వినయం భూషణం

విద్యార్జనకు, విషయం తెలుసుకోవాలన్న తపనకు,  వినయం గుణసంపదగా భాసిల్లి కార్యసాఫల్య మార్గం సుగమం చేస్తుంది. గురుకుల సంస్కృతిలో, సన్యాస ఆశ్రమాల్లో గురువులు శిష్యుల్లో వినయాన్ని చూసేవారు.

Published : 10 Mar 2024 00:46 IST

విద్యార్జనకు, విషయం తెలుసుకోవాలన్న తపనకు,  వినయం గుణసంపదగా భాసిల్లి కార్యసాఫల్య మార్గం సుగమం చేస్తుంది. గురుకుల సంస్కృతిలో, సన్యాస ఆశ్రమాల్లో గురువులు శిష్యుల్లో వినయాన్ని చూసేవారు. వినయవంతుడైన శిష్యుడి పట్ల ప్రత్యేక దృష్టి కలిగి, సర్వ విద్యలూ బోధించి తనంతటివాడిగా తీర్చిదిద్దుతాడు గురువు.

విద్య వినయాన్ని ప్రసాదిస్తుందన్నది సుభాషితం. అన్నీ ఉన్న ఆకు అణగి మణగి ఉంటుంది. ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది అంటూ వినయశీలిని పూర్ణ పదార్థాలతో నిండిన ఆకుతో పోలుస్తారు పెద్దలు. నిండుకుండ తొణకదు అన్న మాటా వినయ వ్యక్తిత్వాన్ని ఉదాహరిస్తూ లోక వ్యవహారంలో ఉన్నదే. పళ్లతో నేలను తాకుతూండే చెట్టును వినమ్రతకు చిహ్నంగా భావించమంటారు పెద్దలు.

బాధ్యత పంచడానికైనా, అవసరమైన పని చేయించుకోవడానికైనా నాయకులు వినయశీలుర్ని ఎంచుకుంటారు. మాటకు మాట ఎదురు చెప్పే దుడుకు స్వభావుల పట్ల సమాజం అప్రమత్తంగా ఉండి దరికి చేరనీయదు.

శ్రీరామచంద్రుడు మహా చక్రవర్తి దశరథుడి కుమారుడు అయినా సాధారణ వ్యక్తిలా యాగ రక్షణ కోసం అడవుల్లో విశ్వామిత్రుడి వెంట కాలినడకన వెళ్ళాడు. విశ్వామిత్రుడు ముక్కోపి అయినా బాలరాముడి ప్రశాంత తత్వం, ఆయన కోపానికి అవకాశం ఇవ్వలేదు. రాముడి వినయానికి సంతుష్టుడైన విశ్వామిత్రుడు ఎన్నో అస్త్రశస్త్రాలను బహూకరించాడు. తాటకి, సుబాహులను చంపడం వల్ల రాముడి పరాక్రమం, శివధనుస్సును ఎక్కుపెట్టడం వల్ల అతడి కీర్తి దశదిశలకు విస్తరించాయి. సాక్షాత్తు లక్ష్మీదేవి అవతారమైన సీతాదేవిని వివాహమాడి అంతులేని సంపదలను పొందగలిగాడు. పరశురాముడి విల్లును ఎక్కుపెట్టి వినయభూషణుడై అతడికి గర్వభంగం చేశాడు. పోతపోసిన వినయమూర్తి రాముడని లోకం కొనియాడింది. రామాయణం మానవ యానానికి మార్గదర్శకమైంది.

దుష్టులకు ధనం, వంశం, విద్య మదాన్ని కలిగిస్తాయని, అవే సత్పురుషులకు వినయాన్ని ప్రసాదిస్తాయని మహాభారతంలో విదురుడు ధృతరాష్ట్రుడికి వివరిస్తాడు. కచుడు వినయ గుణం కలిగి ఉండటం వల్ల శుక్రాచార్యుడి వద్ద శిష్యుడిగా చేరి మృతసంజీవని విద్యను పొందగలిగాడు. సత్యభామ పొగరుకన్నా రుక్మిణి వినయం కృష్ణుడిని ఆకట్టుకుందన్నది జగమెరిగిన సత్యం.

ఒకప్పుడు రాజులు ఇతర రాజులకు సంధికి సంబంధించి, ఇతర రాచకార్యాల గురించి వర్తమానాలు పంపాలంటే వినయస్వరూపులనే పంపేవారు. వినయ విధేయతలు జంట పదాలు. వినయం కలిగినవారు నాయకులకు విధేయులుగా ఉంటే ఆ నాయకుడికి లక్ష్యం సునాయాసంగా చేరువవుతుంది. రాముడికి సర్వసమర్థుడు, వినయసంపన్నుడు అయిన ఆంజనేయుడు విధేయుడు. సీతమ్మను కనుగొని రామయ్య వద్దకు చేర్చాడు. శ్రీరామ పట్టాభిషేకంలో నేలపై కూర్చుని విధేయతను చాటాడు. విధేయత విషయంలో కర్ణుడు గొప్పవాడే. కాని, అధర్మ చరితులతో చేతులు కలవడం వల్ల దుష్టచతుష్టయంలో ఒకడిగా అపకీర్తిని మూటగట్టుకున్నాడు.

పిల్లల్లోని వినయం విద్యకు, యువతలోని వినయం కర్తవ్యనిర్వహణకు, పెద్దల్లోని వినయం అనుభవానికి గుర్తులు. మనిషికి ఊహ తెలిసింది మొదలు తనువు చాలించేవరకు చేసే వినయపూరిత వ్యవహారం జీవిత విలువను పెంచుతుంది. పొందే సత్కీర్తి చిరంజీవిని చేస్తుంది.

 ప్రతాప వెంకట సుబ్బారాయుడు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని