పరిమళాలకు దృశ్య రూపం!

వాసనలకు చిత్ర రూపాన్ని అభివృద్ధి చేశారు కాలిఫోర్నియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. ‘వాసనని గ్రహించే కణాల లోతైన అధ్యయనం ద్వారా వేలకొద్దీ వాసనలు..

Updated : 21 May 2023 04:23 IST

వాసనలకు చిత్ర రూపాన్ని అభివృద్ధి చేశారు కాలిఫోర్నియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. ‘వాసనని గ్రహించే కణాల లోతైన అధ్యయనం ద్వారా వేలకొద్దీ వాసనలు... వాటి గ్రాహకాలతో అనుసంధానమయ్యే విధానాన్ని గుర్తించాలనుకున్నా’మని చెబుతారు ఈ పరిశోధనలో కీలకవ్యక్తి ఆశిష్‌ మాంగ్లిక్‌. అందులో భాగంగా ఆ ప్రక్రియకో చిత్ర రూపం తేవాలనుకున్నారు. వాసనల వ్యవస్థ పియానో కీబోర్డ్‌ తరహాలో పనిచేస్తుంది. కొన్ని రకాల శబ్దాలు రావడానికి ఒకటికంటే ఎక్కువ మెట్లు కలిసి పనిచేసినట్టే ఒక వాసనని పసిగట్టడానికి గ్రాహకాలు సమూహంగా పనిచేస్తాయి. దీని చిత్రీకరణ కోసం క్రియో-ఎలక్ట్రాన్‌ మైక్రోస్కోపీని ఉపయోగించారు. అందుకు ముక్కుతోపాటు పొట్టలోనూ ఉండే ఓఆర్‌51ఈ2 గ్రాహకాన్ని తీసుకున్నారు. ఇది ప్రొపయనేట్‌కు స్పందిస్తుంది. స్విస్‌ ఛీజ్‌లో వచ్చే ఘాటైన వాసనలో ఈ ప్రొపయనేట్‌ ఉంటుంది. క్రియో-ఈఎమ్‌తో మిల్లీగ్రామ్‌ పరిమాణంలో ఉన్న ప్రొటీన్‌ని అణువు పరిమాణంలో చిత్రంగా తీయొచ్చు. కానీ వీరు మిల్లీగ్రామ్‌లో వందోవంతు పరిమాణంలోని ఓఆర్‌51ఈ2కు పరమాణువు సైజులో 3డీ ప్రింట్‌ రూపాన్ని తెచ్చారు. గ్రాహకాన్నీ, ఛీజ్‌నీ అతి దగ్గరగా ఉంచడంవల్ల ఇది సాధ్యమైంది. దీన్ని చాలా కీలకమైన అడుగుగా చెబుతున్నారు. కొత్త పరిమళాల సృష్టి, వాసనల్ని దృష్టిలో పెట్టుకుని ఔషధ తయారీ, ఆహార రంగం సహా మరెన్నో ఇతర రంగాల్లోనూ ఈ ప్రయోగ ఫలాలు ఉపయోగపడతాయట.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..