విరమణ... ఉద్యోగానికి మాత్రమే!

అభిరుచి... మన రోజువారీ పనీ, సంపాదనల్లో పడి ఈజీగా మరచిపోయే విషయం. వృత్తిజీవితంలోనే కాదు వ్యక్తిగతంగానూ అది అద్భుతాలు చేయగలదని తెలిసినా పెద్దగా దృష్టిపెట్టం. కానీ ఈ

Updated : 17 Apr 2022 04:33 IST

విరమణ... ఉద్యోగానికి మాత్రమే!

అభిరుచి... మన రోజువారీ పనీ, సంపాదనల్లో పడి ఈజీగా మరచిపోయే విషయం. వృత్తిజీవితంలోనే కాదు వ్యక్తిగతంగానూ అది అద్భుతాలు చేయగలదని తెలిసినా పెద్దగా దృష్టిపెట్టం. కానీ ఈ ముగ్గురినీ ఆ అభిరుచే రిటైరయ్యాక కూడా వార్తల్లోని వ్యక్తుల్లా మార్చింది. నిత్యం ఉత్సాహంతో ఉండేలా చేస్తోంది. ఆ అభిరుచులు ఏమిటో చూసేద్దామా...

అతిపెద్ద లైబ్రరీ కట్టారు...

చీరాల సరస్వతీ మహల్‌, రాజమహేంద్రి గౌతమీ గ్రంథాలయాల్లాగే ఇది కూడా అతిపెద్ద ప్రయివేటు లైబ్రరీ. కాకపోతే, ఇందులో ఉన్న లక్షన్నర పుస్తకాలు కృష్ణమూర్తి-డొరొతి దంపతులు సొంతంగా సేకరించినవి. తమిళనాడు పుదుకోట్టై జిల్లా తిరుగోకర్ణం ప్రాంతంలో ఉంటుంది ఈ లైబ్రరీ. కృష్ణమూర్తి టీచర్‌గానూ, డొరొతి లెక్చరర్‌గానూ పనిచేసి రిటైర్‌ అయినవాళ్లు. అప్పటి నుంచీ మూతపడుతున్న లైబ్రరీలూ, ఖాళీ అవుతున్న ఇళ్ళూ, పాత ప్రచురణ సంస్థల నుంచి పుస్తకాలు సేకరించడం మొదలుపెట్టారు. అలా చూస్తుండగానే వీళ్ళ ఇల్లంతా పుస్తకాలతో నిండిపోయింది. దాంతో ఇంటి పక్కనే 2400 చదరపుటడుగుల స్థలాన్ని 11 లక్షలకి కొని ఈ లైబ్రరీని నిర్మించారు. దానికి ‘జ్ఞానాలయం’ అని పేరుపెట్టారు. తమిళనాడులోని పరిశోధక విద్యార్థులందరూ ఈ లైబ్రరీని ఓ పెద్ద వరంగా భావిస్తారు. ఎనభైయేళ్ల వయసులోనూ రోజూ ఎనిమిదిగంటలపాటు ఈ ‘జ్ఞానాలయం’ బాధ్యతలు నిర్వహిస్తున్నారు కృష్ణమూర్తీ డొరొతీ దంపతులు.  లైబ్రరీలోని పుస్తకాల మరమ్మతుల కోసం ఏటా రెండున్నర లక్షలు వెచ్చిస్తున్నారు!


స్టాంపుల సుబ్రహ్మణ్యం!

అలనాటి స్టాంపులూ, అరుదైన ఫొటోలూ, నాణేలతో నేటి యువతరంలో స్ఫూర్తి నింపుతున్నారు విశాఖపట్నానికి చెందిన గట్టుపల్లి కోటసుబ్రహ్మణ్యం. ఒక్క విశాఖ నగరంలోనే కాదు, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కాలేజీ ఉత్సవాల్లో పాల్గొంటూ అబ్బురపరుస్తుంటారు. అంతగా ఆశ్చర్యపడటానికి ఏముందీ అంటారేమో... మహాత్మాగాంధీకీ, సుభాష్‌ చంద్రబోసుకీ నడుమ ఉన్న భావవైరుధ్యాల్ని విరోధంగా చిత్రీకరిస్తుంటారు చాలామంది! అలాకాకుండా, 1938 నాటి సదస్సులో ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని మనస్ఫూర్తిగా నవ్వే అరుదైన స్టాంపు సుబ్రహ్మణ్యం దగ్గరుంది. దాన్ని విద్యార్థుల ముందుంచి... అటు బోస్‌, ఇటు గాంధీ ఇద్దరి ప్రయాణాన్నీ ఓ కథలా చక్కగా వివరిస్తారీయన. వైల్డ్‌ లైఫ్‌ అనగానే మనం ఇప్పుడు ఏ డిస్కవరీ ఛానెలో చూస్తుంటాం కదా.. వాటి వైవిధ్యాన్ని అంతే ఆసక్తిగా వందకుమించిన తన స్టాంపుల సేకరణతో వివరిస్తారు సుబ్రహ్మణ్యం. ఈ సేకరణ కోసం 2012లో లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డుకెక్కారాయన. రెండేళ్ల తర్వాత సీతాకోక చిలుకలున్న స్టాంపులతో మరోసారీ ఆ బుక్‌లో స్థానం సంపాదించారు. ఒక్క మహాత్మాగాంధీ జీవితానికి సంబంధించే నాలుగు వందల పైచిలుకు స్టాంపులున్నాయి ఆయనదగ్గర. అలా, మరోసారి కూడా లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డులకెక్కారు. అంటే, రికార్డుల్లో హ్యాట్రిక్‌ సాధించారన్నమాట! విశాఖలోని డాక్టర్‌ వీఎస్‌ కృష్ణ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో జువాలజీ లెక్చరర్‌గా చేస్తూ 1999లో రిటైర్‌ అయిన సుబ్రహ్మణ్యం... తన దగ్గరున్న 75 శాతం స్టాంపుల్ని ఆ తర్వాతే సేకరించారు!


కాళ్ళూ చేతులూ కట్టేసుకుని...

‘మరో ఎనిమిదేళ్లలో రిటైరైపోతాం. తర్వాత ఏం చేద్దాం!’... 1996లో ఈ ఆలోచనే వచ్చింది గంగాధర్‌ కడేకర్‌కి. అప్పుడే ఆయన దృష్టి ఈతపైన పడింది. పెద్దగా కష్టంలేకుండా రెండువారాల్లోనే నేర్చుకునేశారు. అక్కడ కట్‌ చేస్తే... ఇటీవల కర్ణాటకలోని ఉడుపి బీచ్‌లో ఐదుగంటలపాటు ఈదుతూ 3.5 కిలోమీటర్లు దాటారు. ఇందులో విశేషమేంటంటే... ఆయన తన చేతులూ కాళ్లని తాడుతో కట్టుకుని ఈదారు. అందుకే ఈ సాహసకృత్యం గోల్డెన్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్సులోనూ నమోదైంది! గత ఏడాది కాళ్లూచేతులకి సంకెళ్లు వేసుకుని పద్మాసనం భంగిమలో అరేబియన్‌ సముద్రంలోకి దూకారు. అలా 70 నిమిషాలు ఈదుతూ దాదాపు రెండున్నర కిలోమీటర్లు దాటారు. ఈ సాహసం ‘ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డు’లోకి ఎక్కింది. అంతేకాదు, తమ ప్రాంతంలో సరదాగా సముద్రంలోకి వెళ్ళి, ఈత రాక చనిపోతున్న యువత సంఖ్య పెరుగుతోందని వాళ్లకి ఉచితంగా ఈత నేర్పిస్తున్నారు గంగాధర్‌. ఇందుకోసమే ‘జై దుర్గ స్విమ్మింగ్‌ క్లబ్‌’ను ఏర్పాటుచేశారు... ఈ రిటైర్డ్‌ ఆర్టీఓ అధికారి!



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..