ప్రజలందరికీ మంచి జరగాలి

ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలోని గోశాల ఆవరణలో శుక్రవారం సంక్రాంతి సంబరాలను నిర్వహించారు. పల్లె వాతావరణాన్ని ప్రతిబింబించేలా ఆవరణను తీర్చిదిద్దారు. ముఖ్యమంత్రి జగన్‌, భారతి దంపతులు పాల్గొన్నారు.

Published : 15 Jan 2022 03:08 IST

సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న సీఎం జగన్‌ దంపతులు  
క్యాంపు కార్యాలయం వద్ద గోశాలలో సంబరాలు

ఈనాడు, అమరావతి: ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలోని గోశాల ఆవరణలో శుక్రవారం సంక్రాంతి సంబరాలను నిర్వహించారు. పల్లె వాతావరణాన్ని ప్రతిబింబించేలా ఆవరణను తీర్చిదిద్దారు. ముఖ్యమంత్రి జగన్‌, భారతి దంపతులు పాల్గొన్నారు. సంప్రదాయ పంచెకట్టులో వేడుకలకు హాజరైన సీఎం గోవులకు పూజ చేశారు. భోగి మంటలు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు, డప్పు   కళాకారుల ప్రదర్శన, కోలాటాలు, చిన్నారుల నృత్య ప్రదర్శనల    వంటి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు.

ముఖ్యమంత్రి దంపతులు నులక మంచం మీద కూర్చొని ప్రదర్శనలను తిలకించారు. హరిదాసుకు సీఎం దంపతులు ధాన్యం వితరణ చేశారు. పిండి వంటలను రుచి చూశారు. రాష్ట్ర ప్రజలందరికీ మంచి జరగాలని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ విప్‌ చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సంబరాల్లో మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఎంపీ బాలశౌరి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


ప్రతి ఇంటా ఆనందాలు వెల్లివిరియాలి: సీఎం

‘మన సంస్కృతి సంప్రదాయాలకు, సొంత గ్రామాలపై మమకారానికి, వ్యవసాయానికి, రైతులకు మనమంతా ఇచ్చే గౌరవానికీ ప్రతీక సంక్రాంతి’ అని ముఖ్యమంత్రి జగన్‌ ట్వీట్‌ చేశారు. ‘భోగి మంటలు, రంగవల్లులు, పండగ తెచ్చే సంబరాలతో ప్రతి ఇంటా ఆనందాలు వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’ అని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు