ఆ ప్రేమలేఖలు మంచి జ్హాపకాలు

ఎదుటివారి పట్ల ఉన్న ప్రేమను తెలియజేసేందుకు ప్రేయసీప్రియులు ప్రేమలేఖలు రాసుకోవడమనేది తెలిసిందే. ఇప్పుడు అవి ఉన్నాయా లేవా అనేది పక్కనపెడితే...

Updated : 11 Feb 2024 07:57 IST

ఎదుటివారి పట్ల ఉన్న ప్రేమను తెలియజేసేందుకు ప్రేయసీప్రియులు ప్రేమలేఖలు రాసుకోవడమనేది తెలిసిందే. ఇప్పుడు అవి ఉన్నాయా లేవా అనేది పక్కనపెడితే... తెరపైన ప్రేమను పండించే ఈ తారలు తమ ప్రేమలేఖల కహానీలను చెబుతున్నారిలా...


ఆ అమ్మాయి ఓకే చెప్పింది

- నాని

నేనెవరికీ ప్రేమలేఖ రాయలేదు, అందుకోలేదు కానీ... ఓ ప్రేమలేఖ నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. నేను సిద్ధార్థ రెసిడెన్షియల్‌లో ఉన్న రోజులవి. డే స్కాలర్స్‌ అయిన అమ్మాయిలు
మా డార్మిటరీ మీదుగానే కాలేజీకి వెళ్లేవారు. మాతో ఉండే ఓ అబ్బాయి ఆ అమ్మాయిల్లో ఒకరికి లవ్‌లెటర్‌ రాశాడోసారి. అందులో అతడు తన వివరాలను చెప్పకుండా తనని ఇష్టపడితే మర్నాడు ఎనిమిది గంటలకల్లా డార్మిటరీ 1 దగ్గరకు వచ్చి కలవమని రాశాడు. మర్నాడు అదే సమయానికి అక్కడ అనుకోకుండా నేను నిల్చుని ఉన్నా. కాసేపటికి ఓ అమ్మాయి వచ్చి ‘ఓకే’ అనేసి వెళ్లిపోయింది. నాకేమీ అర్థంకాలేదు. చివరకు వార్డెన్‌ పిలిచి తిట్టడంతో నాకు ఆ ఉత్తరం గురించి తెలిసింది. అయితే నాకూ అమ్మాయిలు పడతారనే ఆత్మవిశ్వాసం మాత్రం నాలో కలిగిందనుకోండీ.

విందు ఖరీదు లక్ష రూపాయలు!


ఆ ఉత్తరాన్ని దాచుకున్నా

-కీర్తి సురేష్‌

కొన్నాళ్ల క్రితం నేనో నగల దుకాణం ప్రారంభోత్సవానికి వెళ్తే గుంపులోంచి ఓ అబ్బాయి గబగబా వచ్చి నా చేతికి పెద్ద పుస్తకాన్ని ఇచ్చేసి వెళ్లిపోయాడు. ఆ తరువాత దాన్ని తెరిచి చూస్తే అందులో నాకు సంబంధించిన ఫొటోలతోపాటు ఓ ఉత్తరం కూడా కనిపించింది. తనని పెళ్లి చేసుకోమని అడుగుతూ ఆ అబ్బాయి నాకు రాసిన ప్రేమలేఖ అది. విచిత్రం ఏంటంటే... ఉత్తరంతోపాటూ ఆ అబ్బాయి ఫొటో, వ్యక్తిగత వివరాలు కూడా అందులో ఉన్నాయి. మొత్తం చదివాక ఒక్క క్షణం షాకయ్యా గానీ ఆ తరువాత నవ్వొచ్చింది. అది నేను అందుకున్న మొదటి లవ్‌లెటర్‌ కావడంతో నా దగ్గర అలాగే దాచుకున్నా.అదేంటీ అంటారేమో... చదువుకుంటున్నప్పుడు నాకు ఒక్కరు కూడా లవ్‌లెటర్‌ రాయలేదు మరి.


అది చదివి కొట్టారు

- సాయి పల్లవి

నేను రాసుకున్న మొదటి - చివరి ప్రేమలేఖ నాకు ఇప్పటికీ గుర్తే. అప్పుడు నేను ఏడో తరగతిలో ఉన్నాననుకుంటా. ఎందుకో తెలియదు కానీ నాకు మా స్కూల్లో ఓ అబ్బాయి బాగా నచ్చాడు. ఆ విషయాన్ని అతడికెలా చెప్పాలో తెలియక నాకు తోచినట్లుగా ఓ లవ్‌లెటర్‌ను రాశాను. ఉత్తరం అయితే పూర్తయ్యింది కానీ ఆ అబ్బాయికి ఇవ్వడానికి ధైర్యం సరిపోక నా దగ్గరే పెట్టుకున్నా. ఓరోజు ఇంట్లోవాళ్లు ఆ ఉత్తరాన్ని చూసి నన్ను బాగా తిట్టారు, కొట్టారు. దాంతో మరోసారి నేను అలాంటి పనిచేయక పోయినా... ఆ దెబ్బలు నాకు ఇంకా గుర్తున్నాయి. ఆ వయసులో ఆ తరహా ఉత్తరం ఎలా రాయగలిగాననేది నాకు ఇప్పటికీ అర్థం కాదు కానీ ఆ సందర్భాన్ని తలచుకున్నప్పుడు మాత్రం నవ్వొస్తుంది.


అయిదో తరగతిలో అందుకున్నా

- అదితిరావ్‌ హైదరీ

అప్పుడు నేను అయిదో తరగతిలో ఉన్నా. ఓరోజు మా సీనియర్‌ నుంచి ఉత్తరాన్ని అందుకున్నా. ఇంటికెళ్లి తెరిచి చూస్తే రెండు పేజీల్లో రాసిన ప్రేమలేఖ అది. దాన్ని ఒకటికి రెండుసార్లు చదివాక చాలా థ్రిల్లింగ్‌గా, గర్వంగా అనిపించింది. ఆ వయసులో ఒక అబ్బాయి నుంచి లవ్‌లెటర్‌ అందుకున్నందుకు నన్ను నేను చాలా గొప్పగా ఊహించుకున్నా. దాన్ని ఎవరో ఒకరికి చూపించాలనిపించింది. ఆ ఎవరో అమ్మే ఎందుకు కాకూడదని అమ్మ దగ్గరకు వెళ్లి నవ్వుతూ ఉత్తరాన్ని అందించా. అమ్మ దాన్ని చదివాక ఏమనలేదు కానీ కొన్ని రోజులకే నన్ను బోర్డింగ్‌ స్కూల్‌కు పంపించేసింది.


బోలెడు రాసేవాడిని

- రణ్‌బీర్‌ కపూర్‌

చదువుకుంటున్న రోజుల్లోనే... అమ్మాయిలకు ప్రేమలేఖలు రాసేవాడిని. అంతేనా... ఆ రోజుల్లో అమ్మానాన్నలూ, తాతా నానమ్మలు రాసుకున్న ఉత్తరాలను తీసుకుని ఎవరూ చూడకుండా చదవడమూ నేను ఇష్టంగా చేసే పనుల్లో ఒకటి. ఇప్పుడు ఆలోచిస్తే ఆ ఉత్తరాల్లో స్వచ్ఛమైన ప్రేమ, ఒకరిపట్ల మరొకరికి ఉన్న శ్రద్ధ కనిపించేవి. ఈ రోజుల్లో అవన్నీ తగ్గిపోయాయి కానీ నిజంగా ఉత్తరాలకు ఉన్న విలువే వేరు. అందుకే ఇప్పుడు ఆలియా మా అమ్మాయి పేరుమీద ఒక ఈ మెయిల్‌ ఐడీని పెట్టి రోజుకో ఉత్తరం రాయడాన్ని ఓ అలవాటుగా పెట్టుకుంది. ఆలియాలా నేను కూడా మా అమ్మాయికి ఆసక్తికరమైన ఉత్తరాలు రాయాలని అనుకుంటున్నా.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..