విశాఖలో 50 యుద్ధ విమానాలతో ‘ఫ్లైపాస్ట్‌’

రాష్ట్రపతి యుద్ధనౌకల సమీక్ష (ప్రెసిడెంట్స్‌ ఫ్లీట్‌ రివ్యూ)కు విశాఖలో 50 యుద్ధ విమానాలతో ‘ఫ్లైపాస్ట్‌’ నిర్వహించనున్నట్లు తూర్పు నౌకాదళాధిపతి వైస్‌ అడ్మిరల్‌ బిశ్వజిత్‌ దాస్‌గుప్తా తెలిపారు.

Published : 04 Dec 2021 04:19 IST

ఫిబ్రవరి 21న వీక్షించనున్న రాష్ట్రపతి

ఫిబ్రవరి 25 నుంచి ‘మిలన్‌’

తూర్పునౌకాదళాధిపతి వైస్‌ అడ్మిరల్‌ బిశ్వజిత్‌ దాస్‌గుప్తా


వివరాలు వెల్లడిస్తున్న తూర్పునౌకాదళాధిపతి వైస్‌ అడ్మిరల్‌ బిశ్వజిత్‌ దాస్‌గుప్తా. చిత్రంలో కమొడోర్‌ గోవర్ధన్‌రాజు,
రియర్‌ అడ్మిరల్‌ తరుణ్‌ సోబ్తి, రియర్‌ అడ్మిరల్‌ ఐ.బి.ఉత్తయ్య, కమొడోర్‌ స్వపన్‌ శ్రీగుప్తా

ఈనాడు, విశాఖపట్నం: రాష్ట్రపతి యుద్ధనౌకల సమీక్ష (ప్రెసిడెంట్స్‌ ఫ్లీట్‌ రివ్యూ)కు విశాఖలో 50 యుద్ధ విమానాలతో ‘ఫ్లైపాస్ట్‌’ నిర్వహించనున్నట్లు తూర్పు నౌకాదళాధిపతి వైస్‌ అడ్మిరల్‌ బిశ్వజిత్‌ దాస్‌గుప్తా తెలిపారు. విశాఖలోని తూర్పునౌకాదళంలో శుక్రవారం జరిగిన సమావేశంలో పలు అంశాలను ఆయన వెల్లడించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 21న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ కార్యక్రమానికి హాజరై నౌకాదళం, తీర భద్రతాదళం, మెరైన్‌ విభాగాలకు చెందిన 50 యుద్ధనౌకలను తిలకిస్తారన్నారు. ఫిబ్రవరి 25 నుంచి ‘మిలన్‌’ పేరుతో పలు దేశాల నౌకాదళాల ఉన్నతాధికారుల అంతర్జాతీయ సమావేశం విశాఖలో జరుగుతుందన్నారు. ఈ తరహా కార్యక్రమం విశాఖలో జరగడం మొదటిసారన్నారు. అయితే పాకిస్థాన్‌, చైనాలకు ఈ సమావేశాల్లో స్థానం లేదని వెల్లడించారు. ‘మిలన్‌’ నిర్వహణ సందర్భంగా ‘మిలన్‌ విలేజ్‌’, ‘నగర కవాతు’, ‘రక్షణ ఉత్పత్తుల ప్రదర్శన’ నిర్వహిస్తామని ప్రకటించారు. ఫిబ్రవరి 27న జరిగే నగర కవాతుకు ముఖ్యమంత్రి జగన్‌ హాజరవుతారని, డిఫెన్స్‌ ఎక్స్‌పోను రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ప్రారంభిస్తారని వెల్లడించారు. విశాఖలోని తూర్పు నౌకాదళంలో మిగ్‌-29 స్క్వాడ్రన్‌ను వచ్చే సంవత్సరానికల్లా ఏర్పాటు చేస్తామని తెలిపారు. తూర్పునౌకాదళానికి ఇప్పటికే మూడు అధునాతన ఎ.ఎల్‌.హెచ్‌.హెలికాప్టర్లు వచ్చాయని త్వరలో మరో రెండు రాబోతున్నాయని వెల్లడించారు. అత్యాధునికమైన మల్టీరోల్‌ హెలికాప్టర్లను కూడా విశాఖకు రప్పిస్తున్నట్లు తెలిపారు. ‘రాష్ట్రపతి యుద్ధనౌక సమీక్ష’ టీజర్‌ను తూర్పునౌకాదళాధిపతి విడుదల చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని