జీవితమంటే ఇవ్వడమే!

నువ్వు ఇవ్వదగినదేదో ఇవ్వు... అది వెయ్యింతలై తిరిగి నీకు దక్కుతుంది. కాని, నీ దృష్టి దాని మీదే ఉండకూడదు. ఇది స్వామి వివేకానంద సూక్తి.

Published : 28 May 2022 00:42 IST

నువ్వు ఇవ్వదగినదేదో ఇవ్వు... అది వెయ్యింతలై తిరిగి నీకు దక్కుతుంది. కాని, నీ దృష్టి దాని మీదే ఉండకూడదు. ఇది స్వామి వివేకానంద సూక్తి.

మానవజన్మ ఇచ్చేందుకే కలిగింది. ఎంతసేపూ నాకేమిటని అనుకోవడం స్వార్థం. నీకేం కావాలి అని అడగడం పరమార్థం. ఇలా అడగడంలో ఏమైనా ఇవ్వడంలో మనిషి పొందే సంతృప్తి, ఆనందం అనుభవైకవేద్యం. ‘నువ్వు ఎంత ఇస్తున్నావనేది కాదు. ఎంత ప్రేమగా ఇస్తున్నావనేది ముఖ్యం’ అంటారు మదర్‌ థెరెసా. ఇతరులనుంచి సహాయం పొందడంలో కన్నా వాళ్లకు చేతనైనంత సాయం అందించడంలో కలిగే సంతోషమే గొప్పది.

సముద్రం ఇచ్చిన నీరు గ్రహించి సూర్యుడు ఆవిరి చేస్తున్నాడు. ఫలితంగా ఏర్పడిన మేఘాలు వర్షిస్తున్నాయి. ఆ నీరు గ్రహించిన నేల- మనిషికి చెట్టు, ఫలాలు, కలప ఇస్తోంది. వీటిలో దేనికి స్వార్థం ఉంది? ప్రకృతి నుంచి పంచభూతాలనుంచి మనం నేర్చుకో వలసింది ఇదే!

ఎంత నిరుపమానమైన త్యాగం చేసి రుషులు, మునులు, పండితులు, బుధులు, నేతలు సమాజ కల్యాణానికి తమను తాము సమర్పించుకున్నారు. జగతి ప్రగతి కోసం అంకిత మైపోయారు! మనకు మెతుకు ఇవ్వడానికి  రైతు శ్రమిస్తున్నాడు. మనకు బతుకునివ్వడానికి తన ప్రాణాన్ని పణం పెడుతున్నాడు. ఇలా ఎందరెందరో జీవితం అంటే ఇవ్వ డమన్న మాటలకు సాక్షీభూతులై కనపడుతున్నారు. ఆనందంగా ఉన్న సమయంలో మనతో కలిసి నవ్విన మనిషిని మరిచిపోవచ్చు కాని, కష్టకాలంలో మనతో పాటు విలపించిన మనిషిని మాత్రం మరిచిపోకూడదు. అదే మానవత్వం. ప్రతి మనిషికీ మరణం ఉంటుంది. కాని, మానవత్వానికి ఉండదు.

కర్ణుడు, శిబి, రంతిదేవుడు, హరిశ్చంద్రుడు జీవితానికున్న పరమార్థాన్ని అర్థం చేసుకుని ఆచరించిన వారు. ‘నాది అనుకున్నదేదీ నాది కాదు’ అన్న సత్యం గ్రహించినవారు. త్యాగశీలికి కులం, మతం, వర్గం, ప్రాంతం, సమయం, సందర్భం... ఇవేవీ అడ్డుకావు. మనిషి, పక్షి, పశువు- ఇలాంటి తారతమ్యాలను అతడు చూడడు.

లోగిలిలోని కుక్క మనం పెట్టేముద్ద తిని, నమ్మకంగా అక్కడే ఉంటుంది. యజమాని వెంటనంటే ఉంటుంది. ఆమాత్రం విశ్వాసం మానవుడిలో ఉంటే చాలు, మానవత్వం వికసిస్తుంది. పొందిన ఉపకారానికి ఎన్నో రెట్లు ప్రత్యుపకారం చేయడమే మనిషి గౌరవాన్ని కీర్తిని పెంచుతుంది.

మంచిమాట, సలహా ఇతరులకు చెప్పడానికి మనిషి ఆసక్తి చూపాలి. మేలుచేయడానికి, త్యాగం చేయడానికి తపించాలి. సాటిమనిషిని, నిస్సహాయుణ్ని ఆదుకునేందుకు ఆవేదన చెందాలి.

ఎవరైనా చెయ్యి చాపితే, సగం మరణించినవాడని, అలా చెయ్యి చాపినప్పుడు ‘లేదు’ అనేవాడు ముందే మరణించిన వాడితో సమానమనీ అంటాడు కబీర్‌ దాసు.

కుటుంబంలోనే పరస్పర త్యాగశీలత అలవడితే, అది సమాజంలో విస్తరించి ప్రపంచమంతా పరివ్యాప్తమవుతుంది.

- చిమ్మపూడి శ్రీరామమూర్తి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని