పఠనం విలువ తెలిసినోళ్లు!

‘పుస్తకం హస్తభూషణం’ అనేది పెద్దల మాట. ఇప్పుడా స్థానంలో స్మార్ట్‌ఫోన్‌ వచ్చి చేరింది. పుస్తకాలు చదివే అలవాటు క్రమంగా తగ్గుతుండటంతో గ్రంథాలయాలూ చిన్నబోతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో విద్య ఆవశ్యకతనూ పుస్తక పఠనం అవసరాన్నీ భావితరాలకు తెలియజేయాలనుకున్నారు వీరు...!  

Updated : 30 Jan 2022 05:59 IST

పఠనం విలువ తెలిసినోళ్లు!

‘పుస్తకం హస్తభూషణం’ అనేది పెద్దల మాట. ఇప్పుడా స్థానంలో స్మార్ట్‌ఫోన్‌ వచ్చి చేరింది. పుస్తకాలు చదివే అలవాటు క్రమంగా తగ్గుతుండటంతో గ్రంథాలయాలూ చిన్నబోతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో విద్య ఆవశ్యకతనూ పుస్తక పఠనం అవసరాన్నీ భావితరాలకు తెలియజేయాలనుకున్నారు వీరు...!  

పెద్దల చొరవతో...

తన దగ్గరున్న వందలాది పుస్తకాలను మరికొందరితోనూ చదివించాలనుకున్నాడో రిటైర్డ్‌ ఇంజినీర్‌. గొప్ప వ్యక్తులకు సంబంధించిన పుస్తకాలు బీరువాకే పరిమితం కావొద్దని భావించాడో విశ్రాంత పోలీస్‌ కమిషనర్‌. పఠనంతోనే విజ్ఞానమనీ, సొంతంగా పుస్తకాలు కొని మరీ చదివించడం అలవాటు చేయాలనుకున్నాడో మాజీ న్యాయమూర్తి. ఇలా ముంబయి నగరానికి చెందిన పలువురు పెద్దలంతా కలిసి- ములంద్‌లోని ఓ ఫుట్‌పాత్‌ను గ్రంథాలయంగా తీర్చిదిద్దారు. దాదాపు 2000 పుస్తకాలతో 24 గంటలూ అందుబాటులో ఉండే ఈ లైబ్రరీలోని రిజిస్టర్‌లో తమ పేరు, ఫోన్‌ నంబర్‌ను రాసి ఎవరైనా సరే ఉచితంగా పుస్తకాలను తీసుకెళ్లొచ్చు. 15 రోజుల్లో చదివేసి తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. దగ్గరలోనే కళాశాల ఉండటంతో విద్యార్థులూ ఇక్కడి నుంచి కావాల్సిన పుస్తకాలను ఇంటికి పట్టుకెళ్తున్నారట. ఎవరూ కాపలా ఉండని ఈ లైబ్రరీని రోజంతా తెరిచి ఉంచితే, పుస్తకాలు చోరీకి గురయ్యే ప్రమాదం ఉంటుంది కదా అని అడిగితే - ‘అవును. పుస్తకాలు దొంగిలిస్తారనే భయం కొంత ఉంటుంది. కానీ, ఎలాగైనా చదివించడమే కదా మా ఉద్దేశం’ అని చెబుతారు వ్యవస్థాపకుల్లో ఒకరైన రమేశ్‌.  


ప్రజల వద్దకే పుస్తకాలు

‘చదవాలంటే గ్రంథాలయాలకే రావాలా... ప్రజల దగ్గరకే పుస్తకాలు ఎందుకు వెళ్లకూడదు?’ అనుకున్నాడు సుకుమారన్‌. అలా ప్రశ్నించుకోవడమే కాదు అందుకు సమాధానమూ తనే అయ్యాడు. కేరళలోని కరువట్ట గ్రామానికి చెందిన ఆయన 1979లో సమీప గ్రామంలోని గ్రంథాలయంలో లైబ్రేరియన్‌గా విధుల్లో చేరాడు. కొత్తలో ఒకరిద్దరు మాత్రమే గ్రంథాలయానికి వచ్చేవారు. ఇక లాభం లేదనుకొని... పిల్లలూ, మహిళల్లో పఠనాసక్తి పెంపొందించేందుకు తనే ప్రతి ఇంటికీ వెళ్లాలనుకున్నాడు. చదువుకునే రోజుల్లో నడుచు కుంటూనే పేపర్‌ వేసిన ఆయనకు... తరువాత అదే అలవాటుగా, కొన్నాళ్లకు ఇష్టంగా మారింది. అలా ప్రతి రోజూ 12 కిలోమీటర్లు నడుస్తూ... ఇంటింటికి వెళ్తూ ప్రజలకే నేరుగా పుస్తకాలు అంద జేస్తున్నాడు. ఒకటి కాదు రెండు కాదు దాదాపు 41 ఏళ్లుగా ఇదే ఆయన దినచర్య. ఉదయం లైబ్రరీకి వెళ్లగానే 60-70 పుస్తకాలను ఒక బ్యాగ్‌లో వేసుకొని చుట్టుపక్కల 35 ఇళ్లకు కాలినడకనే వెళ్తాడు. కావాల్సిన వారికి పుస్తకాలిచ్చి సాయంత్రం తిరిగివెళ్తాడు. కేవలం ఇవ్వడం, తీసుకోవడం మాత్రమే కాదు... పుస్తకాలపైన పాఠకుల అభిప్రాయాలూ తెలుసుకుంటాడు. ప్రతి రోజూ 11 దినపత్రికలు చదివే అలవాటున్న సుకుమారన్‌ని స్థానికులు ‘నడిచే గ్రంథాలయం’ అని పిలుస్తుంటారు. ఆయన సేవలకు గుర్తింపుగా కేరళ ప్రభుత్వం ఇటీవల అవార్డూ అందించింది. ప్రతి రోజూ రకరకాల వ్యక్తులతో మాట్లాడటం, పుస్తకాలూ, వాటిల్లోని అంశాలపై చర్చించడం తనకెంతో ఆనందాన్నిస్తుందని చెబుతాడు సుకుమారన్‌.  


దండకారణ్యంలో గ్రంథాలయాలు

చదువుతో పాటు సరైన దిశానిర్దేశం ఉంటేనే జీవితంలో నిలదొక్కుకోగలరని నమ్మిన వ్యక్తి ఆశిష్‌. బిహార్‌లోని రొహ్‌తాస్‌ జిల్లా ఎస్పీగా పనిచేస్తున్న ఆయన మారుమూల గ్రామాల్లోని విద్యార్థులూ, యువతా చదువుకునేలా ప్రోత్సహిస్తున్నారు. అందుకు లైబ్రరీల ఏర్పాటే మార్గంగా ఎంచుకున్నారు. నాలుగేళ్ల క్రితం మావోయిస్టు ప్రభావిత ప్రాంతం ధార్హరాలో సొంత ఖర్చుతో మొట్టమొదటిగా గ్రంథాలయాన్ని ప్రారంభించారీ ఐపీఎస్‌ అధికారి. కొద్దిరోజులకు మరో ఏజెన్సీ గ్రామంలోనూ, ఆ తరువాత ఎస్పీ కార్యాలయ ప్రాంగణంలోనూ లైబ్రరీలను ఏర్పాటు చేయించారు. ఇటీవల మారుమూల ఆదివాసీ ప్రాంతం రెహల్‌లో బడి సమీపంలోనూ పుస్తకాలయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. విద్యార్థులతో పాటు యువతకూ ఉపయోగపడేలా పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలూ, నవలలూ ఇక్కడ అందుబాటులో ఉంచారు. బాహ్య ప్రపంచమంటూ తెలియని గిరిజన బాలికలకు ఈ లైబ్రరీలు దిక్సూచిలా మారాయని వారి తల్లిదండ్రులు చెబుతున్నారు. ఆయా గ్రంథాలయాల పర్యవేక్షణ బాధ్యతను స్థానిక పోలీసు సిబ్బందికి అప్పగించారాయన. అప్పటివరకూ గిరిజనులకు అందని ద్రాక్షగా మారిన విద్యను చేరువ చేయడంతో పాటు కలగానే మిగిలిన రోడ్లూ, వైద్యం తదితర అభివృద్ధి పనుల్లోనూ కదలిక తీసుకురావడంతో ఎస్పీ ఆశిష్‌ను అక్కడి ప్రజలు దేవుడిలా చూస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..