెట్టాడు. కేవలం రూ.16 వేలకే ఈ పరికరాన్ని అందిస్తూ... సంచలనం సృష్టిస్తున్నాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..