ఉద్యోగాలు సృష్టించే నాయకుణ్ని ఎన్నుకోవాలి

ఏ నాయకుడు రాష్ట్రాన్ని ఆర్థికంగా ముందుకు తీసుకువెళ్తారు? ఎవరి వల్ల యువతకు ఉద్యోగాలు వస్తాయి? రాష్ట్రంలో శాంతిభద్రతలను ఎవరు కాపాడతారో అలాంటి నాయకుడిని ఎన్నుకోవాలని ప్రవాస భారతీయుడు వెంకటరావు మూల్పూరి సూచించారు.

Published : 09 May 2024 06:02 IST

మాదకద్రవ్యాలకు ఏపీ రాజధానిగా మారడం బాధాకరం
ప్రవాస భారతీయుడు వెంకటరావు మూల్పూరి

ఈనాడు, అమరావతి: ఏ నాయకుడు రాష్ట్రాన్ని ఆర్థికంగా ముందుకు తీసుకువెళ్తారు? ఎవరి వల్ల యువతకు ఉద్యోగాలు వస్తాయి? రాష్ట్రంలో శాంతిభద్రతలను ఎవరు కాపాడతారో అలాంటి నాయకుడిని ఎన్నుకోవాలని ప్రవాస భారతీయుడు వెంకటరావు మూల్పూరి సూచించారు. ‘రాష్ట్రాన్ని ఉన్నత స్థానంలోకి తీసుకువెళ్లే నాయకుణ్ని, న్యాయబద్ధంగా పాలన చేసేవారిని ఎన్నుకోవాలి. సీఎం జగన్‌ న్యాయాన్ని, ధర్మాన్ని నాలుగు పాదాల మీద కాదు కదా.. కనీసం బొటనవేలు మీద కూడా నడిపించలేకపోతున్నారు. యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు ఉండాలి. బంగారు భవిష్యత్తుకు.. విద్య తొలిమెట్టు అయితే, ఉద్యోగం ఆ తర్వాతి మెట్టు. ఏ తల్లి తన పిల్లలు చదువుకుని, నిరుద్యోగులుగా ఉండడాన్ని ఇష్టపడదు. ఉద్యోగాలు రావాలంటే రాష్ట్రం పారిశ్రామికంగా ముందుండాలి. గత అయిదేళ్లలో పారిశ్రామికాభివృద్ధిలో రాష్ట్రం వెనకబడింది. బీటెక్‌ పట్టాలు పొందిన యువత ఉద్యోగాల కోసం పలు నగరాలకు వెళ్లాల్సిన దుస్థితి. మన రాష్ట్రంలోనే ఉద్యోగాలు సృష్టించుకోవాలి. ఐటీ రంగానికి కావాల్సింది పెట్టుబడి కాదు మేధస్సు కావాలి. మెకానికల్‌ ఇంజినీరింగ్‌ వంటి వాటిల్లో పట్టాలు పొందే వారికి ఉపాధి కల్పించాలంటే ఉత్పత్తి పరిశ్రమలను తీసుకురావాలి. అవి రావాలంటే రాష్ట్రంలో అనుకూలమైన పరిస్థితులు కల్పించుకోవాలి’ అని తెలిపారు. ‘రాష్ట్రంలో శాంతిభద్రతలు ఉన్న ప్రాంతాల్లోనే పరిశ్రమలు పెట్టడానికి పెట్టుబడిదారులు ముందుకు వస్తారు. మంచి రోడ్లు, మౌలికసదుపాయాలు ఉంటేనే అవి సాధ్యం. ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి తన రాష్ట్రాన్ని ఒక ట్రిలియన్‌ డాలర్‌ ఎకానమిగా చేసి చూపిస్తా అంటున్నారు. 15 ఏళ్ల కింద ఉమ్మడి రాష్ట్రంతో పోలిస్తే యూపీ ఎంత వెనకబడి ఉందో గమనించాలి. ఈ రోజున వాళ్లు అంత సవాల్‌ చేస్తున్నప్పుడు మన రాష్ట్రంలో ఎవరైనా ఆ అంశం గురించి మాట్లాడుతున్నారా? ఏ నాయకుడిని పరిశ్రమలు నమ్ముతాయి. ఎవరిని నమ్మి పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తాయో అని ఓటర్లు ఆలోచించుకోవాలి. గత అయిదేళ్లుగా ఏపీలో జరుగుతున్న విధ్వంసాన్ని చూసి ప్రవాసాంధ్రులు ఎంతో ఆవేదన చెందుతున్నారు. రాష్ట్రానికి రాజధాని లేకున్నా.. మన దేశంలో మాదకద్రవ్యాలకు ఏపీ రాజధానిగా ఉండడం చూసి దుఃఖిస్తున్నాం’ అని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని