పిల్లల్ని ఇలా పెంచాలట..!

‘నా బిడ్డకేం తక్కువ... రాజాలా పెంచుతా...’ ప్రతి తండ్రీ అనుకునే మాటే ఇది. అడిగినవన్నీ కొనిచ్చీ... ఆస్తులు సంపాదించిపెట్టీ... నిజంగానే పిల్లల కోసం మన దేశంలో తల్లిదండ్రులు చేస్తున్నంత మరెవరూ చేయరేమో! అందుకే రెండేళ్ల క్రితం 64 వేల కోట్లు ఉన్న పిల్లల వస్తువుల మార్కెట్‌ విలువ ఐదేళ్లలో లక్షా 20 వేల కోట్ల రూపాయలకు చేరుతుందని నిపుణుల అంచనా.

Updated : 08 Jan 2023 06:54 IST

పిల్లల్ని ఇలా పెంచాలట..!

‘నా బిడ్డకేం తక్కువ... రాజాలా పెంచుతా...’ ప్రతి తండ్రీ అనుకునే మాటే ఇది. అడిగినవన్నీ కొనిచ్చీ... ఆస్తులు సంపాదించిపెట్టీ... నిజంగానే పిల్లల కోసం మన దేశంలో తల్లిదండ్రులు చేస్తున్నంత మరెవరూ చేయరేమో! అందుకే రెండేళ్ల క్రితం 64 వేల కోట్లు ఉన్న పిల్లల వస్తువుల మార్కెట్‌ విలువ ఐదేళ్లలో లక్షా 20 వేల కోట్ల రూపాయలకు చేరుతుందని నిపుణుల అంచనా. పిల్లల్ని పెంచడమంటే అన్ని సౌకర్యాలూ అమర్చడమేనా, వాళ్లకి కావలసిందేమిటీ, మనం ఇస్తున్నదేమిటీ... అన్న ఆలోచన అమ్మానాన్నల్ని ఎప్పుడూ వేధిస్తూనే ఉంటుంది. ఆ ఆందోళనని ఆచరణ దిశగా మళ్లిస్తుంది ‘ద విజ్‌డమ్‌ బ్రిడ్జ్‌’ పుస్తకం. ‘దాజి’గా పేరొందిన ఆధ్యాత్మికవేత్త కమలేశ్‌ డి.పటేల్‌ రాసిన ఈ పుస్తకం తల్లిదండ్రుల ఎన్నో సందేహాలకు సమాధానమిస్తుంది.

క యువకుడు గురుకులంలో ఉండి అన్ని విద్యలూ నేర్చుకున్నాడు. అతడు తిరిగి ఇంటికి వెళ్లిపోయే సమయం వచ్చింది. గురువు భార్య దగ్గర వీడ్కోలు తీసుకోవడానికి వెళ్లాడు. తమ కళ్లముందు చదువుకుంటూ పెరిగిన ఆ అబ్బాయి మీద ఆమెకి పుత్రవాత్సల్యం. తమను విడిచి వెళ్లిపోతున్నాడని బెంగ. ‘వెళుదూ గానీలే... ముందు భోజనం చెయ్యి, కాసేపు విశ్రాంతి తీసుకో...’ అంటూ ఆ వంకా ఈ వంకా చెప్పి సాయంత్రం వరకూ కళ్లకెదురుగా కూర్చోబెట్టుకుంది. ఇక గురువు వచ్చే వేళ కాగానే ఆ అబ్బాయి చేతికి ఒక లాంతరు ఇచ్చి జాగ్రత్తగా వెళ్లిరమ్మని సాగనంపింది.

కాస్త దూరం వెళ్లాడో లేదో గురువు పిలిచినట్లు వినిపించింది అతనికి. వెనక్కి వెళ్లాడు. శిష్యుడి చేతిలోని లాంతరు తీసుకుని ఆయన ‘ఇక వెళ్లు. జాగ్రత్త’ అన్నాడు. చీకట్లో వెళ్తున్నవాడి చేతిలో దీపం తీసేసుకుని జాగ్రత్తగా వెళ్లమంటాడేంటీ... ఇంతకీ అతడు క్షేమంగా చేరాడా..!

నిజానికి ఈ సందిగ్ధావస్థ ప్రతి తల్లీ తండ్రీ పిల్లల పెంపకంలో ఎదుర్కొనేదే. ఇక్కడ గురువు భార్య- పిల్లల పట్ల మన ప్రేమకు ప్రతీక అయితే గురువు క్రమశిక్షణకు సంకేతం. విద్యావంతుడైన ఆ అబ్బాయికి జ్ఞానమే దారి చూపుతుందనీ దీపంతో పనిలేదనీ గురువు ఉద్దేశం. ప్రేమా క్రమశిక్షణా... ఈ రెంటి మధ్యా నలిగిపోని తల్లిదండ్రులు ఉండరు కదా. అందుకే తన పుస్తకాన్ని దాజి ఈ కథతోనే ప్రారంభించారు. పిల్లల పెంపకం గురించి ఆయన ప్రధానంగా తొమ్మిది సిద్ధాంతాలను చర్చించారు. తన జీవితం నుంచి
ఉదాహరణలు ఇస్తూ, సందర్భానుసారం శాస్త్రీయ పరిశోధనలను పేర్కొంటూ రాసిన ఈ పుస్తకం- మంచి తల్లిదండ్రులు ఎలా కావచ్చో చెబుతుంది. పిల్లల పెంపకంలో తాతయ్యలూ బామ్మల విలువేమిటో చాటుతుంది. ఈ ఆంగ్ల పుస్తకంలోని విశేషాల సారాంశం చూద్దామా!

ఊరంటే... ప్రాంతం కాదు!

బిడ్డను పెంచాలంటే ఊరంతా పూనుకోవాలని ఆఫ్రికన్ల సామెత. ప్రపంచంలో ఎక్కడైనా అంతేనేమో. ఒకప్పుడు మన సమాజాలన్నీ గ్రామీణ సమాజాలే. అక్కడ అందరూ కలిసిమెలిసి బంధాల్నీ బాధ్యతల్నీ పంచుకునేవారు. పిల్లల్ని పెంచడంలోనూ తలా ఒక చెయ్యీ వేసేవారు. బోలెడంత మంది సభ్యులతో సమష్టి కుటుంబాలుండేవి. వారందరి ప్రేమా ఆప్యాయతల నడుమ పిల్లలు భద్రంగా, స్వేచ్ఛగా పెరిగేవారు. నగర జీవితమూ, చిన్న కుటుంబాలూ, భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేయడమూ తప్పనిసరైన ఈ రోజుల్లో అలాంటి పెంపకం సాధ్యంకాదు. మరెలా..?

* చిన్న కుటుంబాల్లో పెరిగే పిల్లలు ఒంటరితనంతో బాధపడతారు. ఊరంటే ఒక ప్రాంతం కాదు, మనుషులు. పిల్లల్ని పెంచడానికి ఊరంతా తీసుకురాలేం కానీ తాతయ్యనీ, బామ్మనీ తీసుకురావచ్చు. వాళ్ల అనుభవం పిల్లల పెంపకంలోని సవాళ్లను ఎదుర్కొనడంలో సాయపడుతుంది. పిల్లల సంరక్షణకు బయటివారిమీద ఆధారపడితే ఆందోళనా ఆర్థికభారమూ కూడా. అదే సొంత మనుషులైతే అవేవీ ఉండవు.  

* పెద్దలు దగ్గర ఉండడం సాధ్యం కాక పోయినా పిల్లలు వారి ప్రేమకి దూరం కానక్కర్లేదు. ఫోన్లూ టెక్నాలజీని అందుకు వాడుకోవచ్చు. వారానికోసారైనా వీడియోకాల్‌ చేసి పెద్దలతో మాట్లాడించాలి. అనుబంధాలే ఒంటరితనాన్ని దూరంచేస్తాయి.

* అచ్చం అమ్మానాన్నల్లాగా చూసుకునే బంధువులూ పిల్లలకు అవసరం. ‘హాలో పేరెంటింగ్‌’ అంటారు దీన్ని. తాతయ్యా బామ్మలో, పెదనాన్నో, మామయ్యో... అందుబాటులో ఉండే ఎవరో ఒకరు ఆ పాత్ర పోషించాలి. ఆ సాన్నిహిత్యం పిల్లలు పెద్దయ్యాక కూడా మనసు విప్పి తమ కష్టసుఖాలు చెప్పుకోవడానికి వీలు కల్పిస్తుంది.

* దొరికిన సమయమంతా పిల్లలకు ఏవో నేర్పించేయాలనీ, చదివించేయాలనీ తాపత్రయం కూడదు. పిల్లల ప్రపంచంలో ఏం జరుగుతోందో తెలుసుకోవాలి.

* తల్లిదండ్రులు తమ బిడ్డ ‘స్పెషల్‌, టాలెంటెడ్‌’ అని చెప్పుకోవడానికి ఇష్టపడుతున్నారు. కానీ పిల్లలు ‘స్పెషల్‌’గా కాదు, ‘సెక్యూర్‌’గా ఫీలవ్వాలి. తమ పిల్లలు ‘స్పెషల్‌’ అనుకునే తల్లిదండ్రులు వారి సామర్థ్యాలపైనే దృష్టిపెడతారు. ఇతరుల ముందు గొప్పగా వారి విజయాలను ప్రదర్శిస్తారు. దాంతో పిల్లలు ఒకలాంటి అభద్రతాభావంలోకి నెట్టివేయబడతారు. ఈ విజయాలు సాధించకపోతే అమ్మానాన్నా నన్ను ప్రేమించరేమో- అని దిగులుపడతారు. పిల్లల గెలుపుని కాకుండా వివిధ అంశాల్లో వారు చూపే చొరవని ప్రశంసించాలి.

జ్ఞానవారధి నిర్మించాలి

జ్ఞానం- బోధించేది కాదు, గ్రహించేది... అంటారు దాజీ. ఒక తరం నుంచి మరో తరానికి జ్ఞానం ప్రసారమయ్యేది తల్లిదండ్రులనుంచి కాదు, తాతలూ బామ్మల నుంచేనట. దీనికి కారణం లేకపోలేదు... తల్లిదండ్రుల మీద ఉన్న సంపాదన బాధ్యతవల్ల పిల్లల్ని ఇంట్లో ఉన్న పెద్దల మీద వదిలేయడం మొదటినుంచి ఉన్నదే. అప్పుడు వేటకు వెళ్లేవారు, ఇప్పుడు ఉద్యోగాలకు వెళ్తున్నారు. దాంతో పిల్లల వ్యక్తిత్వానికి పునాది పడే బాల్యం అంతా వారు తాతయ్యలూ, నాయనమ్మ, అమ్మమ్మల పర్యవేక్షణలోనే గడుపుతారు. వారి దగ్గరే జీవన నైపుణ్యాలను నేర్చుకుంటారు. నిత్యజీవితంలో చేసే పనుల్లోనే అనుభవంతో తాము నేర్చుకున్న మెలకువలను సందర్భాన్ని బట్టి చెబుతూ ఉంటారు పెద్దలు. ఆచరణలో నేర్చుకునే ఇలాంటి అంశాలు పిల్లల మీద చెరగని ముద్రవేస్తాయి. అందుకే పెద్దల్ని ‘లివింగ్‌ విజ్‌డమ్‌ బ్రిడ్జ్‌’ అంటారు దాజీ. ప్రతి ఒక్కరి దగ్గరా ఏదో ఒక నైపుణ్యం ఉండితీరుతుంది. దాన్ని నేర్చుకునే అవకాశం పిల్లలకు ఇవ్వాలి. పెద్దల అనుభవజ్ఞానాన్ని తర్వాత తరాలకు అందించేందుకు ఉన్న ఏకైక మార్గం అదే.

సన్నద్ధత అవసరం

ఏ వయసులో పిల్లల్ని కనాలీ అన్నది నేటి సమాజంలో చర్చనీయాంశం. స్త్రీ పురుషులిద్దరూ కెరీర్‌కి పెద్దపీట వేస్తూ పెళ్లినీ, పిల్లల్నీ వాయిదా వేస్తున్నారు. అవి వారి వ్యక్తిగత విషయాలే కావచ్చు. ఇక్కడ మనం పిల్లల కోణంలో మాత్రమే సమస్యను చూద్దాం. 35 ఏళ్లు దాటాక పుట్టే పిల్లల్లో శారీరక, మానసిక సమస్యలు తలెత్తే అవకాశం ఉందని పరిశోధనలు చెబుతున్నాయి. రెండోది- పిల్లల్ని పెంచడానికి చాలా ఓపికా శక్తీ కావాలి. వయసు పెరిగే కొద్దీ అవి తగ్గిపోతాయి. తల్లిదండ్రులకే కాదు, వారికి తోడ్పాటునందించే పిల్లల నానమ్మా అమ్మమ్మల వయసూ పెరుగుతుంది. దాంతో వాళ్లూ ఓపిగ్గా పెంచలేకపోవచ్చు. ఆలస్యంగా పిల్లల్ని కంటే వాళ్లు జీవితంలో స్థిరపడేసరికి తల్లిదండ్రులు వృద్ధులైపోతారు. మనవల ముద్దూ ముచ్చట్లను ఆస్వాదించలేరు. ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకోవాలి. ఉద్యోగమూ ఆర్థిక విషయాల గురించి ఎలా ముందుగా ప్లాన్‌ చేసుకుంటామో అలాగే పిల్లల్ని ఆహ్వానించే సమయాన్నీ ప్లాన్‌ చేసుకోవాలి. అప్పుడే సంతోషంగా తల్లిదండ్రుల హోదాని ఆస్వాదించవచ్చు. వివాహబంధంలో తృప్తిగా ఆనందంగా ఉన్న జంటే మంచి తల్లిదండ్రులు కూడా కాగలరు. తల్లిదండ్రులు ఆనందంగా ఉంటే పిల్లలూ సంతోషంగా ఉంటారు. పిల్లలకు 50 శాతం సంతోషం జన్యుపరంగా తల్లిదండ్రులనుంచి వస్తే మిగిలిన 50 శాతం చుట్టూ ఉన్న పరిస్థితుల నుంచి వస్తుందట.

అమ్మ ఆనందమే..!

మహిళ గర్భం దాల్చిన విషయం తెలిసినప్పటినుంచీ కుటుంబసభ్యులూ బంధువులూ ఆమెను ప్రత్యేకంగా చూస్తారు. తినాలనిపించినవి చేసి పెడతారు. పుట్టింటికి తీసుకెళ్లి విశ్రాంతి ఇస్తారు. సీమంతమనో మరొకటనో వేడుకలు చేస్తారు. ఇవన్నీ ఆమెను ఆరోగ్యంగా, ఆనందంగా ఉంచడానికి చేసేవే. తల్లి సంతోషంగా ఉన్నప్పుడే కడుపులోని బిడ్డ సంతోషంగా ఉంటుంది. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో డచ్‌ వాళ్లు ఆహార కొరతతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వేలాది మంది ఆకలిచావులకు గురయ్యారు. ఆ పరిస్థితుల్లోనూ అక్కడి ఆస్పత్రులు రోగుల ఆరోగ్య రికార్డులను వివరంగా నమోదుచేశాయి. అప్పుడు గర్భిణులుగా ఉన్న దాదాపు 40వేల మంది మహిళలూ వారి పిల్లల ఆరోగ్యాల మీద ఎన్నో అధ్యయనాలు జరిగాయి. తల్లి కడుపులో ఉన్నప్పుడు ఎదుర్కొన్న పోషకాహారలేమి పలురకాల అనారోగ్యాల రూపంలో ఆ పిల్లల్ని జీవితకాలం వెంటాడిందని రుజువయ్యింది. మిగతా సమయాల్లో పుట్టిన పిల్లలతో పోలిస్తే అప్పుడు పుట్టినవారు ఎక్కువసార్లు ఆస్పత్రిలో గడపవలసి వచ్చిందట. గుండెజబ్బులు ఎక్కువగా వచ్చాయట. గర్భం దాల్చడమనేది కేవలం కాన్పు సాఫీగా అవడంతో అయిపోయే ప్రక్రియ కాదనీ బిడ్డ జీవితకాలపు ఆరోగ్యాన్ని గర్భంలో ఉన్నప్పటి సమయమే శాసిస్తుందనీ ఆ అధ్యయనాలు తేల్చి చెప్పాయి. అందుకే గర్భిణికి మంచి ఆహారమూ విశ్రాంతీ ఇస్తూ శారీరకంగానూ మానసికంగానూ ఆమె ఆనందంగా ఉండేలా చూసుకోవాలి. సంతోషంగా ఉన్న తల్లి బిడ్డని ప్రేమగా చూసుకుంటుంది. అది బిడ్డలో భద్రతకీ ప్రేమబంధానికీ పాదులు వేస్తుంది.

బాల్యం... వ్యక్తిత్వానికి పునాది

పిల్లల మెదడు తొంభై శాతం మూడేళ్లలోపలే ఏర్పడుతుంది. ఆ వయసులోనే అది అయస్కాంతంలాగా అందిన సమాచారాన్నంతా గ్రహించేస్తుంది. భాష, అభిరుచి, ఆలోచన, విశ్లేషణానైపుణ్యాలు లాంటి ఎన్నో లక్షణాలకు గట్టి పునాది వేస్తుంది.

* కొందరు పిల్లలకు అన్నీ నేర్పించేసి బాలమేధావులుగా తయారుచేయాలని ఆత్రపడుతుంటారు. దానివల్ల ఒరిగేదేమీ ఉండదు. నీళ్లున్నాయి కదా అని బిందెలకొద్దీ పోసేస్తే చెట్టు కాయలు కాయదు, అది కాసే సమయం వచ్చినప్పుడే కాస్తుంది. అలాగే పిల్లలూనూ. మనం చేయాల్సిందల్లా వారి చిన్ని మెదడుకి మేత వేయడం. కథలూ పాటలూ మాటలూ ఆటలతో బుర్రకి పదును పెట్టడం. ఆ చిన్ని మొక్క పెద్దదై తన ప్రతిభా పాటవాలతో అలరించే దాకా వేచి చూడడం.

* అన్నిటికన్నా ముఖ్యంగా పిల్లలు చెప్పేది వినాలి. రకరకాల ప్రశ్నలు అడిగి తప్పోఒప్పో మాట్లాడనివ్వాలి, సరిచేయకూడదు. తోటి పిల్లలతో ఆడుకోవాలి. అదే సమయంలో తల్లిదండ్రులూ తమ స్నేహితులతో పిల్లల పెంపకంలో అనుభవాలను పంచుకోవాలి. అంతే కానీ పోల్చుకోకూడదు. పిల్లలందరూ ఎవరికి వారే ప్రత్యేకం.  

* పిల్లల్ని తీర్చిదిద్దడంలో మాట చాలా ముఖ్యం. తల్లిదండ్రుల మాటలు వారికి ధైర్యాన్నివ్వాలి. విలువల్ని నేర్పాలి. చెడు అలవాట్లను సరిదిద్దడం కన్నా మొదటే మంచి అలవాట్లు అలవడేలా చూడాలి.

* పెద్దలు ఇరవై నాలుగ్గంటలూ ఫోనో టీవీనో చూస్తూ పిల్లల్ని అవతలి గదిలోకి వెళ్లి చదువుకోమనడం పద్ధతి కాదు. పిల్లలు చుట్టూ కన్పిస్తున్న విన్పిస్తున్న ప్రతిదాన్నీ గ్రహిస్తారు. అందుకే వాళ్లేం చూడాలని ఆశిస్తున్నారో అవే కన్పించేలా పెద్దలు నడచుకోవాలి. పిల్లలకి తల్లిదండ్రులే రోల్‌మోడల్స్‌ అన్నది మర్చిపోకూడదు. కొందరు పెద్దలు సిగరెట్లూ మద్యం తాగుతారు. పిల్లల ముందే అసభ్యంగా మాట్లాడతారు.  

* పిల్లల్ని ఆదేశించడం, ఆజ్ఞాపించడం కన్నా ఆడుతూ పాడుతూ చెప్పాలనుకున్నది వాళ్లకి చెప్పగలగడమే సరైన పేరెంటింగ్‌.

లక్షణాలే వ్యక్తిత్వాన్ని నిర్మిస్తాయి

తీయని జామ కాయలు కాయాలంటే జామ మొక్కే నాటాలి. నీరు పోసి జాగ్రత్తగా పెంచాలి. చీడ పట్టకుండా కాపాడుకోవాలి. అప్పుడు తీయని జామకాయలే కాస్తాయి. ఆ చెట్టు క్యారెక్టర్‌ అయితే పండ్లు వ్యక్తిత్వం. క్యారెక్టర్‌ని మనం ఎంత బాగా కాపాడితే అంత మంచి వ్యక్తిత్వం రూపుదిద్దుకుంటుంది. పిల్లల క్యారెక్టర్‌ని మౌల్డ్‌ చేయడం తల్లిదండ్రుల బాధ్యత. పరీక్షలో నీకెన్ని మార్కులు వచ్చాయి, అందరికన్నా ఎక్కువ ఎవరికి వచ్చాయి, టీచరు నిన్నేమన్నారు, పెద్దయ్యాక ఏమవుదామనుకుంటున్నావు... సాధారణంగా ఇలాంటి ప్రశ్నలు అడగని తల్లిదండ్రులు ఉండరేమో! ఇవాళ స్కూల్లో ఏంచేశావు, లంచ్‌ ఎవరితోనైనా షేర్‌ చేసుకున్నావా, ఎవరికైనా సాయం చేశావా... ఇలాంటి ప్రశ్నలు అడిగేవారు అరుదు. మన ప్రశ్నలు ఎప్పుడూ తెలివితేటలూ యాంబిషన్‌ మీదే ఉంటాయి. కానీ పిల్లలు నేర్చుకోవాల్సింది మంచితనం, మానవత్వం, విలువలూ. వీటిని నేర్పక్కరలేదు, సహజంగానే వస్తాయనుకుంటారు కానీ నిజానికి నేర్పించాల్సింది వీటినే. అప్పుడే వాళ్లలో చక్కటి వ్యక్తిత్వం రూపుదిద్దుకుంటుంది.  

కళ్లెం వదిలేయొద్దు!

పిల్లల్ని ఎంతో జాగ్రత్తగా పెంచి వాళ్లు బాల్యం నుంచి కౌమారంలోకి రాగానే పూర్తిగా వదిలేస్తారు తల్లిదండ్రులు. తమ ఎత్తు ఎదిగిన బిడ్డల్ని చూసుకుని మురిసిపోతారు. పెద్దరికం ఆపాదించేస్తారు.

నిజానికి హార్మోన్ల మార్పులతో అతలాకుతలమయ్యే ఆ వయసులోనే పిల్లలకు పెద్దల ప్రేమా మార్గదర్శకత్వమూ చాలా అవసరం. అది లేనప్పుడే పిల్లలు పక్కదారి పడతారు. వ్యసనాల బారినపడతారు. అందుకే పసిపిల్లల్ని ఎంత సున్నితంగా ఎత్తుకుంటామో పెద్ద పిల్లలతో అంత సున్నితంగా మాట్లాడాలి. పదేళ్లలోపు పిల్లల మనసు ఫ్లెక్సిబుల్‌గా ఉంటుంది. నిశ్చితమైన అభిప్రాయానికి రాలేరు కాబట్టి వారి మనసులోకి మనం అనుకున్న ఆసక్తుల్ని చొప్పించవచ్చు. టీనేజ్‌లోకి వచ్చాక అలాంటివి సాధ్యం కాదు. ఇష్టాయిష్టాలపై వారికో కచ్చితమైన అభిప్రాయం వచ్చేస్తుంది. అధికారంతోనో వాదనతోనో వాళ్ల అభిప్రాయాన్ని మార్చాలనుకోకూడదు. ఎంత పెద్ద పిల్లలైనా వారికి ప్రేమ కావాలి. దాన్ని పుష్కలంగా అందించాలి. రోజూ కొంతసమయం వారితో గడపాలి. సరదాగా  నవ్వుకోవాలి. మీ చిన్ననాటి అనుభవాలూ తీసుకున్న నిర్ణయాల్లో తప్పొప్పులను నిస్సంకోచంగా చర్చించాలి. నీతి బోధలకన్నా అనుభవాలు చెప్పే పాఠాలు మనసులో నాటుకుంటాయి. పిల్లల్లో ఆలోచననీ వివేకాన్నీ పెంచుతాయి. మంచి పౌరులుగా తీర్చిదిద్దుతాయి. చాలామంది తల్లిదండ్రులు పిల్లలు బాధ్యత తెలుసుకోవడం లేదని బాధపడుతుంటారు. వాళ్లకు బాధ్యత అప్పజెప్పడం ఎలాగో ముందు పెద్దలు తెలుసుకోవాలి. సవాలక్ష అనుమానాలతో కాకుండా పిల్లల్ని నమ్మి బాధ్యత అప్పజెప్పాలి. పొరపాట్లు జరుగుతాయి. వాటినుంచే పాఠాలూ నేర్చుకోనివ్వాలి.  

జీవనశైలీ, క్రమశిక్షణా...

ప్రేమలో క్రమశిక్షణ చూపండి, కానీ క్రమశిక్షణను ప్రేమించకండి... అని చెబుతారు దాజి. చాలామందికి తాము తల్లిదండ్రులు కాగానే క్రమశిక్షణ గుర్తొస్తుంది. అది పిల్లలకు మాత్రమే సంబంధించిన విషయం అనుకుంటారు. క్రమశిక్షణ ప్రతి ఒక్కరికీ అవసరం. అది వ్యక్తిత్వంలో భాగం. క్రమశిక్షణ అంటే స్వేచ్ఛకు సంకెళ్లు వేయడం కాదు, స్వేచ్ఛనివ్వడం.

జీవనశైలి అలవాట్లనూ, క్రమశిక్షణనూ పెద్దల్ని చూసే పిల్లలూ నేర్చుకుంటారు. అందుకే ముందు మనల్ని మనం మెరుగుపర్చుకుని వ్యక్తిగత క్రమశిక్షణ పాటించాలి. వయసుకి తగినట్లు పిల్లలకు మంచి అలవాట్లను నేర్పే విషయంలో ఒకటికి పదిసార్లు చెప్పడంలో తప్పు లేదు. అయితే అది నసపెట్టినట్లో తిట్టినట్లో కాకుండా మర్యాదగా చెప్పాలి. మంచి భాష, సమయపాలన, సహానుభూతి చూపడం లాంటివన్నీ పిల్లలకు అలవాటయ్యేలా చూడాలి.

పిల్లవాడు ఆడుకోవడానికి వెళ్లకుండా ఇవాళ హోంవర్కు చాలా ఉంది చేసుకుంటాను అన్నాడంటే- సెల్ఫ్‌ డిసిప్లిన్‌  ర్చుకుంటున్నాడన్న మాటే. అలాంటప్పుడు మెచ్చుకుంటూ ఉంటే- క్రమంగా మంచేదో చెడేదో వాళ్లే నిర్ణయించుకోగలుగుతారు.


పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే...

పిల్లల పెంపకానికి సంబంధించి కొన్ని పరిశోధనలు చూస్తే...

* రెండేళ్ల వరకూ పిల్లలకు అసలు ఏ తెరా చూపించవద్దంటుంది అమెరికన్‌ అకాడమీ ఆఫ్‌ పీడియాట్రిక్స్‌. చిన్నప్పుడే స్క్రీన్‌ ఎక్స్‌పోజర్‌ బడికెళ్లాక పిల్లల నేర్చుకునే సామర్థ్యాన్ని దెబ్బతీస్తుందట. పిల్లలు చూడకపోయినా, ఇంట్లో ఏ మూలో నడుస్తున్న టీవీ వారి ఏకాగ్రతని భగ్నం చేస్తుందట. మాట తీరునీ, సమస్యల్ని ఎదుర్కొనే విధానాన్నీ ప్రభావితం చేస్తుందట.

* యూనివర్సిటీ ఆఫ్‌ బ్రిస్టల్‌కి చెందిన పరిశోధకులు మట్టికీ మనిషికీ ఉన్న బంధం గురించి పరిశోధించారు. మట్టిని ముట్టుకున్నప్పుడు శరీరంలో సెరొటోనిన్‌ స్థాయి పెరుగుతుందట. అది మన భావోద్వేగాలను నియంత్రిస్తుంది కాబట్టి పిల్లల్ని మట్టిలో ఆడుకోనివ్వాలి.

* హెల్త్‌ సర్వీసెస్‌ కంపెనీ సిగ్నా 2018లో 20వేల మందితో ఒక అధ్యయనం చేసింది. జనరేషన్‌ జడ్‌ ‘లోన్లీయెస్ట్‌ తరం’ అని తేల్చింది. దీనికి కారణం పిల్లలు ఒంటరిగా పెరగడమే.

* మూడేళ్లలోపు పిల్లలతో తల్లిదండ్రులు ఏం మాట్లాడతారూ ఎలా మాట్లాడతారూ ఎంతసేపు మాట్లాడతారూ అన్నది వాళ్లమీద జీవితకాలం ప్రభావం చూపుతుందట. 1995లో అమెరికా పరిశోధకులు ఈ విషయంపై అధ్యయనం చేసి ‘ద ఎర్లీ కెటాస్ట్రఫీ’ అన్న నివేదిక వెలువరించారు. పదేళ్ల తర్వాత చదువుకుంటున్న పిల్లల్ని పరిశీలిస్తే చిన్నప్పుడు ఇంట్లో తల్లిదండ్రులు తక్కువ మాట్లాడిన పిల్లలు పలు అంశాల్లో వెనకబడి ఉండడాన్ని గమనించారు.

ఆ అధ్యయనం తర్వాత తల్లిదండ్రుల్లో చైతన్యం తేవడానికి అక్కడ దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలు చేపట్టారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..