Big Samosa: 30 మంది కోసం.. బాహుబలి సమోసా!

మాములుగా సమోసాలు అరచేతిలో ఇమిడిపోతాయి. కానీ, రెండు చేతులతో ఎత్తాల్సివచ్చే ‘బాహుబలి సమోసా’ను చూశారా? దాని బరువు కూడా ఒక కిలో కాదు.. రెండు కాదు.. దాదాపు ఎనిమిది కిలోలు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌లో ఈ భారీ సమోసాను తయారు చేశారు.

Published : 27 Oct 2022 18:13 IST

లఖ్‌నవూ: మాములుగా సమోసాలు అరచేతిలో ఇమిడిపోతాయి. కానీ, రెండు చేతులతో ఎత్తాల్సివచ్చే ‘బాహుబలి సమోసా(Bahubali Samosa)’ను చూశారా? దాని బరువు కూడా ఒక కిలో కాదు.. రెండు కాదు.. దాదాపు ఎనిమిది కిలోలు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌లో ఈ భారీ సమోసాను తయారు చేశారు. ఆలు, బఠాణీలు, డ్రైఫ్రూట్స్‌, ఛీజ్‌తో ఈ సమోసాను స్టఫ్‌ చేశారు. ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్‌ గోయెంకా(Harsh Goenka) తాజాగా ఈ తినుబండారానికి సంబంధించిన వీడియోను ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు. దీన్ని దీపావళితో ముడిపెడుతూ.. ‘పండగ రోజు స్వీట్స్ అన్నీ అయిపోయాక.. ఈరోజు ఒకటి కంటే ఎక్కువ సమోసాలు తినకూడదని నా భార్య ఆదేశించింది’ అని చమత్కరించారు.

ఇదిలా ఉండగా.. ఈ సమోసా ధర రూ.1100. దీన్ని తినేందుకు 30 మంది అవసరమని దుకాణం నిర్వాహకులు తెలిపారు. అరగంటలో ఆరగిస్తే.. రూ.51 వేల నగదు బహుమతి సైతం ప్రకటించడం విశేషం. మరోవైపు.. హర్ష్‌ గోయెంకా ట్వీట్‌ చేసిన ఈ సమోసా వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. నెటిజన్లు సైతం పెద్ద సమోసాను చూసి, కామెంట్ల రూపంలో ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ‘ఇది చాలా పెద్దది. మీరు ఒంటరిగా తినలేరు. పుట్టినరోజు కేకులా కోసి.. ఫాలోవర్స్‌కు పంచండి’ అని ఒకరు స్పందించారు. ‘ఈ సమోసా చూడటానికా? లేదా తినడానికా? దీన్ని షోకేస్‌లో ఉంచడమే మంచిది’ అని మరొకరు కామెంట్‌ పెట్టారు. దీన్ని సగం తినడం కూడా గిన్నిస్‌ రికార్డు అవుతుందని ఒకరు వ్యాఖ్యానించారు. 



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని