అమ్మ-నాన్న

అమ్మ నిజం, నాన్న నమ్మకం అని కొందరు అంటూ ఉంటారు. ఈ వాక్యంలో అసంపూర్ణత్వం, వెలితి ప్రస్ఫుటం అవుతున్నట్లు తోస్తుంది. అమ్మ నిజం అయినప్పుడు నాన్నా నిజమే.

Published : 02 Jun 2023 00:40 IST

మ్మ నిజం, నాన్న నమ్మకం అని కొందరు అంటూ ఉంటారు. ఈ వాక్యంలో అసంపూర్ణత్వం, వెలితి ప్రస్ఫుటం అవుతున్నట్లు తోస్తుంది. అమ్మ నిజం అయినప్పుడు నాన్నా నిజమే. రక్త సంబంధం, సహచరత్వం, ఒకే గూటి  నివాసం... ఇవన్నీ కుటుంబ వ్యవస్థకు ఉన్న ప్రాథమిక లక్షణాలు. నిజాలకు నమ్మకాలకు అమ్మా నాన్న అతీతం. ‘నాన్నా నిన్ను నమ్ముతున్నాను’ అని చెప్పడంలో ఆత్మీయత కనపడదు. ‘అమ్మా నీవే నిజం’ అనే మాట ఆ ప్రేమమూర్తిని అవమానించడమే! అమ్మలోని ఆప్యాయత, అనురాగం, ఆనందం, ఆదర్శం, కమ్మదనం, తీయదనం- హృదయంలో గొప్ప అనుభూతి కలిగిస్తాయి. నాన్నలోని హుందాతనం, సంతానంపై కడుపులో కనపడకుండా దాచుకున్న ప్రేమ ఈ ప్రపంచాన్నే మరిపింపజేస్తాయి. 

నాగరికత పురోభివృద్ధి, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం కుటుంబ  వ్యవస్థ మీదా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. రకరకాల ఆలోచనలు, కొత్త కోణంలో వ్యక్తమవుతున్న తల్లిదండ్రుల అనురాగం వల్ల ప్రేమల్లో స్వాభావికత లోపిస్తోంది. నిజానికి ప్రేమకు మరో రూపం  అమ్మ. నాన్న అంటే ఒక ధైర్యం. చెప్పిన మాట వినకపోతే  నాన్న అంటే భయం. నాన్న అంటే మమకారం... నాన్న అంటే కొంచెం కోపం... మొత్తానికి నాన్న అంటే విడదీయలేని బంధం. అమ్మ కడుపులోకి చేరిన నాటి నుంచి   నవ మాసాలు మోసి తన రక్త మాంసాలు పంచి జన్మనిస్తుంది. పొత్తిళ్లలో పసికందును చూసి ప్రసవవేదనను మరిచిపోతుంది. అప్పుడు నాన్న తన రెండు చేతుల్లోకి తీసుకొని కొడుకు  భవితవ్యం కోసం ప్రణాళికలు రచించడం ప్రారంభిస్తాడు. నాన్నలోని జ్ఞానం, నాన్నలోని లలితకళలు ఆ స్పర్శ ద్వారా కొడుకులోకి చేరతాయి.

నాన్న ఒక భద్రత. ఆయనే భవితకు భరోసా. ప్రౌఢ వయసులో పరిపూర్ణమైన వ్యక్తిత్వం కలగడానికి, గెలుపులో ఆనందాలను సంయమనంతో అదుపు చేసుకోవడానికి  ఓటమిలో నిరాశా నిస్పృహలను అధిగమించేందుకు నాన్నే మార్గదర్శి. అమ్మది అనురాగం... నాన్నది బాధ్యత. ఇద్దరూ సమానమే. ఎదుగుతున్న వయసులో అమ్మ నిజం... నాన్న సత్యం. నిజానికి నాన్న లేనిది అమ్మదనం రాదు. కనుక నాన్న అసందిగ్ధమైన నిజం. అమ్మ వర్ణనకు అతీతం. తల్లి పిల్లలకు మెరుగైన సంరక్షణను అందించాలనుకుంటుంది. తండ్రి కొడుకుకు జీవితంలో గెలుపు బాట చూపిస్తాడు. తల్లిదండ్రులిద్దరికీ పిల్లలపైన అపారమైన అనురాగం ఉంటుంది. కాకపోతే తల్లి ఆ అనురాగాన్ని ప్రదర్శిస్తుంది... తండ్రి ఆ అనురాగాన్ని వికాసంగా మారుస్తాడు.

సంతానం తల్లినొకరకంగా తండ్రినొక రకంగా గమనించే ప్రమాదం నుంచి కాపాడాలి. సంస్కృతిపరమైన సరిహద్దులు పలుచనైపోకుండా చూసుకోవాలి. బాధ్యతలు లేని కుటుంబ వ్యవస్థ, సమాజాన్ని పూర్తిగా పాడుచేస్తుందని కృష్ణుడు పార్థుడితో అంటాడు. వ్యక్తిగత ధోరణుల కంటే అమ్మ నాన్నల మధ్య అపురూపమైన అవగాహన స్థాయి సంతానానికి హాయిని ఆనందాన్ని ఇస్తుంది. అమ్మకు ఎప్పుడూ పిల్లలలోని గుణాలే కనిపిస్తాయి. నాన్నకు మాత్రం పిల్లల గుణాలతోపాటు దోషాలు కూడా గోచరిస్తాయి. నాన్న తప్పులను ఒప్పులుగా మార్చి వ్యక్తిత్వాలను తీర్చిదిద్దుతాడు. అంతులేని ప్రేమ అమ్మది. ఆ ప్రేమ ఆమె కళ్లలో కనిపిస్తుంది. నాన్న అరుదుగా మెచ్చుకుంటాడు మాటలతో. కానీ మౌనంగా దీవిస్తాడు. అమ్మ భోజనం పెట్టి ఆకలి తీరుస్తుంది. నాన్న ఆశలు తీరుస్తాడు. అందుకే అమ్మ అనురాగం ఆత్మీయత నిజం. నాన్న బాధ్యతలు నిజం... అందుకోసం నాన్న పడే కష్టాలు బాధలు నిజం. అమ్మ, నాన్న... ఇద్దరూ నిజాలే!

 అప్పరుసు రమాకాంతరావు

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు