పదేళ్ల తర్వాతే యాజమాన్య హక్కులా?

పట్టణ భూ గరిష్ఠ పరిమితి చట్టం పరిధిలో ఉన్నట్లు గుర్తించిన మిగులు భూముల క్రమబద్ధీకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి మరోసారి వివాదాస్పదమైంది.

Published : 12 Mar 2023 04:33 IST

ప్రభుత్వ షరతుపై బాధితుల ఆవేదన
పాత ఉత్తర్వుల్లో కానరాని ‘డి.పట్టా’ ప్రస్తావన

ఈనాడు, అమరావతి: పట్టణ భూ గరిష్ఠ పరిమితి చట్టం పరిధిలో ఉన్నట్లు గుర్తించిన మిగులు భూముల క్రమబద్ధీకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి మరోసారి వివాదాస్పదమైంది. ఈ భూముల క్రమబద్ధీకరణకు గతంలో నిర్ణయించిన ఫీజుల్లో కాస్త వెసులుబాటు ఇస్తూనే... పదేళ్ల తర్వాతే యాజమాన్య హక్కుల బదలాయింపునకు అనుమతిస్తామని ప్రభుత్వం పేర్కొనడంపై విమర్శలు వస్తున్నాయి. కిందటేడాది జనవరిలో జారీ చేసిన జీఓ 36లో స్థల విస్తీర్ణంతో సంబంధం లేకుండా బేసిక్‌ విలువకు ఒకటిన్నర రెట్లు ఫీజు చెల్లించాలని షరతు విధించింది. విజయవాడలో 300 గజాల స్థల యజమానికి రూ.2.7 కోట్లు చెల్లించాలని నోటీసు వచ్చింది. దీనిపై బాధితుల నుంచి విమర్శలు చెలరేగడంతో గత నెలలో జీఓ 84ను ప్రభుత్వం జారీచేసింది. 150 చదరపు గజాల వరకు ఉచితంగా, 150-300 చ.గజాల వరకు బేసిక్‌ విలువలో 15%, 300 నుంచి 500 చ.గజాల వరకు 100% ఫీజు చెల్లిస్తే క్రమబద్ధీకరిస్తామని ప్రభుత్వం పేర్కొంది. ఈ జీఓలోనే పదేళ్ల తర్వాతే యాజమాన్య హక్కు బదలాయింపునకు అనుమతి లభిస్తుందని, అప్పటివరకు డి.పట్టాగానే పరిగణిస్తామని ప్రభుత్వం పేర్కొనడం వివాదానికి కేంద్రమైంది. 2008లో కొందరి భూములను క్రమబద్ధీకరించారు. అప్పటి ఉత్తర్వుల్లో గానీ, గతేడాది ఇచ్చిన జీఓ 36లో గానీ... డి.పట్టా గురించి ప్రస్తావించలేదు.

డి పట్టా అంటే ప్రభుత్వ భూమి

‘డి (దరఖాస్తు) పట్టా అంటే ప్రభుత్వ భూమిగా పరిగణించి ఇచ్చేది. సీలింగ్‌ పరిధిలో ఉన్నందున ప్రభుత్వం క్రమబద్ధీకరణకే చర్యలు తీసుకోవాలి. కానీ, చేతులు మారుతూ వచ్చిన ఈ భూముల్లో ఇళ్లు వెలిశాయి. ఈ పరిస్థితుల్లో వీరికి డి.పట్టా ఇచ్చి... పదేళ్ల తర్వాతే యాజమాన్య బదలాయింపు హక్కు కల్పిస్తామనడం విడ్డూరంగా ఉంది’ అని రెవెన్యూ శాఖ విశ్రాంత అధికారి ఒకరు వ్యాఖ్యానించారు.

రికార్డుల్లో ప్రభుత్వ భూమి

బాధితులు విజయవాడలోని అధికారులను స్పందిస్తే ‘‘రికార్డుల్లో మీ భూమి ప్రభుత్వ భూమిగా ఉంది. అందువల్లే డి-పట్టాగా పరిగణిస్తామని జీఓలో పేర్కొన్నారు’’ అని బదులిచ్చారు. ‘మా భూములకు రిజిస్ట్రేషన్లు జరిగాయి కదా’ అని ప్రశ్నిస్తే మౌనంగా ఉన్నారని ఓ బాధితుడు ఆవేదన వ్యక్తంచేశారు.

నేపథ్యం ఇదీ..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ భూ గరిష్ఠ పరిమితి చట్టం 1976లో అమల్లోకి వచ్చింది. విజయవాడ, గుంటూరు, విశాఖ, హైదరాబాద్‌లోనే ఈ చట్టం అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం చర్యలు తీసుకోవడంతో కొంత భూమి ప్రభుత్వ పరిధిలోకి వెళ్లింది. ఈ క్రమంలోనే పలువురు న్యాయస్థానాలు/రెవెన్యూ ట్రైబ్యునళ్లను ఆశ్రయించారు. తర్వాత ఈ భూములు చేతులు మారుతూ వచ్చాయి. మరోవైపు వీటిని నిషిద్ధ భూముల జాబితా 22 (1) (డి) పరిధిలోకి చేర్చారు. దీనిపై సరైన సమాచారం లేకపోవడం, సబ్‌-రిజిస్ట్రార్‌ కార్యాలయాల నుంచి అభ్యంతరాలు రాకపోవడంతో క్రయ, విక్రయాలు జరుగుతూ వస్తున్నాయి. ప్రస్తుతం విజయవాడలో 1,205, విశాఖ నగరంలో సుమారు 3,500 మంది చొప్పున ఈ భూముల పరిధిలో ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని