సైబర్‌ బాధితులా...వీళ్లు రక్షిస్తారు

‘రుణ ఆప్‌ల వేధింపులు, యువకుడి బలవన్మరణం’ - పత్రికల్లో అప్పుడప్పుడూ ఇలాంటి వార్తలు చూస్తుంటాం కదా! ‘కేవలం అప్పు అడిగినందుకు ఆత్మహత్య చేసుకోవాలా’ అని ప్రశ్నించేవారు చుండూరి రాధాకృష్ణమూర్తి కథ వినాలి. ఒకప్పుడు తను కూడా రుణ ఆప్‌ బాధితుడే- ఆత్మహత్య చేసుకోవాలనుకున్న వాడే. త్రుటిలో అందులో నుంచి బయటపడ్డ రాధాకృష్ణమూర్తి, ఓ వినూత్న స్టార్టప్‌ను ప్రారంభించాడు.

Published : 04 Feb 2024 00:28 IST

‘రుణ ఆప్‌ల వేధింపులు, యువకుడి బలవన్మరణం’ - పత్రికల్లో అప్పుడప్పుడూ ఇలాంటి వార్తలు చూస్తుంటాం కదా! ‘కేవలం అప్పు అడిగినందుకు ఆత్మహత్య చేసుకోవాలా’ అని ప్రశ్నించేవారు చుండూరి రాధాకృష్ణమూర్తి కథ వినాలి. ఒకప్పుడు తను కూడా రుణ ఆప్‌ బాధితుడే- ఆత్మహత్య చేసుకోవాలనుకున్న వాడే. త్రుటిలో అందులో నుంచి బయటపడ్డ రాధాకృష్ణమూర్తి, ఓ వినూత్న స్టార్టప్‌ను ప్రారంభించాడు. దాని ద్వారా సైబర్‌ నేరాల బాధితులని ఆదుకుంటున్నాడు. ఈ కొత్తతరం స్టార్టప్‌ సంగతేమిటో చూద్దామా...

‘ఆ రోజు నేను కొత్త ఫోన్‌ కొనుక్కున్నా. నా రూమ్మేట్‌ అందులో ఓ రుణ ఆప్‌ డౌన్‌లోడ్‌ చేశాడు. వాడికేదో డబ్బు అవసరముండి అందులోని లింక్‌ నొక్కిన మరుక్షణమే మూడువేల రూపాయలు అకౌంట్‌లో పడ్డాయి. ఆ డబ్బును వాడికిచ్చేసే తొందరలో వాళ్ళ నియమ నిబంధనలు నిశితంగా చూసుకోలేదు నేను. ఆ తర్వాతి రోజే నా కొత్త ఫోన్‌ పోయింది. వారం తర్వాత మరో ఫోన్‌ కొనుక్కుని ఆన్‌ చేస్తుండగానే ఆ రుణ ఆప్‌ సంస్థ నుంచి ఫోన్‌కాల్‌ల వెల్లువ మొదలైంది. గంటలో వందసార్లు ఫోన్‌ చేశారంటే చూసుకోండి. కాల్‌ చేసిన ప్రతిసారీ రాయలేని మాటల్తో తిట్టడమే! తీసుకున్నది మూడువేలు అయితే రూ.18 వేలు తిరిగి ఇవ్వమన్నారు. చచ్చీచెడి వాళ్ళ అకౌంట్‌లో ఆ డబ్బు వేస్తే- క్రెడిట్‌ కాలేదంటూ బొంకారు. నాకు పరిచయమున్న పోలీసులతో చెపితే ‘సిమ్‌ని ఆఫ్‌ చేసి ఉంచు’ అన్నారు తేలిగ్గా. అలాగే చేశాను- దాంతో ‘ఆప్‌’ వాళ్ళు నా మెయిల్‌ అకౌంట్‌ హ్యాక్‌చేశారు. నా ఫొటో చేజిక్కించుకుని నగ్నంగా ఉన్నట్టు మార్ఫింగ్‌ చేసి నా ఫోన్‌లోని 1500 కాంటాక్ట్‌లకి పంపించారు. దానికింద నా ఆధార్‌ కార్డు పెట్టి ‘ఇతనో రేపిస్టు’ అని రాశారు! మా సొంతూరు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం బాపట్ల జిల్లాలోని ఇంకొల్లు. పల్లె ప్రాంతం కదా... అట్టుడికిపోయింది. నాన్న టీచర్‌... ఊళ్ళో గౌరవమర్యాదలు ఉన్నవాడు. ఎదురుపడ్డ వాళ్ళందరూ ‘మీవాడా... ఇలా?’ అని అడుగుతుంటే అవమానంతో కుంగిపోయారాయన. ‘బతికుండగానే నన్ను చంపేశావు కదరా!’ అని ఆయన అంటుంటే బాధతో విలవిల్లాడిపోయాను. కత్తి తీసుకుని- మణికట్టు కింద కోసుకుని చచ్చిపోదామనుకున్నాను. వంటగదిలోకి వెళ్తుండగా- ఫోన్‌ మోగింది. నాటి హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ చేశారు. ఆయనా నా కాంటాక్ట్‌ లిస్టులో ఉండడంతో మార్ఫింగ్‌ఫొటో వెళ్ళినట్టుంది. ‘ఏమైంది’ అని ఆయన అడుగుతుంటే బోరున ఏడ్చేశాను. ఆయన సూచనతో కేసు ఫైలు చేశాను. కానీ ఆ ఆప్‌ వాళ్ళని ఎవరూ ఏం చేయలేరని అర్థమైంది. ఎందుకంటే- ఈ రుణాల ఆప్‌లవాళ్ళు పనిచేసేది ఉత్తరాదిన మారుమూల ప్రాంతాల నుంచి. దాదాపు అందరూ మైనర్‌లు. అక్కడికెళ్ళి వాళ్ళని అరెస్టు చేయడం అసాధ్యం. బాధను దిగమింగి, బాగా ఆలోచించగా- ముల్లుని ముల్లుతోనే తీయాలన్నట్టు హ్యాకింగ్‌కి హ్యాకింగ్‌తోనే జవాబు చెప్పాలనిపించింది. నాలాంటి దారుణ పరిస్థితి మరెవరికీ రాకూడదని ఆక్షణమే నిర్ణయించుకున్నాను...’ అంటాడు రాధాకృష్ణ.

ఆ నిర్ణయంతోనే ‘గ్లోబల్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌’(జీఎస్‌సీ) సంస్థని మొదలుపెట్టాడు. దీనిద్వారా ఒక్క రుణాల ఆప్‌లే కాకుండా బెట్టింగ్‌ ఆప్‌లతో మోసపోయినవాళ్ళూ, మార్ఫింగ్‌ మాయకి బలైనవాళ్ళకి సాయపడుతున్నాడు. హ్యాకింగ్‌కి ప్రతి- హ్యాకింగ్‌ చేసి బాధితులు మరింత నష్టపోకుండా చూస్తున్నాడు. మనదేశంలో మాత్రమే కాకుండా విదేశాల నుంచి సాయమడిగే వాళ్ళను సైతం ఆదుకుంటున్నాడు. దేశంలో ఈ తరహా సేవలందిస్తున్న సంస్థ ఇదొక్కటే.

ఎథికల్‌ హ్యాకర్‌!

చీరాలలో ఇంజినీరింగ్‌ చదివిన రాధాకృష్ణ కోడింగ్‌పైన ఇష్టంతో దానిపైన పట్టు సాధించి... ఎథికల్‌ హ్యాకర్‌గా మారాడు. ఈసీ కౌన్సిల్‌ అనే సంస్థలో ఉద్యోగిగా చేరి 2020లో- కరోనాకి కాస్త ముందు- బయటకొచ్చేశాడు. సరిగ్గా అప్పుడే లాక్‌డౌన్‌ పడింది. అందరూ సొంతూళ్ళకి వెళుతుంటే తాను మాత్రం హైదరాబాద్‌లోనే ఉండిపోయి ‘అక్షయపాత్ర ఫౌండేషన్‌’తో కలిసి మురికివాడల్లోని పేదలకి సేవ చేశాడు. అప్పుడే తనకి నాటి హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ పరిచయమయ్యారు. కొవిడ్‌తో ఆసుపత్రిలో చేరినవాళ్ళకి రక్తం అందించడం కోసం ఆయన ఏర్పాటుచేసిన ‘కొవిడ్‌ ఫోర్స్‌’ ప్రత్యేక బృందంలో వలంటీర్‌గా చేరాడు రాధాకృష్ణ. అప్పుడే అతని జీవితంలో దా‘రుణ’ం చోటుచేసుకుంది. ఆ సంక్షోభమే ‘గ్లోబల్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌’కి పునాదిగా మారింది!

సేవలు ఇలా ఉంటాయి...

ఆ అమ్మాయి సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌. తెలుగు యూట్యూబ్‌ వీక్షకులలో బాగా పేరుంది. కానీ- ఆ పాపులారిటీతో తనకి శత్రువులూ పెరిగారు. ఓ రోజు తన ఫొటోలు మార్ఫ్‌చేసి- అశ్లీల వెబ్‌సైట్‌లో పెట్టారు. ఆ విషయం బయటకొస్తే మరింత అల్లరవుతానని భయపడిపోయింది ఆ అమ్మాయి. ఏం చేయాలో పాలుపోని పరిస్థితుల్లో ‘గ్లోబల్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌’ని ఆశ్రయించింది. వెంటనే రంగంలోకి దిగిన రాధాకృష్ణ- తానూ హ్యాకర్‌గా మారి ఆ మార్ఫింగ్‌ వీడియోలని మాయం చేశాడు. ఆ హ్యాకర్‌లకి ఫోన్‌ చేసి, మరోసారి ఇలా చేస్తే పోలీసులకు పట్టిస్తానని హెచ్చరించాడు! దాంతో వాళ్ళు తోకముడిచారు. ముల్లుని ముల్లుతో తీయడమంటే అదేగా మరి!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..