UP MLA: ‘కాలితో ఇలా తన్నగానే తొలగిపోయిన తారు.. ఇదీ యూపీ రోడ్డు పరిస్థితి!’

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓ రోడ్డు పనుల్లో నాణ్యతా లోపాలకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. కేవలం కాలితోనే రోడ్డుపై వేసిన తారు కొట్టుకుపోతుండటం గమనార్హం.

Published : 01 Apr 2023 00:32 IST

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌ (Uttar Pradesh)లో రోడ్డు పనుల్లో నాణ్యత లోపాలను తేటతెల్లం చేస్తోన్న ఓ వీడియో నెట్టింట వైరల్‌ (Viral Video)గా మారింది. మామూలుగా కాలితో ఇలా తన్నగానే రోడ్డుపై వేసిన తారు తొలిగిపోతున్నట్లు అందులో కనిపిస్తోంది. స్వయంగా ఎమ్మెల్యే చేపట్టిన తనిఖీల్లో ఈ డొల్లతనం బయటపడటం గమనార్హం. ఇక్కడి జఖనియా నియోజకవర్గంలో జాంగీపుర్‌- బహారియాబాద్‌- యూసుఫ్‌పుర్‌ మార్గంలో కొత్తగా తారు రోడ్డు వేస్తున్నారు. అయితే, నాసిరకం పనులు చేపడుతున్నారంటూ స్థానికులు.. గాజీపుర్‌ ఎమ్మెల్యే, సుహెల్‌దేవ్‌ భారతీయ సమాజ్‌ పార్టీ(SBSP)కి చెందిన బేదీరాం దృష్టికి తీసుకెళ్లారు.

దీంతో ఆయన క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించారు. కేవలం కాళ్లతోనే తారును తొలగిస్తున్నట్లు కనిపిస్తోన్న దృశ్యాలు ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారాయి. దీంతో ఆయన అక్కడే ఉన్న సంబంధిత గుత్తేదారు తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘ఇది కొత్త రహదారా..? కారు వెళ్లగలదా దీనిపైనుంచి?’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘పని ప్రదేశంలో ప్రజాపనుల విభాగం అధికారి ఎవరూ లేరు. రోడ్డు పనుల్లో నాణ్యత ప్రమాణాలను విస్మరించారు. ఇది ఆరు నెలలు కూడా నిలవదు’ అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. మరోవైపు, ఈ వీడియో చూసిన నెటిజన్లు సైతం పనుల తీరుపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని