Switzerland: సరిలేరు... ‘స్విస్‌’కెవ్వరూ..!

స్విస్‌... స్విట్జర్లాండ్‌... ఈ దేశం పేరు చెప్పగానే నోరూరించే చాకొలెట్లూ, ఖరీదైన వాచీలూ కళ్లముందు మెదులుతాయి. ఇంకాస్త ఆలోచిస్తే రాజకీయ నాయకుల నల్లధనం అంతా అక్కడి బ్యాంకుల్లో ఉంటుందన్న విమర్శా గుర్తొస్తుంది

Updated : 24 Dec 2023 08:41 IST

స్విస్‌... స్విట్జర్లాండ్‌ (Switzerland)... ఈ దేశం పేరు చెప్పగానే నోరూరించే చాకొలెట్లూ, ఖరీదైన వాచీలూ కళ్లముందు మెదులుతాయి. ఇంకాస్త ఆలోచిస్తే రాజకీయ నాయకుల నల్లధనం అంతా అక్కడి బ్యాంకుల్లో ఉంటుందన్న విమర్శా గుర్తొస్తుంది. అందమైన ఆల్ప్స్‌ పర్వతాల పక్కన ఉన్న ఈ చిన్ని దేశం పర్యటకులకు స్వర్గధామం కూడా. వీటన్నిటినీ మించిందీ, మరే దేశమూ పోటీ పడలేనిదీ అయిన ప్రత్యేకత ఇంకోటుంది. నేటి ప్రపంచాన్ని నడిపిస్తున్న‘ఇన్నొవేషన్‌’లో వరసగా గత పదమూడేళ్లుగా స్విట్జర్లాండ్‌దే ప్రథమస్థానం. పట్టుమని కోటి జనాభా లేని ఈ దేశం ప్రపంచానికి ఏమిచ్చిందో తెలుసా..?

 చిన్ని చిన్ని మనుషులు కొండప్రాంతాల్లో ఆడుతూ పాడుతూ తిరుగుతుంటారు. సంతోషానికి చిరునామాలాగా ఎప్పుడూ నవ్వుతూ తుళ్లుతూ ఉంటారు. ఎవరికే సాయం కావలసివచ్చినా నేనున్నానని వస్తారు. పశుపోషణ వారి వృత్తి. వాళ్లు తయారుచేసే జున్ను ఎంత తిన్నా తరగదు. అందరూ తిన్నాక ఒక్క చిన్న ముక్క ఉంచితే చాలు, మళ్లీ భోజనం వేళకు గిన్నె నిండిపోతుంది... అచ్చం మన అక్షయ పాత్రలాగే!

ఆల్ప్స్‌ పర్వత సానువుల్లో ఉండే స్విట్జర్లాండ్‌లో పిల్లలు చిన్నప్పుడు చదువుకునే మరుగుజ్జు మనుషుల కథల్లో ఈ మ్యాజిక్‌ జున్ను కథా ఒకటి. ఆ జున్ను లాగే తరగని సృజన కూడా స్విస్‌ వాసుల సొంతం. అందుకే పదమూడేళ్లుగా ప్రపంచ దేశాలన్నిటినీ తోసిరాజని ‘సరికొత్త ఆవిష్కరణల్లో సరిలేరు మాకెవ్వరూ’ అంటున్నారు.
స్విట్జర్లాండ్‌ జనాభా 90 లక్షలు. వైశాల్యం... కాస్త అటూ ఇటూగా తెలంగాణ రాష్ట్రంలో మూడో వంతు ఉంటుంది. ఈ చిన్ని దేశంలో నాలుగు జాతీయ భాషలూ బోలెడన్ని మాండలికాలూ మాట్లాడతారు. పిల్లలకు మాతృభాషలో చదువు చెబుతూ సెకండరీ స్కూలు స్థాయినుంచి మాత్రమే ఆంగ్లాన్ని ఒక భాషగా నేర్పిస్తారు.
అలాంటి ఈ దేశం ఇప్పుడు చాలా విషయాల్లో సగర్వంగా మొదటిస్థానంలో నిలబడుతోంది. మానవాభివృద్ధి నివేదికలో, అవినీతి అతి తక్కువ ఉండే దేశాల్లో స్విట్జర్లాండ్‌ది ఫస్ట్‌ ర్యాంక్‌. ఆర్థిక స్వేచ్ఛలో రెండోస్థానం. పర్యావరణ మిత్ర ఆర్థికవ్యవస్థల్లో, సగటు ఆయుః ప్రమాణం(84.25 సంవత్సరాలు)లో... ఇంకా చాలా చాలా అంశాల్లో టాప్‌టెన్‌ దేశాల్లో ఉంటుంది. నోబెల్‌ శాంతి బహుమతి గెలుచుకున్న తొమ్మిది సంస్థలు ఈ దేశంలోనే ఉన్నాయి. సైన్సు పరిశోధనా కేంద్రాలకైతే లెక్కే లేదు. అందుకే... నాటి వెల్‌క్రో నుంచి నేటి అత్యాధునిక రోబోట్‌ల దాకా ఎన్నో అద్భుతమైన ఆవిష్కరణలు స్విట్జర్లాండ్‌ నుంచి ప్రపంచ దేశాలకు అందుతున్నాయి.

ఆ నేలలోనే ఉందా...

‘ఆ ఇంటి చిగురు కొమ్మైన చేవ...’ అన్నట్లు స్విట్జర్లాండ్‌ నేలలోనే ఏదో మహత్తు ఉన్నట్లుంది. నెస్లె, గ్లెన్‌కోర్‌, నొవార్తిస్‌, రోలెక్స్‌ లాంటి మల్టీ నేషనల్‌ కంపెనీలు పాతిక దాకా ఈ దేశంలోనే ఉన్నాయి. తయారీ రంగం ఇక్కడి ప్రధాన ఆర్థిక వనరు. పలు రసాయనాలూ, మందులూ, సైన్సు పరికరాలూ, విద్యుత్‌ ఉపకరణాలూ, సంగీత వాద్య పరికరాలూ... ఇక్కడ తయారై, వివిధ దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఆధునిక మానవుడికి ప్రాణవాయువుతో సమానమైన సాంకేతికత- అంతర్జాలానికి పుట్టినిల్లు...సెర్న్‌(యూరోపియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ న్యూక్లియర్‌ రీసెర్చ్‌) స్విట్జర్లాండ్‌లోనే ఉంది. 114 మంది నోబెల్‌ విజేతలకు స్విట్జర్లాండ్‌తో సంబంధం ఉంది.

అంతెందుకూ... ఐన్‌స్టీన్‌ తన సాపేక్ష సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఇక్కడే. స్విట్జర్లాండ్‌ రైల్వే నెట్‌వర్క్‌ని నూటికి నూరుశాతం విద్యుదీకరణ చేసింది. ప్రపంచంలోనే పొడవైన, లోతైన రైల్వే సొరంగం ఇక్కడే ఉంది. ఆల్ప్స్‌ పర్వతం లోపలినుంచి 57 కి.మీ. పొడవునా సొరంగం తవ్వి రైల్వేలైను వేసిన ఘనత ఈ దేశానిది. ఈ బుల్లి దేశంలో ఆరు అంతర్జాతీయ విమానాశ్రయాలున్నాయి. చెత్తని దాదాపు తొంభై శాతం రీసైక్లింగ్‌ చేస్తున్న దేశం ఇదే. పట్టుమని కోటిమంది లేని ఇంత చిన్న దేశానికి ఇవన్నీ ఎలా సాధ్యమయ్యాయీ... అన్నది ప్రపంచ దేశాల ముందున్న పెద్ద ప్రశ్న. అందుకు చాలా కారణాలే కన్పిస్తాయి.

సైన్సుకే స్విస్‌ ఓటు

స్విట్జర్లాండ్‌ పౌరుల్లో దాదాపు మూడోవంతు ఏ మతాన్నీ అనుసరించరు. అందరూ కలిసి నమ్మేది సైన్సునే. సైన్స్‌ ఆధారిత ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి స్విట్జర్లాండ్‌లో ప్రత్యేకంగా ఒక ఏజెన్సీ ఉంది. దాని పేరు ‘ఇన్నోస్వీస్‌’. దాంతో యూనివర్సిటీలలో జరిగే పరిశోధనలు స్టార్టప్‌ల రూపంలో సమాజంలోకి వస్తున్నాయి. ప్రపంచంలోనే మొట్టమొదటి కమర్షియల్‌ కార్బన్‌ రిమూవల్‌ టెక్నాలజీ స్టార్టప్‌ ‘క్లైమ్‌వర్క్స్‌’... అక్కడి టెక్నాలజీ యూనివర్సిటీల సహకారంతో పుట్టిందే. 2050 నాటికి బిలియన్‌ టన్నుల కార్బన్‌డై ఆక్సైడ్‌ని వాతావరణం నుంచి తొలగించే ప్రయత్నంలో ఉందీ సంస్థ.

ఆదేశాలు ఇస్తే పనిచేసే రోబోట్లు మనకు తెలుసు. కానీ మనసులో అనుకున్నది తెలుసుకుని పనిచేసే రోబోట్లను తయారుచేసింది స్విట్జర్లాండ్‌. లౌసన్‌లోని పరిశోధనాకేంద్రంలో ఒక శాస్త్రవేత్తల బృందం మెదడునీ మెషీన్‌నీ అనుసంధానించడానికి ఏళ్ల తరబడి చేసిన పరిశోధన ఫలించింది. వాళ్లు తయారుచేసిన రోబోట్‌ అనారోగ్యంతోనో వైకల్యంతోనో చక్రాల కుర్చీకి పరిమితమైనవారికి ఎంతో ఉపయోగం. కేవలం తమ మనసులో ఆలోచనతోనే వీరు ఎంతో దూరంలో ఉన్న రోబోట్‌తో పనిచేయించవచ్చు. ఇటీవలే వేర్వేరు దేశాల్లో ఉన్న కొందరు దీన్ని
ప్రయోగాత్మకంగా వాడి చూడగా వందశాతం విజయం సాధించింది. అందుకు వాళ్లు చేయాల్సిందల్లా బ్రెయిన్‌ సిగ్నల్స్‌ని విశ్లేషించేందుకు ప్రత్యేకంగా తయారుచేసిన ఒక టోపీ ధరించడమే.
స్విట్జర్లాండ్‌ ఏటా కొన్ని వేల పేటెంట్లకు దరఖాస్తులు పెడుతుంది. అవి ఏటికేడాదీ పెరుగుతూనే ఉంటాయి. 2021లో 8442 దరఖాస్తులు పెడితే 2022లో అవి 9008కి పెరిగాయి. జనాభాతో పోలిస్తే ఇంత ఎక్కువ పేటెంట్లు మరే దేశమూ పెట్టట్లేదు. ఇంత చిన్న దేశమైనా ఒక్కో రంగాన్నీ ఒక్కోచోట అభివృద్ధి చేయడం ముచ్చట గొలుపుతుంది. బ్లాక్‌చైన్‌ డెవలప్‌మెంట్‌ మీద దృష్టి పెట్టే క్రిప్టో వ్యాలీ అసోసియేషన్‌ జుగ్‌ పట్టణంలో ఉంది. లౌసన్‌లో డ్రోన్ల పరిశోధనా, తయారీకేంద్రాలున్న డ్రోన్‌ వ్యాలీ ఉంది. ఈపీఎఫ్‌ఎల్‌ ఇన్నొవేషన్‌ పార్కులో ఆహార పదార్థాల పరిశ్రమలున్నాయి. పార్క్‌ బసెల్‌ ఏరియాలో లైఫ్‌సైన్స్‌ పరిశోధనలుంటాయి. జ్యూరిక్‌లో అంతరిక్ష పరిశోధనా కేంద్రాలూ రోబోటిక్‌ పరిశ్రమలూ ఉన్నాయి. జ్యూరిక్‌ని సిలికాన్‌ వ్యాలీ ఆఫ్‌ రోబోటిక్స్‌ అనీ అంటారు. వీటన్నిటిలోనూ వేలల్లో శాస్త్రవేత్తలు పరిశోధనల్లో తలమునకలై ఉంటారు.

స్విస్‌ ఇన్నొవేషన్‌కి మచ్చుతునకలు మరికొన్ని...

  • మనిషి ఊపిరితిత్తికి ప్రతిరూపాన్ని ప్రయోగశాలలో తయారుచేసింది అల్వియోలిక్స్‌ కంపెనీ. ‘లంగ్‌ ఆన్‌ చిప్‌’ అనే ఈ పరికరం అచ్చం శ్వాస ప్రక్రియలో ఊపిరితిత్తి ఎలా పనిచేస్తుందో అలాగే పనిచేస్తుంది. శ్వాస సమస్యలకు సంబంధించిన మందులు తయారుచేసే కంపెనీలు ఆ మందులను పరీక్షించే ప్రయోగాలు చేయడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.
  •  మనిషి చర్మకణాల్ని లేబొరేటరీలో తయారుచేశారు. సీఎస్‌ఈఎం, సీయూటీఐఎస్‌ఎస్‌ అనే రెండు సంస్థలు కలిసి ‘డెనొవొకాస్ట్‌’ని అభివృద్ధి పరచాయి. ప్రమాదాల్లోనో, కాలిన గాయాలవల్లనో చర్మం లోతుగా దెబ్బతింటే వేరేచోట నుంచి చర్మాన్ని తీసి చికిత్స చేస్తారు. సంక్లిష్టమైన ఆ ప్రక్రియ అవసరం లేకుండా ఒక ఆటోమేటెడ్‌ మెషీన్‌ ఈ కస్టమైజ్డ్‌ స్కిన్‌ టిష్యూ గ్రాఫ్ట్స్‌ని తయారుచేస్తుంది. అది శరీర కణాల్ని టెంప్లేట్‌గా తీసుకుని మామూలు చర్మంలాగే పెరుగుతుందట.

  •  మనకి ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ ఫోన్లు తెలుసు. కానీ శాంసంగ్‌, ఎస్‌కే టెలికాం సంస్థలు వినియోగదారుల కోసం మొట్టమొదటి క్వాంటమ్‌ స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్‌ చేశాయి. ఫోన్లకోసం క్వాంటమ్‌ సాంకేతికతను తయారుచేసింది స్విస్‌కి చెందిన ఐడీ క్వాంటిక్‌ సంస్థ. ఈ సాంకేతికత వల్ల బ్యాటరీల దగ్గర్నుంచీ సెక్యూరిటీ విషయం వరకూ అన్నిట్లోనూ ఫోన్లు మరింత శక్తిమంతంగా తయారవుతాయి. ఇప్పుడీ సంస్థ 60 దేశాలకు ఈ సాంకేతికతను ఎగుమతి చేస్తోంది.
  •  ప్రపంచ దేశాలన్నీ ఇష్టం వచ్చినట్లు ఉపగ్రహాలను అంతరిక్షంలో ప్రవేశపెడుతున్నాయి. గడువు తీరిపోయాక అక్కడ అవి వ్యర్థాలుగా మారి అంతరిక్షాన్ని చెత్తకుండీలా చేసేస్తున్నాయి. దాన్ని శుభ్రం చేసే బాధ్యతని తలకెత్తుకుంది ‘క్లియర్‌స్పేస్‌’ సంస్థ.
  • ప్రయోగాత్మకంగా విజయం సాధించిన ఈ సంస్థ క్లియర్‌స్పేస్‌-1 మిషన్‌ ద్వారా 2025లో మొదటి దఫా అంతరిక్షంలో కొంతమేర చెత్తను తొలగించనుంది. తర్వాత వివిధ అంతరిక్ష పరిశోధనా సంస్థలకు వాటి వ్యర్థాలను తొలగించే సేవలు చేపడుతుంది.
  •  పదిహేడేళ్ల పరిశోధన అనంతరం ‘అక్తీయా’ అనే స్టార్టప్‌ ఆప్టికల్‌ సెన్సార్లతో కూడిన మణికట్టుకు కట్టుకునే ఒక పరికరాన్ని తయారుచేసింది. ఇది బీపీని 24 గంటలూ పర్యవేక్షిస్తుంది. ఇప్పటివరకూ ఉన్న ఇలాంటి పరికరాల కన్నా ఇది పది రెట్లు ఎక్కువ సమర్థంగా పనిచేస్తుందట. ఇప్పటికే దీన్ని యూరప్‌లోనూ అమెరికాలోనూ వాడుతున్నారు.
  •  కలపతో తయారైన ఫర్నిచర్‌ లోపల లైట్‌ పెట్టాలంటే వైరింగ్‌ అదీ చాలా శ్రమతో కూడుకున్న పని. అందంగానూ కనపడదు. కానీ బెర్న్‌ యూనివర్సిటీకి చెందిన
  • ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ మెటీరియల్స్‌ అండ్‌ ఉడ్‌ టెక్నాలజీ సంస్థ నిపుణులు విద్యుత్తు ప్రసరించడానికి అనువుగా ఉడ్‌బేస్‌డ్‌ పానెల్‌ని రూపొందించారు. ఈ పానెల్‌ లోపల రెండు సన్నని కార్బన్‌ఫైబర్స్‌ ఉంటాయి. వీటిద్వారా కరెంటు ప్రవహిస్తుంది. ఈ విధానాన్ని ఉపయోగించి ఫర్నిచర్‌ తయారీలో ఎంతో కొత్తదనం తేవచ్చని భావిస్తున్నారు.
  •  అంధులు తమంతట తాము బయట తిరగాలంటే ఇప్పటివరకూ ఉన్న వాకింగ్‌ స్టిక్‌ లాంటివి చూడగానే వాళ్లు అంధులని తెలిసిపోయేలా చేస్తున్నాయి. అలాంటి
  • పరికరాల అవసరం లేకుండా షర్టుకి అమర్చుకునే తేలికపాటి కాలర్‌తో వాళ్లు ధైర్యంగా రోడ్డుమీద నడవచ్చు. బైపెడ్‌ సంస్థ తయారుచేసిన ఈ ఏఐ ఆధారిత పరికరంలో త్రీడీ కెమెరాలుంటాయి. అవి ఆ వ్యక్తి చుట్టూ ఉన్న పరిసరాలను 170 డిగ్రీల కోణంలో స్కాన్‌చేసి అందించిన సమాచారం ఆధారంగా అవరోధాలుంటే అతనికి మాత్రమే వినపడేలా ఇమ్మర్సివ్‌ త్రీడీ సౌండ్‌లో చెబుతుంది. దాంతో చూపులేని వారు కూడా ఎలాంటి ఇబ్బందులూ లేకుండా మామూలుగా నడవగలరు.
  • వ్యవసాయ పరిశ్రమ తాలూకు ఉప ఉత్పత్తులు(ఆకులూ కాండాలూ వేళ్లూ లాంటివి) ఎన్నో వ్యర్థాలుగా చెత్తలో చేరుతుంటాయి. నిజానికి పోషకాలపరంగా అవి చాలా విలువైనవి. బయోమాస్‌ ప్రాసెసింగ్‌ టెక్నాలజీతో వాటిని అప్‌సైక్లింగ్‌ చేయడం ద్వారా బోలెడు పోషకాహారాన్ని పొందవచ్చని నిరూపించింది
  • ‘ఎంబియాన్‌’ అనే కంపెనీ. అంతేకాదు, మిలియన్‌ టన్నుల బయోమాస్‌ని అప్‌సైకిల్‌ చేయడం ద్వారా వ్యవసాయంలో వెలువడే వంద మిలియన్‌ టన్నుల కార్బన్‌ డయాక్సైడ్‌ని తగ్గించవచ్చట.
  • కృత్రిమమేధ రాజ్యమేలుతున్న ఈ రోజుల్లో గొప్ప కళాకారులు గీసిన చిత్రాలకు నకిలీలు తయారుచేసి అసలుగా చలామణి చేయడం, డీప్‌ఫేక్‌ ఫొటోలనూ వీడియోలనూ సృష్టించడం కష్టమేమీ కాదు. కళాకారుల మేధోహక్కులకీ, వ్యక్తుల ప్రైవసీ హక్కు రక్షణకీ అండగా నిలుస్తోంది ‘మాటిస్‌’ సంస్థ. డీప్‌టెక్‌ సాయంతో సాధారణ కంటికి కనిపించని లోతైన సమాచారాన్ని సేకరించి ఏది అసలు, ఏది నకిలీ అన్నది సులభంగా కనిపెట్టే సాంకేతికతను రూపొందించింది ఈ సంస్థ.
  • ఎంత హెల్మెట్‌ పెట్టుకున్నా అథ్లెట్లు ఒక్కోసారి తీవ్రగాయాల బారిన పడుతుంటారు. గాయం పైకి కన్పించకపోయినా దాని ప్రభావం దీర్ఘకాలంలో బయటపడుతుంటుంది. అలాంటప్పుడు వాళ్ల మెదడుకి హాని జరగకుండా చూసేందుకు ‘బియర్‌మైండ్‌’ సంస్థ కొత్త సాంకేతికతను తయారుచేసింది. హెల్మెట్‌ లోపల తల కదలికలను సేకరించిన సెన్సార్లు ఆ కదలికల తీవ్రతను అంచనా వేయడం ద్వారా రాబోయే ప్రమాదాన్ని ముందే తెలియజేస్తాయి. దాంతో ముందు జాగ్రత్త పడవచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే లెక్కలేనన్ని... యూనివర్సిటీలకు అనుబంధంగా పరిశోధనా కేంద్రాలూ, వాటికి అనుబంధంగా అంకుర పరిశ్రమలూ వ్యాపారాభివృద్ధి సంస్థలూ, వీటన్నిటికీ అండగా ప్రభుత్వ విధానాలూ... సమన్వయంతో పనిచేస్తూ దేశాన్ని అభివృద్ధి పథంలోనే కాదు, ఇన్నొవేషన్‌ ర్యాంకింగ్స్‌లోనూ ముందు నిలుపుతున్నాయి.
  • సృజనా ఆవిష్కరణల వల్ల మనిషి జీవనప్రమాణాలు పెరుగుతాయి. ఉత్పాదకత పెరుగుతుంది. అందుకే స్విస్‌ సమాజం సాంకేతికత తోడుగా సృజనకు మెరుగులు దిద్దుతోంది. ప్రపంచదేశాలకు పాఠాలు చెబుతోంది..!

​​​​​​​


ఏమిటీ సూచీ..!

ప్రపంచవ్యాప్తంగా 132 దేశాలను ఆయా దేశాల్లో జరుగుతున్న సాంకేతిక అభివృద్ధి ఆధారంగా ఇచ్చే ర్యాంకుల సూచీని ‘గ్లోబల్‌ ఇన్నొవేషన్‌ ఇండెక్స్‌’ అంటారు. ప్రపంచ మేధోహక్కుల సంస్థ(వరల్డ్‌ ఇంటలెక్చువల్‌ ప్రాపర్టీ ఆర్గనైజేషన్‌) గత పదహారేళ్లుగా దీన్ని విడుదల చేస్తుండగా పదమూడేళ్లుగా స్విట్జర్లాండ్‌ ప్రధమ స్థానంలో నిలుస్తూ ప్రపంచాన్ని అబ్బురపరుస్తోంది. అసలు రోజురోజుకీ మారిపోతున్న ఈ సాంకేతిక అభివృద్ధినీ సరికొత్త ఆలోచనల్నీ ఎలా కొలుస్తారూ అంటే... అందుకు ప్రధానంగా ఏడు అంశాల్నీ వాటి ఆధారంగా మరో 80
ఇండికేటర్స్‌నీ పరిగణనలోకి తీసుకుంటారు. ఆ ఏడు అంశాలూ ఏమిటంటే...

మేధస్సు, సాంకేతిక ఉత్పత్తులు: పేటెంట్‌ దరఖాస్తులు ఎన్ని నమోదయ్యాయి, సాంకేతిక ఉత్పత్తులు ఎన్ని తయారుచేశారు...
మానవ వనరులు, పరిశోధన: పది లక్షల మంది జనాభాకి ఎంతమంది పరిశోధకులు ఉన్నారూ, ఆ పరిశోధనలకు కార్పొరేట్‌ సంస్థలు ఎంత పెట్టుబడి
పెడుతున్నాయీ...
బిజినెస్‌ సోఫిస్టికేషన్‌: ప్రతిభ ఆధారిత ఉపాధి, యూనివర్సిటీ- ఇండస్ట్రీల మధ్య పరిశోధనలో సహకారం
మార్కెట్‌ సోఫిస్టికేషన్‌: స్టార్టప్స్‌కి ఆదరణా, నిధుల సేకరణా సృజనాత్మక ఉత్పత్తులు: ట్రేడ్‌మార్క్‌ అప్లికేషన్స్‌, గ్లోబల్‌ బ్రాండ్‌ వాల్యూ
మౌలిక వసతులు: పర్యావరణంపై ప్రభావం, అందుబాటులో ఉన్న ఇన్ఫర్‌మేషన్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ టెక్నాలజీ
సంస్థలు: నాణ్యతను క్రమబద్ధం చేస్తూ, వ్యాపారాన్ని సులభతరం చేసే విధానాలను అమలుచేసే సంస్థలు... తదితరాలన్నిటినీ పరిశీలించి ఈ ర్యాంకింగ్‌ ఇస్తారు.


స్విట్జర్లాండ్‌లోనే ఎందుకంటే...

సృజనను పెంచి పోషించే వాతావరణం స్విట్జర్లాండ్‌లో పుష్కలంగా ఉంది. అక్కడి ప్రభుత్వం సృజనకు అన్నివిధాలా సహకరించడం వల్ల ప్రతికూలతలు కూడా అనుకూలంగా మారుతున్నాయి.
విద్య: ఒక్క జ్యూరిక్‌ ప్రాంతంలో ఉన్న విశ్వవిద్యాలయాల్లోనే ప్రపంచవ్యాప్తంగా 125 దేశాలనుంచి వచ్చిన దాదాపు పాతికవేల మంది విద్యార్థులు ఉంటారు.
రాజకీయం: ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఉత్పాదక రంగానికి సంబంధించిన విషయాల్లో స్థిరత్వం ఉండేలా చూడడాన్ని ప్రథమ కర్తవ్యంగా భావిస్తాయి.
ఆర్‌ అండ్‌ డి: ఆవిష్కరణలకు అక్కడి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుంది. ఉదాహరణకు ఒక్క 2019లో స్విట్జర్లాండ్‌ రెండు లక్షల కోట్లకు పైనే పరిశోధనలకోసం ఖర్చు పెట్టింది.
పెట్టుబడులు: పరిశోధనలకు ఇక్కడ లభించే ప్రాధాన్యం తెలిసే విదేశాలనుంచి ఇక్కడికి వచ్చే పెట్టుబడులు ఏటికేడాది పెరుగుతున్నాయి. ఉదాహరణకు 2020 కన్నా 2021కి 44శాతం పెరిగి 28వేల కోట్లకు చేరింది.
భౌగోళిక పరిస్థితి: తీరప్రాంతమనేది లేకుండా చుట్టూ తనకన్నా పెద్ద దేశాలతో సరిహద్దులు పంచుకోవడాన్ని మరొక దేశమైతే బలహీనతగా భావించేది. ఈ దేశం మాత్రం దాన్ని కూడా వరంగా మార్చుకుని ఎగుమతుల్ని పెంచుకుంటోంది.
నిపుణులైన కార్మికులు: వరల్డ్‌ టాలెంట్‌ ర్యాంకింగ్‌లోనూ స్విట్జర్లాండ్‌ది మొదటి స్థానమే. వేర్వేరు దేశాలకు చెందిన ఎందరో నిపుణులు ఇక్కడ పనిచేస్తున్నారు.
విలువలు: సృజనకూ వ్యక్తి స్వాతంత్య్రానికీ సమానత్వానికీ ప్రాధాన్యమిస్తుంది.


మనం...40వ స్థానంలో!

మోస్ట్‌ ఇన్నొవేటివ్‌ దేశాల జాబితాలో స్విట్జర్లాండ్‌ తర్వాత స్వీడన్‌, అమెరికా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. గత ఐదేళ్లలో నాలుగుసార్లు అమెరికాను మూడోస్థానంలోకి నెట్టేసి స్వీడన్‌ రెండోస్థానం చేజిక్కించుకోవడం విశేషం. సగానికి పైగా యూనికార్న్‌ సంస్థలకు నెలవైనప్పటికీ ఇన్నొవేషన్‌ విషయంలో మాత్రం అమెరికాకి ఈ చిన్నదేశాలు గట్టి పోటీనిస్తున్నాయి. ఇంగ్లండ్‌, సింగపూర్‌, ఫిన్లాండ్‌, నెదర్లాండ్స్‌, జర్మనీ, డెన్మార్క్‌, సౌత్‌కొరియాలు... టాప్‌ టెన్‌లో చోటు సాధించాయి.
ఓవరాల్‌గా ఐదోస్థానంలో ఉన్న సింగపూర్‌ ఆసియాలో ప్రథమస్థానంలో నిలవగా మన దేశం మొత్తమ్మీద నలభయ్యవ స్థానంలో ఉంది. టాప్‌ సైంటిఫిక్‌ సంస్థలుగా కేంబ్రిడ్జి(ఇంగ్లండ్‌), స్టాన్‌ఫర్డ్‌(అమెరికా), ఆక్స్‌ఫర్డ్‌(ఇంగ్లండ్‌), ఐందోవెన్‌(నెదర్లాండ్స్‌), ఎంఐటీ(అమెరికా)లు నిలుస్తున్నాయి.


 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..