Updated : 30/11/2021 05:11 IST

AP News: వేగంగా పరిహారం ఇచ్చినా విమర్శిస్తున్నారు

ఆ పెద్దమనిషివి బురద రాజకీయాలు

హుద్‌హుద్‌ సమయంలో రూ.22 వేల కోట్ల నష్టమన్నారు

కానీ రూ.550 కోట్లే ఇచ్చారు

వరద సహాయ చర్యలపై సమీక్షలో సీఎం జగన్‌

ఈనాడు డిజిటల్‌, అమరావతి: వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు బాగా పనిచేసి బాధితులకు వేగంగా పరిహారం అందించినా బురదజల్లుతున్నారని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. రూ.6 వేల కోట్ల నష్టం వాటిల్లితే రూ.34 కోట్లే ఇచ్చారంటూ విమర్శిస్తున్నారని.. ఆ పెద్దమనిషివి బురద రాజకీయాలని చంద్రబాబును ఉద్దేశించి విమర్శించారు. వరద నష్టంలో 40% రహదారులు, 30% పంటలు, సుమారు 18% ప్రాజెక్టుల రూపేణా జరిగిందని వివరించారు. హుద్‌హుద్‌ తుపాను సమయంలో రూ.22 వేల కోట్ల నష్టం జరిగిందని చెప్పి.. రూ.550 కోట్లు మాత్రమే సాయం అందించారని, అదీ కేంద్ర ప్రభుత్వమే ఇచ్చిందని విమర్శించారు. వరద బాధితులను శరవేగంగా ఆదుకోవడం గతంలో ఎన్నడూ జరగలేదని, కనీసం నెల సమయం పట్టేదని చెప్పారు. ఇప్పుడు వారం రోజుల్లోనే సాయం అందిస్తున్నామన్నారు. కడప, చిత్తూరు, నెల్లూరు, అనంతపురం జిల్లాల కలెక్టర్లతో తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం సోమవారం వర్చువల్‌గా సమీక్షించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాల పురోగతి, నష్టపరిహారం, నిత్యావసరాల పంపిణీ, రహదారుల తాత్కాలిక పునరుద్ధరణ వంటి అంశాలను తెలుసుకున్నారు.

ఇళ్లు లేనివారికి తాత్కాలిక వసతి

‘వరద బాధిత ప్రాంతాల్లో ఇళ్లు లేని వారికి తాత్కాలిక వసతి ఏర్పాటు చేయాలి. నివాసాలు ఏర్పాటయ్యే వరకూ వారిని జాగ్రత్తగా చూసుకోవాలి. చెరువులకు గండ్లు పడకుండా పర్యవేక్షించాలి. చెరువుల మధ్య అనుసంధానత, అవి నిండగానే అదనపు నీటిని నేరుగా కాల్వలకు పంపించే వ్యవస్థ ఉండేలా దృష్టిపెట్టాలి. అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోవడంతో  నీటిని నిల్వ చేయలేని పరిస్థితి తలెత్తింది. అనేక ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు ఆధారమైన చెరువులకు గండ్లు పడ్డాయి. ఆ ప్రాంతాల్లో తాగునీటి కొరత రాకుండా.. వచ్చే వేసవిని దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. నిత్యావసరాలు అందించిన ప్రతి కుటుంబానికి అదనపు సాయం రూ.2 వేలు అందాలి. పంట నష్టం లెక్కింపు పూర్తయిన వెంటనే సామాజిక తనిఖీ నిర్వహించాలి. క్షేత్రస్థాయి పర్యటనలో వచ్చే విజ్ఞప్తులపై అధికారులు ఉదారంగా స్పందించాలి. పూర్తిగా ధ్వంసమైన ఇళ్ల స్థానంలో కొత్తవి మంజూరు చేసి, వెంటనే పనులు పూర్తయ్యేలా చూడాలి’ అని సీఎం స్పష్టం చేశారు.

గతంలో పరిహారం ఇవ్వడానికే నెల

‘గతంలో వరదల సమయంలో ఇళ్లు ధ్వంసమైనా, దురదృష్టవశాత్తూ ఎవరైనా మరణించినా పరిహారం ఇచ్చేందుకు నెల పట్టేది. గల్లంతైన వారికి పరిహారం ఇచ్చేవారు కాదు. రేషన్‌, నిత్యావసరాలు ఇస్తే చాలనుకునేవాళ్లు. ఇప్పుడు వారం రోజుల్లోనే పరిహారం ఇచ్చి ఆదుకున్నాం. నిత్యావసరాలతోపాటు రూ.2 వేల అదనపు సాయం అందించాం. గతంలో సీజన్‌ ముగిసేలోగా రైతులకు సాయం చేసిన దాఖలాల్లేవు. ఇన్‌పుట్‌ సబ్సిడీ అందాలంటే కనీసం ఏడాది పట్టేది. ప్రస్తుతం పంట నష్టపోయిన సీజన్‌ ముగిసేలోగా సాయం చేస్తున్నాం. బాధితులకు అన్ని రకాలుగా నష్టపరిహారం అందించాం’ అని సీఎం చెప్పారు.

Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని