Amaravati: అవకాశం వచ్చినా అమరావతి కనబడదా?

పదిహేనో ఆర్థిక సంఘం సిఫారసు మేరకు కేంద్ర ప్రభుత్వం దేశంలో కొత్తగా 8 నగరాల్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ప్రతిపాదనలు పంపాలని రాష్ట్ర ప్రభుత్వాల్ని కోరింది. ఇందుకు సరైన ఎంపిక అమరావతి అని విజ్ఞత ఉన్న ఎవరైనా చెప్పేస్తారు.

Updated : 26 May 2023 07:31 IST

కొత్త నగర నిర్మాణం కోసం కేంద్రానికి కొప్పర్తిని ప్రతిపాదించిన రాష్ట్ర ప్రభుత్వం
అన్ని వనరులూ ఉన్న అమరావతిని కాదని, సీఎం సొంత జిల్లాలోని ప్రాంతం ప్రతిపాదన
ఈనాడు - అమరావతి

మీ పెరట్లో ఒక మామిడి చెట్టుంది. బాగా పక్వానికి వచ్చింది. చేతికందేంత ఎత్తులోనే ఉంది. అదే చెట్టుకు చిటారు కొమ్మన మరో పిందె ఉంది. ఎవరైనా ఏం చేస్తారు? చేతికందేంత ఎత్తులోని పండును కోసుకుంటారు. ఆ తర్వాత పిందె గురించి ఆలోచిస్తారు. కానీ, పరిపాలనలోనూ రివర్స్‌ గేర్‌లో వెళ్లే జగన్‌ ప్రభుత్వం మాత్రం పండును కాలదన్ని, పిందె కోసం అర్రులు చాస్తోంది.

కొత్త నగరాల నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపిన ప్రతిపాదనలు సరిగ్గా ఇలాగే ఉన్నాయి. మహానగరానికి కావాల్సిన సకల వనరులున్న అమరావతిని వదిలేసి, సీఎం సొంత జిల్లాలోని కొప్పర్తిని ప్రతిపాదించింది.


పదిహేనో ఆర్థిక సంఘం సిఫారసు మేరకు కేంద్ర ప్రభుత్వం దేశంలో కొత్తగా 8 నగరాల్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ప్రతిపాదనలు పంపాలని రాష్ట్ర ప్రభుత్వాల్ని కోరింది. ఇందుకు సరైన ఎంపిక అమరావతి అని విజ్ఞత ఉన్న ఎవరైనా చెప్పేస్తారు. భూసమీకరణ, సిద్ధమైన ప్రణాళిక, ఇప్పటికే రోడ్ల వంటి ప్రధాన వసతుల అభివృద్ధిలో ముందుకెళ్లిన ప్రాంతం కావడమే ఇందుకు కారణం. కానీ, జగన్‌ ప్రభుత్వం అమరావతిని వదిలేసి వైయస్‌ఆర్‌ జిల్లాలోని కొప్పర్తిని ప్రతిపాదించింది. అమరావతిపై వైకాపా ప్రభుత్వం ఎంత కక్షపూరితంగా వ్యవహరిస్తోందో చెప్పడానికి ఇదే నిదర్శనం.

సొంత జిల్లాపై ముఖ్యమంత్రికి అభిమానం ఉండొచ్చు..! కానీ, ఆయన ముఖ్యమంత్రి అన్న విషయం మర్చిపోతే ఎలా? కొప్పర్తిలోనో, మరో ప్రాంతంలోనో కొత్త నగరాన్ని అభివృద్ధి చేయడాన్ని ఎవరూ కాదనరు. కేవలం ఒక ప్రాంతంపై కక్షతో రాష్ట్ర ప్రయోజనాల్ని పణంగా పెట్టడాన్ని ఏమనాలి? ఒకవైపు వైకాపా ప్రభుత్వమూ అమరావతిని ‘శాసన రాజధాని’ అంటోంది. అలాంటప్పుడు అమరావతి నిర్మాణానికే మొదటి ప్రాధాన్యమివ్వాలి కదా? పైగా 15వ ఆర్థిక సంఘం ఏ లక్ష్యంతో కొత్త నగరాల్ని అభివృద్ధి చేయాలని ప్రతిపాదించిందో దానికి అమరావతి సరిగ్గా సరిపోతుంది. కొత్త నగరాల నిర్మాణం తలపెట్టినప్పుడు... ఎలాంటి సవాళ్లు, అవరోధాలు ఎదురయ్యే అవకాశముందని ఆర్థిక సంఘం అభిప్రాయపడిందో వాటన్నిటినీ అమరావతి ఇప్పటికే అధిగమించేసింది.
కేంద్రం నిర్మించాలనుకున్న ఒక్కో నగరానికి రూ.వెయ్యి కోట్లు ఇవ్వాలని ఆర్థిక సంఘం ప్రతిపాదించింది. ఆ మేరకు ఎంపిక చేసిన ప్రాంతాల అభివృద్ధికి ఏటా రూ.250 కోట్లు కేంద్రం ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం పదేపదే చెబుతున్నట్లు నిధుల కొరతే అమరావతిని నిలిపివేయడానికి కారణమైతే.. ఇప్పుడు కేంద్రం ఇచ్చే నిధులతోనైనా అభివృద్ధి చేయొచ్చు. అయినా అమరావతిని ఎందుకు ఎంపిక చేయలేదు.? అమరావతిపై కక్షతో జగన్‌ ప్రభుత్వం నాలుగేళ్లుగా ఒక్క ఇటుకా పేర్చలేదు. మరోవైపు కేంద్రం, మిగతా రాష్ట్రాలు నగరాల అవసరాన్ని గుర్తించి.. వాటి నిర్మాణంవైపు సాగుతున్నాయి.

ఆర్థిక సంఘం మాటలతోనైనా కళ్లు తెరవాలి!

* ‘‘దేశంలోని పట్టణ ప్రాంతాలు రద్దీగా మారిపోయాయి. ఒక ప్రణాళిక లేకుండా విస్తరిస్తున్నాయి. మౌలిక వసతుల అభివృద్ధి కష్టమవుతోంది. పట్టణాల్లో తగిన మౌలిక సదుపాయాలు లేకపోవడం ఎంత సమస్యాత్మకమో కొవిడ్‌ మహమ్మారి విజృంభించినప్పుడు చూశాం. అందుకే పాత నగరాలకు కొత్త రూపునిస్తూ, మరిన్ని కొత్త నగరాల్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది’’

* ‘‘పూర్తిగా కొత్తగా నిర్మించే (గ్రీన్‌ఫీల్డ్‌) నగరాల్లో రహదారుల నిర్మాణం, తాగునీరు, మురుగునీటి పారుదల వంటి వ్యవస్థలకు పైపులైన్‌లు వేయడం, విద్యా సంస్థలు, పార్కులు వంటి వాటికి స్థలాలు కేటాయించడం తేలిక’’

* ఆర్థిక సంఘం వివిధ సందర్భాల్లో వెల్లడించిన అభిప్రాయాలు ఇవి. వీటిని పరిశీలిస్తే విభజన తర్వాత ఒక మహానగరమంటూ లేని ఆంధ్రప్రదేశ్‌లో కొత్త నగరాల ఆవశ్యకత తెలుస్తుంది. అదినూ భవిష్యత్తులో హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు దీటుగా ఎదిగేందుకు అవసరమైన వనరులు, ప్రణాళిక, సాధన సంపత్తి ఉన్న నగర నిర్మాణం అవసరం. అమరావతికి అలాంటి ప్రణాళిక, వనరులు పుష్కలంగా ఉన్నా... ఉద్దేశపూర్వకంగా అమరావతి విధ్వంసానికి పూనుకొన్న వైకాపా ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరవాలి.


అమరావతి అద్భుత నగరమయ్యేది
- శేఖర్‌గుప్తా, ప్రముఖ పాత్రికేయుడు, ‘ద ప్రింట్‌’ ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌

‘‘ఈ 21వ శతాబ్దంలో ఒక రాష్ట్రానికి 3 రాజధానులు ఏర్పాటు చేయాలనుకోడం జాతీయ విషాదం. ఇలాంటి పిచ్చి చర్యను అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రజాస్వామ్య దేశంలో కేంద్ర ప్రభుత్వంపై ఉంది. అమరావతిలోని పాలకులపై తుగ్లక్‌ ప్రభావం బలంగా ఉన్నట్టుంది. మూడు రాజధానులే కాకుండా, విశాఖ, అమరావతిల్లో హైకోర్టు బెంచ్‌లూ పెడతారట. వేసవిలో శాసనసభ సమావేశాలు విశాఖలో జరుపుతారట. తుగ్లక్‌ కంటే మూడు రెట్లు ఎక్కువగా అధికార దుర్వినియోగం కనిపిస్తోంది’’ అని ప్రముఖ పాత్రికేయుడు, ‘ద ప్రింట్‌’ ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌ శేఖర్‌గుప్తా అన్నారు. ముఖ్యమంత్రి జగన్‌ 2019 డిసెంబరులో శాసనసభలో మూడు రాజధానుల ప్రతిపాదన చేయగా... ఆ నిర్ణయాన్ని తూర్పారబడుతూ ఆ నెలాఖరులో శేఖర్‌గుప్తా ఒక వీడియో విడుదల చేశారు. దేశంలో కొత్త నగరాల నిర్మాణం ఎంత అవసరమో వివరిస్తూ.. అమరావతి అద్భుతమైన నగరమవుతుందని అందరూ భావించినట్టు చెప్పారు. ‘‘రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లోని నాయకులకు.. గొప్ప నగరం నిర్మించే అవకాశం వచ్చింది. ఆ దిశగా అడుగులూ పడ్డాయి. ఆంధ్రప్రదేశ్‌లో మొదటి నుంచీ మంచి ఎంటర్‌ప్రెన్యూర్స్‌ ఉన్నారు. గొప్ప డ్యామ్‌లు, రహదారులు వంటి ప్రాజెక్టుల నిర్మాణంలో ఏపీకి చెందిన కాంట్రాక్టర్లు ఉంటారు. వారిని ఆంధ్రాప్రెన్యూర్స్‌గా పిలిచేవారు. వారంతా కలసి అమరావతిని అద్భుత నగరంగా నిర్మిస్తారని అనుకున్నాం. దురదృష్టవశాత్తు ఆ ప్రాజెక్టు నిలిచిపోయింది’’ అని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు.


అంతా సిద్ధంగా ఉన్న అమరావతిని కాదని..!

ప్లాన్‌ సిద్ధం

కొత్త నగర నిర్మాణానికి ప్రధాన సమస్య భూసేకరణ. అమరావతికి ఆ సమస్య లేదు. దేశ చరిత్రలోనే మొదటిసారిగా 29 వేల మంది రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి 33 వేల ఎకరాలకుపైగా భూమిని ఇచ్చారు. మాస్టర్‌ ప్లాన్‌ సిద్ధంగా ఉంది.

మిగులు భూమీ ఉంది

అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రధాన మౌలిక వసతుల నిర్మాణం చేపట్టారు. భూసమీకరణలో భూములిచ్చిన రైతులకు స్థలాలు తిరిగి ఇవ్వగా, ప్రధాన మౌలిక వసతులు నిర్మాణానికి అవసరమైన భూములు పోగా, వివిధ సంస్థలకు కేటాయించగా... ఇంకా సీఆర్‌డీఏ దగ్గర ఇంకా 5,020 ఎకరాల భూమి ఉండేలా ప్రణాళిక రూపొందించారు. ఆ భూముల్ని దశలవారీగా విక్రయించి నిధులు సమీకరించేలా... స్వయం సమృద్ధి ప్రాజెక్టుగా అమరావతిని రూపొందించారు.

అందుబాటులో రుణాలు

గత ప్రభుత్వ హయాంలోనే బ్యాంకులు రూ.2,600 కోట్ల రుణం ఇచ్చాయి. ప్రపంచబ్యాంకు నుంచి రూ.3,500 కోట్ల రుణం పొందేందుకు అప్పట్లోనే అంతా సిద్ధమైంది. వైకాపా ప్రభుత్వం రాజధాని నిర్మాణాన్ని కొనసాగించి ఉంటే... రుణం ఇచ్చేందుకు అనేక ఆర్థిక సంస్థలు, బ్యాంకులు ముందుకొచ్చేవి. గత ప్రభుత్వ హయాంలోనే అమరావతిలో రూ.10 వేల కోట్లకుపైగా నిధుల్ని వెచ్చించారు.

జలం పుష్కలం

పక్కనే కృష్ణా నది ఉండటంతో నీటికి కొరత లేదు.

రవాణా సదుపాయాలు

జాతీయ రహదారికి పక్కనే ఉంది. రైలు, ఎయిర్‌ కనెక్టివిటీ ఉంది. ఇన్ని అనుకూలతలున్న అమరావతిని పక్కన పెట్టి... కొత్త నగర నిర్మాణానికి జగన్‌ ప్రభుత్వం మరో ప్రాంతాన్ని  ప్రతిపాదించడంపై అనేక విమర్శలు వస్తున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని