Viral video: ఆ బాలిక సంకల్పం ముందు వైకల్యం ఓడిపోయింది..

ఓ పదేళ్ల బాలికకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట సంచలనంగా మారింది. ఆమె చూపిస్తున్న మనోధైర్యం ఎంతో మందికి స్ఫూర్తి రగిలిస్తోంది.......

Published : 25 May 2022 20:49 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఓ పదేళ్ల బాలికకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట సంచలనంగా మారింది. ఆమె చూపిస్తున్న మనోధైర్యం ఎంతో మందికి స్ఫూర్తి రగిలిస్తోంది. బుజానికు పుస్తకాల సంచి వేసుకొని ఒంటికాలిపై బడికి వెళుతున్న బాలికను చూసిన నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తూ.. ఆమె సంకల్పానికి సలాం చేస్తున్నారు. బిహార్‌లోని జుమాయ్‌ జిల్లాకు చెందిన సీమాకు రెండేళ్ల క్రితం ఓ ప్రమాదం జరగ్గా.. వైద్యులు ఆమె ఎడమ కాలును తొలగించాల్సి వచ్చింది.

అయితే ఈ వైకల్యం ఆమెను కుంగదీయలేదు. చదువు పట్ల ఇష్టం ఏమాత్రం తగ్గలేదు. పుస్తకాల సంచిని బుజానికి వేసుకోని.. ఒంటికాలితోనే ప్రతిరోజు కిలోమీటరు దూరంలో ఉన్న పాఠశాలకు వెళుతోంది. ఆమె ఒంటికాలితో స్కూలుకు వెళ్లే దృశ్యాలను కొందరు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో ఉంచగా విశేష స్పందన వచ్చింది. అనేకమంది ఆమె కొనియాడుతున్నారు. ప్రముఖులు, అధికారులు ఆమెకు సాయం చేసేందుకు ముందుకొస్తున్నారు.

ముందుకొచ్చిన సోనూసూద్‌

కొవిడ్‌ లాక్‌డౌన్‌లో ఆపద్బాంధవుడిలా నిలిచిన సోనూసూద్‌ తాజాగా స్పందించారు. సీమా ఒంటికాలిపై నడుస్తున్న వీడియోను రీట్వీట్‌ చేస్తూ.. ఇకపై ఆమె ఒక కాలితో కాకుండా రెండు కాళ్లతో పాఠశాలకు పరిగెడుతుందని హామీ ఇచ్చారు. సీమా కోసం టికెట్లు పంపిస్తున్నానని పేర్కొన్నారు. సీమాపై వచ్చిన కథనాలపై అంతకుముందే వైద్య శాఖ స్పందించింది. అధికారులు వచ్చి సీమా కాలిని పరిశీలించారు. ఆమెకు కృత్రిమ కాళ్లను అమర్చాలని నిర్ణయించారు.

ఎవరికీ భారం కాకూడదని..

రెండేళ్ల క్రితం సీమాను ట్రాక్టర్ ఢీకొట్టడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. దెబ్బతిన్న కాలిని పూర్తిగా తీసేయాలని వైద్యులు నిర్ణయించి, ఆమె ఎడమ కాలిని తొలగించారు. అయితే ఆపరేషన్ తర్వాత సీమా వేగంగానే కోలుకుంది. దివ్యాంగురాలిననే భావన దరిచేరకుండా సొంతంగా తన పనులు చేసుకోవడం ప్రారంభించింది. ఎవరికీ భారం కాకూడదని ఒంటికాలితో గెంతుకుంటూనే స్కూల్​కు వెళ్తోంది. టీచర్లు సైతం సీమా పట్టుదలను చూసి మెచ్చుకుంటున్నారు.




గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు