మనసైన వారు... మెచ్చేలా!

ప్రియమైన వారికి ఐలవ్‌యూ చెప్పడంతోపాటు ఓ కానుకనూ ఇచ్చి ఆనందించే రోజే ప్రేమికుల దినోత్సవం.

Published : 10 Feb 2024 23:14 IST

ప్రియమైన వారికి ఐలవ్‌యూ చెప్పడంతోపాటు ఓ కానుకనూ ఇచ్చి ఆనందించే రోజే ప్రేమికుల దినోత్సవం. వాటితోపాటు  ఆ రోజున వంటకాలనూ కాస్త కొత్తగా నోరూరించేలా చేసేద్దామా...


వెజిటబుల్‌ కట్‌లెట్‌

కావలసినవి: ఉడికించిన బంగాళాదుంపలు: మూడు, పచ్చిబఠాణీ: అరకప్పు, స్వీట్‌కార్న్‌: పావుకప్పు, క్యారెట్‌ ముక్కలు: అరకప్పు, బీన్స్‌తరుగు: పావుకప్పు, బీట్‌రూట్‌ తరుగు: పావుకప్పు, పచ్చిమిర్చి: ఒకటి, అల్లంతరుగు: చెంచా, బ్రెడ్‌పొడి: అరకప్పు, మైదా: రెండు టేబుల్‌స్పూన్లు, ఉల్లిపాయ: ఒకటి, కారం: అరచెంచా, దనియాలపొడి: చెంచా, పసుపు: పావుచెంచా, గరం
మసాలా: అరచెంచా, కొత్తిమీర తరుగు: రెండు టేబుల్‌స్పూన్లు,నిమ్మ రసం: చెంచా, ఉప్పు: తగినంత, నూనె: వేయించేందుకు సరిపడా.
తయారీ విధానం: ఓ గిన్నెలో మైదా తీసుకుని నాలుగుటేబుల్‌స్పూన్ల నీళ్లు పోసి కలిపి పెట్టుకోవాలి. అల్లం, పచ్చిమిర్చి కలిపి పేస్టులా చేసుకోవాలి. అలాగే మూడు కప్పుల నీటిలో పచ్చిబఠాణీ, స్వీట్‌కార్న్‌, బీన్స్‌ వేసి పది నిమిషాలు ఉడికించుకుని తీసుకోవాలి. స్టవ్‌మీద కడాయిని పెట్టి రెండు చెంచాల నూనె వేసి ఉల్లిపాయముక్కల్ని వేయించుకుని అల్లంపచ్చిమిర్చి పేస్టు కలపాలి. ఇందులో ఉడికించిన కూరగాయముక్కలు, క్యారెట్‌, బీట్‌రూట్‌ తరుగు, తగినంత ఉప్పు వేసి వేయించి కారం, దనియాలపొడి, పసుపు, గరంమసాలా కలిపి దింపేయాలి. ఇది కాస్త చల్లారుతున్నప్పుడు పావుకప్పు బ్రెడ్‌పొడి, ఉడికించిన బంగాళాదుంపల ముద్ద, కొత్తిమీర తరుగు, నిమ్మరసం వేసుకుని అన్నింటినీ బాగా కలిపి నిమ్మకాయంత సైజులో ఉండల్లా చేసుకోవాలి. వీటిని మందంగా, వెడల్పుగా అద్దుకుని హృదయాకారం వచ్చేలా మౌల్డ్‌తో కట్‌ చేయాలి. ఇప్పుడు వాటిని మొదట మైదా మిశ్రమంలో ముంచి.. తరువాత బ్రెడ్‌పొడిలో అద్దుకోవాలి. చివరగా నాన్‌స్టిక్‌ పాన్‌మీద రెండుమూడు చొప్పున ఉంచి నూనె వేస్తూ రెండువైపులా ఎర్రగా కాల్చుకుని తీసుకుంటే చాలు.


చాక్లెట్‌ కొబ్బరి లడ్డు

కావలసినవి: కొబ్బరిపొడి: మూడుంబావు కప్పులు, కండెన్స్‌డ్‌మిల్క్‌: ఒక డబ్బా, చాక్లెట్‌ చిప్స్‌: కప్పు, నెయ్యి: చెంచా.
తయారీవిధానం: పావుకప్పు కొబ్బరిపొడిని విడిగా పెట్టుకోవాలి. స్టవ్‌మీద నాన్‌స్టిక్‌ పాన్‌ను పెట్టి... మిగిలిన కొబ్బరిపొడిని వేసి వేయించుకోవాలి. అది కాస్త రంగు మారుతున్నప్పుడు కండెన్స్‌డ్‌మిల్క్‌, చాక్లెట్‌చిప్స్‌ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమం దగ్గర పడుతున్నప్పుడు దింపేయాలి. వేడి కాస్త చల్లారాక.. చేతికి నెయ్యి రాసుకుని లడ్డూల్లా చుట్టుకుని... మిగిలిన కొబ్బరిపొడిని అద్దితే సరిపోతుంది.


సమోసా పిన్‌వీల్‌

కావలసినవి: మైదా: కప్పు, బొంబాయిరవ్వ: రెండు టేబుల్‌స్పూన్లు, వాము: పావుచెంచా, ఉప్పు: తగినంత, నూనె: వేయించేందుకు సరిపడా.
స్టఫింగ్‌కోసం: ఉడికించిన బంగాళాదుంపలు: రెండు(తురుముకోవాలి), పసుపు: పావుచెంచా, కారం: అరచెంచా, జీలకర్రపొడి: పావుచెంచా, దనియాలపొడి: అరచెంచా, కొత్తిమీర తరుగు: రెండు టేబుల్‌స్పూన్లు, గరంమసాలా: అరచెంచా, అల్లంవెల్లుల్లి పేస్టు: అరచెంచా, మైదా: రెండు టేబుల్‌స్పూన్లు.
తయారీవిధానం: ముందుగా మైదా, బొంబాయిరవ్వ, వాము, అరచెంచా ఉప్పు వేసుకుని అన్నింటినీ కలపాలి. తరువాత నీళ్లు పోస్తూ గట్టి పిండిలా చేసుకుని చెంచా నూనె రాసి మూత పెట్టాలి. ఇప్పుడు మిగిలిన మైదాపిండిలో కాసిని నీళ్లు పోసి గరిటెజారుగా చేసుకోవాలి. స్టఫింగ్‌కోసం పెట్టుకున్న పదార్థాలను ఓ గిన్నెలో తీసుకుని, అరచెంచా ఉప్పు వేసి కలుపుకోవాలి. కలిపి పెట్టుకున్న మైదా-రవ్వ పిండి నుంచి కొద్దిగా తీసుకుని మందంగా చపాతీలా ఒత్తుకోవాలి. దీనిపైన బంగాళాదుంప మిశ్రమాన్ని పరిచాక రోల్‌లా చుట్టి... ముక్కల్లా వచ్చేలా కోయాలి. వీటిని మళ్లీ కాస్త వెడల్పుగా వచ్చేలా చేత్తోనే వత్తుకుని మైదా మిశ్రమంలో ముంచి... కాగుతున్న నూనెలో వేసి వేయించుకోవాలి.  


అండా పులావ్‌

కావలసినవి: బాస్మతీ బియ్యం: కప్పు, ఉడికించిన గుడ్లు: నాలుగు (మధ్యకు కోయాలి), జీలకర్ర: అరచెంచా, అనాసపువ్వు: ఒకటి, యాలకులు: రెండు, లవంగాలు: రెండు, మిరియాలు: పావుచెంచా, బిర్యానీఆకు: ఒకటి, ఉల్లిపాయ: ఒకటి, టొమాటోలు: రెండు, పచ్చిమిర్చి: రెండు, అల్లంవెల్లుల్లి పేస్టు: చెంచా, పెరుగు: రెండు టేబుల్‌స్పూన్లు, కారం: అరచెంచా, పసుపు: అరచెంచా, గరంమసాలా: చెంచా, కసూరీమేథీ: చెంచా, నూనె: రెండు టేబుల్‌స్పూన్లు, కొత్తిమీర: చిన్నకట్ట, పుదీనా ఆకులు: కొన్ని, ఉప్పు: తగినంత.
తయారీ విధానం: బాస్మతీ బియ్యాన్ని ఇరవై నిమిషాలు నానబెట్టుకుని, కడిగి సరిపడా నీళ్లు పోసి ఎనభైశాతం వరకూ ఉడికించుకుని పెట్టుకోవాలి. స్టవ్‌మీద కడాయిని పెట్టి నూనె వేసి జీలకర్ర, అనాసపువ్వు, యాలకులు, లవంగాలు, మిరియాలు, బిర్యానీ ఆకు వేయించుకుని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి తరుగు, అల్లంవెల్లుల్లి పేస్టు వేయాలి. ఉల్లిపాయముక్కలు ఎర్రగా వేగుతున్నప్పుడు టొమాటో ముక్కలు వేయాలి. అవి కాస్త మగ్గుతున్నప్పుడు పెరుగు, కారం, పసుపు, గరంమసాలా, తగినంత ఉప్పు, కసూరీమేథీ, ఉడికించిన గుడ్డు ముక్కలు వేసి బాగా కలపాలి. ఆ ముక్కలకు మసాలా పట్టిందనుకున్నాక అన్నాన్ని పరిచినట్లుగా వేసుకుని కొత్తిమీర తరుగు, పుదీనా ఆకులు వేసి మూత పెట్టి.. సిమ్‌లో పది నిమిషాలు ఉంచి తీసేయాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..